నాకు ప్రియమైనవారలారా, మన ప్రభువు మిమ్మును గూర్చి చింతించు దేవుడుగా ఉన్నాడు. కనుకనే, మీరు దేనిని గురించి చింతించకండి. ఒకవేళ మీరు, 'నేను పెళ్లికి వెళ్ళాను. ఎవరూ నన్ను పలకరించలేదు. మా అమ్మ చనిపోయిన రోజు. ఈరోజు, నేను ఒంటరిగా ఏడ్చుచున్నాను. నన్ను ఎవరూ పలకరించలేదు. ఎవరూ నాకు ఫోన్ చేసి నన్ను అడగలేదు. ఎవరూ నాకు ఉత్తరం వ్రాయలేదు లేక నాకు ఎవరు కూడా ఈమెయిల్ పంపలేదు' అని దుఃఖముతో ఉన్నారా? ఇంకను నా ఉద్యోగం పోయింది, ఉద్యోగమును కోల్పోయిన నాకు ఏమైనా సహాయము కావాలని ఎవరూ నన్ను అడగలేదని చింతించుచున్నారా? అయితే, మీరు చింతించకండి.

నా ప్రియులారా, నేడు మిమ్మును గూర్చి చింతించుటకు ఒక వ్యక్తి ఉన్నాడని గుర్తుంచుకొనండి. ఆయనే మన కృపగల ప్రభువైన యేసు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 పేతురు 5:7వ వచనము తీసుకొనబడినది. ఆ వచనములో చూచినట్లయితే, " ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి'' అని చెప్పబడినట్లుగానే, యేసు ప్రభువు మిమ్మును గురించి చింతించేవాడు గనుకనే, మీ చింతలన్నిటిని ఆయన మీద వేయండి. కానీ, మనుష్యుల దగ్గరకు వెళ్లి కూర్చుని మీ చింతలన్నిటిని చెప్పినను సరే, మీకు ఏమి ప్రయోజనము లభించదు. ఎవ్వరు కూడా మీకు నిజంగా సహాయము చేయగలరు? మీకు ఎవ్వరు కూడా సహాయము చేయలేరు. గనుకనే, మీ చింతయావత్తును దేవుని మీద వేయండి.

నిన్న ఒక వ్యక్తి నన్ను ఈలాగున ఇంటర్వ్యూ చేశాడు. అతడు నన్ను చూచి, ' సహోదరుడా, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని?' అడిగాడు. అందుకు నేను ఈలాగున జవాబు చెప్పాను, 'నాకు స్నేహితులు ఎవరు కూడా లేరు, నా స్నేహితుడు కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే. నా స్నేహితుడు, పరిశుద్ధాత్ముడు. ప్రభువైన యేసు యొక్క ఆత్మయే. నేను నా జీవితమును దేవునికి ఎప్పుడు అప్పగించి యున్నానో, ఆ రోజు ఆయన నా యొద్దకు వచ్చి, నాతో ఈలాగున మాట్లాడియున్నాడు. ఆయన, నాతో, ' పాల్, నీకు ఇంతవరకు ఈ లోక జీవితంలోను మరియు పాపపు మార్గంలో నడిపించుటకు ఎంతో మంది స్నేహితులు ఉండియున్నారు. కానీ, ఇకమీదట, ఏ ఒక్కరు కూడా నీకు స్నేహితులుగా నీతో ఉండరు. ఈ రోజు నుండి నేను మాత్రమే నీకు స్నేహితునిగా నీతో కూడా ఉంటాను. నేను మాత్రమే నీకు స్నేహితునిగా ఉంటాను' అని తెలియజేసియున్నాడు.

నా ప్రియులారా, ఈ రోజు వరకు 46 సంవత్సరములుగా ఆయనే నాకు స్నేహితునిగా ఉన్నాడు. కాబట్టి, నేను, ఒక్కరోజు కూడా, 'నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాను, నా బెస్ట్ ఫ్రెండ్‌తో బయటకు వెళ్లుచున్నాను, నా బెస్ట్ ఫ్రెండ్‌తో సమయం గడుపుచున్నాను' అని నేను ఎక్కడికి వెళ్లడం లేదు. నేను మాత్రమే కాదు, మా యింటిలో, నా భార్య మరియు మా పిల్లలు కూడా ఎక్కడకు వెళ్లడము లేదు. నా మనమసంతానము కూడా వెళ్లలేదు. కనీసం, క్యేటీ కూడా ఈలాగున చెబుతుంది, 'తాతయ్య, అందరూ ఇంట్లో ఉండటమే నాకు చాలా సంతోషము. నాకు బయటకు వెళ్లడం ఇష్టం లేదు. కానీ, ప్రార్థన గోపురమునకు వెళ్లడం నాకు చాలా ఇష్టము. ఆలాగుననే, ప్రార్థన గోపురములో పాటలు పాడటానికి వెళ్లాలంటే, నాకు ఎంతో ఇష్టం, టెలివిజన్ కార్యక్రమములలో మాట్లాడటానికి వెళ్లడం కూడా ఇష్టం, స్కూల్‌కు వెళ్లడం ఇష్టం. కానీ, నేను ఎవరి ఇంటికి వెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఈలాగున ఉండడము ఎంతో సంతోషముగా ఉంటుంది తాతయ్య' అని అంటుంది. ఇది ఎంత గొప్ప విషయం కదా, ప్రభువుతో కలిసి ఏకంగా ఉండుటయు మరియు కుటుంబంతో కలిసి ఉన్నప్పటికిని, ఎన్నో లక్షలాది మంది ప్రజలకు, ఒక స్నేహితునిగా, ఆశీర్వాదకరంగా ఉండడమనగా, ఇది ఎంత గొప్ప భాగ్యము కదా!

అవును, నా ప్రియులారా, దీని వెనుక ఉన్న రహస్యం చాలా సులభమైనది. దేవు డు మన పట్ల శ్రద్ధ వహించుచున్నాడని మనకు తెలుసు. కనుకనే, మన భారములను మరియు మన చింతలన్నింటిని ఆయన మీద ఉంచవలెను. వీటన్నిటికి ఒకే ఒక మార్గం, మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకనగా, ఆయన మనలను గూర్చి ఎల్లప్పుడు చింతించుచున్నాడు. ఆలాగుననే, మేము కూడా మా భారమంతటిని ఆయన మీదనే వేయుచున్నాము. కాబట్టి, ఆయన వేకువజాముననే నన్ను నిద్రలేపుతాడు. ఆ రోజు ఎదుర్కొనబోయే సమస్యలన్నిటికి సరైన వాక్యమును ముందుగానే మాకు అనుగ్రహిస్తాడు. ఆ రోజు మేము ఆ వాక్యమును పట్టుకుని ప్రార్థించునట్లుగా చేయుచున్నాడు. ఆ సమయంలో ఆయన వచ్చి ఇతరులకు, కుటుంబ సభ్యులకు, ఇతర ప్రజలకు, దేశ నాయకులకు, సేవకులకు ఏమి చేయాలో మాకు బోధిస్తాడు. ఆలాగుననే, ఆ దినమున దేవుడు తెలియజేసిన కార్యములన్నిటిని మేము జరిగిస్తాము. ఆ రోజు ముగించు సమయమునకు, నెమ్మదిగాను మనస్సుశాంతితో పండుకొని నిద్రించునట్లుగా ప్రభువు మాకు సహాయము చేస్తాడు. ఆ రోజు మాకు ఎటువంటి పోరాటం వచ్చినను సరే, మాలో ఒక సమాధానం ఉంటుంది. ఆ సమాధానము, ' మీకు ఏమియు జరగదు, దేవుని ప్రణాళికకు మించి, ఏమియు కూడా మీకు సంభవింపదు' అని యేసు ప్రభువు చెప్పి, ఆ దినమునకు మమ్మును సిద్ధపరుస్తాడు. అంతమాత్రమే కాదు, ఈ రోజు ఈ వాగ్దానమును మాకు ఇచ్చియున్నాడన్న ధైర్యముతో నడుచునట్లుగా మమ్మును చేస్తాడు. ఇంకను ఆ శ్రమలన్నింటి ద్వారా వెళ్లుచూ, మేము వాటన్నిటిని జయించునట్లుగాను, ఎటువంటి కీడు మమ్మును తాకకుండా కాపాడబడుచూ, మంచి పేరు ప్రఖ్యాతితోను, కీర్తితోను నిత్యము ప్రభువు చిత్తమును నెరవేర్చునట్లుగాను, సేవ ద్వారా, యూనివర్సిటీ ద్వారా, సామాజిక జీవితము ద్వారా, పేదలను ఆదురించుట ద్వారా జయముతో జరిగించునట్లుగాను, కుటుంబముతో కలిసి దానిని అనుభవించునట్లుగా ఆయన చేస్తాడు.

నా ప్రియులారా, నేడు మీకు కూడా అలాగుననే జరిగిస్తాడు. కారణము, యేసు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుకనే, మీ చింతయావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీద వేయుటకు మరచిపోకండి. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 55:22వ వచనములో చూచినట్లయితే, " నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు'' అని చెప్పబడినట్లుగానే, మీ భారమును ఆయన మీద వేసినప్పుడు ఆయన మిమ్మును ఆదుకుంటాడు. నా ప్రియమైన వారలారా, మనం దేని మీద నమ్మకం ఉంచాలి? మొదటిగా ఆయన ప్రేమ యందు నమ్మకం ఉంచవలెను. కారణము, యేసు మిమ్మును ప్రేమించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి 1 యోహాను 4:19వ వచనములో చూచినట్లయితే, " ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము '' అని చెప్పబడినట్లుగానే, ఆయనే మొదటగా మనలను ప్రేమించియున్నాడు. గనుకనే మనమును కూడా ఆయనను ప్రేమించబద్ధులమై యున్నాము. అవును, నా ప్రియులారా, ఆయన మనలను ప్రేమించుచున్నాడు గనుకనే, ఆయన ప్రేమ యందు మనము నమ్మకముంచాలి. అంతే చాలు. ఆలాగుననే, మీకు ఎటువంటి దుఃఖము మరియు కష్టము వచ్చినను సరే, "యేసయ్య నన్ను ప్రేమించుచున్నాడు, ప్రేమించుచున్నాడు,' అని చెప్పినట్లయితే, నిశ్చయముగానే ఆయన మీ భారమునంతటిని తొలగిస్తాడు.

రెండవదిగా, ఆయన శక్తిపై నమ్మకం ఉంచవలెను. అందుకే బైబిల్ నుండి ఎఫెసీయులకు 3:20వ వచనములో చూచినట్లయితే, " మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి'' అని చెప్పబడినట్లుగానే, మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా మనలో కార్యము సాధించు ఆయన శక్తి. కనుకనే, మనము ఆయన శక్తియందు నమ్మకము ఉంచినప్పుడు, తద్వారా, ప్రభువు శక్తి మన పట్ల బయలుపరచ బడుతుంది. అంతమాత్రమే కాదు, నా ప్రియులారా, మనం అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను దీవెనలు మీ మీదికి నేడు దిగివస్తాయి. కనుకనే, నా స్నేహితులారా, ఆయన ప్రేమ యందు మరియు ఆయన శక్తి యందు నమ్మకము ఉంచినప్పుడు, ప్రభువు మన కొరకు సమస్తమును నెరవేర్చి, ఆయన తన శక్తితో వాటన్నిటిని మారుస్తాడు. ఎలాగనగా, మనం ఊహించుదానికంటెను, అడుగువాటన్నిటికంటెను అత్యధికముగా మనకు అనుగ్రహిస్తాడు. మనము తలంచినట్లుగా మనకు జరిగించడు, అందుకు బదులుగా, మనము ఊహించినదానికంటె ఎక్కువగా చేస్తాడు. నా ప్రియులారా, కష్టాలు ఎంతో భయంకరముగా ఉండవచ్చును, కానీ వాటికంటెను ఎక్కువగా ప్రభువు మనలను హెచ్చించి, ఘనపరుస్తాడు. తద్వారా, మనం దేనిని కూడా కోల్పోము. నేడు ఇటువంటి దీవెనను పొందుకోవాలంటే, మీలోనికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఆహ్వానించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి దిగివస్తాడు. దేవుని ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మీ జీవితములో ఉన్న ప్రతి బంధకమున్నియు తొలగిపోతాయి, ఆయన శక్తి మీలోనికి వస్తుంది. మీరు సంపూర్ణ విజయం పొందునట్లుగా ప్రభువు చేస్తాడు. ఇంకను ఈ దీవెనను ప్రభువు ఈ రోజు మీకు అనుగ్రహించి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్య, మమ్మును గురించి చింతించే దేవుడవు గనుకనే, మా భారములన్నిటిని ఇప్పుడు నీ మీద వేయుచున్నాము, గనుకనే, దయతో వాటన్నిటిని మా నుండి తొలగించి, మమ్మును ఆదుకొనుము. దేవా, మేము నీ కృపను పొందుకొనునట్లుగా, మా చింతలన్నిటిని మా నుండి తొలగించి, సమాధానంతో నేడు మేము జీవించునట్లుగా చేయుము. ప్రభువా, ఈ రోజు మా యొక్క ప్రతి భారమును, దుఃఖమును, భయమును మరియు చింతలను నీ మీద వేయుచున్నాము, నీ ప్రేమ చేత మమ్మును ఆదుకొని, మేము ఎన్నటికిని కదలకుండా చేయుము. దేవా, మా స్వంత జ్ఞానము మీద కాకుండా, నీ ప్రేమయందు నమ్మకముంచి, నీ యొక్క అద్భుతమైన శక్తి మీద ఆధారపడునట్లుగా మాకు సహాయం చేయుము. యేసయ్యా, మా హృదయమును పరిపూర్ణ సమాధానముతో నింపి, రాబోయే ప్రతి సవాలుకు మమ్మును సిద్ధపరచుము. దేవా, మా కుటుంబమును నీ మార్గములో నడిపించి, మేము చేయుచున్న ప్రతి పనిని ఆశీర్వదించి, నీ యొక్క చిత్తానుసారంగా జరుగునట్లుగా కృపను చూపుము. యేసయ్యా, మా యొక్క ప్రతి కీడు నుండి మమ్మును కాపాడి, మా విశ్వాసమును బలపరచి, అనేకులకు ఆశీర్వాదంగా ఉండటానికి మమ్మును మార్చుము. దేవా, ప్రతిరోజూ మీ సన్నిధిని, దయను మరియు సమృద్ధియైన ఆశీర్వాదములను మేము అనుభవించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.