హలో నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు నేను అడయారులో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములో ఉన్న ధ్యానగదిలో నుండి మాట్లాడుచున్నాను. అవును, ఇక్కడ దేవుని యొక్క బలమైన సన్నిధానమును అనుభూతి చెందుచున్నాను. ప్రతి రోజు వందలాది మంది ప్రజలు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములో ఉన్న ధ్యానగదిని సందర్శించి, దీవించబడుచున్నారు. అందులో నేను కూడా ఒక వ్యక్తిని. నా జీవితములో ఏదైన ఒక ముఖ్యమైన సంఘటన జరిగినను, లేక ఏదైనా కష్టము ఎదురైనను సరే, నేను వెంటనే, యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములో ఉన్న ధ్యానగదిని పరుగెడుతాను. అక్కడికి వెళ్లి, నా సమస్యలను గురించి ప్రార్థించుకుంటాను.

ఆలాగుననే, ఒకరోజు నా కుమార్తె క్యేటీని గురించి ప్రార్థన చేయాలనే భారమును ప్రభువు నా హృదయములో ఉంచాడు. ఆ సమయములో తను 2 లేక 3 సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు ఇది జరిగింది. ప్రభువు నాకు ఎందుకు ఆలాగున చెప్పాడని నాకు తెలియదు కానీ, నేను ఉపవాసము ఉండి నేను తన కొరకు ప్రార్థించాను. ఆలాగుననే, ప్రతిరోజు సాయంత్రము 5 గంటల వరకు ఉపవాసముండి, 5 గంటలకు ధ్యానగదికి (ఛాపల్)కు వెళ్లి ప్రార్థించిన తర్వాతనే, సాయంత్రము 5 గంటల తర్వాత నేను ఆహారమును తీసుకుంటాను. అప్పుడు, ప్రభువు నాకు ఎంతో సమీపముగా ఉంటూ, నాతో మాట్లాడేవాడు. ప్రభువు నాతో ఎంతో స్పష్టముగా మాట్లాడేవాడు. అప్పుడు కూడా ఇదంతయు ఎందుకు జరుగుతుందని నాకు అర్థము కాలేదు. అటుపిమ్మట, కొన్ని నెలల తర్వాత మాత్రమే, క్యేటీ యొక్క స్నేహితురాలు, ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుచున్నదని మాకు తెలియ వచ్చింది. కనుకనే, క్యేటీ, తన ప్రక్కనే ఉంటుంది కాబట్టి, తనకు కూడా ఆనారోగ్యమునకు గురై ఉండేదేమో. కానీ, ప్రభువు నన్ను తన సన్నిధిలో కూర్చుని ప్రార్థింపజేశాడు. ఆలాగుననే, ఉపవాసముతో ధ్యానగదిలో ప్రార్థించేదానను కాబట్టి, ప్రభువు నా ప్రార్థనలను విని యున్నాడు. దేవుడు మా పట్ల గొప్ప కార్యములను జరిగించియున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.

అవును, నా ప్రియులారా, ఈ రోజు మీ హృదయము విరిగిన స్థితిలో ఉంటూ, మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారేమో? దూరముగా ఉన్నటువంటి మీ బిడ్డలను గురించి, ఆలోచించు చింతిస్తున్నారేమో? అయితే, దిగులుపడకండి. అందుకే బైబిల్ నుండి నేటి వాగ్దానముగా యోహాను సువార్త 16:24వ వచనముతో దేవుడు మనతో కూడా మాట్లాడుచున్నాడు. ఆ వచనము, " ఇది వరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును'' అని చెప్పబడిన ప్రకారముగా నేడు మీరు ఎటువంటి దుఃఖము గుండా వెళ్లుచున్నను సరే, దేవుడు మీరు ఆయనను అడిగినప్పుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీకు దొరుకుతుంది. అవును, నా ప్రియులారా, ఈ రోజు మన బిడ్డలను దీవించాలని మనము అడుగుదాము. మీ వ్యాపారమును దీవించమని మరియు కుటుంబమును దీవించమని ప్రభువును అడగండి. ప్రభువు మిమ్మును ఎంతగానో ప్రేమిస్తూ, మిమ్మును ఆశీర్వదించడాని కొరకై ఆయన మీ కొరకు వేచియున్నాడు. కాబట్టి, మనమందరము కలిసి ప్రార్థించి, మనలను మరియు మన బిడ్డలను దీవించమని అడుగుదాము. ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ మొఱ్ఱను ఆలకించి, దేవుడు నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మేము అయోగ్యులము, నీ సన్నిధిలో నిలిచియుండుటకు కూడా మాకు యోగ్యత లేదు. ప్రభువా, నీవు మమ్మును ఎంతగానో ప్రేమించుచున్నందున, మేము కార్చిన కన్నీటిని, మేము చేసిన త్యాగములన్నిటిని చూసి, ఈ రోజు మా కన్నీరు అంతయు తుడిచివేయబడునట్లుగా, మా దుఃఖమంతయు సంతోషముగా మార్చబడునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. యేసయ్యా, మా బిడ్డల పట్ల మేము కలిగియున్న భారమును మా నుండి తొలగించి, ఆనారోగ్యముతో బాధపడుచున్న మా బిడ్డలను మరియు ప్రియులను వారిని స్వస్థపరచి, ఆశీర్వదించుము. ప్రభువా, మా చింతలు, ముఖ్యంగా మా పిల్లలు మరియు కుటుంబం గురించిన చింతలు నీకు తెలుసు. మాకు అర్థం కానప్పుడు కూడా నిన్ను నమ్మునట్లుగా దయచేసి మాకు నేర్పించుము. దేవా, ప్రతిరోజూ ప్రార్థించడానికి మరియు నిన్ను వెదకడానికి మాకు నీ యొక్క బలమును అనుగ్రహించుము. ప్రభువా, మా ప్రతి మొర నీ సింహాసనమును చేరునట్లుగాను మరియు మా ప్రియులైన వారిని ప్రతి ప్రమాదం మరియు కీడు నుండి కాపాడుము. దేవా, ఈ రోజు మా హృదయాన్ని దైవిక శాంతితో మరియు భరోసాతో నింపుము. ప్రభువా, నీవు నా మొర వింటావని మరియు మాకు జవాబిస్తావని మేము నమ్ముచూ, యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.