నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలములో మిమ్మును పలకరించుటకు నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. అందుకే నేడు ఒక చక్కటి వాగ్దానము బైబిల్ నుండి మత్తయి 6:6వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును'' అని చెప్పబడినట్లుగానే, అవును, నా స్నేహితులారా, మీరు రహస్యమందు చేయుచున్న ప్రతి ప్రార్థనను ప్రభువు ఆలకించుచున్నాడు. అంతమాత్రమే కాదు, మీరు రహస్యమందు చేయుచున్న ప్రతి ప్రార్థనలకు దేవుడు ఆలకించి, మీకు ప్రతిఫలమిచ్చుచున్నాడు. మీరు రహస్యమందు చేయుచున్న ప్రతి పనిని ప్రభువు గమనించుచున్నాడు. మీ హృదయమును మరియు మీ యొక్క ప్రతి ఆలోచనను ప్రభువు గమనించుచున్నాడు. కనుకనే, మీ హృదయమును కలవరపడనీయ్యకండి.

ఆలాగుననే, ఒక అద్భుతమైన సత్యమును ఉదాహరణగా మీకు తెలియజేయాలని నేను కోరుచున్నాను. జార్జి ముల్లర్‌గారి జీవితములో కూడా అదే జరిగియున్నది. 19వ శతాబ్దములో అతడు కొన్ని వేలకొలది మంది అనాధ పిల్లలను అతడు పరామర్శిస్తూ వస్తున్నాడు. అతడు ఎవరి యొద్ద నుండి డబ్బులు తీసుకొనేవాడు కాదు లేక ఆశించేవాడు కాదు కానీ, తన అవసరతల కొరకు ప్రభువు సన్నిధిలో మాత్రమే ప్రార్థించేవాడు. అతని జీవితములో ఒక అద్భుతమైన కార్యము జరిగియున్నది. ఒకరోజు అనాధశ్రమము నుండి ఒక వ్యక్తి వచ్చి, అయ్యగారు, పిల్లలకు పెట్టుటకు ఆహారము ఏమియు కూడా మన యొద్ద లేదు. ఏమి చేయాలో కూడా మాకు తెలియడము లేదు. అందుకు జార్చిముల్లర్‌గారు, అతనితో, ప్రతి ఉదయమున మీరు ఎప్పుడు చేయుచున్నట్లుగానే, పిల్లలందరిని భోజన శాలలో కూర్చుండబెట్టి ప్రార్థన చేయించండి అని చెప్పాడు. ప్రభువు ఈ రోజు ఇవ్వబోయే ఆహారము కొరకు పిల్లలను ప్రార్థన చేయమని చెప్పండి అని అతడు తెలియజేశాడు. ఇంక వారు ఏమియు ప్రశ్నలు అడగకుండా, వెళ్లి, భోజన శాలలో పిల్లలందరిని కూర్చుండబెట్టి, వారిని ప్రార్థన చేయమని చెప్పియున్నారు. వారందరు కూడా కలిసి ప్రార్థన చేసిన వెంటనే, ఎవరో తలుపు తట్టినట్టుగా ఒక శబద్దము వారికి వినబడియున్నది. వారికి దగ్గరలో ఉన్నటువంటి ఒక బేకరీని కలిగియున్న ఆ వ్యక్తి, అతడు తలుపు దగ్గర నిలుచుని తలుపు కొట్టుచుండెను. వెంటనే, వారు తలుపు తెరచినప్పుడు, అతడు ఈ విధంగా చెప్పియున్నాడు, 'రాత్రంతయు నాకు నిద్రపట్టలేదు, ఈ బ్రేడ్‌ను పిల్లలందరి కొరకు తయారు చేయమని ' ప్రభువు నాకు చెప్పియున్నాడు. కాబట్టి, ఈ ఉదయకాలమున పిల్లలందరి కొరకు నేను ఈ యొక్క ఆహారమును తయారు చేసి, పిల్లల కొరకని తీసుకొని వచ్చానని చెప్పాడు. ఆలాగుననే, అతని తర్వాత మరియొక ఆశ్చర్యమైన అద్భుత కార్యమును దేవుడు జరిగించియున్నాడు. అదేమనగా, ఒక పాల బండి, సరిగ్గా అక్కడకు వచ్చేసరికి ఆగిపోయిననది. అతడు అనాధాశ్రమమునకు వచ్చి ఈలాగున చెప్పాడు, 'బండి మరమ్మత్తు జరిగినది. కనుకనే, ఈ పాలన్నియు కూడా పాడైపోతాయి. అవన్నియు కూడా ఎలాగో పాడైపోతాయి, కనుకనే, ఈ పాలన్నిటిని మీకు ఇస్తున్నాను కాబట్టి, పాలు పాడైపోవుటకు ముందుగానే, ఈ పాలన్నిటిని మీరే తీసుకోండి' అని చెప్పాడు.

నా ప్రియ స్నేహితులారా, మన ప్రభువు ఆలాంటి అద్భుతమైన రీతిలో అన్నిటిని సమకూరుస్తాడు. అవును, ఆ బిడ్డలందరు కూడా అనాధాశ్రమములోపల కూర్చుని వారు ప్రార్థన చేసియున్నారు. అయితే, బయట ఉన్నటువంటి వ్యక్తులను ప్రభువు ప్రేరేపించి, వారందరిని అక్కడికి నడిపించాడు. ఆలాగుననే, పిల్లలు ప్రార్థించిన వెంటనే, వారి యొక్క ప్రార్థనకు ప్రతిఫలమును పొందుకొనియున్నారు. అవును, నా ప్రియులారా, అదేవిధముగా, మీలో అనేకమంది యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములో ఉన్న ధ్యానగదిలోనికి వచ్చి, అక్కడ మోకరించి ప్రార్థిస్తారు. బయట ప్రపంచమునకు చెప్పుకోలేని వారి యొక్క అనేక అంశములను మరియు సమస్యలను అక్కడకు వచ్చి, కన్నీటితో రహస్యముగా ప్రార్థించుకుంటారు. వారు ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి సమస్యలను ప్రభువు చెంత చెప్పుకొని ప్రార్థించుకుంటారు. అయితే, వారు యేసుని పాద సన్నిధికి వచ్చి, రహస్యంగా ఆయనకు వారి ప్రార్థన మనవులను తెలుపుతారు. ప్రభువు అటువంటి లక్షలాది మంది ప్రార్థనలను ఆలకించి అద్భుత కార్యములను జరిగించియున్నాడు.

ఆలాగుననే, డెహ్రాడూన్ పట్టణమునకు చెందిన సహోదరి ఎలియాజర్ ఓషీన్ ప్రార్థనా గోపురమునకు వెళ్లి, అక్కడ ధ్యానగదిలోనికి వెళ్లి ప్రార్థన చేసుకున్నప్పుడు, అద్భుతరీతిగా ఆమె యొక్క ప్రార్థనకు జవాబుగా ఒక మంచి ఉద్యోగమును దయచేసియున్నాడు. ఆలాగుననే, చెన్నై పట్టణము నుండి సహోదరులు రాజ్ గోపాల్‌గారు తన కుమార్తె యొక్క చదువుల నిమిత్తము ధ్యానగదికి వచ్చి ప్రార్థించుకొని అతడు తిరిగి వెళ్లినప్పుడు, ఎంతగానో పోటీలు కలిగి ఉన్నప్పటికిని అతని కుమార్తెకు దేవుడు మంచి మార్కులను అనుగ్రహించియున్నాడు. అదేవిధముగా, ముంబై పట్టణము నుండి సహోదరి రాజ్యలక్ష్మిగారు, ధ్యానగదికి వచ్చి, తనకు క్షేమకరమైన ప్రసవము జరగాలని ప్రార్థన చేసుకున్నారు. తన గర్భములో ఎదుగుచున్న బిడ్డ యొక్క క్షేమము, కాపుదల కొరకు ప్రార్ధించుకొనెను. తను ప్రార్థన చేసిన రీతిగానే ప్రభువు తన ప్రార్థనను ఆలకించి, తనకు క్షేమకరమైన ప్రసవమును కలుగజేసియున్నాడు. అద్భుతమైన ఒక బిడ్డను ప్రభువు అనుగ్రహించియున్నాడు.

నా ప్రియ స్నేహితులారా, అదేవిధముగా మీరు రహస్యమందు ప్రార్థన చేయుచుండగా, ప్రభువు మీ యొక్క ప్రతి కన్నీటిని చూచుచున్నాడు. మీ యొక్క ప్రతి విన్నపమును ప్రభువు ఆలకించుచున్నాడు. మీ యొక్క ప్రతిఫలమును ప్రభువు మీకు నిశ్చయముగా ఇస్తాడు. మీ కొరకు ప్రభువు ఒక గొప్ప అద్భుతమును జరిగించి, మీకు ఘనతను ఆయన కలుగజేయుచున్నాడు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీరు ధైర్యముగా ఉండండి, ప్రభువు మీ ప్రార్థలను ఆలకించుచున్నాడు. మీరు రహ్యమందు చేయుచున్న ప్రార్థనలను ఆయన ఆలకించుచున్నాడు. మీరు రహస్యమందు చేయుచున్న ప్రార్థనలకు ఆయన తప్పకుండా బహిరంగముగా జవాబిస్తాడు. కనుకనే, నేడు ఆయన అనుగ్రహించు ఆశీర్వాదములను పొందుకుందాము. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మేము రహస్యంగా చేయబడిన ప్రతి ప్రార్థనను ఆలకించి, ప్రతిఫలమిచ్చు మంచి దేవుడవుగా ఉన్నందుకై నీకు వందనములు. ప్రభువా, మేము నీకు మొఱ్ఱపెట్టుచున్న ప్రతి మొఱ్ఱను ఆలకించి, మాకు జవాబును దయచేయుము. దేవా, మేము నిన్ను శ్రద్ధగా వెదకుటకును మరియు మేము భరించుచున్న ప్రతి భారమును మరియు మేము రహస్యమందు కార్చిన ప్రతి కన్నీటిని మరియు మా హృదయాంతరంగములో ఉన్న దాగియున్న ప్రతి విన్నపమును నీకు తెలుసు గనుకనే, నీవు మా ప్రార్థన విన్నపమునకు జవాబును దయచేయుము. ప్రభువా, ఈ రోజు మేము నీ సన్నిధికి వచ్చి, ప్రార్థించిన మా యొక్క ప్రతి ప్రార్థనను ఆలకించి, నీ పరిపూర్ణ చిత్తానుసారంగా మాకు జవాబును దయచేయుము. దేవా, మా ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడవు అని నీ యందు మేము విశ్వాసముంచుటకును సహాయము చేయుము. ప్రభువా, మా యొక్క విశ్వాసమును బలపరచి, మా జీవితంలోని ప్రతి అవసరతను తీర్చి, మా పక్షమున అద్భుతములను జరిగించుము. దేవా, మా మార్గములో ఉన్న ప్రతి ఆటంకమును తొలగించి, ఆశీర్వాదములకు నూతన మార్గములను తెరచి, నీ యొక్క శాశ్వతమైన ప్రేమతో మమ్మును ఘనపరచుము. ప్రభువా, నీ యొక్క దైవీకమైన సమకూర్పు, సమాధానము మరియు దయను మేము అనుభవించునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, మేము నీ యందు ఉంచిన మా యొక్క విశ్వాసమును ఘనపరచి, మాకు తగిన ప్రతిఫలమిచ్చి, మా హృదయమును ఆనందంతో నింపి, మా జీవితము నిన్ను మహిమపరచునట్లుగా మాకు నీ కృపను దయచేయుమని యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.