నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, ఈ రోజు నాకెంతో ప్రియమైన వాగ్దానమును ధ్యానించబోవుచున్నాము. ఆ వాగ్దాననము బైబిల్ నుండి యోబు 42:10వ వచనము తీసుకొనబడియున్నది. ఆ వచనము, "మరి యు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను." మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను'' అని చెప్పబడినట్లుగానే, నేడు దేవుడు మీకు రెండంతలుగా దయచేయాలని మీ పట్ల కోరుచున్నాడు. అవును, దేవునికి గల పేర్లలో ఒకటి, 'యోబు యొక్క దేవుడు.' యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను కాబట్టి, మన దేవునిని, 'తిరిగి సమకూర్చు దేవుడు' అని పిలుచుచున్నాము.
బైబిల్‌లో ప్రభువు యోబును గురించి ఈ విధంగా సాక్ష్యమిచ్చియున్నాడు. అదేమనగా, "అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు'' అని చెప్పబడినట్లుగానే, అతడు నిరపరాధియు మరియు నీతిమంతుడై యున్నాడు. అయినప్పటికిని, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములను పొందుకొనుటకు యోబు తన్నుతాను తగ్గించుకొనియున్నాడు. యోబు తన ఆరోగ్యమును మరియు తన ఐశ్వర్యమును తన ఆస్తినంతటిని కోల్పోయాడు. అతడు తన జీవితములో శ్రమలన్నిటిని కూడా ఎదుర్కొనవలసి వచ్చినది. తన జీవితములో అస్సలు అర్థముకానీ పరిస్థితి. అయితే, దేవుని యెదుట తన్ను తాను తగ్గించుకొని, ధూళితో తన్ను తాను సమానముగా చేసుకొనియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మన జీవితములో ఎదురగుచున్న కష్టాలు మరియు శ్రమలు మనలను పశ్చాత్తాపము పొందునట్లుగా చేయుచున్నవి.
అవును, నా ప్రియులారా, యోబు నీతిమంతుడైనప్పటికిని కూడా, తన పాపములన్నిటికి కూడా, దేవుని యెదుట తన్ను తాను తగ్గించుకొని క్షమాపణను కోరియున్నాడు. ఆ తర్వాతనే, ప్రభువు అతనికి అన్నిటిని కూడా సమకూర్చియున్నాడు. మనము పశ్చాత్తాపమునొందిన హృదయముతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు ప్రభువు అన్నిటిని మరల సమకూరుస్తాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 139:24వ వచనములలో చూచినట్లయితే, దావీదు భక్తుడు కూడా ఈ విధంగా మొఱ్ఱపెట్టాడు, "నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము'' అని మొఱ్ఱపెట్టాడు. అవును, నా ప్రియులారా, మనము శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, ధూళివలె మనలను మనము తగ్గించుకొని, ప్రభువు యెదుట మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన మనలను ఘనపరచును.
అవును, నా ప్రియులారా, యోబు తనను తాను తగ్గించుకోవడము కాదు కానీ, తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థించాడు. చూడండి, అతడు తన స్నేహితుల యెదుట తనను తాను తగ్గించుకున్నాడు. ఇంతకు వారు మంచి స్నేహితులు కాదు, వారు విమర్శించుచూ, అతనిని తప్పు పట్టియున్నారు. అయినప్పటికిని తన స్నేహితుల యొక్క పాపములు క్షమించబడాలనియు కూడా అతడు ప్రార్థించాడు. కాబట్టి, ప్రభువు అతనికి ముందున్నటువంటి గొఱ్ఱెలకు బదులుగా రెండంతలుగా సమకూర్చి మరల ఇచ్చియున్నాడు. ఇంకను ఒంటెలు, పశువులు, గాడిదలు, ఇలాగున అన్నిటిని తిరిగి అతడు రెండంతలుగా పొందుకొనియున్నాడు. అతడు ముందుగా తన బిడ్డలను కోల్పోయాడు. దేవుడు తిరిగి అతనికి ఏడుగురు కుమారులను, ముగ్గురు కుమార్తెలను ఇచ్చియున్నాడు. తన సహోదరీలు మరియు సహోదరులు వచ్చి అతనిని ఆదరించారు. అతని చూచుటకు వచ్చిన ప్రతి ఒక్కరు అతనికి వెండిని మరియు బంగారపు ఉంగరమును కూడా ఇచ్చియున్నారు. అటు తరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమార్తెలను నాలుగు తరముల వరకు కూడా అతడు చూడగలిగాడు. ఇది ఎంతటి గొప్ప ఆశీర్వాదము కదా!
నా ప్రియమైనవారలారా, ప్రభువు మనకు కూడా రెండంతలుగా సమకూరుస్తాడు. మనము ఆయన యొద్దకు తిరిగి వచ్చినప్పుడు, మనము కోల్పోయినదంతయు రెండంతలుగా తిరిగి ఇస్తాడు. మునుపటికంటె అధికముగా ప్రభువు మనలను ప్రేమిస్తాడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడే మీ పాపముల నిమిత్తము మీరు పశ్చాత్తాపమునొందండి. ప్రతిరోజు ప్రభువు మనలను క్షమించునట్లుగా, మనము ఆయనకు మొఱ్ఱపెట్టాలి. ఇంకను ప్రభువు యెదుట మనలను మనము ధూళివలె తగ్గించుకున్నప్పుడు, ఆయన యొక్క మహా కృపను బట్టి, ఆయన మనలను రెండంతలుగా దీవిస్తాడు. నా ప్రియులారా, ఇటువంటి గొప్ప ధన్యతను మీరు పొందుకోవాలంటే, ఇప్పుడు మీ జీవితాలను ప్రభువునకు సమర్పించి, పశ్చాత్తాపపడి, ఆయన యొద్ద క్షమాపణ కోరినట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు యోబు వలె మిమ్మును రెండంతలుగా ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా జీవితములో విరిగిపోయిన వాటన్నిటిని సరిచేసి, మాకు తిరిగి ఇచ్చినందుకై నీకు వందనములు. ప్రభువా, యోబు వలె మేము కలిగియున్నదానిని కోల్పోయి ఉన్నాము మరియు మా ప్రియులను, మా ఆరోగ్యమును, మా స్థిరచరాస్థులను మరియు ఐశ్వర్యమును, మా ఆత్మీయను కోల్పోయి నీ యొద్దకు వచ్చియున్నాము. దేవా, నీవు మమ్మును జ్ఞాపకము చేసుకొని, మేము కోల్పోయిన వాటన్నిటిని రెండంతలుగా మమ్మును దీవించుము. యేసయ్యా, మేము ఎదుర్కొంటున్న అవమానము మరియు శ్రమలన్నిటికి బదులుగా రెండంతలు ఆశీర్వాదములను, ఘనతను, ధనము, ఐశ్వర్యము, రెండంతల ఆత్మీయ అభిషేకమును మాకు అనుగ్రహించి, మమ్మును దీవించుము. ప్రభువా, మా పాపముల నిమిత్తము మేము ధూళివలె మమ్మును తగ్గించుకొని పశ్చాత్తాపపడుటకు అటువంటి హృదయమును మాకు అనుగ్రహించి, మేము కోల్పోయిన సంతోషమును రెండంతలుగా మాకు తిరిగి వచ్చునట్లుగా చేయుము. దేవా, మేము ఏమైతే, ఈనాడు కోల్పోయి ఉన్నామో, వాటన్నిటిని తిరిగి పొందుకొనునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితములను, మా గృహములు మరల కట్టబడునట్లుగా చేయుము. దేవా, మేము కూడా యోబువలె నీ యెదుట సాక్ష్య జీవితమును కలిగియుండునట్లుగా మాకు నీతి మరియు యథార్థతగల జీవితమును దయచేయుము. ప్రభువా, మేము చేసిన త్యాగములన్నిటికిని మమ్మును ఘనపరచుము. దేవా, మేము అనుభవించుచున్న ప్రతి అవమానమును ఘనతతోను, ప్రతి దుఃఖమును ఆనందంతో మరియు విరిగిన ప్రతిచోట నీ యొక్క స్వస్థపరచు స్పర్శతో తాకుము. ప్రభువా, మేము కోల్పోయినవన్నీ నీ యొక్క సంపూర్ణ చిత్తానుసారంగా తిరిగి వచ్చునట్లుగా చేసి, మా జీవితము నీ విశ్వాసనీయతకు సాక్ష్యంగా మారునట్లుగా సహాయము చేయుమని యేసుక్రీస్తు అత్యంత ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


