నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి సువార్త 1:22,23వ వచనములను తీసుకొనబడినవి. ఆ వచనములు, "ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము'' ప్రకారము మీలో ప్రతి ఒక్కరికి ఆయన మీకు తోడుగా ఉన్నాడని వాగ్దానము చేయుచున్నాడు. ఒకవేళ, మీరు ఈ రోజు బాధపడుచున్నారా? కారణము లేకుండా మీరు నిరాశ చెందుచున్నారా? కొన్నిసార్లు అనేక విషయాలను గురించి చింతించుచూ, దేవునికి దూరమైపోయినట్టుగా ఉంటాము. అంతమాత్రమున యేసు మీతో లేనట్టుగానే మీరు తలంచుచుండవచ్చును. అదియుగాక, దేవుడు మిమ్మును పట్టించుకోనట్టుగా మీకు అనిపించుచున్నదా? లేదు నా ప్రియులారా, మీ అందరితో కూడా ఆయన ఉన్నాడు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, - ఇమ్మానుయేలు అనగా, 'మనకు తోడైయున్న దేవుడు' అని ఆయన పేరులోనే ఆ భావము ఉన్నది.

ఇసుక నేలపైన పాదముద్రల యొక్క ఒక కధ అది మనకందరికి తెలిసిన కధయే! ఒక అతను ఇసుక నేలపైన పాదముద్రలను చూశాడు. ఆ అడుగు జాడలు వెళ్లు మార్గమంతటిలోను అన్నిచోట్ల, పెద్ద పాదముద్రలు రెండు మరియు రెండు చిన్న పాదముద్రలు ఉండుట గమనించాడు. అయితే, సమస్యలు ఉన్నచోట మాత్రమే ఒక్క పాదముద్ర జతను చూశాడు. అతడు కష్టాలను, నిరాశను, నిస్పృహను ఎదుర్కొన్నప్పుడు ఒక్క పాదముద్ర జతను మాత్రమే చూశాడు. అప్పుడు దేవుడు అతనితో, 'చూడు, నా కుమారుడా, నీ జీవితాంతము నీకు తోడుగా నడుస్తున్నాను' అని చెప్పాడు. అయితే, అతడు మనవలె ఎంతో నిరాశను చెందియున్నాడు. ఆ మాటలు విన్న అతడు, 'ప్రభువా, నేను ఎంతో దుఃఖములోను, బాధలలోను ఉన్నప్పుడు నీవు నాకు సమీపముగా లేనేలేవు, నీవు నాకు దూరముగా ఉన్నావు. కారణము, అక్కడ ఒక్క పాదముద్ర జత మాత్రమే కనబడుచున్నది' అని అన్నాడు. అయితే, దేవుడు అతనితో, 'నా కుమారుడా, అవి నా పాదముద్రలు, నీవు బాధలలో, నిరాశలో ఉన్నప్పుడు, నేను నా చేతులతో నిన్ను ఎత్తుకున్నాను, నేను నిన్ను ఎత్తి పట్టుకొని నడిపించాను కాబట్టి, అవి నా అడుగుజాడలు మాత్రమే' అని చెప్పాడు.

అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మిమ్మును ఎత్తుకొని నడిపిస్తున్నాను అని చెబుతున్నాడు. మీరు నిరాశలోను, బాధలలో ఉంటూ, యేసయ్యా, నాకు దూరముగా ఉన్నాడని ఆయనకు దూరంగా పారిపోకండి, ఆయన వైపునకు పరుగెత్తండి, ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమించుచున్నాడనియు మరియు ఆయన మిమ్మును మోయుచున్నాడనియు మీకు గుర్తు చేయుచున్నాడు. కనుకనే, మీరు మరియు మనందరము కలిసి ఆయనను తన ఆత్మతో నింపమని ప్రార్థిద్దాము. ఆలాగున చేసి, నేటి వాగ్దానము నుండి దేవుని యొక్క దీవెనలను మనము పొందుకుందాము. దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, నీవు ఎల్లప్పుడూ మాతో కూడా ఉంటావని నీవిచ్చిన వాగ్దానానికి వందనాలు. ప్రభువా, మా చుట్టు ఎవ్వరు లేకుండా, మేము బాధలలోను, చింతలలోను ఉన్నప్పుడు కూడా మరియు మా ప్రియులను కోల్పోయి, మాకు ఆదరణ లేకపోయినా? నీ సన్నిధి మాకు తోడుగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, నీ సన్నిధిని మేము సంపూర్ణంగా అనుభవించునట్లుగాను మరియు నీ వైపు తిరిగి చూచిన ప్రతిసారి, నీ సన్నిధిని మేము అనుభూతి చెందునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము తీసుకొనవలసిన నిర్ణయములన్నిటిలోను, నీ నడిపింపు ప్రకారము నడుచునట్లుగాను, వాటిని సులభంగా తీసుకొనునట్లుగాను, మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీ ఆత్మచేత మేము నింపబడునట్లుగాను, నీవు ఈ రోజు దర్శనమగునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, మేము ఒంటరిగా లేదా తప్పిపోయినప్పుడు కూడా, నీవు మమ్మును విడిచి దూరంగా వెళ్లకుండా, నీవు 'ఇమ్మానుయేలుగా' మాతో నడిచే మా దేవుడు ఉండుమని వేడుకొనుచున్నాము. దేవా, మేము నిన్ను చూడలేనప్పుడు, నీవు మమ్మును మోయుచున్నావని మేము గుర్తించుటకును మరియు నమ్ముటకును మాకు సహాయం చేయుము. యేసయ్యా, మా మనస్సు ఆందోళనతో బరువెక్కినప్పుడు మా హృదయాన్ని నీ శాంతితో నింపుము. దేవా, మేము బలహీనంగా అనిపించినప్పుడు మమ్మును నీ యొక్క బలముతో పైకి లేవనెత్తి మరియు రోజులోని ప్రతి క్షణం నీ ఆదరణనిచ్చే సన్నిధి మమ్మును చుట్టుముట్టునట్లుగా చేయుము. ప్రభువా, దయచేసి నీ నుండి దూరంగా కాకుండా నీ వైపు పరుగెత్తడానికి మమ్మును నడిపించుము. ప్రభువా, మమ్మును నీ చేతులలోనికి మమ్మును నీకు సమీపముగా చేర్చుకున్నందుకై నీకు వందనాలు చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.