నా ప్రియమైన వారలారా! నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 121:3వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మిమ్మును నిత్యము కాపాడును. మీరు తొట్రుపడాలని, పడిపోవాలని, శత్రువు చేత అవమానించబడాలని లేదా నాశనం చేయబడాలని ఆయన ఎన్నడును కోరుకోడు. ఇది మీ పట్ల ఆయనకున్న ప్రేమగల హృదయమును ప్రతిబింబించుచున్నది. ఆయన ప్రేమ తల్లి ప్రేమకంటే గొప్పది; మీరు దృఢంగా, స్థిరంగా నిలిచియుండవలెనని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు.

బైబిల్ నుండి కీర్తనలు 46:4-5వ వచనములలో చూచినట్లయితే, "ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, దేవుని పట్టణము అనగా, సర్వోన్నతుడైన దేవుడు నివసించే పరిశుద్ధ స్థలముగా ఉన్నది. దేవుడు ఆ పట్టణము మధ్యలో నివసించుచున్నాడు, కాబట్టి అది ఎవరి ద్వారా కదిలించబడదు. అవును, నా ప్రియులారా, మీరు దేవుని నివాసస్థానముగా ఉన్నారు. ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు, ఏదియు మిమ్మును కదిలించలేదు. నా ప్రియులారా, నేడు ప్రభువు మిమ్మును ఆదుకుంటానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి! కొన్నిసార్లు మన అడుగులు తడబడవచ్చును, అప్పుడు నిలబడుటకు మనము ఇబ్బంది పడవచ్చును. నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. మా తాతగారు, నాన్న, అమ్మ, మా చెల్లెలు ఏంజల్ మరియు నేను, మేమందరము కలిసి కాశ్మీర్‌కు వెళ్ళినప్పటి సంగతి. పహల్గామ్‌లో, మమ్మల్ని గుఱ్ఱముల మీద ఒక ఎత్తైన శిఖరము దగ్గరకు తీసుకొని వెళ్లారు. ఎత్తైన పర్వతము మీదికి వెళ్లు మార్గము ఎంతో ఇరుకుగాను, వంకరగాను ఉంటుంది, అది ఒక వైపు లోతైన లోయ ఉన్నది. మేము ఆ లోయను చూశాము. ఒకవేళ, ఆ లోయ నుండి జారి క్రింద పడినట్లయితే, ప్రాణాపాయం కలిగే అవకాశం ఉన్నది. మరణము తప్పదు. అయినను, మేమంతా గుఱ్ఱములపై ఎక్కాము; మా నాన్నగారు మా వెనుక గుఱ్ఱము మీద ఎక్కి వస్తున్నారు. ఆయన, గుఱ్ఱము మీద స్వారీ చేయుచున్న వ్యక్తిని చూచి, 'అయ్యా, ఈ లోయలో ఒకవేళ గుఱ్ఱము జారి పడినట్లయితే ఏమవుతుంది?' అని అడిగారు. అందుకు, ఆ వ్యక్తి ఎంతో ధైర్యముగా మీరు దేనికిని చింతించకండి మరియు భయపడకండి, 'నేను మీతో కూడా ఉన్నాను. మీరు నన్ను నమ్మి ఈ గుఱ్ఱమును ఎక్కండి' అని జవాబిచ్చాడు. అయితే, మా నాన్నగారు భయపడినట్లుగానే, ఇరుకైన దారిలో ఆయన గుఱ్ఱము అకస్మాత్తుగా పట్టు తప్పి, క్రిందికి పడిపోయే స్థితికి చేరుకున్నది. వెంటనే, మేమందరము భయముతో కేకలు వేయడము తప్ప, మేము ఏమియు కూడా చేయలేకపోయాము. అయితే, గుఱ్ఱమును స్వారీ చేస్తున్న ఆ వ్యక్తి వెంటనే వచ్చి, ఆ గుఱ్ఱమును గట్టిగా పట్టుకుని తన అదుపులోనికి తీసుకున్నాడు. ఆ గుఱ్ఱము మరల సమతుల్యతను పొందడంతో, మా నాన్నగారు ప్రాణాపాయము నుండి తప్పించుకున్నారు.

అందుకే బైబిల్ నుండి కీర్తనలు 94:18వ వచనములో చూచినట్లయితే, ఈ ఆదరణాత్మక కృపను ఎంతో చక్కగా వర్ణించుచున్నది. ఆ వచనము, "నా కాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, మన కాలు జారుచున్నదని మనము అనుకున్నప్పుడు, దేవుని కృప మనలను ఆదుకొనును. ఒక గుర్రపు స్వారీ చేయుచున్న ఒక వ్యక్తి జారిపడుచున్న గుర్రమును సరైన సమయములో కాపాడగలిగినట్లయితే, అనగా, మన ప్రభువు యొక్క అతీతమైన కృప మరియు అపారమైన దయ మన యొక్క ప్రతి ఆపత్కాలములోనూ మనలను ఎంతగా ఆదుకొనగలవో కదా! అసూయ, ఎంతో దుఃఖం, దీర్ఘకాలిక అనారోగ్యం, ఊహించలేని నష్టము, ఆందోళన లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మన పాదములు జారవచ్చును. మనము ద్రోహము, దోషారోపణలు, ఆధ్యాత్మిక పోరాటములు మరియు శోధనలను కూడా ఎదుర్కొనవచ్చును. నా ప్రియులారా, ఇటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మనలను నిస్సహాయకరముగాను మరియు నిరుత్సాహముగా భావించునట్లుగా చేయుచున్నవి. కనుకనే, మీరు భయపడకండి.

నా ప్రియులారా, అయినప్పటికిని, "ప్రభువా, మా అడుగులు జారిపోవుచున్నవి'' అని మనము మొరపెట్టినప్పుడల్లా, ఆయన అచంచలమైన కనికరము మనకు సహాయమునకు దిగివచ్చును. అంతమాత్రమే కాదు, ఆయన మనలను బలపరచి, ప్రతి శోధనలోనూ మనలను ఆదుకుని ముందుకు నడిపిస్తాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 94:19వ వచనములో చూచినట్లయితే, " నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, దేవుని ఆదరణ మన ప్రాణమునకు నెమ్మదిని కలుగజేయుచున్నది. బైబిల్‌లో యోనాను గమనించి చూచినట్లయితే, అతను దేవునికి అవిధేయుడై తప్పుడు నిర్ణయము తీసుకున్నాడు. కానీ, ప్రభువు అతని విడిచిపెట్టలేదు. యోనా ప్రాణములను కాపాడుటకు ఆయన ఒక పెద్ద చేపను పంపాడు. అతడు సముద్రపు అగాధములో ఉన్నప్పుడు కూడా, దేవుడు అతనిని కనిపెట్టి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. అంతమాత్రమే కాదు, అతనిని సురక్షితముగా బయటకు తీసుకొని వచ్చియున్నాడు. అప్పుడు, యోనా ప్రభువు యొక్క ఆజ్ఞకు విధేయుడై, ఆయన సువార్తను ధైర్యముగా ప్రకటించాడు. దీని ఫలితముగా, నీనెవె పట్టణ ప్రజలు దేవుని వైపు తిరిగారు, ఆయన కనికరమును పొందుకున్నారు మరియు నాశనం నుండి నీనెవె పట్టణస్థులు సురక్షితముగా కాపాడబడ్డారు.

నా ప్రియమైనవారలారా, దేవుడు మీ విషయంలో కూడా అదేవిధముగా చేయగలడు! మీరు పొరపాట్లు చేసినప్పటికిని, ఆయన కృప మిమ్మును తిరిగి నిలువబెట్టి, ఆయన మీకు ఇచ్చిన పిలుపును నెరవేర్చడంలో సహాయపడుతుంది. దేవుని వరములు మరియు పిలుపు ఎన్నటికిని మార్చబడవు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 11:29వ వచనములో చూచినట్లయితే, " ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు'' అని చెప్పబడినట్లుగానే, మీరు నేడు స్థిరంగా నిలబడలేక ఇబ్బంది పడుచున్నారా? నా ప్రియులారా, మిమ్మును నిలబెట్టడానికి ఆయన కృప అందుబాటులో ఉన్నది. ఇంకను ప్రార్థించండి మరియు ఆయన యందు నమ్మకము ఉంచినప్పుడు, ఆయన మిమ్మును కాపాడతాడు, బలపరుస్తాడు మరియు మీ అడుగులను తిరిగి సరైన మార్గములో ఉంచుతాడు. ఇతరుల యెదుట గౌరవముతో ఎదుగునట్లుగా, ఆయన దైవీక సంకల్పమును నెరవేర్చునట్లుగాను మరియు దేశములకు, కుటుంబములకు, సమాజమునకు అలాగే మీరు పనిచేయుచున్న మరియు చదువుకునే స్థలములోనికి ప్రజలకు ఆశీర్వాదకరముగా మారునట్లుగా ప్రభువు మిమ్మును శక్తిమంతులను చేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క సమృద్ధియైన కృపను కోరుతూ మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, మా జీవిత పోరాటములను ఎదుర్కొంటున్నప్పుడు నీ కృపను మా మీద కుమ్మరించుము. దేవా, నీవు మమ్మును ఆశీర్వదించి, నీ వాగ్దానములను మా పట్ల నెరవేర్చి, తగిన సంపూర్ణమైన ప్రతిఫలమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా పాదములు జారుతున్నప్పుడు నీ కృపచేత మమ్మును బలపరచి, మేము తిరిగి లేచి బలముగా నిలువబడగలుగునట్లుగా పాదములను స్థిరముగా నిలబెట్టుము. యేసయ్యా, మా యొక్క ప్రతి సమస్యల నుండి మమ్మును విడిపించి, మా బలహీనతలో మమ్మును బలపరచి, నీ దైవీకమైన పిలుపును నెరవేర్చడానికి మాకు సహాయము చేయుము. దేవా, నీ యొక్క కృపావరముల విషయములోను మరియు మీ పిలుపు విషయములోను మేము జాగ్రత్తగా ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, దేశమునకు వెలుగుగా మరియు లక్షలాది కుటుంబములకు ఆశీర్వాదకరముగా మార్చబడునట్లుగా కృపను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.