నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహెజ్కేలు 11:19వ వచనమును ఇవ్వబడియున్నది. ఆ వచనము, "వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు మీకు ఏకమనస్సును కలుగజేసి, నూతన ఆత్మను పుట్టింతునని వాగ్దానము చేయుచున్నాడు. అవును, ఈ వాగ్దానము మీ కొరకు కాదు గానీ, ఇది మీ శత్రువుల కొరకై యున్నది. ప్రభువు, "నేను వారికి ఏకమనస్సును కలుగజేసి, వారికి ఏక ఆత్మను పుట్టింతును'' అని అంటున్నాడు కదా. నా ప్రియులారా, ఈ రోజు అనేకులు మీకు వ్యతిరేకముగా పనిచేయవచ్చును. మీ స్వంత కుటుంబములోనే మీకు శత్రువులు ఉండవచ్చును. అయినను, మీరు భయపడకండి.

నా ప్రియులారా, ఇంకను మీ స్వంత బృందములో ఉన్న సభ్యులే శత్రుత్వము చేత ఎవరికి వారు వారికి ఇష్టము వచ్చినట్లుగానే చేయవచ్చును. అయితే, ఈ రోజు ప్రభువు అటువంటి వారిని చూచి, ఇలాగున అంటున్నాడు కదా, "నేను అందరిని ఐక్యమత్యముతో సమకూరుస్తాను'' అని సెలవిచ్చుచున్నాడు. ఆలాగే, మీ బృందము విజయాన్ని పొందాలనియు మరియు ఈ రోజు మీ కుటుంబము మరల ఏకమవ్వాలని ప్రార్థించుచున్నారా? ఇంకను మీ కుటుంబములో సమాధానము కొరకై ప్రార్థించుచున్నారా? అయితే, చింతించకండి.

అవును, నా ప్రియులారా, ఏదైనను సరే, నేడు ఏక మనస్సును మరియు ఏక హృదయమును మీకు ఇస్తానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆలాగుననే, 'మీకు నూతన ఆత్మను పుట్టిస్తాను' అని అంటున్నాడు. అంతమాత్రమే కాదు, మీ శత్రువులందరు మీకు మిత్రువులుగా మారిపోతారు. వారందరి దృష్టిలో మీరు దయను పొందుకుంటారు. అంతమాత్రమే కాదు, మీరందరు ఒకే లక్ష్యము కొరకై కలిసి పనిచేయుదురు. మీ ఉద్యోగ స్థలములో మీకు శ్రమలు ఎదురైతే, మీ యొక్క పరిస్థితులను మారుస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ప్రభువు మీకు విజయమును అనుగ్రహిస్తాడు. కనుకనే, నా ప్రియులారా, మీరు దీనిని నమ్మి ప్రభువును దీవించమని ప్రార్థించినప్పుడు, నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ శత్రువులందరిని మిత్రువులనుగా చేసి, మీకు ఏకమనస్సును కలుగజేసి, మిమ్మును మృదువుగా మారుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నూతన హృదయం మరియు నూతన ఆత్మ యొక్క నీ వాగ్దానమునకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువైన యేసయ్యా, మా మీదికి నీ ఆత్మ దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మాకు వ్యతిరేకముగా పనిచేయు వారందరు మిత్రువులనుగా మార్చుము. దేవా, మా శత్రువులను దీవించి, వారి హృదయాలను మార్చి, మా శత్రువులను సహా మిత్రువులనుగా చేయుము. ప్రభువా, ఇశ్రాయేలీయులను పంపించకూడదని ఫరో అనుకున్నప్పుడు, అతని హృదయమును మార్చినట్లుగానే, నేడు మా శత్రువుల హృదయాలను మార్చివేయుము. దేవా, మాకు వ్యతిరేకంగా పనిచేయుచున్నవారిని నీవు తాకుచున్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, దయచేసి ప్రతి విభజనను తొలగించి దానిని ఐక్యత మరియు సమాధానముతో మమ్మును నింపుము. దేవా, కుటుంబంలో ప్రేమను మరియు మా కార్యాలయంలో సామరస్యాన్ని పునరుద్ధరించుము. ప్రభువా, పరిచర్య ద్వారా మరియు సంఘములో పరిచర్య చేయుచున్న మేము ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని తొలగించి, మాకందరికి, ఏకమనస్సు మరియు ఏక హృదయమును దయచేయుము. దేవా, అన్నివైపుల నుండి నీ దయ మమ్మును ఆవరించునట్లు చేయుము. ప్రభువా, దయచేసి మా నియంత్రణకు మించిన పరిస్థితులను మార్చుము. దేవా, నీ మహిమ కొరకు మాలో మరియు చుట్టూ అద్భుతాలు జరిగిస్తావని మేము సంపూర్ణంగా నమ్ముచూ యేసు యొక్క గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.