నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లూకా 12:7వ వచనమును నేడు ఆదరణపూరితమైన మాటలను మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?'' అని చెప్పబడిన ప్రకారము మనము దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్ఠులముగా ఉన్నాము కదా! మనము మన తల మీద ఉన్న వెంట్రుకలన్నియు ఎప్పటికిని లెక్కించ జాలము, కానీ మనము మన తల్లి గర్భములో ఎలా రూపింపబడతామో అని కూడా మనకు తెలియదు. బైబిల్ నుండి కీర్తనలు 139:15,16వ వచనములను మనము చూచినట్లయితే, "నేను రహస్య మందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండలేదు. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను'' ప్రకారం మీ తలవెంట్రుకల లెక్కను ప్రభువు ఎరిగియున్నాడు. ఇంకను మీ శరీరములోని ప్రతి అవయవము కూడా ప్రభువునకు తెలిసియున్నది. మీరు నిర్మించబడుటకు ముందుగానే ప్రభువు ఎరిగియున్నాడు. ప్రభువు కన్నులు మీ యందు దృష్టి ఉంచియున్నవి. బైబిల్ నుండి కీర్తనలు 147:4వ వచనమును ఈవిధంగా సెలవిచ్చుచున్నది, "నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు'' ప్రకారం సర్వమును సృష్టించియున్న సృష్టికర్త ఆయనే అయి ఉన్నాడు. ఆయనకు విశ్వమంతయు తెలుసు. మీ శరీరములో ఉన్న ప్రతిదీ ఆయనకు తెలుసు. మనము మన తల వెంట్రుకలను లెక్కించజాలము కానీ, ప్రభువు సమస్తమును లెక్కించియున్నాడు. మనము " ప్రభువా, నన్ను మరచిపోయావా? నన్ను విడిచిపెట్టి వేశావా? నన్ను దృష్టించుచున్నావా? లేదా?'' అని మనము ప్రభువును ప్రశ్నిస్తూ ఉంటాము. కానీ, ప్రభువు ఈలాగున అంటున్నాడు, "నా కుమారుడా, కుమార్తె, నా అరచేతులలో నిన్ను చెక్కుకొనియున్నాను'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు భయపడకండి.
పరమజిత్ అను ప్రియ సహోదరి యొక్క సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. ఈ సహోదరి ఎంతో కాలముగా యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో పాలిభాగస్థులుగా ఉన్నారు. 25 సంవత్సరములు ఆమె ఈ పరిచర్యకు ఎంతగానో తోడ్పడుచూ, సహాయపడుచున్నారు. అయితే, 10 సంవత్సరములు ఆమెకు వివాహము జరగాలని ఎంతగానో వేచియుం డెను. అయితే, 'నీ దేవుడు ఎక్కడ?' అని అందరు ఆమెను చూచి, విమర్శిస్తూ, ఎగతాళి చేసేవారు. అయితే, ఆమె ఒక రోజు నా భర్తగారికి ఈమెయిల్ వ్రాసి, ప్రార్థన విన్నపమును పంపించెను. ఆయన కూడా ఆ ఉత్తరమును చదివి, జవాబును పంపించియున్నారు. ఆ ఉత్తరములో, ఆయన సామెతలు 23:18 మరియు యిర్మీయా 29:11వ వచనములను వ్రాసి పంపించారు. ఆ వచనములు, "నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు మరియు ప్రభువు మీ జీవితము పట్ల ఒక ప్రణాళిక కలిగియున్నాడు' అని పంపించిన ఆ ఉత్తరములో ఉన్న వాగ్దానములను ఆమె గట్టిగా పట్టుకొని, ప్రార్థన చేయడము కొనసాగించినది. ఆ తర్వాత, అద్భుత రీతిగా ఆమెకు వివాహము జరిగినది. ఆమెకు వివాహము జరిగినప్పుడు, తనకు 44 సంవత్సరములు. ఆ తర్వాత, గర్భఫలము కొరకు 5 సంవత్సరములు వేచియుండెను. కానీ, పేద ప్రజలకు సహాయము చేసే సీషా అనే మా సంస్థను గురించి ఆమె తెలుసుకున్నప్పుడు, సీషా ద్వారా అనేకమంది చిన్నారులకు ఆమె సహాయము చేసినది. ఆ తర్వాత, ఆమెకు దేవుడు ఒక గర్భఫలమును అనుగ్రహించాడు. ప్రభువు ఒక గర్భఫలముతో ఆమెను ఆశీర్వదించాడు. ఆ బిడ్డకు మహిమ అని పేరు పెట్టినది. ఈ రోజు ఆ బిడ్డ ఎంతో చక్కగా పాటలు పాడుచున్నది. తన పాఠశాలలో అనేకమైన అవార్డులు పొందుకొనుచుండెను. అయితే, ఆ తర్వాత, ఆమె భర్తకు ఒక ప్రమాదము జరిగినది. అతనికి ఎంతో ప్రమాదకరమైనటువంటి కరెంటు షాక్ కొట్టింది. ఆమె ప్రార్థన గోపురమునకు వచ్చి, తన భర్త కొరకు ప్రార్థన చేయమని కోరింది. వైద్యులు అతని మీద ఉన్న అన్ని ఆశలను వదులుకోమనియు మరియు అతనికి వైద్యము చేయడము ఎంతో ప్రమాదకరము కనుకనే, ఎటువంటి ఆపరేషన్ చేయలేము అని చెప్పారు. అతనికి శస్త్రచికిత్స చేయడం ఎంతో ప్రమాదకరము అని వైద్యులు చెప్పియున్నారు. అయితే, ఆమె పరుగెత్తుకుంటూ ప్రార్థన గోపురమునకు వచ్చి, తన భర్త కొరకు ప్రార్థన చేయమని కోరి, ఆమె కూడా తన భర్తను గురించి ప్రార్థన చేసెను. ఆ తర్వాత, వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేయుటకు ఒప్పుకున్నారు. ఈ రోజు అతను నూరు శాతము చక్కగా ఆరోగ్యముగా ఉన్నాడు. మరల ఆమె తనకు ఒక స్వంత గృహము కావాలని ప్రార్థన చేయించుకొనెను. ఆలాగుననే, 'మీరు దేవుని యింటిని నిర్మించండి అప్పుడు దేవుడు మీ యింటిని నిర్మిస్తాడు' అని నా భర్తగారు చెప్పినటువంటి మాటను ఆమె జ్ఞాపకము చేసుకున్నది. వెంటనే, ప్రార్థన గోపురము భవన నిర్మాణము కొరకు ఆమె కానుకను సమర్పించెను. ఆ తర్వాత, ఆమె జీవితములో వెంటనే ఒక అద్భుతము జరిగినది. ప్రభువు ఒక అద్భుతమైన, అందమైన గృహమును నిర్మించుకోవడానికి సహాయము చేసియున్నాడు. ఆ విధంగానే, ఎంతో కాలము వేచియున్న తర్వాత, ప్రతి ఆశీర్వాదాన్ని ఆమె పొందుకున్నారు. ఆలాగుననే, ఆమె విషయమై ప్రభువు సమస్తమును సమకూర్చి చక్కగా జరిగించియున్నాడు. హల్లెలూయా! సమస్త మహిమ దేవునికే కలుగును గాక.
నా ప్రియ స్నేహితులారా, బహుశా! మీరు కూడా ఒక అద్భుతం కొరకు ఎంతో కాలము నుండి ఎదురు చూస్తుండవచ్చును, అది మీ వివాహం, మీకు గర్భఫలము, మీకు మరియు మీ ప్రియులకు వారి స్వస్థత, ఆర్థిక పరిస్థితులు లేదా మీ స్వంత ఇల్లు కావచ్చును. మీరు కూడా ఆశ్చర్యపోవచ్చును. ఒకవేళ మీరు, 'అస్సలు ప్రభువు నా ప్రార్థనను ఆలకిస్తున్నాడా? లేదా?' అని అనుకుంటుండవచ్చును. అస్సలు ప్రభువు ఎక్కడ ఉన్నాడనియు కూడా అడుగుతూ ఉండవచ్చును. కానీ, ప్రభువు మీ యొక్క తల వెంట్రుకలన్నిటిని లెక్కించియున్నాడు అని గుర్తించుకోండి, మీలో ప్రతి ఒక్కరి అవసరతలను ఆయన గుర్తెరిగియున్నాడు. ప్రభువుకు అసాధ్యమైనది అంటూ ఏదియు లేదు నా స్నేహితులారా. మీ జీవితములో కూడా ఆయన అద్భుతములు నిశ్చయముగా జరిగిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మమ్మును ఇంతగా గుర్తెరిగియున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మా తల వెంట్రుకలను కూడా నీవు లెక్కించియున్నందుకై నీకు వందనాలు. దేవా, మేము నీ దృష్టిలో శ్రేష్టులమని మేము నమ్ముచున్నాము. ఓ ప్రభువా, మా కుటుంబం యొక్క ప్రతి అవసరాన్ని గుర్తుంచుకొని, ఈ రోజు స్వస్థత, పునరుద్ధరణ మరియు ఆశీర్వాదాన్ని మాకు దయచేయుము. దేవా, మా జీవితంలోని ప్రతి దుఃఖాన్ని ఆనందాన్ని కలిగించు సాక్ష్యంగా మమ్మును మార్చుము. ప్రభువా, మా జీవితానికి సంబంధించిన ప్రతిదాన్ని పరిపూర్ణం చేసి, నీ మహిమ కొరకు అద్భుతాలు జరిగించుమము. ప్రభువా, స్వంత గృహములేని మాకు కూడా ఈ రోజు ఒక స్వంత గృహమును నిర్మించుకొనుటకు సహాయము దయచేయుము. దేవా, ఆర్థికముగా మాకు సహాయము చేయుము. ప్రభువా, ఈ రోజు నుండి మమ్మును దీవించి, మాకు ఒక చక్కని జీవిత భాగస్వామిని మరియు మాకు చక్కటి గర్భఫలమును దయచేయుము. దేవా, నీవు మమ్మును మరువకుండా జ్ఞాపకము చేసుకొనుము. ప్రభువా, పై చెప్పబడిన సహోదరి వలె మా జీవితాలలో సమస్తమును సమకూర్చి మమ్మును కూడా ఆశీర్వదించుము. ప్రభువా, మాకు సహాయము చేయుటకు నీవు మాత్రమే. కాబట్టి, ఈ రోజు మా అవసరతలన్నిటిని తీర్చుము. దేవా, మా పేరు నీవు గుర్తెరిగియున్నావని మరియు మా సమస్యలన్నియు ఎరిగియున్నావని మేము నమ్ముచున్నాము. కనుకనే, దేవా, నీ రాజ్యమునకు సహాయము చేయుటకు మేము ముందుకు వచ్చుటకు మాకు కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.