నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీతో ఒక కధ చెప్పాలని ఆశించుచున్నాను. ఒక పట్టణమునకు దూరముగా ఒక వృద్ధురాలు నివసించుచుండెను. తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా లేరు. తాను ఒంటరిగా నివసించుచుండెను. అదే సమయములో, తన జీవితములో ప్రతి విషయములను గురించి, ప్రభువు ఇచ్చిన ఆశీర్వాదములన్నిటిని బట్టి, 'వందనములు యేసయ్యా' అని గట్టిగా ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినది. అది చూసిన, తన ఇరుగుపొరుగువారు, అనగా, అదే విశ్వాసములేనివారు, ఈ ముసలామెను, ఏలాగైనా ఆటపట్టించి, ఆమె విశ్వాసమును పరీక్షించాలి అని ఆ పొరుగువారైన ఆ వ్యక్తి అనుకున్నాడు. ఒకరోజు, 'ఆమె, యేసయ్యా, నేను తినడానికి నాకు బియ్యము కావాలి, పండ్లు మరియు కూరగాయలు కావాలి' అని ఆ సమయములో ఈ ముసలామె గట్టిగా ప్రార్థన చేసెను. ఆ ప్రార్థన విని, 'ఈమెను ఆటపట్టించడానికి ఇదియే సమయము' అని ఆ పొరుగు యింటి వ్యక్తి అనుకున్నాడు. ఆమె అడిగినవన్నిటిని ఒక పట్టిక వ్రాసుకొని, తన యింటి దగ్గర ఉన్న ఒక దుకాణమునకు వెళ్లి, వాటన్నిటిని తానే డబ్బులు ఇచ్చి కొనుక్కొని, తీసుకొని వచ్చి, ఆమె యింటి ముందు పెట్టాడు. డోర్ బెల్ కొట్టి అక్కడ నుండి కనిపించకుండా వెళ్లిపోయాడు.

ఆమె ఆ బెల్ శబ్దము వినగానే, పరుగెత్తుకుంటూ అక్కడకు వచ్చినది. ఆ వృద్ధురాలు తలుపు తెరచి చూడగానే, అక్కడ వస్తువులతో నింపబడిన ఒక సంచి కనబడెను. అది చూచిన ఆమె, వెంటనే, ' యేసయ్యా, నాకు కావలసిన సరుకులన్నిటిని నాకు ఇచ్చినందుకై నీకు వందనములు' అని దేవుని స్తుతించడము మొదలుపెట్టినది. ఆ సమయములో ఆ పొరుగు వ్యక్తి వచ్చి ఆమెతో, నీకు ఇవన్నియు యేసయ్య ఇవ్వలేదు, నేను అన్నిటిని కొనుక్కొని తీసుకొని వచ్చాను అని చెప్పాడు. వెంటనే ఆమె, 'ఈ సరుకులన్నిటిని బట్టి నీకు వందనములు' అని చెప్పి దేవునిని స్తుతించినది. ఇంకను ఆమె, 'యేసయ్యా, నాకు కావలసిన వాటన్నిటికి సాతాను డబ్బులు చెల్లించునట్లుగా చేసినందుకై నీకు వందనములు' అని చెప్పెను. అప్పుడు, ఆ పొరుగు వ్యక్తి ఎంతో బాధపడుచూ, తన యింటికి తిరిగి వెళ్లిపోయాడు. మీ విశ్వాసమును ప్రోత్సహించడానికి ఇది ఒక చిన్న హాస్యాస్పద కధగా ఉన్నది.

నా ప్రియులారా, ఈ రోజు మీరు ప్రభువును విశ్వసించుచున్నారమో? మీరు ఎటువంటి పరిస్థితులలో ఉన్నను సరే, ప్రభువును మాత్రమే ఆశించుచున్నారా? మీరు ప్రభువును నమ్ముతూ, మీరు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితిలోనైనా ఆయనలో ఆశ్రయం పొందుతూ ఉండి ఉండవచ్చును. అయితే, ఈ రోజు మీరు ఆయన వైపు పరుగెత్తండి. ప్రభువు మీకు బలమైన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అందుకే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 25:3వ వచనములో చెప్పబడినట్లుగానే, " ...నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగులకుండ నీడగాను ఉంటివి'' అని చెప్పబడినట్లుగానే, అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువే మనకు నీడగా ఉంటాడు. ఏలయనగా, అనిశ్చితమైనటువంటి ఈ కఠినమైన ప్రపంచములో ప్రభువే మనకు ఒక గొప్ప ఆశ్రయముగా ఉంటాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు మీ జీవితమును మరియు మీ బిడ్డల జీవితములను యేసయ్య హస్తాలకు ఇప్పుడే సమర్పించుకొనండి. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు ఈ రోజు మిమ్మును మరియు మీ కుటుంబములను కాపాడుతాడు, నడిపిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, ప్రతి తుఫానులో నీవే మా బలమైన ఆశ్రయము, మా సురక్షితమైన శరణాలయముగాను ఉన్నందుకై నీకు వందనములు. యేసయ్యా, మమ్మును ఎన్నడు కూడా విడువకుండా ఎడబాయకుండా ఉన్నందుకై నీకు కృతజ్ఞతలు. దేవా, మా భయం, అనిశ్చితి మరియు బలహీనత మమ్మును చుట్టుముట్టినప్పుడు, మేము నీ వైపు పరుగెత్తడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ దివ్యమైన ఏర్పాటు మరియు సరైన సమయము మీద నమ్మకం ఉంచడానికి మా విశ్వాసాన్ని బలపరచుము. యేసయ్యా, మా జీవితములో అద్భుతం జరగకముందే నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం మాకు నేర్పించుము. దేవా, నీ బలమైన నీడ క్రింద మా జీవితాన్ని మరియు మా పిల్లల జీవితాలను కాపాడుము. ప్రభువా, వెట్ట తగులకుండ మాకు నీడగా, ప్రతి కష్టంలో మాకు ఆశ్రయంగా ఉండుము. యేసయ్యా, మా జీవితాలను నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, మేము ఆలాగున చేసినప్పుడు నీవు మాకు ఎంత గొప్ప సమాధానమును కలుగజేయుచున్నావని మేము నమ్ముటకు నీ కృపను దయచేయుము. దేవా, ఆ వృద్ధురాలు నీయందు ఎంతో విశ్వాసమును కలిగియున్నట్లుగానే, మేమును కూడా ఆలాంటి విశ్వాసమును కలిగియుండుటకు మాకు నేర్పించుము. ప్రభువా, మేము ఎల్లప్పుడు ఒకే విశ్వాసమును కలిగియుండుటకు మాకు నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించుము. దేవా, మా కుటుంబములను మరియు మా బిడ్డల కుటుంబములను నీ హస్తములకు సమర్పించుకొనుచున్నాము, మమ్మునందరిని కాపాడుము మరియు నీ మార్గములో మమ్మును నీ చిత్త ప్రకారము నడిపించుమని యేసు క్రీస్తు యొక్క శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.