నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ రోజు బైబిల్ గ్రంథము హెబ్రీయులకు 6:10 నుండి ఒక అద్భుతమైన వాగ్దానమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు'' అని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది. మీలో ఎంతమంది ప్రభువును వెంబడించుచూ, ఆయన పరిచర్యను చేయాలని ఆశపడుచున్నారు? మీ స్వంత గృహము నుండి కూడా మీరు ప్రభువు కొరకు ఏదో ఒక కార్యమును చేయగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఎలాగున సేవించాలో మీరు ఆశ్చర్యపోవచ్చును. మీరు వేదికపై లేదా పెద్ద వేదికపై ఉండవలసిన అవసరం లేదు; మీ స్వంత ఇంటి నుండి కూడా, మీరు దేవుని పరిచర్యకు ఒక పాత్రగా ఉండవచ్చును. మీ ప్రార్థనలు, మీ ప్రోత్సాహకరమైన మాటలు, ఇతరుల పట్ల మీకున్న శ్రద్ధ అన్నిటిని మరువకుండా, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.

నా స్వంత జీవితములో నేను దీనిని సాక్ష్యముగా అనుభవించియున్నాను. నేను 1986వ సంవత్సరములో నా కుమార్తె ఏంజల్‌ను కోల్పోయినప్పుడు, నా హృదయము బ్రద్ధలైపోయినది. ఆ సయములో ప్రభువు నాకు ఒక అద్భుతమైన పరిచర్యను ఇచ్చాడు. 1988వ సంవత్సరములో ప్రభువు నాతో మాట్లాడి ఒక ప్రార్థనా బృందం పరిచర్యను ప్రారంభింపజేసాడు. అది స్త్రీల కొరకైన పరిచర్య. అది ఎలా చేయాలి? ఏమి చేయాలి? అని నాకేమి తెలియదు. ప్రభువు అద్భుతమైన రీతిలో నన్ను నడిపించాడు. ఇప్పుడు ఆ పరిచర్య ప్రారంభించి 30 సంవత్సరములు గడిచిపోయాయి. అనేకమంది స్త్రీలు ఈ పరిచర్యలో పాల్గొంటూ, ప్రార్థిస్తూ, వారు ఇప్పుడు ప్రభువు కొరకు ప్రార్థన యోధులుగా నిలిచియున్నారు. ఈ పరిచర్య పేరు, 'ఎస్తేరు ప్రార్థనా బృందం.' బైబిల్‌లో ఉన్న ఎస్తేరు వలె, మేము స్త్రీలందరము కలిసి కొన్ని అంశములను గురించి ప్రార్థిస్తాము. నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా చేరి, ప్రభువు చేత దీవెనలు పొందగలరు. నా ప్రియులారా, మీరు కూడా కుటుంబముగా కలిసి ప్రార్థించవచ్చును. ఇంకను యౌవనస్థులు మరియు చిన్న పిల్లలు కూడా ఇందులో చేరి ప్రార్థించవచ్చును. నా కుమార్తెను పోగొట్టుకొని, ఆ వేదన నుండి బయటకు ఎలా రావాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ అద్భుతమైన పరిచర్యను ప్రభువు నాకు ఇచ్చాడు. ఇప్పటికిని నేను ఆ పరిచర్యను కొనసాగించుచున్నాను. ఈ పరిచర్య ద్వారా అనేకులు దీవించబడుచున్నారు. అనేకులు ఈ పరిచర్య ద్వారా ప్రభువు కొరకు పనిచేయుచున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియ సహోదరీ, సహోదరులారా, అవును, మీరు ప్రభువు కొరకు గొప్ప కార్యములు చేయుచున్నారు. మీరు ఆలాగున చేసినప్పుడు, ఈ వాగ్దానము ప్రకారము, ఏమి జరుగుతుంది? "మీరు చేసిన కార్యమును మరియు తన నామమును బట్టి చూపిన మీరు ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కానేకాడు'' కనుకనే, నా ప్రియులారా, మీరు కూడా ప్రార్థన యోధులుగా మారండి, యౌవనస్థురాలుగాను, వివాహము జరిగిన స్త్రీలుగా, దంపతులుగా కలిసి పరిచర్య చేయుట కొరకు ఒక పరిచర్య ఉన్నది. ఆ పరిచర్యలో మీరు కూడా కలిసి పరిచర్య చేసినట్లయితే, మీరు ప్రభువు కొరకు గొప్ప కార్యములు చేయగలుగుతారు. మీ ద్వారా ప్రభువు తన నామమున మహిమపరచుకుంటూ, మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాడు. కనుకనే, నేడు మనలను మనము తగ్గించుకొని, దేవుని వైపు చూద్దాము. ఆలాగున ప్రభువుకు పరిచర్య చేయుటకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని, ఆయన వైపు తిరిగి ఆయనకు పరిచర్య చేసినట్లయితే, నిశ్చయముగా, మీరు కూడా కలిసి దీవెనలు పొందగలరు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్న మేము నీ యొక్క ఆశ్రయము క్రిందకు వచ్చునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా సమయమును మేము వృధాపరచకుండా, నీ కొరకు పనిచేయుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. దేవా, నీ పరిచర్య చేయుటకు మమ్మును మేము నీ హస్తాలకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మేము పరిచర్య చేయుచు, ఇతరుల కొరకు ప్రార్థించే గొప్ప కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను పొందుకొని, మేము ఇతరుల కొరకు పరిచర్య చేయుటకును మరియు నీ రాజ్యమునకు ఒక ఆత్మనైనను తీసుకొని వచ్చునట్లుగా మమ్మును మరియు మా కుటుంబ సభ్యులను నీ సేవలో వాడుకొనుము. దేవా, ఈ విలువైన వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రభువా, మా ప్రేమ, శ్రమను మరచిపోయేలా నీవు అన్యాయస్థుడివి కావు. మేము నిన్ను సేవించాలని కోరుకుంటున్నప్పుడు మా హృదయాన్ని బలపరచుము. దేవా, మా ఇంట్లో మరియు కుటుంబంలో ప్రార్థన యోధులుగా మమ్మును లేవనెత్తుము. ప్రభువా, మా దుఃఖమంతయు తొలగించి, అనేకులకు ఆశీర్వాదముగా మార్చుము. దేవా, ఇతరుల కొరకు మేము విజ్ఞాపనము చేయునట్లుగా మమ్మును నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపుము. దేవా, నీ మహిమ కొరకు మా పరిచర్య ఫలమును విస్తరింపజేయుము. ప్రభువా, మా సమయాన్ని వృధా చేయకుండా, నీ రాజ్యమునకు ఉపయోగకరంగా ఉండనిమ్ము. దేవా, నీ పరిశుద్ధ నామమును ఎల్లప్పుడూ మహిమపరచుటకు మమ్మును సిద్ధపరచుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.