నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 84:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు'' ప్రకారం అవును ప్రియులారా, ప్రభువు మిమ్మును తన మేలుతో నింపుతాడు. ఆయన యెదుట మీరు యథార్థముగా నడుచుకున్నప్పుడు, ఆయన మీకు ఏ మేలు చేయక మానడు. కనుకనే, మీరు ప్రభువునందు ఆనందించండి. ఇంకను నిందారహితముగాను మరియు యథార్థముగాను ఉండడము అనగా ఏమిటి? బైబిల్ నుండి కీర్తనలు 119:1వ వచనములో మనము చూచినట్లయితే, "యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు'' ప్రకారం మనము ధన్యతను పొందుకోవాలనగా, యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకున్నప్పుడు మనము దేవుని యొద్ద నుండి అట్టి ధన్యతను పొందుకుంటాము.

బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తిని మనము చూడగలము. అతని మార్గములు ఎంతో నిర్దోషములైనవి. బబులోను దేశమునకు బంధీగా కొనిపోబడినటువంటి దానియేలు అను ఒక వ్యక్తిని మనము చూడగలము. పరిపాలకులకు మరియు ఆత్మీయులకు తల ఒగ్గుటకు అనేక అవకాశములున్నను కూడా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైన వాటిని జరిగించకుండా, అతని జీవితమును భద్రపరచుకోవడము కొరకు అతడు దేవుని ఆజ్ఞలను మాత్రమే పాటించాడు. రాజును మాత్రమే ఆరాధించాలన్న ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు కూడా, దానియేలు ఎన్నటికిని తన విశ్వాసమును విడిచిపెట్టలేదు. ఒక దినములో మూడుసార్లు క్రమము తప్పకుండా ప్రార్థించాడు. దానియేలు రాజు ఆజ్ఞలను తన విశ్వాసము మీద ప్రభావితము చేయలేదు. అతడు దేవునికి ఎలా ఇష్టుడుగా జీవించుచున్నాడో ప్రభువు గమనించాడు. కనుకనే, తగిన సమయములో ప్రభువు అతనిని హెచ్చించాడు. పరిపాలకులు ఆశ్చర్యపోవు విధంగా ప్రభువు తన వరములతో అతనిని దీవించాడు. ఆ రాజ్యము మీద పరిపాలకుడుగా తను కూడా హెచ్చింపబడ్డాడు. ఇది ఒక్కసారిగా జరగలేదు. కానీ, అతడు ఎన్నో కష్టాలను మరియు శ్రమలను ఎదుర్కొన్నాడు. ఎన్నో పరీక్షలు వచ్చినను కానీ, అతడు తన విశ్వాసమును కాపాడుకున్నాడు. ప్రభువు ఆజ్ఞానానుసారముగా నడుచుకుంటూ, ఆయన మాటలకు విధేయత చూపెడుతూ, దేవుని అతడు విడిచిపెట్టలేదు. సమస్త మేలులను ప్రభువు అతనికి ఇచ్చాడు. ఇంకను ప్రభువు అతనికి ఏ మేలును చేయక మానలేదు. కాబట్టి, చింతించకండి.

నా ప్రియులారా, "నేను యథార్ధమైన వ్యక్తిని, నా మార్గము నిందారహితముగా నడుచుకుంటున్నాను, నా ప్రతిఫలము ఏది, నా జీవితములో ఎప్పుడు మేలు జరుగుతుంది? అని మీరు అంటున్నారా?'' ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఇప్పుడు మీరు మీ జీవితములో నిందలు, కష్టాలు, శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికిని, ప్రభువు మిమ్మును విడిపించి, తగిన సమయములో మీకు ప్రతిఫలమును ఇస్తాడు. దానియేలును హెచ్చించిన రీతిగా, పరిపాలకునిగా చేసినట్లుగానే, మంచితనముతో అతనికి ప్రతిఫలము ఇచ్చినట్లుగానే, మిమ్మును కూడా అదేవిధముగా ప్రభువు హెచ్చిస్తాడు. ప్రియులారా, నేడు వ్యాధులతో ఉన్న మీకు స్వస్థతను ఇస్తాడు, మీకు బిడ్డను, జీవిత భాగస్వామిని మరియు మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగమును మీకు ఇస్తాడు, మీ వ్యాపారములో మీకు విజయమును ఇస్తాడు. మీ శ్రమల నుండి మీకు విడుదలను ఇస్తాడు. మిమ్మును హెచ్చించి, ఘనపరుస్తాడు. ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయకమానడు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, ప్రోత్సహించబడండి. మీరు తగిన సమయములో హెచ్చించబడతారు. మీ విశ్వాసమును నమ్మకమును ప్రభువు మీద ఉంచండి. నేడు మీరు నిందారహితమైన జీవితమును కొనసాగించుచూ, దేవుని దృష్టిలో యథార్థముగా జీవించినట్లయితే, మీ విధేయతను, యథార్థతను చూచి, ప్రభువు మిమ్మును హెచ్చించి, ఘనపరుస్తాడు. ఆయన మీకు ఏ మేలు చేయక మానడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నిందారహితముగా జీవించుచున్నాము. ప్రభువా, ఈ రోజు ఈ సందేశమును చదువుచున్న మమ్మును దీవించుము. దేవా, మేము నీ యందు నిందరాహితముగా జీవించుచున్నాము, మా అద్భుతము ఎప్పుడు లభిస్తుంది, దేవా, మేము అనేక శ్రమలు కష్టాలను ఎదుర్కొంటున్నాము, మేము అందరికి మేలు చేయుచున్నాము, మాకు తగిన ప్రతిఫలము ఎప్పుడు వస్తుంది తండ్రి. ప్రభువా, నీ మాటలకు విధేయులమై జీవించునట్లుగాను మరియు నీ యెదుట నిర్దోషముగా నడుచుకొను మాకు ఏ మేలు చేయకమానవని సెలవిచ్చిన నీ వాగ్దానానికై నీకు వందనాలు. ప్రభువా, నీ భక్తుడైన దానియేలు చేసినట్లుగానే, నమ్మకముగా, నిందారహితముగాను, నీయందు పూర్తి నమ్మకముతో నీ మార్గాలలో నడుచుకొనుటకు మమ్మును బలపరచుము. దేవా, మా జీవితం నీ దృష్టిలో ఆనందదాయకంగా ఉండునట్లుగా చేయుము మరియు మా హృదయము నీ నుండి ఎన్నడూ తొలగిపోనియ్యకుము. ప్రభువా, నీవు తగిన సమయంలో, నీవు మాకు ప్రతిఫలమిస్తావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, నీవు మమ్మును స్వస్థపరచుము, మమ్మును ఆశీర్వదించుము, ఇంకను ప్రభువా, మాకు కావలసినవి సమకూర్చుము మరియు మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, మేము నీ నీతిలో నడిచే నీ పిల్లలైన మమ్మును ఘనపరచునట్లు హెచ్చించి, మమ్మును నీ కౌగిలిలోనికి హత్తుకొని, మమ్మును ఘనపరచి, ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.