నా ప్రియమైనవారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 కొరింథీయులకు 1:10 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును...'' అని చెప్పబడినట్లుగానే, మన ఆత్మలు, కుటుంబములు, ఉద్యోగములు, పిల్లలు మరియు పరిచర్యలకు ఆటంకము కలిగించు ప్రమాదములను మనము ఎదుర్కొనవచ్చును. వీటన్నిటి మధ్యలో మరణ భయము, అపవాది దాడులు మరియు ఊహించని కష్టములు ఎదుర్కొనుచున్నాము. అయితే, వీటన్నిటి మధ్యలో ప్రభువు మనలను మరియు మనము కలిగియున్న భయములన్నిటి నుండి మనలను విడిపిస్తానని మన పట్ల వాగ్దానము చేయుచున్నాడు. దేవుని వాక్యము మనకు మూడు ముఖ్యమైన వాస్తవములను మనకు గుర్తుచేయుచున్నది. ఆయన మనలను విడిపించాడు, ప్రస్తుతము విడిపించుచున్నాడు మరియు ఇకముందు కూడా ృమనలను విడిపిస్తాడు. కాబట్టి, మనము ఆయన యందు మాత్రమే మన నిరీక్షణను కలిగియుందాము.
మొదటగా, మరణము అనే ప్రమాదం నుండి మనలను కాపాడినందుకు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించుదాము. మన ప్రాణములను కాపాడినందుకు మనము ఆయనను ఎంతగానో స్తుతించవలెను! దుష్టుల కుట్రలు, అసూయ మరియు పాపము నుండి వచ్చు ఫలితములవంటి ఎన్నో ప్రమాదములను మనకు తెలియకుండానే మనము ఎదుర్కొని ఉండవచ్చును. అయినప్పటికిని, ప్రభువు మనలను వినాశనము నుండి కాపాడియున్నాడు. కనుకనే, మనము, 'ప్రభువా, వినాశనం నుండి మమ్మును కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు!' అని పలుకుతూ ఆయన పరిశుద్ధ నామమును స్తుతించవలెను.
రెండవదిగా, ప్రభువు ప్రతి క్షణం మనలను కాపాడుతూనే ఉంటున్నాడు. ఎప్పటికిని శాశ్వతమైన ఆయన కృప మరియు కనికరము ద్వారానే మనము ఇంతవరకు నిలిచియున్నాము. మనలను బలపరచడానికి మరియు కాపాడటానికి ఆయన ప్రతి ఉదయము నూతన వాత్సల్యతను ఆయన మనకు అనుగ్రహించుచున్నాడు. కాబట్టి, ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమ మరియు కాపుదల, భద్రత కొరకు మనము నిత్యము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలెను.
మూడవదిగా, ప్రభువు మనలను మరలా విమోచిస్తాడు. ఈ వాగ్దానమును నమ్ముతూ, మనము ఆయనను గట్టిగా పట్టుకున్నట్లయితే, మనము ఎటువంటి నిర్ణయములను తీసుకున్నను, ఆయన మనలను కాపాడుచున్నాడు అనే భావనతో అజాగ్రత్తగా జీవించకూడదు. అందుకు బదులుగా, మనము పరిశుద్ధతలో నడుచుకుంటూ, నీతిగా జీవించుచూ, దేవునిని ఘనపరచుచూ, ఆయన వాక్యమునకు నమ్మకముగా విధేయత చూపవలెను. మనము ఆయనయందు స్థిరంగా నిలిచియున్నప్పుడు, ఆయన ఇచ్చు నిత్యమైన భద్రతను మనము నమ్మగలము.
నా ప్రియులారా, ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 91:2-10వ వచనములలోని ఆశీర్వాదాన్ని అంగీకరించుచూ, ఈ మాటలను మన వ్యక్తిగత విశ్వాస ప్రకటనగా మార్చుకుందాము: "ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.''
రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసికొనియున్నావు. నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎందుకనగా, ప్రభువు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మన చుట్టూ ఉన్న దుష్టత్వపు పరిణామములను మనము చూడవచ్చును. కానీ, ఆయన రక్షణలో మనము సురక్షితంగా విశ్రమించ వచ్చును. అవును, నా ప్రియులారా, మహోన్నతుని మన నివాస స్థలంగా చేసుకున్న ప్పుడు, మనకు ఎటువంటి అపాయము కలుగదు, ఏ తెగులు మన గుడారమును సమీపించదు. ఈ వాగ్దానములను మనము గట్టిగా పట్టుకుని, విశ్వాసముతో వాటిని ప్రకటించుదాము. కనుకనే, మీరు ఈలాగున ప్రార్థించండి, 'తండ్రీ, నీ వాక్యానుసారముగా మమ్మును కాపాడుచున్నందుకై నీకు కృతజ్ఞతలు. యేసయ్య, మమ్మును విడిపించినందుకు నీకు కృతజ్ఞతలు. పరిశుద్ధతతోనూ భయభక్తులతోనూ నడుచుకునే కృపను మాకు అనుగ్రహించి, మమ్మును సమృద్ధిగా ఆశీర్వదించుము.
నా ప్రియులారా, మన పోరాటము కేవలం రక్తమాంసములతో కాదు వాక్యము సెలవిచుచున్నది. అందుకే బైబిల్ నుండి ఎఫెసీయులకు 6:12వ వచనములో చూచినట్లయితే, "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము'' అని చెప్పబడినట్లుగానే, మనము ఈ లోకనాధుడైన అపవాది సంబంధమైన కార్యముతోను పోరాడుచున్నామని లేఖనము మనకు గుర్తుచేయుచున్నది. దుష్ట శక్తులకు విరోధముగా మనము ఆధ్యాత్మిక పోరాటములను ఎదుర్కొంటున్నాము, కానీ సిలువ మీద యేసుక్రీస్తు సాధించిన విజయం ద్వారా వాటిపై ఆయన జయము పొందారు. ఆ శక్తులు మన జీవితములలోనికి తీసుకురావలెనని చూచుచున్న ప్రమాదముల నుండి ఆయన ద్వారా దేవుడు మనలను కాపాడతాడని మనము నమ్మవచ్చును. యేసు నామములో అపారమైన శక్తి కలదు మరియు ప్రభువు తన పిల్లల మీద తన నామము ఉంచుచున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండి ఆయన శక్తివంతమైన నామము మీద నమ్మకం ఉంచండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకపు తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా యొక్క ప్రతి కీడు ప్రమాదం నుండి మమ్మును విడిపించి, నీ కృప మరియు వాత్సల్యత ద్వారా మమ్మును కాపాడినందుకు నీకు వందనములు. ప్రభువా, మరణము, రహస్య బెదిరింపులు, అసూయ, దుష్ట కుట్రలు మరియు ప్రతి దుష్టశక్తి వంటి ప్రమాదముల నుండి మమ్మును కాపాడినందుకై నీకు వందనములు. దేవా, నీవే మాకు ఆశ్రయముగాను, కోటగాను, కేడెముగాను మరియు రక్షకునిగా ఉండుము. ప్రభువా, మమ్మును ప్రతి కీడు మరియు ప్రతి ప్రమాదము నుండి మమ్మును మరియు మా కుటుంబమును విడిపించుము మరియు మా పిల్లలను, ఉద్యోగములను, పరిచర్యను మరియు గృహములను కాపాడుము. దేవా, మేము పరిశుద్ధత, నీతి, భయభక్తులు కలిగియుంటూ మరియు నీ వాక్యమునకు విధేయతతో మేము నడుచుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మా విశ్వాసమును బలపరచి, అనుదినము నిన్ను నమ్మునట్లుగా మాకు నేర్పించుము. దేవా, నీ శక్తివంతమైన రెక్కల క్రింద మమ్మును కప్పి, మా మీద యేసు నామమును ఉంచి, మరియు మేము వర్ధిల్లునట్లుగా మమ్మును మార్చుమని యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


