నా ప్రియమైన వారలారా, నేడు ప్రభువు మిమ్మును జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 10:6వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును'' అని చెప్పబడినట్లుగానే, నీతిమంతుల తల మీద దీవెనలు నిలిచి యుండును. అవును, నా ప్రియ స్నేహితులారా, నీతిగా జీవించడానికి ప్రయత్నించే ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీని ఆయన చూస్తున్నాడు. అందుకే, నీతిమంతుల మీద సమృద్ధియైన ఆశీర్వాదములను, పరిపూర్ణమైన ప్రతిఫలమును కుమ్మరిస్తానని ప్రభువు వాగ్దానము చేయుచున్నాడు. అయితే, ఈ ఆశీర్వాదమును పొందుకొను ఆ నీతిమంతులు ఎవరు? అందుకే బైబిల్ నుండి మీకా 6:8 వ వచనములో చూచినట్లయితే, "మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు'' అని చెప్పబడిన ప్రకారం, మనము న్యాయముగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి మరియు దేవుని యందు దీనత్వముతో నడుచుకోవలెనని ఆయన మన పట్ల కోరుచున్నాడు. ఎవరైతే, నీతిని న్యాయమును అనుసరించి, దీనమనస్సు కలిగి ప్రవచించెదరో అటువంటి వారు న్యాయమును కోరుకుంటారు, హృదయపూర్వకంగా కనికరమును చూపిస్తారు మరియు ఇతరులను క్షమిస్తారు, తమ పిల్లలను మరియు తమ కుటుంబములను నీతిన్యాయ మార్గములలో నడిపిస్తాడు. అంతమాత్రమే దేవుని యెదుట తమను తాము తగ్గించుకొని, దీనమనస్కులై ఉంటారు.
నా ప్రియులారా, మనము ఈ విధంగా జీవించినప్పుడు, ప్రభువు మన తలల మీద నీతి కిరీటమును ఉంచుతాడు. అందుకే బైబిల్ నుండి 2 తిమోతికి 4:7-8వ వచనములలో చూచినట్లయితే, " మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతి కిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును'' అని పౌలు పేర్కొన్నట్లుగా, ఆయన మంచి పోరాటమును పోరాడాడు, తన పరుగు పందెమును కడముట్టించాడు. అంతమాత్రమే కాదు, తన యొక్క విశ్వాసమును కాపాడుకొనియున్నాడు. తద్వారా, నీతి విషయమైన కిరీటము అతని కొరకు ఉంచబడియున్నది. ఇంకను నీతిమంతుడైన న్యాయాధిపతిగా ఉన్న ప్రభువు, ఆయన ప్రత్యక్షతను ప్రేమించు వారందరికిని నిశ్చయముగా దానిని అనుగ్రహిస్తాడు. అంతేకాక, రాత్రింబగళ్లు తనకు మొఱ్ఱపెట్టువారికి, తాను ఏర్పరచుకున్న వారి పట్ల తప్పకుండా న్యాయము జరిగిస్తాడని ప్రభువు వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి లూకా 18:7,8వ వచనములలో చూచినట్లయితే, "దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును...'' అని చెప్పబడినట్లుగానే, మీరు అన్యాయమును, నిందారోపణలు, ద్రోహము, అబద్ధపు సాక్ష్యములు, అసూయ లేదా అన్యాయమైన ప్రవర్తనను అనుభవించియున్నట్లయితే, నిరుత్సాహపడకండి. ప్రభువు మీ జీవితములో నీతిన్యాయమును జరిగిస్తాడు. ఆయన మీ దుఃఖమును తొలగించి, మీ నిరీక్షణను ముగింపునిచ్చి, మీ ఆశీర్వాదములను మరల పునరుద్ధరిస్తాడు. ప్రభువు మీ జీవితములోని ప్రతి రంగంలోను, మీ కార్యస్థలం, చదువులు, సమాజము, పరిచర్య, ఉద్యోగము మరియు సంస్థలో న్యాయమును స్థిరపరుస్తాడు. ఆయన మీకు తగిన ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. నా ప్రియులారా, మీకు విరోధముగా తలెత్తుచున్న ప్రతి దోషపూరితమైన ఆత్మ ఓడిపోవును మరియు మీ పిల్లలు ప్రతి దుష్ప్రభావము నుండి విడుదల పొందుకుంటారు. ఆలాగుననే, అవినీతి, అన్యాయమునకు, అవమానానికి సంబంధించిన ప్రతి కిరీటమునకు బదులుగా, మీకు నీతి కిరీటము లభించును.
నా ప్రియులారా, నీతికి సంబంధించిన ఈ కిరీటం వలన కలుగు ఆశీర్వాదాలు ఏమైయున్నవి? అందుకే బైబిల్ నుండి కీర్తనలు 112:1-5వ వచనములలో మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. ఆ ఆశీర్వాదములను మనము ఇప్పుడు చూడగలము, "యెహోవా యందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు'' ప్రకారము ఆయన యందు భయభక్తులు కలిగియున్నప్పుడు, మీరు ధన్యలవుతారు. అప్పుడు, మొదటిగా, " వాని సంతతివారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు'' అని చెప్పబడినట్లుగానే, మీ సంతానము భూమి మీద బలవంతులగుదురు; యథార్థవంతులైన మీ సంతతి ఆశీర్వదించబడుతుంది. రెండవదిగా, "కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును'' ప్రకారము మీ యింటిలో ఐశ్వర్యసంపదలు ఉంటాయి, మీ నీతి నిత్యము నిలిచి ఉంటుంది. మూడవదిగా,"యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు'' ప్రకారము చీకటిలో మీకు వెలుగు ఉదయిస్తుంది, మీ జీవితములో ఉన్న అంధకారమంతా తొలగిపోతుంది. మీరు దయ గలవారు, కరుణామయులు, వాత్సల్యతయుగలవారు మరియు మీ కార్యములలో మీరు నీతిమంతులుగా ఉన్నందున, ప్రభువు మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఇతరులు కూడా మీ పట్ల మంచితనంతోను, వాత్సల్యముతోను, కనికరంతోను నడుచుకుంటారు. ఆలాగుననే, "దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును'' అని చెప్పబడినట్లుగానే, న్యాయవిమర్శలో మీ వ్యాజ్యెము నిశ్చయముగా గెలుచును. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాటాడినందుకై నీకు వందనములు. దేవా, మేము నీతి మార్గములో నడవడానికి, న్యాయమును జరిగించడానికి, కనికరమును ప్రేమించడానికి, మరియు నీ యెదుట దీనమనస్సు కలిగి ఉండుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మా తలల మీద నీ నీతి కిరీటమును ఉంచుము. దేవా, మా జీవితము నుండి ప్రతి అవినీతిని, నిందారోపణలను, అసూయను, మరియు దుఃఖమును తొలగించుము. ప్రభువా, మా కుటుంబములోను, పని చేయు స్థలములోను, మా చదువులలోను మరియు పరిచర్యలో న్యాయమును జరిగించుము. దేవా, మా జీవితములో ఉన్న చీకటిలో నీ వెలుగు ప్రకాశించునట్లుగా చేయుము. ప్రభువా, మా పిల్లలను ఆశీర్వదించుము మరియు సంతతి భూమి మీద బలవంతులగునట్లుగా చేయుము. దేవా, మా యింట కలిమియు సంపదతోను, సమాధానముతోను, కనికరముతోను మరియు మంచితనముతోను నింపుము. ప్రభువా, మేము ఎదురు చూచుచున్న సమయమునకు ముగింపును దయచేయుము. దేవా, మేము కోల్పోయిన వాటన్నిటిని తిరిగి మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


