నా ప్రియమైన వారలారా! నేడు ప్రభువు మనకు అనుగ్రహించియున్న వాగ్దానముగా బైబిల్ నుండి యెహోషువ 1:5వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.నిన్ను విడువను నిన్ను ఎడబాయను'' అని చెప్పబడినట్లుగానే, మీ బ్రదుకు దినములన్నిటను మీ యెదుట ఎవరు నిలువలేరనియు, అంతము వరకు ఆయన మిమ్మును విడువడు మరియు ఎడబాయడని మీ పట్ల ప్రభువు వాగ్దానము చేయుచున్నాడు. అవును, నా ప్రియులారా, ఆయన మిమ్మును ఎన్నడును విడువడనియు, మరచిపోజాలడనియు మీకు ఒక నిరీక్షణను కలిగించుచున్నాడు. మీ బ్రదుకు దినములన్నిటను ఆయన మిమ్మును కాపాడి, భద్రపరచి, మీ తలను పైకి లేవనెత్తుతాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి, భయపడకండి.
మొట్టమొదట, ఆయన మీకు జ్ఞానమును అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 6:10వ వచనమును చదివినట్లయితే, "మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి'' అని చెప్పబడినట్లుగానే, విశ్వాసంతో నిండిన వ్యక్తి అయిన స్తెఫను గురించి బైబిల్లో శక్తివంతంగా వివరించబడియున్నది. అతను మాట్లాడిన జ్ఞానమును మరియు పరిశుద్ధాత్మను అతని విరోధులు ఎదిరించలేకపోయారు. అతడు ప్రకటించిన సత్యానికి వారు అతని యెదుట నిలువలేకపోయారు. అంతమాత్రమే కాదు, అతనిని జయించలేకపోయారు.
రెండవదిగా, మీకు విరోధముగా యే ఆయుధము ఏదియు వర్థిల్లదు. అందుకే బైబిల్ నుండి యెషయా 54:17వ వచనమును చూచినట్లయితే, "నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు'' అని చెప్పబడినట్లుగానే, మీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమూ విజయవంతము కాజాలదు. అవును, నా ప్రియులారా, మీ జీవితములో అనేకమంది మీకు విరోధముగా ఆయుధములను మీ మీదికి పంపించవచ్చును. కానీ ధైర్యముగా ఉండండి! అందుకే దేవుడు మనకు ఇంతటి శక్తివంతమైన వాగ్దానమును అనుగ్రహించుచున్నాడు, "నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు'' అని సెలవిచ్చుచున్నాడు. అవును, నా ప్రియులారా, ఒకవేళ, ఈ రోజు మీరు ఈ సత్యము యందు స్థిరముగా నిలిచియున్నందున, ప్రజలు మీ మీద అనేకవిధములైన ఆయుధములను ప్రయోగించవచ్చును. అబద్ధపు సాక్ష్యములు మీకు విరోధముగా లేవనెత్తబడవచ్చును, కొందరు మిమ్మును నమ్మించి వెన్నుపోటు పొడవవచ్చును. వారు మీ కష్టమును, వృత్తిపరమైన కృషిని ఉద్దేశపూర్వకంగా తప్పుగా చిత్రీకరించవచ్చును, నిజాన్ని వక్రీకరించి, వారి చర్యల యొక్క తీవ్రమైన పరిణామములను మీరు అనుభవించునట్లుగా చేయవచ్చును. వారు మీకు వ్యతిరేకంగా అనేకమైన విధములుగా మీకు కీడు కల్పించవచ్చును. వారు మీ కుటుంబమును విడదీయవచ్చును, మీ పిల్లలను వేరు చేయవచ్చును మరియు మీ ఇంటిలో అనవసరమైన గొడవలను సృష్టించవచ్చును. ఒక సమస్య తర్వాత మరొకటి వచ్చి, మీ జీవితంలో పదేపదే మీకు నష్టాలను కలిగించవచ్చును. చట్టపరంగా మీకు చెందవలసిన ఆస్తిని మీకు అందకుండా నిలిపివేయవచ్చును, అలాగే మీకు రావలసిన డబ్బును కూడా రాకుండా అడ్డుకోవచ్చును. కొందరు మీ మీద నిరాధారమైన కోర్టు కేసులు కూడా మోపవచ్చును. ముఖ్యంగా, వారు విడాకుల కోసం కేసులు వేయవచ్చును, మీకు వ్యతిరేకంగా అబద్ధపు సాక్ష్యములను చెప్పవచ్చును మరియు మీ జీవితమును నాశనము చేయడానికి ప్రయత్నించవచ్చును. చాలా సంవత్సరములుగా, చెడు నడతలను కలిగించు దుష్టుల కారణముగా మీకు వివాహము కాకుండా ఉండవచ్చును లేదా మీరు బాధాకరమైన సంబంధం నుండి విడుదల పొందలేకపోయి ఉండవచ్చును, ఇది మీకు తీవ్రమైన వేదనను కలిగిస్తూ ఉండి ఉండవచ్చును. అయితే ప్రభువు ఇచ్చిన వాగ్దానమును ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి: "మీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు!'' అవును, మీకు విరోధంగా తీర్పు పలికే ప్రతి నాలుకను మీరు ఖండించెదరు. ఇది ప్రభువు భక్తుల యొక్క స్వాస్థ్యము; వారి నీతి ఆయన నుండి మాత్రమే కలుగుతుంది.
మూడవదిగా, దేవుడు ప్రతి కీడును మేలుగా మారుస్తాడు. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 50:20వ వచనములో చూచినట్లయితే, ప్రభువు మనకు ఇలాగున గుర్తుచేయుచున్నాడు: " మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను'' అని చెప్పబడినట్లుగానే, మీకు కీడు చేయాలని ఉద్దేశించిన వారి ద్వారానే దేవుడు మీకు దానిని మేలుగా మారుస్తాడు. అవును, నా ప్రియులారా, మనము కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా, ఒక గొప్ప ఉద్దేశమును నెరవేర్చడానికి దేవుడు తెర వెనుక కార్యములు జరిగించుచున్నాడన్న విషయానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనం. అందుకే భక్తుడైన యోసేపు సోదరులు అతనికి కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు ఆ పరిస్థితులన్నింటిని అతనికి మేలుగా మార్చాడు. యోసేపు అనేకమందిని రక్షించగలుగునట్లుగా, దేవుడు అతనిని రాజుతో సమానమైన ఉన్నత పదవిలో కూర్చుండుట కొరకు ఒక అధికారిగా లేవనెత్తబడ్డాడు. నా ప్రియులారా, నేడు దేవుడు మీకు కూడా అటువంటి కృపనే అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:28వ వచనములో చూచినట్లయితే, "దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియులారా, మీరు దేవుని ప్రేమించి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మీకు సమస్తము మేలుకే జరిగించబడతాయని మనకు గుర్తుచేయుచున్నది. కనుకనే, నా ప్రియులారా, దుష్టప్రజలు లేదా అపవాది మీపై కీడు తలపెట్టి ఉండవచ్చును. అయితే, ప్రభువు సమస్తమును సమకూడి మీకు మేలు జరుగునట్లుగా చేస్తాడు. యేసు నామములో ఈ ఆశీర్వాదము నేడు మీకు లభించును గాక! ప్రతి కీడు వంటి దుష్ట పరిస్థితి మీకు మేలుగా మార్చబడును గాక! ప్రభువు మిమ్మును ఆశీర్వదించి, మీ జీవితంలో నీతిని స్థిరపరచును గాక! నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపాకనికరము గలిగిన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మమ్మును నీవు ఎన్నడును విడువకుండా, ఎడబాయకుండా, ఉంటానని మా పట్ల వాగ్దానము చేసినందుకై నీకు వందనములు. దేవా, మాకు విరోధముగా, లేచు ప్రతి దుష్ట పన్నాగము, నిందారోపణ, ద్రోహము మరియు వ్యతిరేకతల నుండి మమ్మును కాపాడుము. ప్రభువా, స్తెఫను నీ యొక్క జ్ఞానముతో నింపినట్లుగానే, నేడు మమ్మును కూడా నీ యొక్క దైవీక జ్ఞానంతో మరియు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. దేవా, మాకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధమూ వర్ధిల్లనీయకండి మరియు ప్రతి కష్టం నుండి మాకు నీతిన్యాయమును జరిగించి, మాకు విడుదలను అనుగ్రహించుము. ప్రభువా, నీవు యోసేపు జీవితములో జరిగించినట్లుగానే, ప్రతి దుష్ట పన్నాగమును మేలుగా మార్చుము. దేవా, నీవు మమ్మును ఘనపరచి, మా తలను పైకి లేవనెత్తుము మరియు మా జీవితంలో నీ నీతిని స్థాపించుము. ప్రభువా, మా కుటుంబము నీ రక్షణ, సమాధానము మరియు ఆశీర్వాదములను అనుభవించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


