నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు గొప్ప నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 17:2వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను.'' అవును, అబ్రాహాము దీర్ఘకాలముగా బిడ్డలు లేకుండా ఉండెను. అయితే, ప్రభువు అతనిని సమృద్ధిగా దీవిస్తాడు అని అబ్రాహాము విశ్వసించి, ప్రార్థించాడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 4:17,18వ వచనములను చదివినట్లయితే, "తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానినిబట్టి తాననేక జనములకు తండ్రియగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు అబ్రాహాముతో, ' అబ్రాహామా, నిన్ను నేను అనేక బిడ్డలకు తండ్రిగా చేసియున్నాను' అని వాగ్దానము చేశాడు. అస్సలు అతనికి బిడ్డలే లేరు. కానీ, అనేక జనములకు తండ్రిగా చేయుదునని అని చెప్పాడు. ఎందుకనగా, అతడు దేవుని విశ్వసించియున్నాడు. ఎంత గొప్ప దేవునిని మనము కలిగియున్నాము కదా!
నా ప్రియులారా, బైబిల్లో, "నేను వాగ్దానము చేయబడినట్లుగానే, నీ సంతానము ఉండునని'' ప్రభువు చెప్పియున్నాడు. ఆ మాటను అబ్రాహాము విశ్వసించియున్నాడు. బైబిల్ నుండి మత్తయి సువార్త 1:1-17 వ వచనములను మనము చూచినట్లయితే, దీవెనకరమైనటువంటి విషయములను చదువుతాము. ఇంకను బైబిల్ నుండి మత్తయి సువార్త 1:1వ వచనములో చెప్పబడినట్లుగానే, "అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి'' అని ప్రారంభించబడుతుంది. ఇంకను, మత్తయి సువార్త 1:17 వ వచనములో చూచినట్లయితే, "ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు'' అని చెప్పబడినట్లుగానే, కాబట్టి, క్రీస్తు అబ్రాహాము యొక్క వంశావళిలో జన్మించాడు. అది ఎంత దీవెనకరమైన జీవితము కదా అది! అబ్రాహామునకు ప్రారంభములో ఏమియు కూడా లేదు. అయితే, అతడు దేవుని విశ్వసించియున్నాడు. దేవునిని గట్టిగా పట్టుకొనియున్నాడు. అందుకే అతనిని అనేకమంది బిడ్డలతో సమృద్ధిగా దేవుడు దీవించియున్నాడు.
అదేవిధముగా, నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, నేడు ఈ సందేశమును చదువుచున్న మీకు బిడ్డలు లేరు అని బాధపడకండి. ఇంకను ఎవ్వరైనను సరే, జ్ఞానములేదు అని బాధపడకండి మరియు దీవెనలు లేవని చింతించకండి. అబ్రాహామువలె దేవుని విశ్వసించండి. హలెల్లూయా! ఇప్పుడే మనము ప్రార్థించి దేవుని యొక్క సమృద్ధి దీవెనలను పొందుకొనుటకు అబ్రాహాము వలె మిమ్మును దేవునికి సమర్పించుకొని, ఆయన వాక్యమునందు విశ్వాసముంచినట్లయితే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు మీ పట్ల నిరీక్షణ కలిగించి, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము నుండి మిమ్మును అబ్రాహాము వలె అనేక జనములకు మిమ్మును వారసులనుగా చేసి, మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోక తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ సమృద్ధియైన ఆశీర్వాదములను నమ్ముతూ మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, అబ్రాహాము నిన్ను నమ్మి నీ వాగ్దానమును పొందినట్లుగానే, మేము కూడా నిన్ను నమ్మి నీ వాక్యమును గట్టిగా హత్తుకొని యుంటూ, సమృద్ధియైన దీవెనలను పొందుకొనునట్లుగా చేయుము. ప్రభువా, సంతానం లేక, మంచి ఉద్యోగం లేక, జ్ఞానం లేక, లేదా మా జీవితాలలో ఆశీర్వాదములు లేక ఏడ్చుచున్న మా వైపు చూడుము. దేవా, మేము నీకు సమీపముగా వచ్చునట్లుగాను, మేము నీ యందు విశ్వాసముంచునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, నేడు మా యొక్క విశ్వాసమును బలపరచి, అబ్రాహామువలె మేము నిన్ను హత్తుకొనునట్లుగా మాకు సహాయము చేయుము.దేవా, మా యొక్క ప్రతి కుటుంబమును జ్ఞాపకము చేసుకొని, మా జీవితములలో నీ వాగ్దానములను నెరవేర్చుము. యేసయ్యా, నీ చిత్తానుసారముగా మమ్మును సమృద్ధిగా ఆశీర్వదించుము. దేవా, మా జీవితములో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మాకు నిరీక్షణ కలిగించి, మేము నిన్ను నమ్ముటకు మమ్మును నీ యొక్క విశ్వాసముతో నింపి, అనేకులకు మేము ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మాకు సహాయము చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


