నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 15:7వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును’’ అని ఇక్కడ దేవుని వాక్యము సెలవియ్యబడినట్లుగానే, నేడు దేవుడు మీ కార్యమును సఫలపరచవలెనని మీ పట్ల కోరుచున్నాడు. ఇంకను బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 15:1-2 వ వచనములలో చూచినట్లయితే, ‘‘ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను. ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైన యెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును’’ అని చెప్పబడినట్లుగానే, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవలసిన విషయమేమనగా, మీరు ఆయనతో జీవించినంత కాలము ప్రభువు మీ పక్షమున మీతో కూడా ఉంటాడు. మరొక ప్రాముఖ్యమైన వాగ్దానమేమనగా, మీరు ఆయనను గురించి విచారణ చేసినట్లయితే, ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఆలాగుననే, నా ప్రియులారా, మీరు ఆయనను వెదకినట్లయితే, ఆయన మీకు దొరుకుతాడు; ఒకవేళ మీరు ఆయనను విడిచిపెట్టినట్లయితే, ఆయన కూడా మిమ్మును విడిచిపెడతాడు. కనుకనే, మీరు దేవునిని గట్టిగా పట్టుకొని, ఆయనను వెంబడించినప్పుడు, నిశ్చయముగా, ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు.
అదేవిధముగా, మనము బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 15:14-15 వ వచనములలో చూచినట్లయితే, ‘‘వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరును సంతోషించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణము చేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెను’’ అని చెప్పబడినట్లుగానే, మనము పూర్ణ హృదయముతో ఆయనను వెదకినప్పుడు, ఆయన మనకు నెమ్మదిని కలుగజేయుచున్నాడు.
నా ప్రశస్తమైన సహోదరీ, సహోదరులారా, చిన్న బిడ్డలారా, చదువుకుంటున్నటువంటివారలారా, ప్రజలందరు మరియు మనమందరము కూడా అదే విధముగా చేయవలెను. మనము ప్రభువు వైపు చూచి, ‘ప్రభువా, నిన్ను మేము నమ్ముచున్నాము’ అని చెప్పాలి. చదువుకుంటున్నటువంటి బిడ్డలు ప్రభువు వైపు చూచి, ‘తండ్రీ, నీ జ్ఞానము మాకు కావాలి’ అని చెప్పండి. ప్రభువు మిమ్మును ఇప్పుడే బలపరుస్తాడు. కుటుంబములో దీవెనలు లేనటువంటి వారు ఇప్పుడే ప్రభువు వైపు చూచి, ‘ప్రభువా, నమ్ముచున్నాను అయ్యా, మా కుటుంబములో దీవెనలు కలుగజేయుము’అని చెప్పినప్పుడు ప్రభువు మిమ్మును ఆశీర్వదిస్తాడు.
నా ప్రియమైన వారలారా, బైబిల్లో రాజైన ఆసా మరియు అతని ప్రజలందరు దీవించబడినట్లుగానే, నేడు మీరు కూడా దీవించబడతారు. ఇప్పుడు దేవుని యొక్క సమృద్ధి దీవెనలు పొందుకొనునట్లుగా మనము కూడా ప్రార్థించుకుందామము. కుటుంబముగా మీరు మీ జీవితమును ప్రభువు హస్తములకు సమర్పించి, ఆయనకు మొఱ్ఱపెట్టండి. ఇంకను మీరందరు ప్రభువు వైపు చూస్తూ, ఆయనకు మొఱ్ఱపెట్టండి మరియు ఆయన యొక్క దీవెనలను సమృద్ధిగా పొందుకొనండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవే మాకు నిరీక్షణను కలిగించు మార్గముగా ఉన్నావు, గనుక మేము నీ పాదముల యొద్దకు వచ్చియున్నాము. ప్రభువా, మేము నిన్ను నమ్ముచూ, మా మార్గములను నీ యొక్క దివ్య హస్తములకు అప్పగించుచున్నాము. ప్రభువా, మా కుటుంబములోను, మా ప్రియులైనవారు, చదువుకుంటున్న వారు మరియు మేము కూడా నిన్ను గట్టిగా పట్టుకొనుచున్నాము. దేవా, నీ వాక్యము చేత నీవు మమ్మును బలపరచి, మాకు కావలసిన జ్ఞానమును, బుద్ధివివేకములను మరియు గ్రహించుటకు కావలసినశక్తిని ఇచ్చి మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, వారు నిన్ను పూర్ణహృదయంతో హత్తుకొనునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, నీకు మొరపెట్టుచున్న మమ్మును మరియు మా కుటుంబమును ఆశీర్వదించి, వారి అవసరతలన్నిటిని తీర్చుము. ప్రభువా, మా పూర్ణహృదయముతో నిన్ను వెదకడానికి మరియు నీకు నమ్మకముగా జీవించుటకు మాకు నేర్పించుము. దేవా, మా ప్రార్థనలను ఆలకించి, మా చదువుల యందు మరియు కుటుంబముల యందు నీ యొక్క సమృద్ధియైన ఆశీర్వాదములను కుమ్మరించుమని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


