నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 14:26వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు...'' అని చెప్పబడినట్లుగానే, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగియుండాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. దేవుని మనము మన కోటగా మరియు ఆశ్రయము కలిగియుండుట ఎంత గొప్ప భాగ్యము. అనిశ్చితమైనటువంటి పరిస్థితులు ఉన్నఈ లోకములో మనము జీవించుచున్నాము. అయితే, ప్రభువులో మనకు ఒక నిశ్చయమైన నిరీక్షణ కలదు. మనము దేవుని యందు భయభక్తులు కలిగియున్నప్పుడు ఆయన మనలో నిరీక్షణను కలుగజేస్తాడు. మన తర్వాత, మన బిడ్డలు కూడా అదే కాపుదలను మరియు సంరక్షణను కలిగియుంటారు. అందుకే బైబిల్ నుండి సామెతలు 10:9వ వచనములో చూచినట్లయితే, " యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును'' అని చెప్పబడినట్లుగానే, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగియుంటూ యథార్థము గా ప్రవర్తించవలెను.

ఆలాగుననే, బైబిల్ నుండి సామెతలు 20:7వ వచనములో చూచినట్లయితే, "యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదు రు'' అని చెప్పబడినట్లుగానే, మన పిల్లల తదనంతరము ధన్యులుగా ఉండాలంటే, మనము నీతిగాను, యథార్థతగాను దేవుని యందు భయభక్తులతో జీవించవలెను. మనము యథార్థతతోను, నీతిమంతులుగా నడుచుకొను వారిని ప్రభువు ఎంతగానో ప్రేమించుచున్నాడు. తరతరములు కూడా ఆశీర్వాదములు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే బైబిల్ నుండి 103:17వ వచనములో కూడా అదే సెలవిచ్చుచున్నది, "ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడచుకొను వారి మీద యెహోవాయందు భయభక్తులుగలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును. ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును'' అని చెప్పబడినట్లుగానే, మనము నీతిగా జీవించవలెనని వాక్యము అదే సెలవిచ్చుచున్నది. ఆయన కృప మనపై నిలిచి ఉండాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. మనము దేవునియందు విశ్వసించిన యెడల మనము మరియు మన కుటుంబ సభ్యులందరు కూడా రక్షింపబడతారని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కనుకనే, మీరు నీతిగా జీవించండి, మీ తరతరములు ఆశీర్వదింపబడండి.

నా భర్తగారి యొక్క తల్లిదండ్రులు మరియు నా తల్లిదండ్రులు దేవుని యందు యథార్థతలో నడుచుకున్నారు. అందుకొరకే మేము ఈ రోజు ఎంతగానో ఆశీర్వదింపబడియున్నాము. మా తర్వాత, మా పిల్లలు, మా పిల్లల తర్వాత, వారి పిల్లలు కూడా దేవునిచేత ఆశీర్వదింపబడు తూనే ఉన్నారు. ఇంతకు ముందు జరిగినటువంటి ఒక చిన్న హాస్యాస్పదమైనటువంటి సంఘటను మీతో పంచుకోవాలని ఆశించుచున్నాను. నా భర్తగారు తన యొక్క సహోదరి కలిసి కార్లులో వెళ్లుచున్నారు. నా భర్తగారు కారును నడిపించుచున్నారు. అది అమవాస్య దినమై ఉంటూ ఉన్నది. అంతట చిమ్మ చీకటి కమ్మియున్నది. రోడ్డు కూడ నల్లటి రంగులో ఉన్నది. అక్కడ మధ్యలో ఎటువంటి గుర్తులు కూడా రోడ్డుపైన లేనేలేవు. నా భర్తగారు ఏమో కారును చాలా వేగంతో పోనిచ్చుచుండెను. రోడ్డు మీద ఉన్నటువంటి ఆ తారు డ్రమ్ములను నా భర్తగారు చూడలేదు. ఆ డ్రమ్ములు కూడా నల్లటి రంగులోనే ఉన్నవి. ఆ డ్రమ్ములకంటె ముందుగా కొంతమంది పోలీసు అధికారులు నిలబడియున్నారు. నా భర్తగారు గానీ, ఎంతో వేగముతో నడిపించుచున్న కారణముచేత అక్కడ ఉన్న పోలీసు అధికారులను ఢీకొనియుండి ఉండేవారు. అయితే, నా భర్తగారు ఆకస్మాత్తుగా బ్రేక్‌ను వేయడము జరిగియున్నది. ఆ పోలీసు అధికారులు అతని కారు తలుపు యొద్దకు వచ్చారు. నా భర్తగారు, వెంటనే, కారు యొక్క తలుపులను తెరచి, ఆ పోలీసు అధికారుల వైపు చూచారు. ఆ పోలీసు అధికారులు అతనితో ఇలాగున అన్నారు కదా! ' మీ తండ్రిగారేమో ఒక ప్రార్థనా పరులైనటువంటి వ్యక్తి, మీరేమే మమ్మును ఢీకొని, మమ్మును చంపివేయాలని చూస్తున్నారేంటీ? అని అన్నారు. వెంటనే నా భర్త ప్రక్కన కారులో కూర్చుని ఉన్నటువంటి తన సహోదరి ఈ విధంగా మాట్లాడడము మొదలు పెట్టారు, ' ఏంటి ఇది, మీరు రోడ్లు అయితే వేయించారు గానీ, రోడ్లు మీద ఎక్కడ ఏ గుర్తులు కూడా లేవు. రోడ్డులకు రెండు వైపుల ఎటువంటి విద్యుత్తు బల్పులు కూడా లేవు. ఆలాంటప్పుడు, మా అన్నగారు ఎలాగున సురక్షితముగా కారును నడపగలరు?' అని చెప్పారు.

వెంటనే, ఆ పోలీసు అధికారులు ఒక చిరునవ్వుతో, ' మీ తండ్రిగారిని బట్టి, మిమ్మును వదలివేయుచున్నాము. కనుకనే, మీరు వెళ్లవచ్చును. భవిష్యత్తులో మీరు ఎక్కడికి వెళ్లినను జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా కారును నడపించండి ' అని వారిని హెచ్చరించి, అక్కడ నుండి పంపించి వేశారు. ఈ రోజు వరకు కూడా నా భర్తగారు ఈ కధను నాతో కూడా పంచుకుంటూ ఉంటారు. మా తండ్రిగారిని బట్టి ఆ రోజు ఆ పోలీసు అధికారులు దగ్గర నుండి మేము విడిపించ బడ్డాము అని చెప్పారు. అయితే, ఇది మీకు హాస్యాస్పదముగా ఉండవచ్చును. కానీ, అదే నిజమై ఉంటున్నది. నా భర్తగారి యొక్క తండ్రిగారు ఒక దైవజనుడుగాను మరియు ప్రార్థనా పరులై ఉన్నందుననే, ఆ రోజు నా భర్తగారు మరియు తన సహోదరి రక్షింపబడ్డారు. ఆలాగుననే, వారు విడిచిపెట్టబడ్డారు. అదే విధముగా, నా ప్రియులారా, ఆయన మీ యొక్క సురక్షితమైన ఆశ్రయాస్పదముగా ఉంటాడు. మీ బిడ్డలకు కూడా ప్రభువు ఒక ఆశ్రయముగా, ఒక కేడెముగా ఉంటాడు. ప్రభువు మీ గృహమును కూడా ఈలాగున ఆశీర్వదించవలెనని మీరు ఆయన మొఱ్ఱపెట్టండి, మీ జీవితాలను ఆయన హస్తములకు సమర్పించినట్లయితే, నిశ్చయముగా, ఆయన నీతి మీ పిల్లపిల్ల తరమున నిలుచునట్లుగాను, ఆయన కృప యుగయుగములు నిలుచునట్లుగా చేసి, మిమ్మును ఆశీర్వదిస్తాడు. ప్రభువు యొక్క కృప మరియు ఆశీర్వాదము లు మీ పిల్లపిల్లల తరముల వరకు కొనసాగుచూ ఉండును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మేము నీ హస్తములలో సురక్షితముగా ఉన్నామని గుర్తించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. ప్రభువా, మా జీవితాంతం నీకు భయపడి, యథార్థతతో మరియు నీతితో నడుచుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవే మా భవిష్యత్తును సుక్షితముగా కాపాడే దేవుడవని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మాకు భవిష్యత్తును గురించిన ఒక నిరీక్షణ నీలో మేము కలిగియుండునట్లుగా చేయుము. దేవా, నీవు మాకు మాత్రమే మా కొండ మరియు కోటగా ఉండుట కాదుగానీ, మా పిల్లలకు నీవే ఆశ్రయ స్థానముగా ఉండునట్లుగా సహాయము చేయుము. యేసయ్యా, మా కుటుంబము మీద మరియు మా పిల్లపిల్ల తరముల మీద నీ యొక్క కాపాడే హస్తము ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, నీ నీతి మా పిల్లపిల్ల తరమున నిలుచునట్లుగాను, నీ కృప యుగయుగములు మా మీద మరియు మా కుటుంబముల మీద నిలుచునట్లుగా చేయుము. దేవా, ఎటువంటి దుష్ట శక్తులు మా గృహమును తాకకుండా ఉండునట్లుగా చేయుము. యేసయ్యా, మమ్మును మరియు మా కుటుంబమును, మా పిల్లపిల్ల తరములు సమస్త కీడు నుండియు, అపాయము నుండియు కాపాడుము. ప్రభువా, మా కుటుంబమును సురక్షితంగా ఉంచి, నీ మార్గములలోను మమ్మును నడిపించుము. దేవా, మా జీవితములను నీ నామమునకు మహిమను తీసుకొనివచ్చునట్లుగాను మరియు నీ ఆశీర్వాదములు మా తరతరాలకు కొనసాగునట్లుగాను చేయుము. ప్రభువా, తల్లిదండ్రులమైన మా ప్రార్థనలు మరియు మా నీతివంతమైన జీవితాలు మా పిల్లలకు ఆశీర్వాదకరంగాను మరియు ఆశ్రయ దుర్గముగాను మారునట్లుగా కృపను దయచేయుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.