నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీరు ప్రభువు ఆశీర్వాదాన్ని వెదకుతూ వచ్చినందుకు నేను ఎంతగానో ఆనందించుచున్నాను. ఆయన కనికరములు మన పట్ల ప్రతి ఉదయం నూతనంగా ఉన్నవి. ఈ రోజు మనం ఆయన నూతన కనిరమును నేర్చుకొని, దానిని పొందుకొనబోవుచున్నాము. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 43:1వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో ప్రభువు ఈరీతిగా సెలవిచ్చుచున్నాడు, "అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహో వా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము,పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు'' అని చెప్పబడినట్లుగానే, అవును, మీరు ఆయన సొత్తు. ఆయన మిమ్మును పేరు పెట్టి పిలిచి, మిమ్మును విమోచించియున్నాడు. కాబట్టి, మీ అపరాధ భావన మిమ్మల్ని ఆయన నుండి దూరం చేయనివ్వకండి. "నేను ఎంతో పెద్ద తప్పు చేశాను కదా'' అని అనుకొనకండి. అంతమాత్రమే కాదు, నేడు మీరు, 'నా పాపం చాలా గొప్పది,' అని అపవాది చెప్పుచున్న అబద్ధాన్ని నమ్మవద్దు. నా స్నేహితులారా, మిమ్మును చూచి, 'మీరు ఆయనకు చెందినవారని' ప్రభువు సెలవిచ్చుచున్నాడు మరియు ఆయన మిమ్మును పేరు పెట్టి పిలిచి, మిమ్మును తన యొద్దకు ఆకర్షించుకొనుచున్నాడు. కనుకనే, నేడు మీరు ఆయన యొద్ద నుండి పారిపోలేరు. ఏమైనను సరే, తన ప్రేమా కనికరములతో ఆయన మిమ్మును పేరు పెట్టి తన యొద్దకు పిలుచుచున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, ఈ శక్తివంతమైన వాగ్దానం మనకు ఈలాగున చెబుతుంది, 'ఆయన మనలను విమోచించియున్నాడు మరియు ఆయన పేరు పెట్టి మనలను తన యొద్దకు పిలుచుచున్నాడు.' కాబట్టి, మనం ఎల్లప్పుడు ఆయనకు చెందినవారమైనందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాము. అది ఆయన కృప, అది ఆయన ప్రేమ మాత్రమే. మనము ఎల్లప్పుడు ఆయనకు చెందినవారముగా ఉండెదము. బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:13వ వచనములో అపొస్తలుడైన పౌలు ఏమని చెబుతున్నాడంటే, "అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై యున్నారు'' అను ఈ వచనం ప్రకారం యేసు రక్తం ద్వారా మీరు ఆయనకు సమీపస్థులై యున్నారు. మీరు ఇప్పుడు ఆయనకు సమీస్థులుగా ఆకర్షించబడియున్నారు. ఇది ఎంతటి గొప్ప వాగ్దానం కదా! భక్తుడైన పౌలు కూడా తన జీవితములో ఇటువంటి అనుభవమును కలిగియున్నాడు. అతడు దేవుని ప్రజలను అనేకమందిని హింసించియున్నాడు, వారిని ఎంతగానో బాధించాడు, ఆయనను నమ్ముకున్నవారి వెంటపడి వారిని వేధించాడు. దేవుని నమ్ముకున్న ప్రజలకు ఎంతో దుఃఖాన్ని తీసుకొని వచ్చాడు. అయిన అతడు కూడా దేవుని కృపకు అతీతం కాదు.

నా ప్రియులారా, అయినప్పటికిని, పౌలు చేసిన విషయాలన్నింటికి వ్యతిరేకంగా, ప్రభువు అతనిని పేరును పెట్టి పిలిచియున్నాడు. అంతమాత్రమే కాదు, అతనికి ఒక నూతన పేరును పెట్టి, సౌలును, పౌలుగా పిలిచి, "పౌలు, నీవు నా సొత్తు'' అని చెప్పాడు. ఆయన రక్తం ద్వారా, ప్రభువు పౌలును తన యొద్దకు ఆకర్షించుకున్నాడు మరియు పౌలు ఒక నూతన వ్యక్తిగా మారిపోయాడు. ఆ తర్వాత, తన జీవితములో ప్రభువైన యేసు కొరకు పరుగులు తీశాడు. ఆ క్షణం నుండి, తన పూర్ణ హృదయంతో యేసును వెండించుటకు ప్రారంభించాడు. అతని జీవితం సంపూర్ణంగా మార్చబడినది. నా ప్రియులారా, అటువంటి రూపాంతరము నేడు మీకు కూడా అనుగ్రహించబడుతుంది. ప్రభువు తాను స్వయంగా మిమ్మును పేరు పెట్టి పిలిచి, విమోచించినప్పుడు, మీరు నూతనమైన వారుగా మార్చబడతారు. నా ప్రియ స్నేహితులారా, ఎటువంటి దోషారోపణ కూడా గొప్పది కాదు. ఏ గతం అయినా అంధకారంగా కాదు. కనుకనే, మీరు ఈ రోజే ఆయనకు లోబడుతారా? మీ హృదయాన్ని మరియు మీ జీవితాలను ఆయనకు అప్పగిస్తారా? ఆలాగైతే, నేడు మీరు దేవుని సొత్తు కావాలంటే, ఆయనకు మీ జీవితాలను అప్పగించినట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మమ్మును పేరు పెట్టి పిలిచి, మమ్మును నీ సొత్తు అని చెప్పినందుకై నీకు వందనాలు. దేవా, మేము అర్హులముకామని భావించినప్పుడు కూడా, నీవు ప్రేమతో మమ్మును నీ యొద్దకు చేర్చుకున్నావు. యేసయ్యా, మేము ఎన్నో చెడు కార్యములు చేసి, నిన్ను నిరుత్సాహపరిచాము. మమ్మును నీ రక్తము ద్వారా కడుగుము. దేవా, ఇంకను కొన్ని ఫర్యాయములు నిన్ను విడిచిపెట్టాము, దయచేసి, మమ్మును నీవు కనికరించుము. ప్రభువా, మేము నీ సొత్తు అని మమ్మును ప్రోత్సహించినందుకై నీకు స్తోత్రములు. దేవా, ఈ రోజు మరియు యేసు రక్తం ద్వారా మమ్మును నీకు సమీపస్థులనుగా ఆకర్షించుకొనుటకు దయచేసి మా అపరాధభావాన్ని కడిగివేసి, ప్రతి అవమాన స్వరాన్ని నిశ్శబ్దం చేయుము మరియు మేము నిజంగా నీకు చెందినవారమని నమ్మడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవు పౌలును మార్చినట్లుగానే, మమ్మును కూడా రూపాంతరపరచుము. ప్రభువా, మమ్మును నూతనంగా మార్చుము. దేవా, మా జీవితాన్ని నీ ఉద్దేశ్యంతో నింపుము. ఈ రోజు, మేము మా గతాన్ని, మా భయాలను మరియు మా వైఫల్యాలను నీకు అప్పగించుచున్నాము, మేము నిత్యము నూతనమైన కృపను ప్రతిదినము పొందుకొనుటకు నీ వాత్సల్యతను మాకు అనుగ్రహించుము. దేవా, నీ యొక్క నూతనంగా పుట్టుచున్న వాత్సల్యతను మేము పొందుకొనునట్లుగా నీ దయను మా పట్ల చూపుమని యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.