నా ప్రియమైన స్నేహితులారా, నేడు మిమ్మును మీరు కాపాడుకొనుటకు తగిన కృపను దేవుడు అనుగ్రహించవలెనని నేను ఆకాంక్షించుచున్నాను. తద్వారా, మీరు విశ్వాసములో స్థిరముగా నిలబడునట్లుగాను, మీరు అత్యంత ధైర్యము వహించువారగుదురు, ఇంకను మీరు అత్యంత బలవంతులగుదురు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 కొరింథీయులకు 16:13వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు ఇట్టి కృపను మీకు అనుగ్రహించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. మీరు దేనిని కాపాడుకొనవలసియున్నది? మీరు మీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకొనవలసియున్నది. అందుకే బైబిల్ నుండి సామెతలు 4:23వ వచనములో చూచినట్లయితే, "నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము'' అని చెప్పబడిన ప్రకారము మీ హృదయమే మీ జీవితమునంతటిని స్వాధీనము చేసుకొని ఉంటుంది. బైబిల్ నుండి పరిసయ్యులును ఈలాగున యేసును ప్రశ్నించెను, " ఆ సమయమున యెరూషలేము నుండి శ్రాస్తులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకాయన మీరును మీ పారం పర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను.'' గనుకనే, మీరు మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎందుకనగా, మీ హృదయములో నుండియే చెడు ఆలోచనలు, అపవాదులు, దురాలోచనలు, భోగేచ్ఛలు, శరీరాశలు, దుష్టత్వము వంటివి మీ హృదయములో నుండి బయటకు వచ్చును. కనుకనే, మీ హృదయమును కాపాడుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రకటన 3:20వ వచనములో చెప్పినది చూచినట్లయితే, "ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము'' అని యేసు సెలవిచ్చియున్నాడు. కనుకనే, ప్రభువైన యేసు, ' నా కుమారుడా, నా కుమార్తె, మీ హృదయమును నాకిమ్ము, నేను మీ హృదయమును నా నివాస గృహముగా చేసుకుంటాను' అని అంటున్నాడు. కనుకనే, యేసును మీ హృదయములో ఉంచుకొనియున్నందున మీ హృదయమును భద్రముగా కాపాడుకొనవలెను. దేవుని యొక్క ఆలోచనలు ఎల్లప్పుడు మీ జీవితములో సమస్తమునకు ప్రేరేణను కలిగించేదిగా ఉండాలి. ప్రభువు, "నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి. '' కనుకనే, నేను మీలోనికి వచ్చినప్పుడు, నాలో ఉన్న ఉన్నతమైన తలంపులు మీలోనికి వచ్చుచున్నవి. అట్టి ఉన్నతమైన నా ఆలోచనలు మీలోనికి వచ్చినప్పుడు, అట్టి ఉన్నతమైన పరసంబంధమైన ఔనత్యమునకు మిమ్మును నేను హెచ్చించెదను'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, యేసును మీ హృదయములో ఉంచుకొనుట ద్వారా, మీ హృదయమును భద్రముగా కాపాడుకొనండి.

రెండవదిగా, మీ హృదయమును లోభము మరియు దురాశ నుండి కాపాడుకొనవలెను. అందుకే బైబిల్ నుండి లూకా 12:15వ వచనములో చూచినట్లయితే, " మరియు ఆయన వారితో మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను'' అని యేసు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, జీవితమంటే కేవలము సంపద యొక్క సమృద్ధి మాత్రమే కాదు, జీవితము మరి ఇంక ఎంతో మిన్నయైనది. దేవుని యొక్క స్వభావముతో దైవాశీర్వాదములతో నింపబడియుండాలి. అదియేనండి, ఐశ్వర్యము. కనుకనే, లోభము, దురాశ నుండి మీ హృదయమును కాపాడుకోవాలి. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 13:5వ వచనములో చూచినట్లయితే, "ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.'' ఆలాగుననే, 'ధనాపేక్షలేకుండా తృప్తి కలిగి యుండండి , నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని చెప్పుచున్నాడు.' మనము ఎప్పుడు కూడ ఆఖరి భాగమును మాత్రమే తీసుకుంటుంటాము. కానీ, ఆయన, మనలను ఏ మాత్రమును విడువడు, ఎన్నడును ఎడబాయడు అని అనుకుంటాము. కానీ, మీ జీవితమునకు భద్రతగా లోభమును, ధానాపేక్షను మాత్రమే మీరు తీసుకున్నట్లయితే, మీ జీవితములో దేవుడు మీతో కూడా ఉండడు. కనుకనే మీరు పశ్చాత్తాపపడండి. "కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.'' అప్పుడు, దేవుని యొద్ద నుండి మీకును, మీ బిడ్డలకును, మీ మనమ సంతతికిని, తరముల వెంబడి తరములకు ఈ ఆశీర్వాదములను కూడ మీకు అనుగ్రహించబడును. దేవుడు ఈ ఆశీర్వాదముల చేత మిమ్మును ఆశీర్వదించును గాక. మూడవదిగా, ఊరుకొనక, పరుషముగా మాట్లాడక, మీ పెదవులను కాపాడుకొనండి. అందుకే బైబిల్ నుండి సామెతలు 13:3వ వచనమును చూచినట్లయితే, "తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును'' అని చెప్పబడినట్లుగానే, తన నోరును, తన జీవితమును కాపాడుకొనువాడు తన జీవితమును కాపాడుకొనును. అయితే, ఊరకొనక లేక పరుషములను మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అవును, మన నోటి మాటలు మరియు మన హృదయ ధ్యానము కూడా కాపాడుకొనవలసి ఉన్నది. అందుకే కీర్తనాకారుడు ఈలాగున ప్రార్థన చేయుచున్నాడు, "యెహోవా, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక'' అని చెప్పుచున్నాడు. అప్పుడు అవి మనుష్యులకు కూడా అంగీకారయోగ్యముగా ఉంటాయి. మన నోటి వెంబడి జ్ఞాన వాక్కులు ప్రవాహముగా ప్రసరిస్తాయి. మనము దేశ వ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా మరియు కుటుంబములో కూడా ఘనపరచబడతాము. దేవుని యెదుటను మనము ఘనపరచబడతాము. కనుకనే, మన నోటిని మనము కాచుకుందాము. మన నోరు లేకపోతే భాషను మనము కాచుకొనకపోయినట్లయితే, బైబిల్ నుండి యాకోబు పత్రికలో దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది, " ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును'' అని చెప్పబడినట్లుగానే, ఇది మన నాలుక అగ్నియై యున్నది. ఇది అగ్ని వ్యాపింపజేసి, సమస్తమును లేక ప్రతి బాంధవ్యమును కూడా తగుల బెడుతుంది. అపవాది వచ్చి, ఆ విధంగా మన నాలుక మీద కూర్చుండిపోతాడు. ఒక రోజున ఒక చిన్న పాపను ప్రార్థన కొరకు తీసుకొని వచ్చియున్నారు, ఆ పాప ఒక దురాత్మ చేత పట్టబడి, ఎంతగానో బాధపడుచుండెను. దైవజనుడు ఆ పాప విడుదల కొరకు ప్రార్థించినప్పుడు, ఆ దైవజనుడు, 'ఈ యొక్క పాప దేహములోనికి ఎందుకు వచ్చావు?' అని అడిగియున్నాడు. ఆ దురాత్మ ఏమని చెప్పిందంటే, 'నేను ఈ యింటి ముంగిట వెళ్లుచున్నాను, ఆకస్మాత్తుగా లోపల నుండి నన్ను ఎవరో రమ్మని పిలిచారు, ఆ పాప యొక్క తల్లి, నీవు దయ్యమా? మురికి దయ్యమా?' అని పిలిచారు. కనుకనే, నన్ను ఎవరో పేరు పెట్టి పిలిచియున్నారు అని భావించి, లోపలికి వచ్చి, ఈ పాపను చెరపట్టాను అని చెప్పింది.' ఇప్పుడు ఆ పాప నిజంగా దయ్యముగా మారిపోయినది. కనుకనే, నా ప్రియులారా, మనము ఇతరులను ఎలాగున పిలుస్తున్నామన్న విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా మన బిడ్డల విషయములో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనము వారికి విలువను అపాదించాలి. మనము వారిని ఘనపరచాలి. ఇది దేవుడు నాకు అనుగ్రహించియున్న వరము అని చెబుతుండాలి. భార్యలారా, మీ భర్తలను ఈ దేవుడు నాకు అనుగ్రహించిన దేవుని స్వరూప్యము అని చెప్పాలి. అతడు ఎలాగున ఉన్నను సరే, అతడు ఏలాంటివాడైనను సరే, అతడు ఏ విధంగా జీవించుచున్నప్పటికిని, అతనిని దేవుని స్వరూప్యము అని పిలిచినప్పుడు, మీ యొక్క పిలుపులను, మాటలను ఆయన నెరవేరుస్తాడు. ఇంకను నా యొక్క బిడ్డ దేవుడు అనుగ్రహించిన వరము అని మీరు చెప్పుచున్నప్పుడు మీ బిడ్డ దేవుని యొక్క వరముగా అవుతాడు. ఎప్పుడు కూడా మీ పెదవులతో కఠినముగా, పరుషముగా మాట్లాడకండి. మీరు ఏమైతే పలుకుతారో, ఆ విధంగా వారు కలిగియుంటారు. కనుకనే, జాగ్రత్త మీ మాటలు ఉండాలి.

నాల్గవదిగా, అవిశ్వాసము నుండి మరియు అపనమ్మకము నుండి మిమ్మును మీరు కాపాడుకొనవలెను. అందుకే బైబిల్ నుండి, 1 కొరింథీయులకు 16:13వ వచనములో చూచినట్లయితే, "మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి'' అని చెప్పబడిన ప్రకారము మెలకువగా ఉన్నప్పుడు మీరు విశ్వాసమందు నిలుకడగా మరియు బలముగాను, ధైర్యముగాను ఉంటారు. ఇదే మాటను మోషే యెహోషువతో చెప్పెను. బైబిల్ నుండి యెహోషువ 1:5,9వ వచనములలో మనము చూచినట్లయితే, " నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును. నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును'' ప్రకారము మోషే యెహోషువతో, ' నీవు ధైర్యముగా ఉండుము, బలము కలిగియుండుము ధైర్యముగా ఉండుము, అవిశ్వాసముతో ఉండకండి, ఎప్పటికి కూడా పిరికితనమును మీలోనికి రానివ్వకండి, ఎప్పడు సందేహించకండి, లేకపోతే అది మిమ్మును నాశనము చేస్తుంది. అప్పుడు ప్రభువు మీతో కూడా ఇక ఉండడు. మిమ్మును మీరు అవిశ్వాసము నుండి కాపాడుకొనండి. విశ్వసించండి, అప్పుడు మీరు దేవుని యొక్క మహిమను చూచెదరు. అవును, యెహోషువ విశ్వాసముంచియున్నాడు. యాజకులు తమ పాదములను యొర్దాను నది మీద ఉంచవలసినదిగా ఆజ్ఞాపించియున్నాడు. యొర్దాను రెండుపాయలుగా వేరుపరచబడి, ఇశ్రాయేలీయుల ప్రజలు వాగ్దాన భూమికి వెళ్లడానికి ఆయన మార్గమును సిద్ధపరచియున్నాడు. అవును, నా ప్రియులారా, అవిశ్వాసము నుండి మిమ్మును కాపాడుకొనండి. బలము కలిగి ధైర్యముగా ఉండండి. ఐదవదిగా, అపవాది యొక్క తంత్రముల నుండి కాపాడుకొనండి. బైబిల్ నుండి 2 కొరింథీయులకు 2:11వ వచనములో చూచినట్లయితే, పౌలు ఏమని చెప్పుచున్నాడనగా, " నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము'' అని చెప్పబడియున్న ప్రకారము అపవాది యేసును శోధించెను. సాతాను మూడు శోధనలను తీసుకొని వచ్చియున్నాడు. యేసు అపవాదిని, దేవుని యొక్క వాక్యము చేత ఎదిరించియున్నాడు. బైబిల్ నుండి మత్తయి 4:1-4వ వచనములలో చూచినట్లయితే, " అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదని'' చెప్పబడినట్లుగానే, సాతాను ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయెను. పరిశుద్ధాత్ముడు ఆయనలోనికి వచ్చెను. శక్తిచేతను, అభిషేకముచేతను, ఆయనను వినియోగించడము ప్రారంభించెను. దేవుని దూతలు యేసునకు పరిచర్య చేసెను. నా ప్రియులారా, అదే ఆశీర్వాదము నేడు మీ మీదికి దిగివస్తుంది. అపవాది యొక్క ఎటువంటి తంత్రము మీ మీదికి రాదు. దేవుని చిత్తమును ఎరిగియుండి స్పష్టమైన, తదేక దృష్టిని, ఏకాగ్రతను మనము కలిగియుంటాము. కనుకనే, మీరు దేవుని చిత్తమును జరిగించుచున్నప్పుడు, మీరు జీవించెదరు. ఏదియు మీకు విరుద్ధముగా నిలువబడజాలదు. ఎవరైతే, దేవుని చిత్తమును జరిగిస్తారో, వారు నిరంతరమును జీవించెదరు, మీ కుటుంబము మరియు పరిచర్య నిరంతరము జీవించును. మీ పేరు నిత్యము సజీవముగా ఉంటుంది. మీ సంపద నిరంతరమునకు సజీవముగా ఉంటుంది. దేవుడు ఈ కృపను మీకు అనుగ్రహించును గాక. మరియు చివరిగా, ఆరవదిగా, తప్పుడు ప్రవక్తలు, అబద్ధ బోధకుల నుండి మిమ్మును కాపాడుకొనండి. బైబిల్ నుండి మత్తయి 7:15వ వచనములో చూచినట్లయితే, "అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీ యొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు'' అని యేసు చెప్పెను. అవును, పౌలు తెలియజేయుచున్నాడు, ప్రజలైనవారు దేవుని నామమును భరించుచు, మోసుకొని వస్తున్నప్పటికిని, ఇంకను వారు క్రీస్తును బోధించడము లేదు, వారు మొరుగుచున్న, మూలుగుచున్న కుక్కలవంటి వారుగా ఉంటున్నారు. ప్రజలను విశ్వాసములో నుంచి, సుధూర తీరములకు తీసుకొని వెళ్లుచున్నట్టుగా ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళికను, పనులను, దేవుని యొక్క వాక్యమును అపార్థమగునట్లుగా చేయుచున్నారు. నా ప్రియ స్నేహితులారా, అబద్ధ ప్రవక్తలను నుండి మీరు కాపాడబడునట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును నడిపించును గాక. ప్రత్యేకంగా ఎవరైతే, వచ్చి, ఈ సమస్యను మీలో ఉంచాడు అని చెప్తుంటారో, ఆలాగున వారు చెప్పినప్పుడు, ఆ దురాత్మను వెళ్లగొట్టలేకపోయినట్లయితే, నా స్నేహితులారా, ప్రతి ప్రవక్తయు కూడా యేసును మనకు గురిగా చూపిస్తారు. ఎవరైతే, యేసును తన రక్షకునిగా ఒప్పుకొననివారుగా ఉంటారో, సాతాను చేసిన దానిని మరియు దుష్టప్రజలు చేసిన దానిని ఎక్కువగా మహిమపరుస్తూ, ఆ విధంగా ఉంటారో, వారు అబద్ద ప్రవక్తలుగా ఉంటారు. ప్రవచనము యేసును గూర్చి సాక్ష్యమిస్తుంది. కాబట్టి, నా ప్రియులారా, అబద్ద ప్రవక్తలు నుండి మిమ్మును మీరు కాపాడుకొనండి. అవును, యేసుక్రీస్తును రక్షకునిగా మీరు అంగీకరించండి, ఇంకను 1 యోహాను 4:1వ వచనములో చెప్పబడినట్లుగా, దేవుడు ఈ కృపను మీకు అనుగ్రహించును గాక. యేసును ప్రభువుగా ఎరిగియుండు నిమిత్తమై మిమ్మును మీరు కాపాడుకొన్నప్పుడు మీరు విశ్వాసములో స్థిరముగా నిలిచియుండెదరు. మీరు అత్యధికమైన విజయమును పొందుకొందురు గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, ఇటువంటి కృపను మాకందరికి అనుగ్రహించుము. దేవా, మమ్మును మేము కాపాడుకొనుటకు నీ కృప మా మీదికి దిగివచ్చునట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయుము. యేసయ్యా, నీ యొక్క వాక్యమును, ఆత్మను, మాకు దిశానిర్దేశమును చేసి, మా హృదయములో భద్రపరచుము. ప్రభువా, మా హృదయాన్ని కాపాడుకోవడానికి మాకు కృపను దయచేయుము. యేసయ్య, నీవు మాలో పరిపూర్ణముగా నివసించునట్లుగా మేము నిన్ను మాలోని ఆహ్వానించుచున్నాము. దేవా, మా జీవితంలోని ప్రతి దురాశ, అవిశ్వాసం మరియు తొట్రుపాటు మాటలను తొలగించుము. ప్రభువా, నీపై మాకున్న విశ్వాసంలో మమ్మును బలంగా మరియు ధైర్యంగాను మార్చుము. దేవా, ప్రతి మోసం మరియు అబద్ధ ప్రవక్తల నుండి మమ్మును జాగ్రత్తగా కాపాడుము. యేసయ్యా, నీ మాటలు మాకు జీవమును మరియు ఘనతను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. దేవా, ప్రతిరోజు నీలో స్థిరంగా నిలబడటానికి మరియు అత్యధికమైన విజయమును పొందుకొనుటకు మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.