నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి సువార్త 1:21వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను'' ప్రకారము అవును, నా ప్రియులారా, మన యేసయ్యా, మన రక్షకుడుగా ఈ లోకమునకు వచ్చియున్నాడు. ఈ లోకములోనికి అనవసరమైన లక్షణాలన్నిటి నుండి ఆయన మనలను రక్షిస్తాడు. ప్రతిరోజు మనము అనేకమైన సమస్యలను ఎదుర్కొంటాము. అయితే, మోషే మరియు ఇశ్రాయేలీయులు అనేకమైన సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చినది. అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 15:2 మరియు కీర్తనలు 118:13-14వ వచనములలో మనము చదివినట్లయితే, "యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను'' మరియు "నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను'' ప్రకారము అవును, ఆయన మనకు రక్షకుడై యున్నాడు. కనుకనే, ఆయన సమస్త సమస్యల నుండి మరియు మన పాప జీవితము నుండి మనలను రక్షించగల మరియు విడిపించగల సమర్థుడై యున్నాడు.

నా ప్రియులారా, ఎల్లప్పుడు మీరు ఆయనను మీ రక్షకుడుగా కలిగి ఉండాలి. మీకున్న కష్టములన్నిటిని నుండి రక్షించడము కొరకు ఆయన వైపు చూడడము మీరు నేర్చుకొనండి. అందుకే బైబిల్ నుండి లూకా 5:4-5వ వచనములను చూచినట్లయితే, "ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా,'' అప్పుడు సీమోను ఏమని జవాబు చెప్పెనని చూచినట్లయితే, " సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.'' మరియు లూకా 5:6వ వచనములో చూచినట్లయితే, యేసయ్యా, ఒక గొప్ప అద్భుతము చేసియున్నాడు. అదేమనగా, "వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలి పోవుచుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.'' అదేవిధముగా, నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడు యేసయ్యను మీ రక్షకునిగా కలిగియున్నప్పుడు అన్ని ఆశీర్వాదములను మీరు పొందుకొనగలరు.

కనుకనే, నా ప్రియులారా, నేడు మీరు చేయవలసిందల్లా, దేవుని వాక్యమును చదువుచూ, దేవుడు చెప్పినవన్నియు, ఆయన ఆజ్ఞలన్నిటిని మీరు పాటించిన యెడల మీ సమస్యలన్నిటి నుండి మీరు రక్షింపబడతారు. అవును, యేసయ్య, మన రక్షకుడు కనుకనే మనము ఎల్లప్పుడు ఆయనను కలిగియుండాలి. ఆయనను ఎల్లవేళల మనము ఆయనను కలిగియున్నట్లయితే, సమస్త ఆశీర్వాదముల చేత మనము కప్పబడతాము. ఇప్పుడు మన జీవితాలను యేసునకు సమర్పించుదాము. ఆలాగుననే, ప్రభువును అన్ని వేళలలో మనకు తోడుండమని అడుగుదాము, 'ప్రభువా, నీవు ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండుము. మమ్మల్ని నడిపించుము, నీవు మమ్మును దీవించుము' అని చెప్పి, ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, మీరు దీవించబడతారు. ఇప్పుడే దేవుని హస్తాలకు మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానముగా నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రశస్తమైన తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసు, మా అమూల్యమైన రక్షకుడవునియు, మా పాపాల నుండి మమ్మును రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినందుకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. తండ్రీ, ఇప్పుడే నీ యెదుట మా జీవితాలను నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, నీ బిడ్డలైన మా హృదయాలను తాకుము, మేము ఎవ్వరము కూడా కఠినమైన హృదయాలతో మేము ఉండకూడదు. యెహోవా, నీవే మా దుర్గము మా గానము ఆయన మాకు రక్షణాధారమైనందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క బలమైన హస్తముతో మమ్మును పైకి లేవనెత్తుము మరియు నీ వాక్యాన్ని విశ్వసించి, ఎల్లప్పుడూ నీ స్వరాన్ని పాటించుటకు మాకు నేర్పించుము. దేవా, నీవు సీమోనును చేపల పట్టుటలో అత్యధికముగా ఆశీర్వదించినట్లుగానే, మా చేతుల పనిని ఆశీర్వదించుము. ప్రభువా, ప్రతిరోజు మేము నీ సన్నిధిలో నడవడానికి మరియు నీ ప్రేమకు సాక్షిగా జీవించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితాన్ని మేము నీకు తిరిగి అప్పగించుకుంటున్నా ము, దయచేసి మా జీవితాలలో గొప్పకార్యములను జరిగించుము. ప్రభువా, మేము ఎల్లప్పుడు నిన్ను వెదకుచూ, నీ ఆజ్ఞలను పాటించి, నిన్ను హత్తుకొని జీవించునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితములో ఎల్లప్పుడు నీవు మాకు తోడుగా ఉండి, మమ్మును సీమోను నడిపించినట్లుగానే ఆశీర్వాదకరమైన మార్గములో నడిపించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.