నా ప్రియమైన స్నేహితులారా, మీకందరికి సంతోషకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈ క్రిస్మస్ దినములలో ఒక అద్భుతమైన వాగ్దానము కలదు. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లూకా 1:32వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును'' ప్రకారము యేసుప్రభువు, సర్వోన్నతుడై యున్నాడు. యేసయ్య, సార్వభౌముడై యున్నాడు. ఆయన రాజులకు రాజై యున్నాడు. ఆయన అందరికి దేవుడై యున్నాడు. ఆయన అందరికంటె గొప్పవాడై యున్నాడు. సర్వసమృద్ధిగల దేవుడై యున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. అందుకే బైబిల్ నుండి మత్తయి సువార్త 28:18వ వచనములో ఆయన అదే తెలియజేయుచున్నాడు. ఆ వచనము, "అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది'' అని చెప్పబడిన ప్రకారము అవును, రాజులందరికంటె రాజుగా ఉన్నత స్థలమందు ప్రభువైన దేవుడు యేసయ్యను నియమించియున్నాడు. ఈ భూమి మీద రాజులందరికంటెను, యేసయ్యను నియమించియున్నాడు. కనుకనే బైబిల్ నుండి ప్రకటన 19:16వ వచనములో దేవుని వాక్యము ఈలాగున సెలవిచ్చుచున్నది, "రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడియున్నది'' ప్రకారము అవును, మనము ఈ విషయమును గుర్తించవలసినవారమై యున్నాము. సర్వోన్నతు డైన దేవునిని మనము ఆరాధించవలసినవారమైయున్నాము. ఆయనకు సాటియైన వారు ఒక్కరును లేరు.

నా ప్రియులారా, ఈ లోకములో ప్రజలు అలెగ్జాండర్‌ని, గొప్పవాడైన అలెగ్జాండర్, 'అలెగ్జాండర్ ది గ్రేట్,' 'చార్లెస్ ది గ్రేట్' లేదా ' ఫ్రెడరిక్ ది గ్రేట్ ' అని పిలుచుచున్నారు. కానీ, జీవించిన వారందరికంటె యేసయ్య ఎంతో గొప్పవాడైయున్నాడు. అవును, ఈ లోకములో ఉన్న సాతానుకంటెను, మీలో ఉన్న యేసయ్య ఎంతో గొప్పవాడై యున్నాడు. కనుకనే, మీరు ఎల్లప్పుడు ఈ యేసయ్యను గుర్తించుకోవాలి. ఇంతటి గొప్ప దేవుని స్తుతించుచూ, ఆరాధిస్తూ మనము ఉండాలి. అందుకే బైబిల్‌లో, "ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది'' అని బాప్తిస్మము ఇచ్చు యోహాను కూడా యేసయ్య గురించి చెప్పెను. ప్రభువు మనలను ఎంత ఎక్కువగా ఆశీర్వదించినప్పటికిని, ప్రభువు హెచ్చింపబడాలి మరియు మనము తగ్గించబడాలి అని మాత్రమే మనము చెప్పాలి. మనలను మనము ఎప్పుడు కూడా హెచ్చించుకోవడానికి ప్రయత్నించకూడదు. మనము, 'నేనే అందరికంటె గొప్పవాడను, గొప్పదానను' అని అనకూడదు. అందుకే 'యేసయ్య, నేను లేకుండా మీరు లేరు' అని అంటున్నాడు. అవును, యేసయ్య అందరికంటె గొప్పవాడు. కనుకనే, నా ప్రియులారా, మీరు ఎప్పుడు కూడా ఆయన లేకుండా గొప్పవారు కాలేరు. ఇంతటి గొప్ప యేసయ్యను బట్టి, మీరు ఈ లోకములో జీవించుచున్నారు. యేసయ్య గొప్పవాడు మరియు ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఆయన పిలువబడియున్నాడు. ఇంత గొప్ప దేవునిని తన గర్భములో మోసిన మరియ ఎంత గొప్ప ధన్యురాలు కదా!

అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, ఇంత గొప్ప యేసయ్యను మీలో కూడా మోయుటకు ఆధిక్యతను ప్రభువు మీకు కూడా అనుగ్రహించియున్నాడు. కనుకనే, ఇంతటి గొప్ప దేవునిని మీ హృదయములోనికి ఆహ్వానించి, ఆయనకు మీ హృదయమును అప్పగిస్తారా? మహోన్నతుడైన ఈ యేసయ్యను మీ జీవితములోనికి ఆహ్వానించినప్పుడు, ఆయన మీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యములను జరిగిస్తాడు. మరియు మీ నుండి అపవాది దొంగిలించబడిన ఆశీర్వాదములను తిరిగి మీకు ఇవ్వబడుతాయి. మరియు ఉత్తమమైనవి మీ జీవితంలోనికి వచ్చును. కాబట్టి, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:.
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసూ, క్రిస్మస్ యొక్క గొప్ప యీవుగా ఈ లోకమునకు మా కొరకై వచ్చినందుకు ఈ రోజు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, నీవు గొప్ప దేవుడవు, నీవు సర్వాధిపతి మరియు సర్వోన్నతుడవైన దేవుడవు, నీవు రాజులకు రాజుగా రాజ్యమేలుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ లోకములో ఉన్నతమైన సర్వోన్నత ప్రభువుగా మేము నిన్ను ఆరాధించుచున్నాము. దేవా, అన్నిటికంటె చెప్పనాశక్యము కానీ వరమైన యేసుక్రీస్తుగా ఉన్న నీవు ఈ క్రిస్మస్ దినమున మాలోనికి వచ్చి, మేము మోయలేనంతగా మమ్మును ఆశీర్వదించుము. దేవా, మా హృదయంలో నివసించడానికి మమ్మును ఎన్నుకున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు మా జీవితంలో నీ మహా శక్తి బలంగా పనిచేయుటకు మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా జీవితంలో నీవు మాత్రమే అద్భుతాలను చేయగలవు గనుకనే, నేడు మా జీవితములో అద్భుతములను జరిగించుము. ప్రభువా, మేము కోల్పోయిన వాటిని మరల పునరుద్ధరించుము. దేవా, మేము అడిగిన లేదా ఊహించిన దానికంటే అత్యధికముగా మాకు ఇచ్చి, మమ్మును ఆశీర్వదించుము. దేవా, దయచేసి మా హృదయాన్ని నీ యొక్క ఆనందం మరియు కృతజ్ఞతతో నింపుము. దేవా, మా సర్వోన్నతుడవైన రాజైన యేసూ, మా జీవితాన్ని నిరంతరము ఏలడానికి మేము నిన్ను మాలోనికి ఆహ్వానించుచున్నాము. ప్రభువా, నీవే మా పట్ల గొప్ప అద్భుత కార్యములను జరిగించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.