నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 15:26వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే...'' అని సర్వశక్తిగల దేవుడు ఈ రీతిగా సెలవిచ్చుచున్నాడు. సకల వ్యాధులను స్వస్థపరచు నిమిత్తమై హృదయమును మరియు శక్తిని కలిగియున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 103:2,3వ వచనములలో చూచినట్లయితే, " నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మీ వ్యాధులను స్వస్థపరచువాడు, మీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సర్వశక్తిగల దేవుడు మీ పాపములను క్షమించుటకును, మీ యొక్క వ్యాధులను స్వస్థపరచుటకు హృదయమును కలిగియున్నాడు. వేరొక వ్యక్తి యొక్క పాపమును క్షమించుటకు నరునికి ఏ మాత్రము శక్తి లేదు. వారి యెడల తప్పిదము చేసిన వారికి క్షమాపణ ఉంటుంది కానీ, వారు ఆ వ్యక్తిలోని పాపపు వేరు అనగా, దాని మూలమును తొలగించడానికి శక్తి లేదు. దేవుడు క్షమించుచున్నప్పుడు, పాపములన్నియు ఆ వ్యక్తిలో నుండి పాపపు స్వభావము కూడా తొలగించివేయబడుతుంది. దేవుడు వ్యాధులను స్వస్థపరచుచున్నప్పుడు, ఆ వ్యాధి యొక్క వేరు, లేక మూలము స్వస్థపరచబడుతుంది. మనలను స్వస్థపరచువాడు దేవుడే మరియు క్షమించువాడు కూడా ఆయనే. అందుచేతనే మనము దేవునికి ప్రార్థన చేయుచున్నాము. బేతెస్థలో ప్రార్థన కేంద్రమును కలిగియున్నాము. మే నెలలో సెలవుల సమయములలో మీరు ఇక్కడకు వచ్చి, దేవుడు మిమ్మును స్వస్థపరచునట్లుగాను, దేవుడు మీ పాపములను క్షమించునట్లుగాను ప్రార్థన చేసుకొనవచ్చును. బైబిల్ నుండి యాకోబు 5:14-15వ వచనములలో చూచినట్లయితే, "మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును'' అని చెప్పబడినట్లుగానే, వారు రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు రోగుల స్వస్థపరచబడుచున్నారు. యాకోబు పత్రిక ద్వారా బైబిల్ ఈలాగున సెలవిచ్చుచున్నది, ప్రభువైన యేసు స్వయంగా ఈలాగున చెప్పియున్నాడు. ఇంకను మార్కు 16:17వ వచనములో చూచినట్లయితే, " నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు'' ప్రకారముగా ఆయన నామమునందు విశ్వాసముంచినప్పుడు, ఆ రోగుల స్వస్థపరచబడతారు అని చెప్పబడియున్నది.

అవును, నా ప్రియులారా, మనము రోగుల మీద చేతులుంచి, యేసు నామమున వారికి ప్రార్థన చేయవలెనని యేసు కోరుచున్నాడు. వారు స్వస్థపరచబడు నిమిత్తము, వారి యొక్క ఆరోగ్యము సమకూర్చబడు నిమిత్తము. అది దేవుని యొక్క ఆజ్ఞయై యున్నది. ఈ రీతిగా మనము ప్రజల కోసము చేయున్నాము అని మనుష్యులు దీనిని విశ్వసించలేకపోవచ్చును. వారు యేసు బిడ్డలుగా మార్చబడినట్లయితే, కానీ, ఆ రీతిగా వారు విశ్వాసముంచలేరు. లేకపోయినట్లయితే, వారు నమ్మలేరు. వారు ఈ ఆశీర్వాదాన్ని కలిగియుండలేరు. యేసు యొక్క బిడ్డలుగా మనము ఎంతటి గొప్ప ధన్యతను కలిగియున్నాము. పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా తెలియజేయుచున్నది. కనుకనే, పరిశుద్ధ గ్రంథమును మరియు దేవుని వాక్యమును మనము అంటి పెట్టుకొనియుందుము. మనము చేతులుంచినప్పుడు యేసు దిగివచ్చి, తన చేతులు రోగుల మీద ఉంచి, వారిని స్వస్థపరచుచున్నాడనియు, మనలను కూడా స్వస్థపరుచుచున్నాడని మనము విశ్వసించవలెను. దేవుడు ప్రజల వ్యాధులను స్వస్థపరచుటకు హృదయమును కలిగియున్నాడు. ఎందుకనగా, ప్రజల యొక్క పాపమును బట్టి, వ్యాధులు వచ్చియున్నవి. వ్యాధిని మరియు రోగమును కలిగియున్న ప్రతి ఒక్కరు పాపి అని కాదు. వ్యాధులు ప్రకృతి కారణముల ద్వారా మనకు సంభవిస్తుంటాయి. ఆలాగే, పాపమును బట్టి వ్యాధులు మనకు కలుగుచున్నవి. ఎవరైన పొగ త్రాగుతూ ఉంటుండగా, వారి యొక్క ఊపిరితిత్తులు పాడైపోతాయి. వైద్యులు ఆ రీతిగా తెలియజేయుచున్నారు. ఆలాగే, ఎవరైనా మద్యపానము సేవించుచున్నట్లయితే, వారి యొక్క కాలేయము దెబ్బతింటుందని వైద్యశాస్త్రము ఈ రీతిగా తెలియజేయుచున్నది. కనుకనే, దేహమునకు విరుద్ధముగా చేయబడిన పాపములు మరియు తప్పుడు కార్యములు రోగములను తీసుకొనివచ్చుచున్నవి.

ఆలాగే నా ప్రియులారా, దురాత్మ శక్తులు వ్యాధులను మరియు రోగములను తీసుకొని వస్తాయి. బైబిల్‌లో 18 సంవత్సరముల నుండి బలహీనపరచు అపవిత్రాత్మ చేత పట్టబడిన నడుము వంగిపోయిన స్థితిలో ఉండిన స్త్రీని మనము చూడగలము. యేసు తాకి ఆమెకు విడుదలను ఇచ్చాడు. కనుకనే, దురాత్మ శక్తుల ప్రభావము నుండి కూడా వ్యాధులు మరియు రోగములు వచ్చుచున్నవి. ఆలాగే చేతబడి శక్తుల ద్వారా వ్యాధులు వస్తాయి. ఇంకను అవిధేయత వలన కూడా రోగములు మరియు వ్యాధులు సంక్రమిస్తాయి. అవునండి, అనేకమైన కారణములు ఉన్నవి. కానీ, ఒక వ్యక్తి యేసు వైపునకు మరలుకున్నట్లయితే, ఎందుకనగా, ప్రతి ఒక్కరి స్వస్థత కోసము ఆయన వెల చెల్లించియున్నాడు గనుకనే, ఆయన తన దేహమును సిలువలో గాయపరచబడు నిమిత్తమై అనుమతించియున్నాడు గనుకనే, తద్వారా బైబిల్ నుండి యెషయా 53:5వ వచనములో చూచినట్లయితే, "మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థపరచబడుచున్నాము. ఈ రోజు మనలను స్వస్థపరచు నిమిత్తమై ఆయన తన దేహము మీదకు గాయములను అనుమతించుకున్నాడు గనుకనే, యెషయా 52:3 మరియు మత్తయి 8:17వ వచనములో చూచినట్లయితే, "ఆయన మాట వలన దయ్యములను వెళ్ళ గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయా ద్వార చెప్పబడినది నెరవేరెను'' ప్రకారము మీ ఆత్మ యొక్క స్వస్థత కొరకు మరియు ఆలాగుననే, మీ దేహము యొక్క స్వస్థత కొరకు ఈ రోజు మీరు యేసు చెంతకు రండి. ఇంకను బైబిల్ నుండి యిర్మీయా 8:22వ వచనములో చూచినట్లయితే, " గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవుచున్నది?'' అని దేవుడు కేక పెట్టుచున్నాడు. ఇంకను మత్తయి 9:35-36వ వచనములలో చూచినట్లయితే, "యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందు ను గ్రామములయందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడెను'' ప్రకారము బహు జనసమూహము ఆయనతో ఉండుట చూచి, ఆయన కనికరముతో చలించిపోయాడు. ప్రజలు 3 రోజుల పాటు ఆయనతో నిలిచియున్నప్పుడు, యేసు వారందరిని స్వస్థపరచియున్నాడు. అందుకే లూకా 4:40వ వచనములో చూచినట్లయితే, " సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయన యొద్దకు తీసికొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను.'' నా ప్రియులారా, అది యేసు యొక్క హృదయమై యున్నది. కనుకనే, ఈ రోజు మనమందరము కలిసి ప్రార్థన చేయుచుండగా, ఆయన దిగివచ్చి, మనలను స్వస్థపరచును. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవే స్వస్థపరచు దేవునిగా ఉన్నందుకై నీకు వందనములు. ప్రభువా, దయచేసి మా పాపములన్నిటిని క్షమించి, మా అంతరంగం నుండి శుద్ధి చేయుము. దేవా, మా శరీరంలోని ప్రతి భాగాన్ని తాకి, మాకు సంపూర్ణ స్వస్థతను కలుగజేయుము. యేసయ్యా, నీ యొక్క స్వస్థతా శక్తితో ప్రతి రోగపు వేరును తొలగించుము. ప్రభువైన యేసూ, నీ యొక్క స్వస్థపరచే సన్నిధి ఇప్పుడు మాలోనికి ప్రవహించునట్లుగా చేయుము. ప్రభువైన యేసయ్యా, నీ శక్తి ద్వారా మా వ్యాధులను ముట్టి, మాకు ఆరోగ్యమును మరల పునరుద్ధరించుము. దేవా, మా మీద ఉన్న ప్రేమను బట్టి, మా ప్రతి అవయమును ఆరోగ్యమును సమకూర్చి, మా అవయములన్నిటిని నూతనపరచుము. ప్రభువా, మా శరీరము, మనస్సు మరియు ఆత్మను నీ యొక్క స్వస్థతా శక్తి ద్వారా బలపరచుము. యేసయ్యా, నీవు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థతను కలుగజేయుము. దేవా, మా జీవితంలో విరిగిపోయిన ప్రతిదానిని బాగుచేయుము. ప్రభువా, నీ అద్భుతమైన అద్భుతాలను విశ్వసించే విశ్వాసంతో మమ్మును నింపుము. దేవా, నీ కనికరము ఈ రోజు మాకు సంపూర్ణతను కలుగజేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.