నా ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువైన యేసు, తన హృదయాన్ని మీకు ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. "మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయైయున్నాడు'' అని చెప్పబడియున్నట్లుగానే, దేవుని ప్రేమించే హృదయంగాను మరియు ప్రజలను ప్రేమించే హృదయముగాను తన హృదయాన్ని మీరు మోసుకొని వెళ్లడానికి ఆయన నిశ్చయముగా మీకు సహాయం చేస్తాడు. ఇంకను ప్రజలను మోసుకొని వెళ్లు హృదయముగా ఆయన మిమ్మును మార్చుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 31:33,34 వ వచనములను తీసుకొనబడినది. ఆ వచనములో, "ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని హృదయమును ప్రేమించువారై యున్నారు, "అవును, మీరు దేవుని హృదయమును పొందుకొనెదరు. కాబట్టి, ఈరోజు మీరు ఆయనకు మొరపెట్టండి, ' ప్రభువా, మాలో ఉన్న కఠినమైన హృదయము తొలగించబడాలి. మాకు యేసుక్రీస్తు కలిగియున్న మనస్సు, హృదయము కావాలి'' అని అడగండి. అందుకే బైబిల్ నుండి యెహెజ్కేలు 36:26వ వచనములో చూచినట్లయితే, "నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను'' అని చెప్పబడిన ప్రకారము ప్రతిఒక్కరిని ఖండించే హృదయం, సుళువుగా ఇతరులను కృంగదీయునటువంటి హృదయము మీ నుండి తొలగించబడుతుంది. మరియు దేవుడు మీకు ఒక నూతన హృదయమును, ఒక నూతన ఆత్మను అనుగ్రహిస్తాడు, అది ఆయన స్వంత హృదయము మాత్రమే.
అందుకే బైబిల్ నుండి ప్రకటన 3:20వ వచనములో చూచినట్లయితే, " ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము'' అని చెప్పబడినట్లుగానే, మీరు చేయాల్సిందల్లా మీ హృదయాన్ని తెరచి, "యేసయ్య, నీవు మా హృదయంలోకి రమ్ము'' అని చెప్పడము మాత్రమే. ఆయన మీలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు, మీలో ఉన్న శరీర సంబంధమైనదంతయు మీ నుండి తొలగించబడుతుంది. ఇంకను మీ యొక్క ప్రతి పాపం మరియు ప్రతి భయం తొలగిపోవుచున్నది. ప్రతి దురాత్మ ఒత్తిడిలు మీ నుండి తొలగిపోతుంది. ప్రతి కృంగుబాడు, ఒత్తిడి తొలగిపోతాయి. అంతా కోల్పోతాము మరియు నష్టమును కలిగించే ప్రతి భయం మీ నుండి తొలగించబడుతుంది. మీ అంతరంగంలో యేసు యొక్క జీవమును కలిగియుండెదరు. చూడండి, మన ప్రభువైన యేసు, " లేచి గాలిని గద్దించి, "నిశ్శబ్దమై ఊరకుండు'' మని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. అవును, ఆయన తుఫాను, అలలు మరియు బలమైన గాలుల మధ్య నిలువబడి, గద్దించి, తుఫానును నిమ్మళపరచాడు. ఆలాగుననే, దేవుడు మీ హృదయంలో ఉంచబోవుచున్నది కూడా సరిగ్గా అటువంటి అధికారమును మాత్రమే. నా ప్రియులారా, పరిస్థితులు మీకు వ్యతిరేకంగా తలెత్తవచ్చును. మీకు వ్యతిరేకంగా దుష్ట ప్రణాళికలు రూపొందించవచ్చును. మీకు విరోధముగా నిందారోపణలు మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నించవచ్చును. మీ పేరు ప్రఖ్యాతిని నాశనం చేయడానికి తప్పుడు మాటలు మాట్లాడవచ్చును. కానీ మీరు భయపడనవసరము లేదు. ఎందుకంటే, మిమ్మును పిలిచినవారు ఎవరో, మీరు ఎవరికి చెందినవారని మీకు తెలుసు. గనుకనే, మీరు భయపడకుండా, ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, మీరు దుష్టులకు గానీ, ఇబ్బందికరమైన పరిస్థితులకు గానీ ఎన్నటికీ భయపడనవసరములేదు. లోకం మీకు విరుద్ధంగా మాట్లాడవచ్చును. సోషల్ మీడియా అబద్ధాలను వ్యాపింపజేయవచ్చును. మీకు విరోధముగా లెక్కలేనన్ని వీక్షణలను పొందవచ్చును. కానీ, మీ హృదయం నెమ్మదితో నింపబడి ఉంటుంది. ఈ లోకంలో ఉన్న అపవాది కంటే కూడా మీలో ఉన్న వాడు అత్యంత గొప్పవాడుగా ఉంటూ, మీ హృదయంలో ప్రవేశించిన యేసుని మీద మీ దృష్టిని ఎల్లప్పుడూ నిలిచి ఉండునట్లుగా చేయండి. అప్పుడు యన ఏమంటున్నాడు? అని చూడండి. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 13:22వ వచనములో చూచినట్లయితే, "తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను'' అని తెలియజేసినట్లుగానే, ఆయన మిమ్మును చూచి, " నా పిల్లలారా, మీరు నా చిత్తమునంతటిని నెరవేర్చారు, గనుకనే, మీరు నా హృదయానుసారులై ఉన్నారని'' సెలవిచ్చుచున్నాడు. నా ప్రియులారా, ఒకవేళ మీరు ఎదైనా కీడును ఎదుర్కొంటున్నను సరే, దేవుడు మా మీద కోపముగా ఉన్నాడు అని అనుకుంటుండవచ్చును. అయితే, దేవుడు మీ మీద ఎందుకు కోపగించుకుంటాడు? ఈ కీడు ఆయన నుండి వచ్చినది కాదు. అనేకమంది మీకు వ్యతిరేకంగా మరి ఎక్కువగా లేచినను సరే, అంత ఎక్కువగా దేవుడు మిమ్మును హెచ్చిస్తాడు. ఎందుకంటే, మీ హృదయం ఆయనకు ఆలయముగా మార్చబడియున్నది మరియు మీరు ఆయన చిత్తమంతటిని నెరవేర్చువారై యున్నారు. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు, నేడు మీరు లోకానికి భయపడకండి. మీ హృదయం యేసు హృదయంతో ఏకమై ఉండాలని కోరుకొనండి. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 6:17వ వచనములో చూచినట్లయితే, " అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని ఆలయముగా ఉంటూ, ఆయనతో ఏకాత్మయై ఉన్నారు గనుకనే, ఈ లోకంలో మీకు ఇంతకంటే ఏమి కావాలి? కనుకనే, నా ప్రియులారా, మీరు యేసుతో నడవండి, ఇలా చెప్పండి: " నేను యేసును వెంబడించాలని నిర్ణయించుకున్నాను. నేవెనుదిరుగన్, నేవెనుదిరుగన్ '' అను పాట వలె మీరు కూడా ఇప్పుడు అటువంటి నిర్ణయమును తీసుకున్నప్పుడు, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, మాలో శుద్ధమైన హృదయాన్ని సృష్టించి, యేసు ఆత్మతో మమ్మును నింపుము. దేవా, మాలో నుండి ప్రతి కఠినత్వాన్ని, భయాన్ని, అహంకారమును, మరియు లోకసంబంధమైన కోరికలను మా నుండి తొలగించుము. ప్రభువైన యేసయ్య, మా హృదయంలోనికి వచ్చి, దానిని శాశ్వతంగా నీ నివాస స్థలంగా మార్చుము. దేవా, మా చుట్టూ ఉన్న ప్రతి తుఫాను మీదను మరియు మమ్మును కలవరపచు ప్రతి స్వరమును గద్దించి, నీ నెమ్మది మమ్మును ఏలునట్లుగా చేసి మమ్మును నడిపించుము. ప్రభువా, మేము నీ మీద దృష్టిని ఉంచి, నీ హృదయానుసారుడుగా ఉండునట్లుగా మమ్మును మార్చుము. దేవా, మా కఠినమైన హృదయమును తొలగించి, మాకు మాంసపు గుండెను అనుగ్రహించుము. ప్రభువా, మేము కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా, నిన్ను విశ్వాసంగా అనుసరించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ చిత్తమంతటినీ నెరవేర్చే నీ బిడ్డలనుగా మమ్మును మార్చుము. ప్రభువా, నీవు ఎల్లప్పుడూ మాతో ఉన్నావని తెలుసుకొని, మా తుఫాలన్నిటిని గదించి, నిమ్మళపరచుచున్నావన్న ధైర్యముతో ముందుకు నడవడానికి మమ్మును బలపరచుమని యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


