నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 2:6వ వచనముమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును'' అని వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుడు జ్ఞానమునకు ఊటయై యున్నాడు. ఇంకను బైబిల్ నుండి సామెతలు 1:4వ వచనములో చూచినట్లయితే, "జ్ఞానములేని వారికి బుద్ధి కలిగించుటకును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు'' ప్రకారము దేవుడే జ్ఞానమునకు మూలమై యున్నాడు. కాబట్టి, దాచపెట్టబడిన ధనమును వెదికినట్లుగానే, మనము నేడు జ్ఞానమును వెదకాలి. దేవుని వాక్యములో మనము ఎంత ఎక్కువగా సమయమును గడుపుతామో, అంత ఎక్కువగా మనకు జ్ఞానమును ఇస్తాడు. నిజమైన జ్ఞానము అనగా ఏమిటి? అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చును. ఆ జ్ఞానమును బట్టి, బైబిల్ నుండి 1 కొరింథీయులకు 1:24వ వచనములో చూచినట్లయితే, "ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱి తనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు'' ప్రకారము క్రీస్తు దేవుని జ్ఞానమునై యున్నాడు. అవును కొలొస్సయులకు 2:3వ వచనములో చూచినట్లయితే, " బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములైయున్నవి'' అని వాక్యము సెలవిచ్చినట్లుగానే, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తుయేసునందు మాత్రమే గుప్తములైయున్నవి. జ్ఞానము మనము స్వంతగా సంపాదించుకొనేది కాదు. కానీ, యేసు క్రీస్తునందు ఉంచుకొనగలిగే జ్ఞానమును మనము పొందుకొనబోవుచున్నాము. ఇంకను మత్తయి 4:4వ వచనములో చూచినట్లయితే, "అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను'' అని ప్రభువు సెలవిచ్చిన ప్రకారము దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవించుచున్నాడు. గనుకనే, మత్తయి 7:24వ వచనములో చూచినట్లయితే, " కాబట్టి యా నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి యుండును '' ప్రకారము మనము దేవుని వాక్యమును విని, వాటి చొప్పున చేయాలి. అంతమాత్రమే కాదు, మనము దేవుని మాటలను వినేవారముగా ఉండాలి. ఆయన యొక్క ప్రతి మాట ప్రకారముగా మనము చేయుచూ, అనుసరించినప్పుడు మనము జ్ఞానవంతులము అవుతాము. దేవుని యందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలమై యున్నది. ఈ లోక సంబంధమైన విషయాలు వాటంతట అవే చెడ్డవి కావు కానీ. అయితే, మనము ఒక సమతుల్యతను పాటించాలి. మన ఆత్మను కూడా ప్రభువు యొద్ద నుండి వచ్చే జ్ఞానముతో మనము నింపుకుంటూ ఉండాలి.

నా ప్రియులారా, దేవుని యొక్క జ్ఞానము కొరకు మనము మొఱ్ఱపెడుతూ అడగాలి. దేవుని ఆత్మ చేత మనము ఎంత అధికముగా నింపబడతామో, ప్రభువు తన జ్ఞానమును వివేచనమును మనకు అంత అధికముగా ఇస్తాడు. మనము జీవము గలిగిన జ్ఞాన వాక్కులను పలికే రీతిగా ప్రభువే మనకు సహాయము చేస్తాడు. మనము దేవుని మాటల వలన జీవించడము మాత్రమే కాదు గానీ, ఇతరులకు మనము ఇచ్చే దేవుని వాక్యము వలన వారు కూడా జీవిస్తారు. దేవుని వాక్కు వలన మరియు దేవుని ఆత్మ వలన మనము జ్ఞానవంతులనుగా మారుతాము. నూతన నిబంధన గ్రంధములో చూచినట్లయితే, అపొస్తలులు శిష్యులను ఎన్నుకోవాలని అని అనుకున్నప్పుడు, జ్ఞానవంతుల కొరకు వెదకియున్నాడు. స్తెఫెను వారిలో ఒక వ్యక్తియై యున్నాడు. స్తెఫెను దేవుని యొక్క వాక్యముతోను మరియు దేవుని ఆత్మతోను నింపబడియున్నటువంటి వ్యక్తి. బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 6:9,10వ వచనములలో చూచినట్లయితే, " అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియ నుండియు ఆసియ నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని, మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి'' ప్రకారము స్తెఫెను దేవుని వాక్కు ఆత్మ జ్ఞానముతో పరిపూర్ణముగా నింపబడియున్నాడు. అదేవిధముగా, నేడు మనము కూడా అటువంటి జ్ఞానము కొరకు మొఱ్ఱపెడదాము. మనము ప్రశ్నింపబడినప్పుడు, మనము ఏమి మాట్లాడవలెనో మనము ఎరిగియుండవలెను. దానియేలు అటువంటి జ్ఞానమును మరియు వివేచనమును కలిగియుండెను. దానియేలు దేవుని ఆత్మచేత మరియు జ్ఞానముచేత నింపబడియున్నాడని రాజు కనుగొనినప్పుడు, దానియేలును రాజు నాయకునిగా చేసియున్నాడు. అదే విధముగా, ప్రభువు జ్ఞానముతో మిమ్మును నింపును గాక. ప్రభువు ఆ విధంగా చేస్తానని వాగ్దానము చేసియున్నాడు.

నేడు నా ప్రియులారా, మీరు కూడ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను, జ్ఞానము వలనను, జీవించుదురు గాక. ఈ రోజు, ఆ పరలోకపు జ్ఞానం కోసం మొఱపెట్టండి. అప్పుడు దేవుని వాగ్దానం మీలో నిత్యము నిలిచి ఉంటుంది. ఇంకను అడుగు ప్రతి వారికి ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మనము జీవిస్తాము. కనుకనే, మీ నిర్ణయాలు, ఆలోచనలు మరియు క్రియలు ఆయన ఆత్మచేత నడిపించబడునట్లుగా, ప్రభువు మీ హృదయాన్ని తన యొక్క దైవిక జ్ఞానం మరియు అవగాహనతో నింపుతాడు. మీరు మాట్లాడేటప్పుడు, మీ మాటలు ఇతరులు గుర్తించునట్లుగా ఆయన జ్ఞానం మరియు శక్తిని కలిగి ఉంటాయి. ఆలాగునేన, స్తెఫెను మరియు దానియేలువలె, మీరు ఆత్మ మరియు దేవుని జ్ఞానం రెండింటితో నింపబడి ఉండాలి. దేవుని జ్ఞానం అయిన క్రీస్తు మీ ద్వారా ప్రకాశిస్తున్నట్లుగా ఇతరులు చూచుటకు మీకు సహాయము చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రీ, నీ వాగ్దానము ప్రకారము మమ్మును నీ యొక్క జ్ఞానముతో నింపుము. ప్రభువా, నీవు ఒక మాట సెలవిచ్చినట్లయితే, నిశ్చయముగా అది నెరవేరునట్లుగాను మా జీవితములో నీ కృపను చూపుము. దేవా, జ్ఞానము కొరకు తృష్ణగొనియున్న మా జీవితాలలోనికి నీవు ప్రవేశింపుము. అయితే, నీ యొక్క జ్ఞానాత్మతో మా హృదయములు నింపబడునట్లుగా చేయము. దేవా, మేము నీ యొక్క జ్ఞానమును కలిగియున్నామని మమ్మును చూచు ప్రతి ఒక్కరు గుర్తెరుగునట్లుగా చేయుము. ప్రభువా, మాకు గూఢమైన సంగతులను మరియు మా భవిష్యత్తును తెలుసుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా ద్వారా ఇతరులు వారి భవిష్యత్తును తెలుసుకొనునట్లగా చేయుము. ప్రభువా, మేము నీ యొక్క జ్ఞానముచేత నింపబడి, మేము అన్నిటిని ఎరుగునట్లు చేయుము. ప్రభువా, ఏ మానవుని మీద మేము ఆధారపడకుండా, నీ ఆత్మ చేత మేము నింపబడునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, యౌవనస్థులైన మాకు నీ యొక్క జ్ఞానమును, ఆలోచన, ప్రత్యక్షతలను దయచేయుము. ప్రభువా, నీలో ఉన్న బుద్ధిజ్ఞానములు సర్వసంపదలను మా చదువులలోను, పనులలోను, పరిచర్యలోను, కుటుంబాలలో మాకు దయచేసి, మమ్మును నడిపించుము. దేవా, మేము జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, మాకు వివేచనను అనుగ్రహించుము. ప్రభువా, మాకు కావలసిన జ్ఞాపకశక్తి మరియు మనస్సు యొక్క స్పష్టతతో మమ్మును నింపుము. ముఖ్యంగా పరీక్షలు లేదా సవాళ్ల సమయాలలో, నీ నడిపింపు ద్వారా విజయం సాధించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ జ్ఞానం మరియు ప్రత్యక్షత యొక్క ఆత్మ మాపై నిలిచి ఉండునట్లుగాను, లోతైన మర్మములను మాకు బయలుపరచుము. ప్రభువా, నీ యొక్క జ్ఞానం మరియు శక్తితో నింపబడిన దానియేలు మరియు స్తెఫెను వలె మమ్మును మార్చుము. దేవా, తద్వారా మేము ఉన్నత శిఖరాలలో లేవనెత్తబడుటకు మాకు కృపనిమ్మని మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.