నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, ఈ రోజు మనము ఒక అద్భుతమైన వాగ్దానమును బైబిల్ నుండి నిర్గమకాండము 23:25వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను'' అని చెప్పబడినట్లుగానే, ఈ రోజు దేవుడు మన యొక్క ఆహారమును, పానమును దీవించవలెనని మన పట్ల కోరుచున్నాడు. నా ప్రియులారా, మొదటగా, మనము మన దేవుని సేవించినప్పుడు మరియు ఆయనను ఆరాధించినప్పుడు, మన జీవితములోనికి ఆశీర్వాదములు దిగివస్తాయి. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 37:4వ వచనములో మనము చూచినట్లయితే, "యెహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును'' అని వ్రాయబడియున్నది. నా స్నేహితులారా, ఇశ్రాయేలీయుల ప్రజలను ఆశీర్వదించడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. అందుకే బైబిల్ నుండి సంఖ్యాకాండము 24:1వ వచనములో మనము చూచినట్లయితే, " ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను'' అని వ్రాయబడినట్లుగానే, దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క ఆహారమును, పానీయములను ఆశీర్వదించాడు. ఆలాగుననే, ఆహారమును, పానీయమును ఆశీర్వదించుట అనగా నేమి? దేవుడు మన యొక్క అనుదిన జీవితమును ఆశీర్వదిస్తాడు.
నా ప్రియులారా, మన జీవితములో ఆహారము మరియు నీరు మనకు ఎంతో నిత్యసవరమై యున్నవి కదా! కనుకనే, ఆయన మనకు అనుదిన అవసరతలను తీరుస్తాడు. ప్రభువు ప్రతిరోజు ఉదయమున ఇశ్రాయేలీయులకు ఆహారముగా అనుదినము మన్నాను వారికి అనుగ్రహించియున్నాడు. వారు ఎంతో ఆరోగ్యవంతముగా ఉండియున్నారు. అందుకే బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 8:4వ వచనములో చూచినట్లయితే, "ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు'' అని చెప్పబడినట్లుగానే, ఇశ్రాయేలీయులు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, వారి యొక్క కాలు వాయలేదు. ఆలాగుననే, ప్రతి దినము వారికి ఆహారము మరియు నీరు సమకూర్చబడియున్నది. అరణ్యములో ఆరు లక్షలకంటె అధికముగా ఉన్నటువంటి ప్రజలకు ప్రతిదినము, ఆహారము మరియు నీరు తగినంత సమకూర్చబడడము సాధ్యతరమేనా? అయితే, ప్రపంచములో ఉన్న మన ప్రతి ఒక్కరికి కూడా ఆహారము మరియు నీరు సమకూర్చునంత సర్వశక్తిమంతుడైన గొప్పవాడు మనకు దేవుడుగా ఉన్నాడు. ప్రభువే మన పోషకుడు, మనకు సమస్తమును సమకూర్చు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి, ప్రభువునందు మనము విశ్వసించి, ఆయనను సేవించినప్పుడు, ఆయనే మనకు ఆహారముగాను, పానీయముగాను మారుతాడు.
అందుకే బైబిల్ నుండి యోహాను 6:33వ వచనములో చూచినట్లయితే," పరలోకము నుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడను గ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను'' ప్రకారముగా, ఆయన మనకు జీవాహారమై యున్నాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 4:14వ వచనములో చూచినట్లయితే, "నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.'' అవును, యేసే ఆ నీటి ఊటగా ఉన్నాడు. ఇంకను ఆయనే మన దీవెనలుగా మారిపోతాడు. నా ప్రియులారా, ప్రభువును సేవించడము మరియు ఆరాధించడము ద్వారా దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములను మనము పొందుకొనగలుగుతాము. యేసుక్రీస్తు తన శిష్యులకు ఈ విధముగా ప్రార్థించమని నేర్పించియున్నాడు. అందుకే బైబిల్ నుండి మత్తయి సువార్త 6:11వ వచనములో చూచినట్లయితే, "మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము'' అని చెప్పబడినట్లుగానే, ప్రతిదినము ఆయనే మనకు ఆహారమును దయచేయుచున్నాడు. అవును, నా ప్రియులారా, ప్రార్థన మన జీవితమునకు ఎంతో ప్రాముఖ్యమైనది. మనము ప్రతిదినము ప్రార్థించినప్పుడు మరియు అనుదినము మనము దేవుని వాక్యమును చదివినప్పుడు అది మన జీవితములలోనికి ఆశీర్వాదములను తీసుకొని వస్తుంది.
కనుకనే, నా ప్రియులారా, మనము ఎప్పుడు కూడా ప్రార్థన చేయడము మరచిపోకూడదు. దేవుని యొక్క దీవెనలను మనము ఎన్నడును నిర్లక్ష్యము చేయకూడదు. మా బిడ్డలు చిన్న వయస్సులో ఉన్నప్పుడు, ప్రతి దినము బైబిల్ గ్రంధమును చదివి, ప్రార్థన చేయమని చెబుతూ ఉంటాను. దేవుని వాక్యమును కంఠస్థము చేసే అంతవరకు వారిని అస్సలు వదలి పెట్టను. నా స్నేహితులారా, ఒక దేవుని బిడ్డ జీవితములో దేవుని వాక్యమును హృదయములో భద్రపరచుకోవడము ఎంతో ప్రాముఖ్యమైన ఒక విషయము. ఇంకను దేవునికి వ్యతిరేకముగా పాపము చేయకుండా ఆ వాక్యము మనలను కాపాడుతుంది. మనము దేవుని యందు ఆనందించునట్లుగా అది చేయుచున్నది. అవును, మనము దేవుని యందు ఆనందించినప్పుడు, ఆయన మన యొక్క హృదయ వాంఛలన్నిటిని తీరుస్తాడు. నేను నా చిన్న వయస్సులో ఉన్నప్పుడు నా తల్లిగారు నేను ఎంతగానో బైబిల్ గ్రంథమును చదవాలని ప్రోత్సహించేవారు. అయితే, మా అమ్మగారి కోసమని నేను ఏదో ఆలాగున బైబిల్ గ్రంథమును చదివి, ఈలాగున మూసివేస్తాను. నా ప్రియులారా, దాని వలన ఎటువంటి ఉపయోగము ఉండదండి. మనము ఆలాగున బైబిల్ గ్రంథమును ఏదో తెరచి పెట్టుకొని, కనిపించిన వాక్యమును చదవడము కాదు.
అయితే, నా ప్రియులారా, మనము దేవుని వాక్యమును చదవడములో ఆనందించవలెను. దేవుని వాక్యమును చదవడములో ఉన్న ఆనందాన్ని అనుభూతి చెందాలి. అప్పుడే, మనము దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదములను పొందుకొనగలుగుతాము. బైబిల్ గ్రంథములో నుండి దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానములను కేక్వలె తీయ్యగా మధురముగా ఉంటాయి. ఆలాగుననే, దేవుని యొద్ద నుండి మనము ప్రవచన వాక్కులను పొందుకున్నప్పుడు, అవి ఆ కేక్ పైన తీయ్యని పూత వలె ఉంటుంది. కనుకనే, దేవుని వాక్యమును ఎంత అధికముగా మనము చదువుతూ ఉంటామో, అంత అధికముగా దేవుని యొక్క దీవెనలు మన జీవితములో వస్తుంటాయి. తద్వారా, ప్రతిదినము మన హృదయములో ఆయన యొక్క ఆనందము అధికమవుతూ ఉంటుంది.
నా ప్రియులారా, యేసే ఆ వాక్యమై యున్నాడు అని బైబిల్ గ్రంథము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. అందుకే బైబిల్ నుండి యోహాను 1:1వ వచనములో చూచినట్లయితే, " ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను'' అని చెప్పబడినట్లుగానే, యేసయ్య ఆ వాక్యమై యున్నాడు. మనము దేవుని వాక్యమును ఎంత అధికముగా చదువుతామో, యేసయ్య యొక్క సన్నిధానమును అంత అధికముగా ఆనందించగలుగుతాము. అప్పుడు మనము యేసువలె మార్చబడతా ము. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 3:18వ వచనములో చూచినట్లయితే, "మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము'' అని చెప్పబడినట్లుగానే, మహిమ నుండి అధిక మహిమను మనము పొందుకొనుచూ ఉండగా, మనము దేవుని యొక్క పోలికలోనికి మార్చబడుచున్నాము. నా ప్రియులారా, మహిమ నుండి అధిక మహిమ మరియు బలము నుండి అధిక బలము. అవును, పరలోకపు ఆశీర్వాదములను కలిగియుండడము ఎంత దీవెనకరమైన విషయము కదా! ఆహారము నీరు కలిగియుండముకంటె అధికమైన విషయము కదా అది! అవును, నా ప్రియులారా, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారానే మనకు నిజమైన ఆనందము కలుగుతుంది. మనము అనేక రోజులు ఆహారము మరియు నీరు లేకుండా జీవించవచ్చును. కానీ, ఒక్కరోజు కూడా దేవుడు లేకుండా మనము జీవించలేము కదా! అవును, నా స్నేహితులారా, మనము ప్రభువును సేవించినప్పుడు, మన మీద దేవుని యొక్క ఆశీర్వాదములు నిలిచి ఉంటాయి. శారీరకపరమైన దీవెనలు మాత్రమే కాదు గానీ, ఆత్మీయ దీవెనలు కూడా మనము పొందుకుంటాము. కనుకనే, నా ప్రియులారా, ఇప్పుడు ఆయన అనుగ్రహించు దీవెనలన్నిటిని పొందుకొనుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? ఆలాగైతే, దేవుని వాక్యము ద్వారా ఆయన మనకు ఆహారమును నీటిని అనుగ్రహించి, మనలను ఉన్నతంగా ఆశీర్వాదిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రియమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు వాగ్దానము చేసిన రీతిగానే, నీ యొక్క ఆహారమును, నీటిని మాకు దయచేసి, మా జీవితములో నీవిచ్చిన వాగ్దానమును నెరవేర్చుము. యేసయ్య, మా కొరకు దిగివచ్చిన జీవాహారము నీవే గనుకనే, జీవాహారమును మాకు దయచేయుము. దేవా, ఈ లోక సంబంధమైన వాటికంటే అధికముగా, ఆత్మీయ ఆహారమును మరియు పరలోకము నుండి వచ్చు నిజమైన జీవాహారము, నిత్యజీవమునకు నడిపించు జీవజలమైన యేసును మాకు దయచేయుము. యేసయ్యా, నీ సన్నిధితో నింపి, నీ వాక్యము కొరకు మాలో గొప్ప దాహమును కలుగజేయుము. దేవా, మేము ప్రతిదినము ప్రార్థన చేయుటకును, నీ వాక్యమును అనుదినము చదువునట్లుగాను, నీ దీవెనల కొరకు కనిపెట్టుకొని ఉండుటకును మాకు సహాయము చేయుము. ప్రభువా, మా యందు నీ ఆశీర్వాదములు అధికమగునట్లుగాను, మా మీద నీ అభిషేకము రెట్టింపు భాగముగా నిలిచి యుండునట్లుగాను, నూతన ఆశీర్వాదములను అనుభవించునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీ సన్నిధానముతో మమ్మును నింపి, నీ యొక్క పరిచర్యలో మమ్మును వాడుకొని, నీ యొక్క పరిశుద్ధాత్మతో అత్యధికముగా మమ్మును నింపుము. ప్రభువా, నీ వాక్యమును చదవాలనే దప్పికను మాకు కలుగజేసి, ప్రతిరోజు నీ కొరకు మేము వేచియుండు కృపను మాకు దయచేసి, అన్నిటికంటె నీ సన్నిధితో మమ్మును నింపుము. దేవా, నీ యొక్క ఆశీర్వాదములతో మా గిన్నె నిండి పొర్లునట్లుగా చేయుము. యేసయ్యా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో కొలతలేకుండా రెండంతల అభిషేకముతో మమ్మును నింపుము మరియు మా పిల్లలను కూడా దీవించుము. దేవా, నీ యొక్క సమృద్ధియైన దీవెనలు మా మీదికి దిగివచ్చునట్లుగాను, కొలతలేనంతగా ఆశీర్వాదములతో మమ్మును నింపి, మా యొక్క అనుదిన ఆహారము పానీయమును, ఆశీర్వదించి, మా మధ్య రోగమును తొలగించి మమ్మును దీవించుమని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


