నా ప్రియమైన వారలారా! నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 145:9వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు తన కనికరములను మన మీద కుమ్మరించవలెనని మన పట్ల ఆశించుచున్నాడు. ఆయన కనికరపూర్ణుడు; కనుకనే, ఆయన మనలను ఎన్నడూ తృణీకరించడు లేదా విడువడు, ఎడబాయడు. ఆయన కనికరముతో నింపబడినవాడు, మిమ్మును క్షమించడానికి మరియు తన దయను కనుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి!

నా ప్రియులారా, దేవుడు పశువులను, వృక్షములను మరియు సమస్త భూమండలముతో కూడ తన సృష్టిలోని ప్రతి దానియందు కనికరం చూపుచున్నాడు. ఆయన తాను సృష్టించిన ప్రతి దాని పట్ల దయ చూపునప్పుడు, మీ పట్ల కనికరం చూపడా? తప్పకుండా చూపిస్తాడు! ఆయన కనికరము చూపినప్పుడు, మనం అర్హులం కాకపోయినప్పటికిని మనకు తన కనికరమును, కృపను అనుగ్రహిస్తాడు. ఎంతటి కరుణామయుడైన, ప్రేమగల సృష్టికర్తను మనము కలిగియున్నాము కదా! ఆయన మంచితనమును, సమృద్ధిగల ఆశీర్వాదములను అనుభవించడం ఎంతో అద్భుతం కదా.

అందుకే బైబిల్ నుండి లూకా 6:35వ వచనములో మనకు గుర్తుచేయునదేమనగా, "మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారి యెడలను దుష్టుల యెడలను ఉపకారియై యున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, కృతజ్ఞత లేనివారి పట్ల, దుష్టుల పట్ల కూడా ప్రభువు దయగలవాడుగా ఉన్నాడు. మన సర్వశక్తిమంతుడైన దేవుడు, వారి గతం ఎలా ఉన్నప్పటికిని, ప్రతి ఒక్కరికిని మేలు జరిగిస్తాడు. సిలువ మీద ఉన్నప్పుడు కూడా, యేసు తనను సిలువ వేసిన వారి కొరకు ఇలాగున ప్రార్థించుచూ, "యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.'' అవును, ఆయన కనికరము, దయ ఎంత గొప్పవిగా ఉన్నవి కదా! ఆయన మీకు కూడా అటువంటి కనికరమును మన పట్ల కనుపరచవలెనని ఆయన ఎంతగానో ఆశించుచున్నాడు.


నా ప్రియులారా, బహుశా! మీరు అర్హతలేనివారనియు లేదా దేవునికి అవిశ్వాసంగా ఉన్నారనియు భావించుచూ ఉండవచ్చును. కనుకనే, కలవరపడకండి. ఈరోజే యేసు వద్దకు వచ్చి పశ్చాత్తాపపడండి. ప్రభువు అత్యంతమైన కృపగలవాడు మరియు మిమ్మును కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే బైబిల్ నుండి లూకా సువార్త 19వ అధ్యాయంలో మనము చూచినట్లయితే, జక్కయ్య అనే ఒక వ్యక్తిని గురించి మనము చదువగలము. అతను సుంకపు పన్నును ప్రజల యొద్ద అత్యధికముగా తీసుకుని, అక్రమంగా సంపదను కూడబెట్టిన ఒక ప్రధాన సుంకపు గుత్తదారుడును. అతను యేసును చూడవలెనని కోరుకున్నప్పటికిని, ప్రజల విమర్శలకు భయపడ్డాడు. యేసును వెంబడించుచున్నందుకు ప్రజలు తనను ఎగతాళి చేయుదురనియు, అలాగే ప్రభుత్వ అధికారిగా తన పదవిని కోల్పోతాడని అతడు ఎంతగానో భయపడ్డాడు.

కానీ, జక్కయ్య పొట్టివాడు కావడంతో, బహు జనసమూహము ఎక్కువగా ఉండటము వలన అతనికి యేసు కనిపించలేదు; అందుకే, యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఇంతకు ముందు జక్కయ్య అతనిని కలుసుకొనపోయినప్పటికిని, యేసు దేవుడు గనుక, ఆయన జక్కయ్య హృదయాన్ని ఎరిగినవాడు కనుకనే, ఆయన కన్నులెత్తి చూచి, "జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండ వలసియున్నదని అతనితో చెప్పగా'' అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను తన యింట చేర్చుకొనెను. యేసును వెంబడించుచున్నందున తన ఉద్యోగమును కోల్పోతాననే భయంతోను లేదా ప్రజల విమర్శలను ఎదుర్కోవలసి వస్తుందనే భయముతోను జక్కయ్య చెట్టు ఎక్కి దాక్కుని ఉండవచ్చును. కానీ, యేసు అతనిని నిందించలేదు లేదా అతని గతమును గురించి ఎటువంటి ప్రశ్నలు కూడా వేయలేదు. ఆయన కేవలం అతని ఇంటికి వెళ్లాలనే తన కోరికను తెలియజేశాడు. జక్కయ్య ఎంతో ఆనందంతో యేసును తన ఇంటికి ఆహ్వానించాడు; దానితో అతని నుండి భయము తొలగిపోయినది. ఆ సందర్భములో, అతను తన తప్పును గుర్తించి, వెంటనే, ' జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనిన యెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.''

అతడు తన అక్రమ కార్యకలాపాలను బహిరంగంగా ఒప్పుకుని, వాటిని సరిదిద్దుకుంటానని యేసు ప్రభువునకు మాట ఇచ్చాడు. అందుకు యేసు, "ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది'' అని ప్రకటించాడు. తద్వారా, ప్రభువు జక్కయ్యలోను, అతని కుటుంబమంతటిలోను మార్పును తీసుకొని వచ్చాడు. ఆయన మీ జీవితములో, మీ కుటుంబములో కూడా అటువంటి మార్పునే తీసుకువస్తాడు. అందుకే బైబిల్ నుండి లూకా సువార్త 7వ అధ్యాయములో చూచినట్లయితే, యేసు ప్రభువు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, పశ్చాత్తాప హృదయముతో ఆ స్త్రీ యొక బుడ్డిలో అత్తరు తీసికొని వచ్చి, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను. అందరి సమక్షంలోనే, ఆమె ఎంతో విలువైన అత్తరు ఆయన పాదముల మీద పోసెను.

నా ప్రియులారా, ఆమె చుట్టు ఉన్నవారందరు ఆమెను పాపి అని నిందించి హేళన చేసినప్పటికిని, యేసు ఆమె పట్ల కనికరమును చూపించి, ఆ స్త్రీ వైపు తిరిగి, "అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.'' యేసు ఆమెను పరిపూర్ణంగా క్షమించి, ఆమెకు ఒక నూతన జీవితమును అనుగ్రహించియున్నాడు. ఆయన ఆమెలోని అపరాధ భావమును తొలగించి, ఆమె గౌరవాన్ని తిరిగి పునరుద్ధరించాడు. నా ప్రియులారా, ఆయన మీ విషయములోనూ అలాగే జరిగిస్తాడు; ఎందుకంటే కృతజ్ఞత లేనివారి పట్ల, తప్పుదారి పట్టినవారి పట్ల కూడా ఆయన దయగలవాడు.

అవును, నా ప్రియులారా, దేవుడు సృష్టించిన వారిలో ఎవరు కూడా నశించవలెనని ప్రభువు కోరుకోరు. జక్కయ్యవలె ప్రతి ఒక్కరూ క్షమాపణ పొందాలని, పరిశుద్ధపరచబడాలని, ఆయన బిడ్డలుగా మారాలని మరియు ఆయన ఆశీర్వాదాలను అనుభవించాలని ఆయన ఆశించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 1:16వ వచనములో చూచినట్లయితే, " ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను '' అని చెప్పబడినట్లుగానే, సమస్తము ఆయన ద్వారా, ఆయన యందు సృష్టించబడ్డాయని మనకు గుర్తుచేయుచున్నది. ఇంకను బైబిల్ నుండి 2 పేతురు 3:9 వ వచనములో చూచినట్లయితే, "కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు'' అని చెప్పబడిన ప్రకారం, ప్రభువు మన పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నారు; ఎవరూ నశించిపోకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి, నా ప్రియులారా, నేడు ఆయన వాక్యమును విని, మారుమనస్సు పొంది, యేసుక్రీస్తు బిడ్డగా మారండి. ఆయనను గట్టిగా పట్టుకోండి, మీ పాపపు మార్గములను విడిచిపెట్టినప్పుడు, మీరు తద్వారా పరిశుద్ధపరచబడతారు. ఆలాగుననే, జక్కయ్య మరియు యేసు వద్దకు వచ్చిన ఆ స్త్రీ వలె, మీరు కూడా ఆయన ఇచ్చు క్షమాపణను పొంది సమాధానముతో జీవించండి. యేసు మీ ఇంటిలోనికి వచ్చి, మీ కుటుంబంతో నివసిస్తాడు. జక్కయ్య వలె ప్రభువు మీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక!

ప్రార్థన
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా హృదయాలను శుద్ధి చేసి, మమ్మును పవిత్రపరచుము. ప్రభువా, ఈ సమయములో మమ్మును ఆశీర్వదించుము. యేసయ్యా, మేము నీ యొక్క పరిశుద్ధతలో ఎదగడానికి, నీ యెదుట మరియు ఇతరుల యెదుట నీతిగా నడవడానికి మాకు సహాయము చేయుము. దేవా, మా జీవితములో నీకు సరైనది చేయడానికి, నీ మార్గములను అనుసరించడానికి, మరియు నీ వాక్యము యందు నమ్మకంగా జీవించడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, మా పాపములను క్షమించి, నీ రక్తము ద్వారా కడిగి, మా జీవితములను నూతనపరచము. దేవా, నీ దయ, కనికరము మా మీద మరియు మా కుటుంబ సభ్యుల మీద నిలిచియుండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ సన్నిధి ఎల్లప్పుడూ మాతో ఉండునట్లుగాను, జక్కయ్య వలె నీవు మా యింటికి వచ్చి, మా యింటిలో నీ యొక్క రక్షణను మాకు అనుగ్రహించుము. దేవా,మా ప్రార్థనను అంగీకరించి మాతో నిలిచియుంటూ, మమ్మును నీ యొక్క మార్గములో నడిపించుమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.