నా ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలమున మీకు శుభములు తెలియజేయుటలో నాకు చాలా ఆనందముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నెహెమ్యా 8:10వ వచనము మనము ధ్యానించుకుందాము. ఆ వచనము, "...యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు'' ప్రకారం మీరు బలము కలిగియుండాలంటే, మీరు ఆయన యందు ఆనందించాలి. అవును, ప్రియులారా, ఈ వచనము చదివిన ప్రతిసారి, నాకు నా స్వంత క«థ జ్ఞాపకము వస్తుంది. అందరు నన్ను చూచి, ' నిన్ను గురించి, అనేకమైన ప్రతికూల వ్యాఖ్యాలు వచ్చినప్పటికిని, నీవు సానుకూలంగా ఎప్పుడు నవ్వుతూ, సంతోషముగా ఎలా ఉంటావు అని అందరు నన్ను అడుగుతారు? ప్రజలు నిన్ను విమర్శించుచున్నప్పటికిని, నీవు సానుకూలముగాను మరియు ఆనందగాను ఎలా ఉండగలుగుతావు? అని అందరు అడుగుతారు.' అందుకు నేను, "యెహోవా యందు ఆనందించుటయే నా బలము'' అని వారు నన్ను అడిగిన ప్రతిసారి నేను వారికి జవాబును చెబుతాను. అవును, నిజముగానే, నా జీవితములో ఆ ఆనందమును నేను అనుభవించియున్నాను.

నా ప్రియులారా,ఈ ఆనందము మన జీవితములో ఎలా పొందుకొనగలుగుతాము? మనకు అనుదినము అది బలంగా ఎలా మారుతుంది? మనము ఒత్తిడికి గురైన తర్వాత, కాస్త నెమ్మదిని, లేక ఆనందాన్ని పొందుకోవడము అనేది సహజమే. మీకు ఎంతో పని ఒత్తిడి ఉండవచ్చును. మీ బంధువులు లేక కుటుంబ సభ్యుల మాటలు మీ మదిలో మెదులుతూ, మిమ్మును బాధపెట్టుచుండవచ్చును? మీ జీవితములో ఆర్థిక వ్యవహారాలు లేక ఉద్యోగము మరియు వ్యాపారములలో అన్నియు క్రిందకు పడిపోతున్నట్టు అనిపించుచుండవచ్చును? ఏదో ఒక చోట నెమ్మది పొందుకుందామా? అని అనుకుంటున్నారేమో? అనేకసార్లు కాస్త సమాధానము కొరకు, స్నేహితుల వైపు లేక వినోదము వైపు చూస్తుంటాము. అయితే, తిరిగి మన జీవితములోనికి వెళ్లినప్పుడు, ఆ యొక్క ఒత్తిడి, ఆ యొక్క బాధ మనలను మరల క్రిందకు లాగుతూనే ఉంటాయి. ఈ కష్టాలన్నిటి మధ్యలో మనము ఎలా సానూకూలంగాను మరియు సంతోషముగా ఉండగలుగుతాము? ప్రతి ఉదయము ప్రభువు ఇచ్చు ఆనందము వలననే, అది సాధ్యమవుతుంది. ఆయనతో కూడ ఉదయాన్నే అనుసంధానమైనప్పుడు, ఆయన వాక్యమును చదివి, దానిని ధ్యానించినప్పుడు, ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడినప్పుడు, ఆ రోజు కావలసిన నడిపింపును ఆయన మనకు ఇస్తాడు. మన ప్రాణమునకు ఆయన పోషణను అందిస్తాడు. మన జీవితములో మరో అడుగు ఎలా ముందుకు వేయాలో మనకు చెబుతాడు. కనుకనే మీ హృదయమును కలవరపడనీయకండి.

అయితే నా ప్రియులారా, బైబిల్ గ్రంథము ఎప్పుడో వ్రాయబడింది కదా, ఈ రోజు అది నాకు ఎలా ఉపయోగపడుతుంది అని మీరు అనుకోవచ్చును? కానీ, అందులోని మాటలు ఈ రోజు కూడా అవి సజీవమై యున్నవి. ప్రభువు ఆయన మాటల ద్వారా మీతో మాట్లాడతాడు. ఆయన మీ ఆత్మను లేవనెత్తుతాడు. ఆయన తన వాక్యము ద్వారా మీ జీవితములో మిమ్మును నడిపిస్తాడు. మీరు చేయుచున్న ప్రతి పనిలోను మీకు తృప్తి అనేది ఉంటుంది. మీ జీవితములో ఉన్నతముగా ఉన్నను, లేక క్రిందకు పడిపోయినను సరే, ప్రభువు మీతో ఉండి, మిమ్మును బయటకు తీసుకొని వచ్చి, మీకు విజయమును ఇస్తాడని మీరు తెలుసుకుంటారు. అన్ని సమయములలో మరియు సందర్భాలలో మీకు సమాధానమును ఇస్తాడు. మీరు అన్నిటిని చేయగలరని జ్ఞాపకము చేస్తాడు. అందుకే బైబిల్‌లో ఫిలిప్పీయులకు 4:12,13వ వచనములలో మనము దానిని చూడగలము. ఆ వచనములు, "దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను'' ప్రకారం దేవుడు అన్నిటిలోను మీరు సంతృప్తి కలిగి ఉండాలని మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే ప్రభువునందు ఆనందించండి. అంతమాత్రమే కాదు, పౌలు భక్తుడు చెప్పిన రీతిగా, అన్ని సందర్భాలలో మీరు సంతృప్తి కలిగి ఉండే కృపను ప్రభువు మీకు ఇస్తాడు. 'నేను సమస్తమును చేయగలను' అని ధైర్యమును మీకు ఇస్తాడు. మరియు 'నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను' అని మీరు ధైర్యముగా చెప్పగలరు.

కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, ప్రతి ఉదయము ఇటువంటి ఆనందము క్రీస్తు యొద్ద నుండి మీరు పొందుకొనండి. అప్పుడు మీరు ప్రతి పరిస్థితులను అధిగమించగలిగే బలమును మీకు అదే అందిస్తుంది. ప్రభువు మీకు తోడుగా ఉండి, అన్నిటిలోను మీకు విజయమును అనుగ్రహిస్తాడు అని మీరు తెలుసుకొని ఆనందముతో ఉండగలుగుతారు. ఆయన అన్నిటిలో మీకు తోడుగా ఉంటాడు. ఈ అద్భుతమైన వాగ్దానమును ఈ రోజు పొందుకుందామా? ప్రభువు యందలి ఆనందముతో మనము నింపబడదామా? ఆలాగైతే, ప్రియులారా, నేడు మీ జీవితాలను ఆయనకు సమర్పించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా మీరు సంతృప్తి కలిగి ఉండునట్లుగా, క్రీస్తు ద్వారా మీరు సమస్తమును చేయునట్లుగాను మిమ్మును బలపరచి, దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ నుండి మాత్రమే వచ్చే ఆనందానికి మరియు ప్రతిరోజు మా బలం అయ్యే పరిపూర్ణ ఆనందానికై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్య, మమ్మును నీ యొక్క ఆనందముతో నింపుతున్నందుకై నీకు వందనాలు. దేవా, అనుదినము నీతో సంబంధము కలిగి ఉండి, నీ వాక్యమును ధ్యానిస్తుండగా, నీతో ప్రతి ఉదయము సమయాన్ని గడుపుచుండగా, ప్రభువా, ఈ రోజుకు కావలసిన నడిపింపును మరియు మాకు కావలసిన ప్రోత్సాహమును, ఇంకను మాకు కావలసిన ప్రత్యక్షతను దయచేయుము. దేవా, మా జీవితములో మేము ఎలాగున జీవించాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, నీ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడుము. దేవా, మా జీవితములో అనుదినము మమ్మును నడిపించుము. యేసయ్యా, 'మమ్మును బలపరచు క్రీస్తునందు మేము సమస్తమును చేయగలము' అని చెప్పుటకు మాకు ధైర్యమును అనుగ్రహించుము. ప్రభువా, ప్రతి సమయములోను, అన్నిటి యందు మేము సంతృప్తిని కలిగి జీవించునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. దేవా, మా జీవితంలోని ప్రతిరోజు ఒత్తిడి మరియు బాధల మధ్య కూడా మేము నిన్ను వెదకాలని ఎంచుకున్నాము,కనుకనే, ప్రతి ఉదయం మమ్మును నీ వాక్యంతో, నీ శాంతితో మరియు నీ ఆనందంతో నింపుము. ప్రభువా, నీ ఆనందం మా భారాలను అధిగమించి, మా హృదయానికి నెమ్మదిని మరియు బలాన్ని తీసుకొని వచ్చునట్లుగా చేయుము. దేవా, సమృద్ధిగా ఉన్నా లేదా అవసరంలో ఉన్నా, అన్ని పరిస్థితులలో సంతృప్తి చెందడానికి మాకు నేర్పించుము. దేవా, మమ్మును బలపరచే క్రీస్తు ద్వారా మేము సమస్తమును చేయగలమ విశ్వాసంతో ముందుకు సాగిపోవుటకు సహాయము చేయుమని సమస్త ఘనత నీకే చెల్లించుచూ యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.