నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయుటలో నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి పరమగీతము 2:4వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియులారా, దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు. ఆయన మిమ్మును ఘనపరచవలెనని మీ పట్ల కోరుచున్నాడు. దావీదుకు అదే జరిగించియున్నాడు. దావీదు ఒక సాధారణమైన ఒక గొఱ్ఱెల కాపరిగా ఉండియున్నాడు. తాను పొలములలో సర్వసాధారణంగా పనిచేయుచుండెను. తన అన్నదమ్ములు కూడా అతనిని మరచిపోయారు. అతనిని గురించి ఎవరైనను అడిగినప్పుడు తన యొక్క స్వంత తండ్రి కూడా దావీదును దాచిపెట్టాడు. అంతగా అతడు నిర్లక్ష్యపెట్టబడ్డాడు. అతనిని ఎవరు కూడా గమనించలేదు, అతనిని పట్టించుకోలేదు. అయితే, ప్రభువు అతనిని దృష్టించాడు, అతనిని ఎన్నుకున్నాడు, మరియు ఒక దేశమునకు అతనిని రాజుగా నియమించాడు. అంతమాత్రమే కాదు, ప్రభువు" అతనిని తన హృదయానుసారుడు''అని పిలుచుకున్నాడు. ఆలాగుననే, విశాలమైన స్థలములోనికి ప్రభువు అతనిని నడిపించాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 18:19వ వచనములో మనము చూచినట్లయితే, "విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను'' అని చెప్పబడినట్లుగానే, దావీదు దేవునికి ఇష్టుడు గనుకనే, ఆయన అతనిని తప్పించి, విశాలమైన స్థలమునకు తోడుకొనివచ్చి, ఉన్నత స్థానమునకు హెచ్చించి, ఘనపరచాడు. ఆలాగుననే, నా ప్రియులారా, ప్రభువు మనలను లేవనెత్తడము మాత్రమే కాదు, మనలను ఘనపరుస్తుంది కూడా. అదే ప్రేమ ధ్వజముగా ఉన్నది.

అవును, నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానమైన పరమగీతము 2:4వచనములో చూచినట్లయితే," అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను'' అని చెప్పబడినట్లుగానే, విందుశాల అనగా, ముఖ్యమైన అతిథులందరు కూర్చుని రాజుతో భోజనము చేయు స్థలమే విందుశాల అంటారు. కనుకనే, నా ప్రియులారా, ఈ విందుశాలకు నేడు ప్రభువు మిమ్మును ఆహ్వానించి, ఆ విందులో పాల్గొనుటకు మిమ్మును నడిపించి, ప్రేమ ధ్వజముగా మిమ్మును ఘనపరుస్తాడు. ఆయన మిమ్మును చూచి, 'ఇతడు, నా ప్రియమైన కుమారుడు, ఈమె నా ప్రియమైన కుమార్తె' అనియు, ' నా హృదయానుసారుడు' అని దావీదును పిలిచినట్లుగానే ప్రభువు మిమ్మును అదేవిధముగా పిలిచి, ఘనపరుస్తాడు. నా ప్రియులారా, ఒకవేళ ఈ రోజు మిమ్మును నిర్లక్ష్యపరచుచున్నారేమో? మీ మేనేజరు మీ పేరును కూడా జ్ఞాపకము ఉంచుకొనుటలేదని అనుకుంటుండవచ్చును. కుటుంబములో మీరే ఆఖరివారు, మిమ్మును ఎవరు పట్టించుకోలేదు అని అంటున్నారేమో? మీకు ఉద్యోకములో కానీ, కుటుంబములో కానీ, ఏ స్థానము లేదు, శక్తి లేదు, జ్ఞానము లేదు అని అంటున్నారేమో? మీకు ఏ నేపథ్యము లేదు, ఏ అర్హతలేదు, మీరు అంత ప్రాముఖ్యము కాదు చెబుతున్నారేమో? దావీదును దాచిపెట్టినట్లయితే, మీరు అందరికి మరుగై యున్నారేమో? దావీదు వలె మీరు కూడా దాచిపెట్టబడుచున్నారేమో? అయితే, మీరు చింతించకండి.

అవును, నా ప్రియులారా, ప్రభువు మిమ్మును పిలిచినప్పుడు, మిమ్మును ఎన్నుకున్నప్పుడు, తన స్వంత బిడ్డలనుగా తన ప్రేమ ధ్వజమును మీ మీద కప్పుతాడు. ఆయన ప్రేమను బట్టి మిమ్మును కాపాడబడడము మాత్రమే కాదు కానీ, ఆయన మిమ్మును పైకి లేవనెత్తి, మిమ్ము ను ఘనపపరుస్తాడు. ఎంతో ప్రాముఖ్యమైన స్థలమునకు ఆయన మిమ్మును ఆహ్వానించి, ఉన్నత శిఖరముల మీద మిమ్మును నిలువబెడతాడు. 'అతడు విందుశాలకు తోడుకొని వచ్చెను' అని సెలవిచ్చినట్లుగానే, ఉన్నత స్థానములలో ఆయన మిమ్మును నిలువబెడతాడు. అంతమాత్రమే కాదు, మిమ్మును ఆయన, 'మీరు తన ప్రియమైన బిడ్డలని' ఈ ప్రపంచానికి చూపెడతాడు. నా ప్రియులారా, అదే ఆయన మీ మీద ఉంచియున్న ప్రేమ ధ్వజము. కనుకనే, స్నేహితులారా, ఈ రోజు మీరు ధైర్యము వహించండి. మీరు దేవునిచేత మరువబడలేదు. ప్రభువు మిమ్మును చూచుచున్నాడు. ఆయన మిమ్మును లేవనెత్తుతాడు. ఆయనకు వందనములు చెల్లించి, ప్రార్ధించుకుందాము. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, దావీదువలె మేము అందరి చేత నిర్లక్ష్యపరచబడియున్నాము. కనుకనే, నీవు మా మీద నీ దృష్టిని ఉంచి, మమ్మును బయటకు తోడుకొని వచ్చి, విశాలమైన స్థలమునకు నీవు మమ్మును నడిపించుము. ప్రభువా, నీ ప్రేమను బట్టి, ఉన్నత శిఖరముల మీద నీవు మమ్మును నిలబెట్టుదువని మేము నమ్ముచున్నాము. దేవా, తద్వారా, 'మేము దేవుని యొక్క ప్రియమైన బిడ్డలు' అని మా చుట్టు ఉన్నవారు గుర్తెరుగునట్లుగా చేయుటకు మాకు కావలసిన నైపుణ్యములను దయచేయుము. ప్రభువా, ఈ లోకములో మేము నిన్ను ప్రతిబింబించునట్లుగా మమ్మును లేవనెత్తి ఘనపరచి, దీవించుము. ప్రియ ప్రభువా, మా జీవితము మీద నీ ప్రేమ ధ్వజముగా ఉంచినందుకై నీకు నీకు వందనములు. దేవా, నీ పరిపూర్ణ ప్రణాళిక ప్రకారం మమ్మును ఉన్నత స్థితికి హెచ్చించి, మా కొరకు నీవు సిద్ధపరచిన స్థలములలోనికి మమ్మును నడిపించుము. ప్రభువా, నీ ప్రేమ ప్రతిరోజూ మాకు విశ్వాసాన్ని, సమాధానమును మరియు బలమును అనుగ్రహించుము. దేవా, మా జీవితం ఎల్లప్పుడు నీ మంచితనమును ప్రతిబింబించునట్లుగాను, నీ నామమునకు మహిమను తీసుకొని వచ్చునట్లుగాను మాకు కృపను దయచేయుము. ప్రభువా, నీకు ప్రియమైన బిడ్డగా నీకు లోబడి నడుచుకోవడానికి మాకు నేర్పించుము. దేవా, నీ సన్నిధితో మరియు నిరంతర ప్రేమతో మమ్మును ఘనపరచుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.