నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయడము నాకెంతో సంతోషము. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 89:15వ వచనము నేడు మనము ధ్యానించుకుందాము. ఆ వచనము, "శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు'' అని చెప్పబడినట్లుగానే, దేవుని సన్నిధి మనలను సరైన మార్గములో నడిపించు ఒక వెలుగుగా ఉంటుంది. కనుకనే, ఆయన ఈ రోజు తన వెలుగుతోను మరియు సన్నిధితోను మనలను నడిపించాలని మన పట్ల కోరుచున్నాడు.

నేను ఈ వచనమును చదువుచున్నప్పుడు నాకు ఒక కథ జ్ఞాపకమునకు వచ్చియున్నది. కొండల చేత చుట్టబడియున్నటువంటి ఒక చిన్న రాజ్యము కలదు. సాయంకాలము అయినప్పుడు, ఆ రాజ్యమంతయు చీకటి కమ్ముకుంటుంది. కాబట్టి, ప్రతి సాయంత్రము కూడా ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలు దీపాలను వెలిగించేవారు. ఆ దీపాలను వారి గృహముల బయట ఉంచేవారు. దారిలో వెళ్లేవారికి ఆ దారి కనిపించాలని ఆ దీపాలను వెలిగించి పెట్టేవారు. హన్నా అను ఒక చిన్న అమ్మాయి ఒంటరిగా నడుచుచుండెను. ఆ రాత్రి సమయములో ఒక గొప్ప తుఫాను వచ్చి, మేఘములన్నియు చంద్రుని కమ్మివేశాయి. తద్వారా, ఎటువంటి వెలుగు కూడ ఆ రాజ్యములో లేదు. అంతా కూడా చీకటిమయమైనది. తను యింటికి వెళ్లడానికి తనకు మార్గము ఏమియు అస్సలు కనిపించలేదు. అటువంటి సమయములో తను నడుస్తూ వెళ్లుచుండగా, తన వెనుక నుండి ఒక చిన్న వెలుగును ఆమె చూచియున్నది. తను నడుస్తూ ముందుకు వెళ్లుచుండగా, ఆ వెలుగు తనను వెంబడించుచున్నట్లుగా గమనించినది. ఆ సమయములో రాజు యొక్క సేవకుడు తన వెనకాల ఒక దీపమును పట్టుకొని, తనను వెంబడిస్తూ నడుస్తూ వచ్చుచుండెను. అది చూచిన ఆమె, అతనిని చూచి, 'మీరు నన్ను వెంబడిస్తున్నారా?' అని అడిగింది. అవును, 'నీవు ఈ మార్గములో నడుస్తున్నట్లుగా, రాజుగారికి తెలియ వచ్చినది. కాబట్టి, నిన్ను వెంబడించమని నన్ను రాజుగారు పంపించారు. ఇంకను నీవు మార్గములో వెళ్లుటకు త్రోవను చూపించమని చెప్పారు.' కనుకనే, హన్నా ముందుకు నడుస్తూ, తను మార్గములో చక్కగా వెళ్లసాగినది. నా ప్రియులారా, ఆ సమయములో తుఫాను కూడా ఆగలేదు, కారుమేఘాలు కూడా వెళ్లిపోలేదు. కానీ, తన వెనుక ఉంటున్నటువంటి వెలుగును బట్టి, తన మార్గములో చక్కగా నడుచుకుంటూ, తను సుళువుగా యింటికి వెళ్లగలిగినది. తను తన గృహమునకు క్షేమముగా చేరుకొనగలిగినది. తను అస్సలు భయపడనే లేదు. ఎందుకనగా, రాజుగారి యొక్క వెలుగు తనను నడిపించుచున్నది గనుకనే, ఆమె తను ధైర్యముతో తన త్రోవలో చక్కగా నడవగలిగినది. చూడండి, ఆ దేశములో మార్గము మారలేదు. పరిస్థితులు మారలేదు. కానీ, తనను నడిపించుచున్నటువంటి వెలుగు, తను వెళ్లుచున్న మార్గమును స్పష్టముగా తెలియజేసినది. కాబట్టి, తను ఎటువంటి భయము లేకుండా చక్కగా తన గమ్యము చేరుకొనగలిగినది.

ఆలాగుననే, మనము మోషేను చూచినట్లయితే, మోషే ప్రభువుతో ఈ విధంగా చెప్పడానిని మనము బైబిల్ గ్రంధములో చూడగలము. "మోషే నీ సన్నిధి రానియెడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొనిపోకుము. నా యెడలను నీ ప్రజల యెడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను.'' అంతమాత్రమే కాదు, 'ప్రభువా, నీ యొక్క సన్నిధి మాతో కూడా రానట్లయితే, మేము అక్కడకు వెళ్లనే వెళ్లము' అని ప్రభువుతో చెప్పియున్నాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధానము యొక్క ప్రాముఖ్యతను మోషే ఎరిగియున్నాడు. నా ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానము అతనికి సంతోషమును చేకూర్చినది. అవును, మోషే అనేకసార్లు అనేకమైన చెడువార్తలు వినవలసి వచ్చినది. నిరాశపరచే వార్తలు, నిస్పృహకు గురిచేయు వార్తలు. భయకంపితమును కలిగించే వార్తలు. అయినను, అతడు అటువంటి వార్తలకు ఎప్పుడు కూడా భయపడలేదు. ఎల్లప్పుడు దేవుని యొక్క ఆనందముతో అతడు నింపబడియున్నాడు. ఎందుకంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని తనకు తెలుసు. కనుకనే, అతడు దేనికిని భయపడలేదు. రెండవదిగా, దేవుని యొక్క సన్నిధానము అతనికి ధైర్యమును చేకూర్చినది. ఏది ఏమి జరిగినప్పటికిని, "దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుకనే, ప్రభువు నాకు సెలవిచ్చినదంతటిని చేయడానికి నేను ముందుకు సాగుతాను'' అని ధైర్యముగా చెప్పి, ముందుకు సాగలిగాడు. మూడవదిగా, దేవుని యొక్క సన్నిధానము మనము నడవవలసిన త్రోవను మనకు నేర్పుతుంది. ప్రభువు మోషేను మరియు తన ప్రజలందరిని కూడా నడిపిస్తూనే వచ్చియున్నాడు. వారు ఎక్కడికి వెళ్లాలో, వారు ఏమి చేయాలో, తర్వాత వారు ఏలా నడుచుకోవాలో, దేవుని మీద ఎలా ఆధారపడాలో, ప్రభువు వారికి ఎలా సమకూరుస్తాడనియు అన్నియు వారికి స్పష్టముగా తెలియజేశాడు. ఈ విషయాలన్నిటి కొరకై మోషే ప్రభువును వెదకి, ప్రజలను నడిపించియున్నాడు.

నా ప్రియులారా, ఈ రోజు అదేవిధముగా, మీరు ప్రభువు సన్నిధానములో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయనే మిమ్మును నడిపించే ఒక వెలుగుగా మీకు తోడై ఉంటాడు. మీ జీవితములోని పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికిని, అవి కష్టతరముగాను మరియు శ్రమపెట్టువిధముగా ఉన్నప్పటికిని, అది ఇరుకైన మార్గమైనప్పటికిని, అనేక అడ్డంకులు ఉన్నటువంటి మార్గములున్నప్పటికిని ప్రభువు మీ కొరకు సిద్ధపరచినటువంటి స్థలము వైపునకు ఆయన వెలుగు మిమ్మును నడిపిస్తూ ముందుకు తీసుకొని వెళ్లుతుంది. ఆయన సన్నిధానము మీకు ముందుగా వెళ్లుతూ ఉండగా, ఆయన సన్నిధానము మిమ్మును కాపాడుచుండగా, మరియు ఆయన సన్నిధానము మిమ్మును సంతోషముతోను మరియు ధైర్యముతోను నింపుచుండగా, ఈ రోజు ప్రభువు యొక్క సన్నిధానమును బట్టి, ఆయనకు వందనములు చెల్లించుదాము. నా ప్రియులారా, మిమ్మును మరియు మీ కుటుంబము, ఇంకను మీ గృహములను ఆయన యొక్క సన్నిధానముతో నింపమని ఆయనకు మొఱ్ఱపెట్టినట్లయితే, నిశ్చయముగా, మోషేను నడిపించిన అదే దేవుని యొక్క సన్నిధానము నేడు మీతో కూడా వచ్చును. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటూ, మీరు వెళ్లవలసిన మార్గమునకు వెలుగుగా ఉంటూ, మీకు ముందుగా వెళ్లుచూ, మిమ్మును సరాళమైన సుళువుగా నడిపిస్తుంది. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన పరలోకమందున్న మా తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా గృహములను మరియు మా కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరిని నీ యొక్క సన్నిధానముతో నింపుము. దేవా, నీ సన్నిధానము మమ్మును మరియు మా కుటుంబమును ఆవరించినప్పుడు, నీ వెలుగు మాకు తోడుగా వచ్చి, మమ్మును నడిపించుచున్నందుకై మరియు రక్షణ అను వెలుగును బట్టి, ఇంకను మాకు మార్గమును చూపించే వెలుగును బట్టి నీకు వందనములు. ప్రభువా, ఆనందమును సమకూర్చే నీ యొక్క అద్భుతమైన సన్నిధానమును బట్టి నీకు వందనములు. దేవా, నీ యొక్క సన్నిధానము ద్వారా మాకు ధైర్యమును ఇచ్చి, మా విశ్వాసమును బలపరచు సన్నిధానము, మేము ఎక్కడికి వెళ్లినను సరే, అటువంటి సన్నిధానము మా యొక్క ప్రతి వంకర మార్గములను సరిచేయుచూ, మాకు ముందుగా వెళ్లునట్లుగా సహాయము చేయుము. ప్రభు వా, నీ యొక్క సన్నిధానము ద్వారా మేము నడవవలసిన మార్గములో మేము నడుచుటకు నీ యొక్క వెలుగును మాకు ముందుగా పంపించుము. యేసయ్యా, మా కుటుంబమును కాపాడుచూ, మేము వేయు ప్రతి అడుగుకు నడిపిస్తూ, మా యొక్క ప్రతి కష్టము మరియు ఆటంకముల ద్వారా నీ సన్నిధి మమ్మును సురక్షితంగా నడిపించునట్లుగా చేయుము. ప్రభువా, నీ వెలుగు మా జీవితముల మీద ప్రకాశించునట్లుగాను మరియు నీ పరిపూర్ణ చిత్తం ప్రకారం మమ్మును నడిపించుము. దేవా, నీ యొక్క సన్నిధానము మాకు త్రోవ చూపెట్టు వెలుగుగాను, మా హృదయములను నీ ఆనందముతోను, ధైర్యముతోను, విశ్వాసముతోను నింపుము. ప్రభువా, నీకు విధేయత చూపెడుతూ, నీ మార్గములలో నడవగలిగే కృపను మాకు అనుగ్రహించుము. దేవా, నిన్ను పూర్తి విశ్వసించే కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.