నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 25:9వ వచనమును మన కొరకు తీసుకొనబడియున్నది. ఆ వచనము, " న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును'' ప్రకారం దీనత్వము గలవారిని దేవుడు ప్రేమించుచున్నాడు. కనుకనే, దేవుడు దీనస్థ్థులతో నడవడానికి ఇష్టపడతాడు. ఒక ఉపాధ్యాయుడు జాగ్రత్తగా వినే విద్యార్థికి బోధించడానికి ఇష్టపడినట్లుగానే, దేవుడు తన యెదుట సాగిలపడి, 'ప్రభువా, నాకు ఏమియు తెలియదు, కానీ నీవు సమస్తమును గుర్తెరిగియున్నావు' అని చెప్పుచున్న తన పిల్లలందరిని నడిపించడానికి ఇష్టపడుచున్నాడు. ఇంకను, "ప్రభువా, నాకు బోధించు ము'' అని మనలను మనము తగ్గించుకున్నప్పుడు, దేవుడే మనకు బోధకుడుగా మారతాడు మరియు ఆయన మార్గాలు మనకు నిజమైన విజయాన్ని, న్యాయాన్ని మరియు ఘనతను తీసుకొని వస్తాయి.

ప్రభువును ప్రేమించే ఒక తత్వవేత్త జీవితంలో మనం ఈ సత్యాన్ని చూడగలము. ఒకసారి, అమెరికాలోని ఒక ప్రముఖ టాక్ షో అతనిని అరగంట పాటు ఎగతాళి చేసి, అతని ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. అయినప్పటికిని, అందుకు ప్రతిగా అతను ఎదురు దాడి చేయలేదు, ఎవరికి ఫిర్యాదు చేయలేదు లేదా వారికి వ్యతిరేకంగా కఠినంగా స్పందించలేదు. బదులుగా, అతను నిశ్శబ్దాన్ని ఎంచుకున్నాడు మరియు అతడు మౌనముగా ఉంటూ, దేవున్ని మాత్రమే నమ్మాడు. కాలక్రమేణా, ప్రభువు అతనికి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు, అనేక ఇతర ప్రదర్శనలు అతనిని ఆహ్వానించడం ప్రారంభించాయి. ప్రజలు అతని మాటలకు ఆశ్చర్యపోయారు మరియు అతను తన తరంలో అత్యంత గౌరవనీయమైన తత్వవేత్తలలో ఒకనిగా మారాడు. ఒకప్పుడు అతన్ని ఎగతాళి చేసిన అదే టాక్ షోనే తరువాత అతన్ని గొప్ప ప్రశంసలతో సత్కరించింది. ప్రభువు జరిగించేది కూడా ఇదే. అవును నా ప్రియులారా, ఆయన దీనులను న్యాయమార్గంలో నడిపిస్తాడు మరియు మనుష్యుల యెదుట వారిని పేరు ప్రఖ్యాతితో పైకి లేవనెత్తుతాడు.

నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీ విషయంలో కూడా అలాగే జరిగిస్తాడు. ఈ లోకం మిమ్మును ఎగతాళి చేయవచ్చును, తక్కువ చేయవచ్చును లేదా తప్పుగా అపార్థం చేసుకోవచ్చును. కానీ, మీరు ప్రభువు సన్నిధిలో మిమ్మును మీరు తగ్గించుకొని దీనత్వంతో నడుచుకున్నట్లయితే, ఆయన ఒక ఉపాధ్యాయునిగా ఉండి, మీకు తన మార్గాన్ని బోధిస్తాడు, మిమ్మును తన జ్ఞానంతో నింపుతాడు మరియు తగిన సమయంలో మిమ్మును హెచ్చించి, పైకి లేవనెత్తుతాడు. మీరు మీ స్వంత జీవితములో మీరు పోరాడవలసిన అవసరం లేదు; ప్రభువు తానే మీ పక్షమున నీతిన్యాయాన్ని స్థిరపరుస్తాడు. కాబట్టి, నా ప్రియులారా,ఈ రోజు మీరు దీనత్వం గల హృదయాలతో ఆయన యొద్దకు వచ్చి, ఆయనను మీ బోధకునిగా లేక ఉపాధ్యాయునిగా, మీ మార్గదర్శిగా మరియు మీ జ్ఞానంగా ఉంచుకున్నప్పుడు, నిశ్చయముగా దేవుడు మీ దీనత్వమును చూచి, మీరు అవమానింపబడిన అదే స్థలంలో దేవుడు మిమ్మును ఘనపరచి, ఉన్నత స్థాయికి హెచ్చిస్తాడు. నేటి వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా ఉపాధ్యాయునిగా, బోధకునిగాను మరియు మా మార్గదర్శిగాను ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, నీ యెదుట దీనత్వముగల హృదయాన్ని మాకు దయచేయుము. దేవా, ఎల్లప్పుడు నీ స్వరాన్ని వినడానికి మాకు సహాయం దయచేయుము. ప్రభువా, నీ జ్ఞానం మరియు వివేకముతో మమ్మును నింపుము. తండ్రీ, ప్రజలు మమ్మును ఎగతాళి చేసినప్పుడు లేదా అవమానించినప్పుడు, నీ శాంతిలో మమ్మును మౌనంగా ఉంచుము. ఓ ప్రభువా, మాకు న్యాయం చేయుము మరియు మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, నీ ఆశీర్వాదం మాకు ఘనతను తీసుకొనివచ్చుటకు నూతన ద్వారాలను తెరువుము. ప్రభువా, నీ మార్గంలో మేము నడవడానికి మమ్మును బలపరచుము. యేసయ్యా, నీవలె మా జీవితములో దీనత్వమును అనుగ్రహించి, మా జీవితములో నీ యొక్క కృపాసత్యాన్ని ప్రతిబింబించునట్లుగా మాకు సహాయము దయచేయుమని యేసు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.