నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీరు ప్రార్థనలో వేటిని అడుగుదురో అవన్నియు మీకు దొరికినవని మీరు నమ్మినట్లయితే, వాటన్నిటిని మీరు నిశ్చయముగా పొందుకొందురు. మీరు అడిగిన వాటన్నిటికి దేవుడు తన యొద్ద నుండి జవాబులు పొందుకొనవలెనని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అందుకు ఏకైక మార్గము, మీరు దేవుని విశ్వసించుటయే. కనుకనే, మీరు తప్పకుండా జవాబును పొందుకొనగలరు అని విశ్వసించండి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి సువార్త 21:22వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మిన యెడల మీరు వాటినన్నిటిని పొందుదురు...'' అని వ్రాయబడియున్నది. ఈ రోజున మీరు ప్రతి ఆశీర్వాదమును కలిగి ఉండవలెనని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. జవాబుల యందు నమ్మిక యుంచండి. పరలోకము నుండి అవి ఇప్పుడు వచ్చుచున్నది. ఇప్పుడు దేనిని మనము విశ్వసించాలి? అని చూచినట్లయితే, మొట్టమొదటగా, దేవుడు మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తాడని మనము విశ్వసించాలి. అందుకే బైబిల్ నుండి మార్కు సువార్త 11:24వ వచనములో మనము చూచినట్లయితే, అందుకు యేసు ప్రభువు, "అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను'' అని సెలవిచ్చియున్నాడు. కనుకనే, ప్రార్థనలో అడుగువాటిని మీరు పొందియున్నాము అని నమ్మిన యెడల అవి మీకు స్వంతమవుతాయని ఆయన సెలవిచ్చియున్నాడు. ఒకవేచ్చి, మీరు ప్రభువైన యేసునకు ప్రార్థన చేసియున్నప్పటికిని కూడా, "ప్రభువా, నాకు తెలుసు, నేను ప్రార్థన చేసియున్నాను, ఇప్పటికే నేను వాటికి జవాబును పొందియున్నాను'' అని చెప్పండి. మీరు ఒకవేళ, వాటిని చూడకపోయినప్పటికిని, మీరు వాటిని అనుభూతి చెందకపోయినప్పటికిని, మీరు వాటిని మీ చేతులలో కలిగియుండకపోయినను సరే, అయినప్పటికిని, 'ప్రభువా, నేను ప్రార్థనలో అడిగియున్నాను గనుకనే, నేను వాటిని పొందియున్నాను' అని చెప్పండి. ప్రభువైన యేసు, 'మీరు ఆలాగున చేసి నాకు వందనములు చెప్పిన యెడల మీరు వాటిని కలిగియుందురు' అని చెప్పుచున్నాడు. రెండవదిగా,మనము చూచినట్లయితే, షరతులు లేకుండా దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు అని విశ్వాసముంచియున్నట్లయితే, ఆయన మిమ్మును ఎంతగానో ప్రేమించుచున్నాడు గనుకనే, అందును బట్టి మీకు జవాబును అనుగ్రహిస్తాడు అని మీరు నమ్మినట్లయితే, అప్పుడు వాటన్నిటిని మీరు పొందుకొనెదరు. అప్పుడు దేవుడు మీకు వాటన్నిటిని అనుగ్రహించును. నా యొక్క మనుమరాలు క్యేటీ, ఉదయకాలముననే లేచి నా యొద్దకు వచ్చేస్తుంది. ఆమె ఏమి చెబుతుందంటే, 'తాతయ్యగారు ఈ పెయింటింగ్ బ్రష్ మరియు పెయింటింగ్ పుస్తకము నాకు కావాలి. నాకు ఇవ్వండి, మీరు నాకు ఇస్తారు అని తెలుసు, ఇంకను మీరు నన్ను ఎంతగానో ప్రేమించుచున్నారని నాకు తెలుసు' అని చెప్పిన కొంత సమయములోనే ఏలాగో ఒకలాగున అది అక్కడ ఆమె చెతులలోనికి వచ్చేస్తుంది. ఎందుకనగా, నేను ఆమెను ప్రేమించుచున్నాను గనుకనే, ఆమె ఏది అడిగినను, నేను ఆమెకు అది ఇస్తాను. నా ప్రియులారా, ప్రభువు యొక్క ప్రేమ కూడా ఆలాగుననే ఉంటుంది. ఆయనకు కూడా, మనము తన చిత్త ప్రకారము అడుగుతామని ఆయన మన యందు నమ్మిక కలిగియుంటాడు. అందుకే కీర్తనలు 13:5వ వచనములో చదివినట్లయితే, " నేనైతే నీ కృప యందు నమ్మిక యుంచియున్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది'' అని చెప్పబడిన ప్రకారము మనము, 'ప్రభువా, నా యెడల నీ ప్రేమ వైఫల్యము చెందనదై యున్నది. అందరి విషయములో నేను ఓటమి పాలు అయినప్పటికిని, అన్ని విషయములలో నేను వైఫల్యము చెందినప్పటికిని, నీవు షరతులు లేకుండా నీవు నన్ను ప్రేమించుచున్నావు, నేను పాపము చేసినప్పటికిని, నేను నీ యొద్దకు రాగలను', నేను పాపములు చేసియున్నాను, అందుచేత నేను నా పాపములను ఒప్పుకుంటున్నాను, నీవు నాకు జవాబును అనుగ్రహిస్తావు అని చెప్పండి.' అందుకే బైబిల్ నుండి 1 యోహాను 1:9వ వచనములో చూచినట్లయితే, "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును'' ప్రకారము ఆయన నమ్మదగినవాడు గనుకనే, మన పాపములను ఆయన క్షమిస్తాడు. కనుకనే, మన పట్ల కలిగియున్న దేవుని వైఫల్యము చెందని ప్రేమయందు మీరు నమ్మకముంచండి.

మూడవదిగా, మీ నిమిత్తము ఆయన కలిగియున్న ప్రణాళిక చొప్పున విశ్వాసముంచినవారై ఆ రీతిగా ఆయనను అడగానికి మరియు ప్రార్థించడానికి ఇష్టపడండి. అందుకే బైబిల్ నుండి యిర్మీయా 29:11వ వచనములో చూచినట్లయితే, "నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు '' ప్రకారము "మేము ఏమి చేయాలో నాకు తెలియడము లేదు అని మీరు అనుకోవచ్చును. ఏ ప్రత్యేకమైన సబ్జెక్టును నేను ఎంపిక చేసుకోవాలో నాకు తెలియలేదు, ఏ డిగ్రీని ఎంపిక చేయాలో నాకు తెలియడము లేదు, ఏ రంగములో నేను ఉద్యోగము చేయాలో నాకు తెలియదు. ఎవరిని వివాహము చేసుకోవాలో నాకు తెలియలేదు. ఇంటిని కొనలా? లేక అద్దెకు తీసుకోవాలో నాకు తెలియదు లేదు' అని అంటున్నారు. కానీ, దేవుడు మీ వర్థిల్లత కొరకు ప్రణాళికను సంసిద్ధము చేసియున్నాడు. మీ జీవితానికి సంబంధించిన ప్రతి ప్రణాళిక క్రమబద్ధకరించబడియున్నది. ఇది మీ వర్థిల్లత కొరకు మాత్రమే. దేవుడు ఇప్పటికే మీ కొరకు ప్రణాళిక చేసియున్నాడు అని నమ్మండి. 'ప్రభువా, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు,' అని ఎప్పుడు కూడా ఏ మాత్రము ప్రార్థన చేయకండి. కేవలము, 'ప్రభువా, నీ చిత్తము మా పట్ల సిద్ధించును గాక' అని ప్రార్థించండి. ఇంకను, 'దేవా, నీ యొక్క ప్రణాళికను మాకు చూపించుము, ప్రభువా, నీవు మా కొరకు ఏమి రూపకల్పనము చేసియున్నావు నాకు కనుపరచుము. నా భవిష్యత్తును నాకు తెలియజేయుము' అని అడగండి. జగత్పునాది వేయబడక మునుపే ఆయన ఈ ప్రణాళికను మీ కొరకు సంసిద్ధము చేసియున్నాడు, ఆయన భూమిని సృజించకమునుపే ఆయన తన హృదయములో కలిగిన వానిగా ఉన్నాడు. ఆయన మిమ్మును ఎంతగానో ప్రేమించుచున్నాడు కదా! "జగత్పునాది వేయబడకమునుపే ఆయన ఈ ప్రణాళికను మీ కొరకు సంసిద్ధము చేసియున్నాడు గనుకనే, అది మీ జీవితములో స్థిరపరచబడి, నెరవేర్చబడవలసియున్నది. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 4:3వ వచనములో ఈలాగున తెలియజేయబడి యున్నది, ''కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము'' ప్రకారము దేవుడు తన ప్రణాళికను ఈ విధంగా నెరవేర్చవలసియున్నది. కనుకనే, ఆయన ప్రణాళికయందు నమ్మికయుంచి ప్రార్థించండి, దేవుడు దానిని మీ కోసం నెరవేరుస్తాడు.

చివరిగా, ఆయన ప్రవక్తల యందు నమ్మకముంచండి. ప్రవక్తల ద్వారా దేవుడు మీతో ఏమైతే మాట్లాడియున్నారో దాని యందు మీరు నమ్మకముంచండి. యెహోషాపాతు శత్రువులను ఎదుర్కొంటూ ఉండియున్న సమయములో అతడు దేవుని యొక్క ప్రవక్తల వైపు మరలుకొనియున్నాడు. దేవుడు వారి ద్వారా ఈలాగున మాట్లాడెను. వారు అతనికి ఏమి చెప్పారో చూడండి, అందుకే బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 20:20వ వచనములో చూచినట్లయితే, "అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను.'' తద్వారా, దేవుడు యెహోషాపాతుకు యుద్ధమునందు గొప్ప విజయమును అనుగ్రహించియున్నాడు. దేవుడు ప్రవక్తల ద్వారా ఇచ్చిన దానిని కేవలము యెహోషాపాతు నమ్మి ఆ విధంగా గానములు చేయుచు యుద్ధ భూమికి వెళ్లియున్నాడు. శత్రువులను ఎదుర్కొనడానికి దేవుడు ఎక్కడకు వెళ్లమని సూచించియున్నాడని కేవలము, అతడు అక్కడికి వెళ్లియున్నాడు. మార్గమధ్యములో, ' యెహోవా ఉత్తముడు ఆయన కృప నిరంతరము ఉండును,' అని గానములు చేయుచూ వెళ్లాడు. యుద్ధములు చేయుటకు యుద్ధ బృందము ప్రక్కన ఉన్నట్లుగానే, ఆయనకు గానములు చేయు సైన్య బృందములుండెను. ఇంకను, గానములు, ఆరాధనలు చేయు సైనిక బృందముల ద్వారా దేవుడు వారికి గొప్ప విజయమును అనుగ్రహించాడు. యుద్ధము అతడు చేయవలసిన అవసరము లేకుండా పోయినది. శత్రువులు వారికి వారే పోరాడుకొని, పారిపోయారు. అతడు కేవలము వారి దోపుడు సొమ్మును పంచుకొని, అతడు ఐశ్వర్యవంతుడుగా తిరిగి మరల యింటికి వచ్చాడు. ఒక్క బొట్టు రక్తము కూడా చిందించబడలేదు. కనుకనే, దేవుని ప్రవక్తల యందు నమ్మికయుంచండి. ఎటువంటి, క్రయధనము, రక్తము మీరు చిందించనవసరము లేదు. దేవుడు వారి ద్వారా మాట్లాడిన మాటలను మీరు వెంబడించినప్పుడు, మీకు విరోధముగా రూపింపబడు యే ఆయుధము కూడా వర్థిల్లదు. మీరు కేవలము శత్రువుల యొక్క దోపుడు సొమ్మును తీసుకొని వచ్చువారుగా ఉంటారు. దేవుడు ఈ ఆశీర్వాదమును మీకనుగ్రహిస్తాడు. కనుకనే, నా ప్రియులారా, మీరు దేవుని యందు నమ్మిక మాత్రము ఉంచండి, మీరు దానిని స్వీకరిస్తారు. దేవుడు మీరు అడిగిన దానిని మీకు అనుగ్రహిస్తాడు అని మీరు విశ్వాసముంచండి, ఆయన మీకు అనుగ్రహించడానికి ప్రేమను కలిగియున్నాడని, అట్టి ప్రేమ యందు మీరు నమ్మికను కలిగియుండండి. దేవుడు ఇప్పటికే మీ జీవితములను ప్రణాళిక చేసియున్నాడని మీరు నమ్మిక యుంచండి. దేవుని ప్రవక్తల యందు మీరు నమ్మికయుంచినప్పుడు, మీరు ఏ మార్గములో వెళ్లవలెనని వారు మీకు తెలియజేయుదురు. వీటిలో ప్రతిదాని యందు విశ్వసించి, ఆలాగున ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీరు అడుగువాటన్నిటి మీకు అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా పట్ల నీకున్న అపారమైన ప్రేమకు వందనములు. దేవా, మేము నీ యందు మరియు నీ ప్రేమ యందు, నీ ప్రకవ్తల యందు నమ్మికను కలిగియుండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, మా జీవితములో ఎటువంటి పోరాటములు ఉన్నను సరే, మా ప్రార్థనలకు జవాబు వచ్చునట్లుగా సహాయము చేయుము. దేవా, మా బంధకములన్నిటిని నుండి నేడే మాకు విడుదలను, స్వస్ధతను పొందుకొనునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, నీ చిత్తము మా జీవితములో జరుగునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రియమైన ప్రభువా, మేము ప్రార్థించినప్పుడు, నీ నుండి మాకు జవాబులు లభిస్తాయని మేము నమ్మునట్లుగా మాకు అటువంటి హృదయమును దయచేయుము. ప్రభువా, మేము పొందుకొనువాటిని వెంటనే చూడకపోయినను సరే, నీవు మా ప్రార్థనను విని, సరైన సమయంలో వాటన్నిటిని మా జీవితములో నెరవేరుస్తావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి, నీ యందు క్షమాపణను పొందుకొనునట్లుగాను, మరియు మా యొక్క సమస్త దుర్నీతి నుండి మమ్మును నీ రక్తము ద్వారా కడిగి శుద్ధులనుగా చేయుము. దేవా, మా జీవితము పట్ల నీ యొక్క పరిపూర్ణ ప్రణాళికను మాకు కనుపరచుము. ప్రభువా, నీ చిత్తం మాలో నెరవేరునట్లుగా చేయుము. దేవా, నీవు మాట్లాడిన ప్రతి మాటను విశ్వసించడానికి మరియు నీ ప్రేమగల చేతుల నుండి గొప్ప కార్యములను ఆశించడానికి మాకు కృపను చప్రుమని సమస్త మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.