నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 20:4వ వచనమును మన కొరకు తీసుకొనబడియున్నది. ఆ వచనము, "నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక'' ప్రకారం ఈ వాగ్దానము మీ కొరకు తీసుకొనబడినది. దేవుడు నేడు మీ కోరికలన్నిటిని సఫలపరుస్తాడు. మన దేవుడు మన హృదయ వాంఛలను నెరవేర్చే దేవుడు. కనుకనే, ఆయన మన ప్రణాళికలన్నింటిని నెరవేర్చు దేవుడుగా ఉన్నాడు. మానవునికి అనేక ప్రణాళికలు ఉంటాయి. కానీ, దేవుని యొక్క చిత్తము తన బిడ్డల జీవితాలలో మాత్రమే స్థిరపడుతుంది అని లేఖనము సెలవిచ్చుచున్నది. మరియు బైబిల్ నుండి ప్రసంగి 3:11వ వచనములో ఇలాగున తెలియజేయబడుచున్నది, " దేనికాలము నందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు'' ప్రకారం అవును, మన హృదయాలలో కోరికలను పుట్టించేది ఆయనే. కనుకనే, మీకు కూడా ఆలాగుననే జరుగుతుంది. కాబట్టి, దేవుడు మన హృదయంలో ఒక కోరికను, ఒక ప్రణాళికను ఉంచినప్పుడు, మనం ఏమి చేయాలి? బైబిల్ నుండి యోహాను 14:13-14వ వచనములను మనము చూచినట్లయితే, "మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును'' అని చెప్పబడిన ప్రకారం, మనం యేసు నామంలో దేవుని చిత్తప్రకారము మనలో ఉన్న కోరికలను లేదా ప్రణాళికలను నెరవేర్చమని ఆయనను అడగాలి.

నా ప్రియులారా, ప్రభువు కూడా, "మీ కొరకు సమస్తమును చేయడానికి నన్ను అనుమతించు లేక అవకాశము ఇవ్వు'' అని అంటున్నాడు. ఒకవేళ, అది వివాహమైనా, మీ విద్యయైనా, మీ కుటుంబమైనా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లానుకున్నను సరే, ఆస్తి కొనుగోలుయైనా, సేవా పరిచర్య చేయడమైనా, మారాలనే నిర్ణయమైనా లేదా మీ పిల్లల విషయాలు పరిష్కరించడమైనా లేక భవిష్యత్తులో ఏదైనా స్థిరపరచడమైనా - ప్రభువు ఇలాగున అంటున్నాడు, "నేను చేస్తాను. నన్ను అడగండి.'' బైబిల్ నుండి లూకా సువార్త 18:41-42వ వచనములలో, ఆ గ్రుడ్డివాడు యేసుకు మొరపెట్టినప్పుడు, ప్రభువు అతనిని పిలిచి ఇలా అడిగాడు, అంతట యేసు నిలిచి, వానిని తన యొద్దకు తీసికొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు, "ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా,'' వాడు, "ప్రభువా, చూపు పొందగోరుచున్నాననెను.'' నేడు ఆయన మిమ్మల్ని కూడా అదే ప్రశ్నను అడుగుచున్నాడు, "నేను మీ కోసం ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారు?'' వెంటనే, యేసు, "చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.'' అదేవిధంగా, నేడు మీరు ఆయనను అడిగినప్పుడు, ఆయన, 'మీరు ఆశీర్వాదము పొందుము' అని మీతో చెప్పును మరియు ఆయనే మీ కొరకు సమస్తమును చక్కగా జరిగించును.

బైబిల్ నుండి 1 రాజులు 3:5వ వచనములో చూచినట్లయితే, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు అన్నాడు, " నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమోదాని నడుగుమని దేవుడు అతనితో సెలవిచ్చెను.'' సొలొమోను జ్ఞానం కావాలని అడిగినప్పుడు, దేవుడు అతనికి జ్ఞానాన్ని మాత్రమే కాకుండా, బుద్ధి వివేకములు గల హృదయమును, ఐశ్వర్యమును ఘనతను మరియు ఇంకను సమస్తమును అనుగ్రహించాడు. అవును, నా ప్రియులారా, నేడు మీరు అడిగిన దానికంటే అత్యధికముగా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కనుకనే, అందునిమిత్తము, బైబిల్ నుండి మత్తయి 6:33వ వచనములో చూచినట్లయితే, మనము ఇటువంటి ఆశీర్వాదమును పొందుకోవాలని మనము ఏమి చేయాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడని మనము చూచినట్లయితే, "కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడు ను'' ప్రకారం ఆయన మిమ్మల్ని నీతిగా జీవించాలని తన యొద్ద అడగమని పిలుచుచున్నాడు. మరియు అలాగున చేయడం ద్వారా, ప్రతి ఆశీర్వాదం, ఆయన బహుమానముగా మీకు దయచేయుచున్నాడు. కాబట్టి, భయపడకండి. ప్రభువు స్వయంగా ఈ ఆశీర్వాదాన్ని ఈ రోజు మీకు కూడా అనుగ్రహించుచున్నాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ కోరికలను తీర్చి, మీకు సమస్తమును అనుగ్రహించి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా హృదయ కోరికలను తీర్చే మరియు నీ పరిపూర్ణ చిత్తం ప్రకారం ప్రతి ప్రణాళికను నెరవేర్చే దేవుడవని నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మా కోరికలను, మా ఆలోచనలను, మా ప్రణాళికలను నీ చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, నీ యొక్క ఉద్దేశ్యమునకు తగిన కోరికలను మాలో ఉంచుము మరియు నీ పరిపూర్ణ సమయంలో, నీ చిత్తమును నెరవేరుటకు మా పట్ల సమస్తము చక్కగా నియమించి యున్నావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, నీవు ఆ గుడ్డివానిని, 'నేను నీకేమి చేయ గోరుచున్నావని' అడిగినట్లుగానే, నేడు నీవు మమ్మును కూడా ఆలాగున అడిగి మా పట్ల అద్భుత కార్యములను జరిగించుము. యేసు ప్రభువా, ఆ గుడ్డి బిక్షగానివలె మేము కూడా ధైర్యంగా నీ నామంలో అడుగుచున్నాము, కనుకనే, మేము అడుగువాటన్నిటికంటెను మరియు ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా అనుగ్రహించుము. దేవా, మేము మొదట నీ రాజ్యాన్ని మరియు నీ నీతిని వెదకడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, మా యొక్క ప్రతి ఆశీర్వాదం నీవు తగిన కాలములో చక్కగా జరిగిస్తావనియు మరియు నీ మార్గంలో మమ్మును నడిపిస్తావనియు మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీవు మా కోసము సమస్తమును చక్కగా దాని కాలమందు అది చక్కగా ఉండునట్లుగా సమస్తము జరిగించుమని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.