నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాము. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోబు 5:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము ఈలాగున తెలియజేయుచున్నది, " ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును'' అని చెప్పబడిన ప్రకారము ఆయన మిమ్మును ఉన్నత స్థలములలో ఉంచుతాడు. దేవుడు ఎవరికి ఈ అవసరతను తీరుస్తాడు? అందుకే బైబిల్ నుండి యాకోబు 4:10వ వచనములో చూచినట్లయితే, "ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును'' అని చెప్పబడిన ప్రకారము మిమ్మును మీరు తగ్గించుకున్నట్లయితే, మీరు హెచ్చింపబడుదురు. 'తగ్గింపు' అనునది యేసుక్రీస్తులో ఉన్న ఒక గొప్ప లక్షణము. ఇంకను బైబిల్ నుండి జెకర్యా 9:9వ వచనములో చూచినట్లయితే, " సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, యేసు ప్రభువు ఇంతటి గొప్ప దీనత్వమును కలిగియున్నాడు. మనము కూడా ఆలాగుననే ఉండాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు భయపడకండి.
నా ప్రియులారా, బైబిల్ నుండి లూకా 14:11 మరియు లూకా 18:14వ వచనములలో మనము చూచినట్లయితే, "తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును'' అని చెప్పబడినట్లుగానే, మిమ్మును మీరు తగ్గించుకొన్నట్లయితే, నిశ్చయముగా మీరు హెచ్చింపబడుదురు. అందుకే బైబిల్ నుండి సామెతలు 15:33 మరియు 18:12వ వచనములను చూచినట్లయితే, "ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును'' అని చెప్పబడిన ప్రకారము ఘనతకు ముందు వినయముంటుంది. ఈ దైవీకమైన లక్షణమును మరియు తగ్గింపును మనము నేడు కలిగియున్నట్లయితే, నిశ్చయముగా ఘనత మనలను వెతుక్కుంటూ వస్తుంది. అవును, నా ప్రియులారా, మనలను మనము తగ్గించుకున్నప్పుడు, ప్రభువే మనలను ఘనపరుస్తాడు.
నా ప్రియులారా, ఈ రోజు వాగ్దానము ప్రకారము రెండవ భాగమును మనము చూచినట్లయితే, "దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును'' అని చెప్పబడినట్లుగానే, దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తుతాడు. ఇంకను బైబిల్ నుండి యోహాను 16:20వ వచనమును చూచినట్లయితే, " మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు నేడు మీ దుఃఖము ను సంతోషముగా మారుస్తాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ లోకములో అనేకమైన శోధనలు మరియు శ్రమలను మనము ఎదుర్కొనవలసి వస్తుంది. అయితే, మన నమ్మకమంతటిని ప్రభువు మీద ఉంచినప్పుడు, ఆయన అద్భుత కార్యములను మన జీవితములో జరిగిస్తాడు. అందుకే బైబిల్ నుండి 1 పేతురు 1:6,7వ వచనములలో మనము చూచినట్లయితే, " ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును'' అని తెలియజేసినట్లుగానే, నా ప్రియులారా, ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న శ్రమల వలన దుఃఖములో ఉండవచ్చును. అందుకు అనేక కారణములు ఉండవచ్చును. అయితే, వాటన్నిటి మధ్యలో మీరు ప్రభువు వైపు చూడండి, ఆయనను గట్టిగా హత్తుకొన్నప్పుడు, మీరు ఆయన యొద్ద నుండి దీవెనలన్నిటిని పొందుకుంటారు. ఈ లోకములోని శోధనలు, శ్రమలన్నిటి నుండి విడుదల పొందడానికి మనము ఆయన వైపు చూచి ప్రార్థించుకుందాము. అవును, నా ప్రియులారా, మీరు కూడా యేసుక్రీస్తు కలిగియున్న ఆ లక్షణమును కలిగియున్నప్పుడు, నిశ్చయముగా, మీ వినయమునకు తగిన ప్రతిఫలముగా మీకు ఘనత వస్తుంది. ఆలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా పరలోకమందున్న ప్రశస్తమైన ప్రియ తండ్రీ, నీ యొక్క అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనాలు. తండ్రీ, మా హృదయాలన్నిటిని నీవు ఎరిగియున్నావు. దేవా, మేము ఈ లోకములో ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నాము, మేము నీ సన్నిధిలో మొఱ్ఱపెట్టుటకు నీ నీ యొద్దకు వచ్చియున్నాము, మా ప్రార్థన విన్నపములను అంగీకరించి, మా శ్రమలు, శోధనలు మరియు మేము ఎదుర్కొంటున్న కష్టములన్నిటిని మా నుండి తొలగించుము. ప్రభువా, ఈరోజు మమ్మును మేము నీ యెదుట తగ్గించుకొని నీ హస్తములకు మమ్మును సమర్పించుకొనుచున్నాము. యేసయ్యా, మా విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు మెప్పును మహిమయు ఘనతయు కలుగజేయుటకు కారణముగా ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, దయచేసి మాకు వినయంతో నడవడం మరియు నీ మార్గములపై నమ్మకం ఉంచడం నేర్పించుము. ప్రభువా, మా బాధలు మరియు మేము మౌనముగా కార్చుచున్న కన్నీళ్లు గురించి నీకు తెలుసు. కనుకనే ప్రభువా, నీ వాగ్దానం ప్రకారం మా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, మా జీవితములో మేము ఎదుర్కొంటున్న ప్రతి పరీక్ష ద్వారా మా విశ్వాసాన్ని బలపరచి, నీ పరిపూర్ణ సమయంలో మమ్మును నీ వాగ్దానము ప్రకారము పైకి లేవనెత్తుతావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము నిన్ను మాత్రమే హత్తుకొని జీవించునట్లుగా, నీలో ఉన్న ఆ గొప్ప లక్షణమును మేము అంగీకరించి, నీ నామమునకు మహిమ కలుగునట్లుగా మాకు ఘనతను దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


