నా ప్రియమైనవారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 41:10 వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును'' అని చెప్పబడిన ప్రకారము అనేకసార్లు, ఈ వచనములో, "నేనే, నేనే చేస్తాను, నేనే నిన్ను ఎత్తుకుంటాను'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, ' నీవు భయపడనక్కరలేదు, నేను నీ కొరకు ఇక్కడ ఉన్నాను' అని చెబుతున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 23:4వ వచనములో దావీదు భక్తుడు ఈలాగున అంటున్నాడు, "గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును'' ప్రకారము ప్రభువు మనకు తోడుగా ఉన్నట్లయితే, మనకు విరోధియెవడు? కనుకనే, నా ప్రియులారా, ఏ హాని కూడ మనలను తాకజాలదు. అందుకే కీర్తనాకారుడైన దావీదు, 'ప్రభువు నాతో కూడా ఉన్నాడు గనుకనే, నేను భయపడను, మనుష్యులు నాకేమి చేయగలరు?' అని భక్తుడు అంటున్నాడు. కనుకనే, నా ప్రియులారా, మనము ఏ మనుష్యునికి కూడా భయపడనవసరము లేదు. ఎందుకనగా, మనకు విరోధముగా వచ్చు ఏ విషయమును గురించి మనము భయపడనక్కరలేదు. ఒకవేళ, 'గాఢాంధకారపు లోయలో మీరు నడిచినప్పటికిని, నీతియను నా దక్షిణ హస్తముతో నేను మిమ్మును పట్టుకుంటానని ప్రభువు అంటున్నాడు.' కనుకనే, మీరు దేనికి కూడా భయపడకండి, ధైర్యముగా ఉండండి.
ఆలాగుననే, చెన్నై పట్టణములో, పాడియనల్లూరులో నివసించుచున్న సహోదరులు ఎబినేజరుగారి యొక్క సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. అతనికి వివాహము జరిగి 17 సంవత్సరములైనవి. వివాహమునకంటె ముందుగా, అతడు అప్పుడప్పుడు త్రాగుచుండేవాడు. వివాహము జరిగిన 5 సంవత్సరముల తర్వాత, ఒకసారి భార్యభర్తల ఇద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ వచ్చినది. ఆ చిన్న గొడవ కాస్త చాలా పెద్ద గొడవగా మారి వారిద్దరు కూడా విడిపోయారు. అతడు ఆ యొక్క వేదనలో ఇంకా అధికముగా త్రాగడము మొదలు పెట్టాడు. ఒక్కొక్కసారి అతడు బాగా త్రాగి ఆ మత్తులో రోడ్లపైన పడిపోయేవాడు. ఆ అలవాటును బట్టి, అతడు తన ఉద్యోగమును కూడా పోగొట్టుకున్నాడు. అతని బంధువులందరు కూడా అతనిని ఇష్టపడకుండా, అతనిని దూరముగా పెట్టారు. తన సహోదరియైన మేరి మాత్రము అతనిని తన తల్లివలె అతని దగ్గర ఉండి తనను చూచుకొనేది. అయితే, చెన్నై పట్టణములో ఉన్న జె.సి. హౌస్ ప్రార్థన గోపురమునకు కూడా ఆమె అతనిని తీసుకొని వచ్చినది. అక్కడ ప్రార్థన యోధులు అతని కొరకు భారముతో ప్రార్థించినప్పుడు, అక్కడ ఎంతగానో ఆ ప్రార్థనల ద్వారా ఆదరించబడ్డాడు. అప్పటి నుండి తరచుగా అతడు ప్రార్థనా గోపురమునకు వచ్చుచుండెను. ఒకరోజు అతడు ధ్యానగదిలో ఎంతగానో తన పాపములను బట్టి విలపించుచుండెను, 'ప్రభువా, నా పాపములన్నిటిని క్షమించుము, ఈ చెడు అలవాట్లన్నిటిని నా నుండి తీసివేయుము. ఎలాగైన సరే, దీని నుండి నేను బయటపడడానికి దయచేసి, నాకు సహాయము చేయుము ' అని ప్రార్థించాడు. ఆలాగున రోజులు గడుస్తున్న కొలది, ప్రతి ఒక్కరు అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
కానీ, ప్రభువు అతనిని విడిచిపెట్టలేదు. అయితే, దేవుని యొక్క మారని ప్రేమ అతనిని తన యొక్క చెడు అలవాట్లలో నుండి పూర్తిగా విడిచిపించినది. ఆ త్రాగుడు అలవాటు నుండి అతడు బయటకు వచ్చాడు. ప్రభువు అతనిని పూర్తిగా స్వతంత్రునిగా మార్చియున్నాడు. 30 సంవత్సరముల మందు త్రాగే అలవాటు నుండి అద్భుతంగా ప్రభువు అతనిని విడుదల చేసి, స్వేచ్ఛను తిరిగి ఇచ్చియున్నాడు. అతని భార్య తిరిగి తన యొద్దకు వచ్చినది. వారిద్దరు ఏకముగా కలుసుకున్నారు. ఈ రోజు వారిద్దరు ఎంతో సంతోషమైన కుటుంబ జీవితమును గడుపుచున్నారు. రెండున్నర సంవత్సరములు గడిచిపోయాయి. 'ఈ రోజు నా యొక్క మందు త్రాగు అలవాట్లన్నిటి నుండి నేను విడుదల పొందుకున్నాను' అని అతడు సాక్ష్యము చెప్పాడు. అంతమాత్రమే కాదు, అతడు ప్రార్థన గోపురమునకు వచ్చి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, నేడు మీ పాపములను గురించిన నిందలలో మీరు ఉండిపోకండి. మీ పాపమును దాచిపెట్టకొనకుండా, ప్రభువు యొద్ద మీరు మీ పాపములను ఒప్పుకున్నట్లయితే, ఆయన కనికరముతో మీ పాపములన్నిటిని కూడా నిశ్చయముగా క్షమిస్తాడు. విచారించకండి, భయపడకండి. ప్రభువు వాటన్నిటి నుండి మీరు బయటకు రావడానికి మీకు సహాయము చేస్తాడు. కనుకనే, నేడు మీరు యేసయ్యను గట్టిగా హత్తుకొనండి, ఆయనను ఎల్లప్పుడు ప్రేమిస్తూ ఉండండి. యేసయ్య మాత్రమే మన నిరీక్షణయై యున్నాడు. యేసయ్యా, మాత్రమే మన భవిష్యత్తును, ఆయనను గట్టిగా హత్తుకొని ఉంటూ, ఆయన యొద్ద నుండి అద్భుతమును పొందుకొనండి. నేటి వాగ్దానము నుండి ఆయన మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవు మా పాపముల నుండి విడుదలను పొందుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, ముఖ్యముగా, మందు త్రాగుచున్న మా ప్రియులైనవారు మరియు మా కొరకు ప్రార్థించుచున్నాము. దేవా, ఈ చెడు అలవాట్లలలో ఉన్న మా ప్రియులైన ప్రతి ఒక్కరిని నీవు విడిపించుము. ప్రభువా, పై చెప్పబడిన సహోదరుని జీవితములో అద్భుతములు జరిగించినట్లుగానే, మాకును మరియు మా ప్రియులైన వారి చెడు అలవాట్ల నుండి విడిపించి, వారి పట్ల అద్భుతమును జరిగించుము. దేవా, మా దుఃఖమును తొలగించి, సంతోషకరమైన జీవితమును మాకు దయచేయుము. ప్రభువా, నేటి నుండి మాలోను మరియు మా ప్రియులైన వారి జీవితములో కూడా ఒక అద్భుతమును జరిగించుము. దేవా, ఎల్లప్పుడూ మాతో ఉన్నందుకు నీకు వందనాలు. ప్రభువా, మాలో భయం పెరిగినప్పుడు, మాకు సహాయం చేయడానికి నీవు మాతో ఉన్నావని మాకు గుర్తు చేయుము. దేవా, మేము బలహీనంగా ఉన్నప్పుడు నీవే మా బలం మరియు మేము పడిపోయినప్పుడు మాకు నిరీక్షణగా ఉండి, దయచేసి నీ నీతిమంతుడైన నీ దక్షిణ హస్తముతో మమ్మును ఆదుకొనుము. యేసయ్యా, మా పాపములన్నిటిని క్షమించి, మా హృదయాన్ని శుభ్రపరచుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి దుర్‌వ్యసనం మరియు నిరాశ యొక్క ప్రతి సంకెళ్లను బ్రద్ధలు చేయుము. దేవా, నీ సన్నిధిలో నిర్భయంగా నడవడానికి మాకు నేర్పుము. ప్రభువా, ఎన్నడూ ఓటమి ఎరుగని నీ శాశ్వతమైన కృపకు వందనాలు చెల్లించుచు యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


