నా ప్రియమైన స్నేహితులారా, నేడు బైబిల్ నుండి హోషేయ 14:4 అని చెప్పబడినట్లుగానే, ప్రభువు ఈ విధంగా వాగ్దానము చేయుచున్నాడు. ఆ వచనములో, "వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును'' అని చెప్పబడినట్లుగానే, మన దేవునికి అసాధ్యమైనదంటూ, ఏదియును లేదు. ఎటువంటి పరిస్థితులైనను సరే, మన దేవుడు వాటన్నిటిని తలక్రిందులుగా మార్చివేస్తాడు. ఆయన మీ యొక్క విశ్వాసఘాతకత్వమును మాన్పి, గుణపరచగలడు. ఈ లోకములో ఎవ్వరు పరిశుద్ధులు కారు. అందరును పాపము చేసి, దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకొని యున్నారు. అయితే, ఈ రోజు ప్రభువు మన విశ్వాసఘాతకత్వము నుండి మనలను గుణపరచబోవుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యెహెజ్కేలు 36:25వ వచనములో చూచినట్లయితే, " మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను'' అని చెప్పబడినట్లుగానే, ఆయన తానే స్వయంగా చేస్తాడని ప్రభువు అంటున్నాడు. నా ప్రియులారా, మీ పట్ల ఉన్న ప్రేమను బట్టి, ఆయన తానే సమస్తమును జరిగిస్తాడు. ఆయన మనలను చూచి, ' నేను మనస్ఫూర్తిగా ప్రేమించుచున్నాను' అని మొదటగా ప్రభువు సెలవిచ్చుచున్నాడు. తన గొప్ప ప్రేమను బట్టి, ఆయన మనలను కడిగి పరిశుద్ధపరుస్తాడు.
కనుకనే, నా ప్రియులారా, దావీదు వలె మీరు కూడా ఆయనకు ఈ విధంగా మొఱ్ఱపెట్టవలెను. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 51:7వ వచనములో చూచినట్లయితే, "నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము'' అని దావీదు అంటున్నాడు. ప్రతి ఒక్కరు ఈ విధంగా పరిశుద్ధపరచబడడము ఎంత అవసరము కదా! ఆలాగుననే, యేసుప్రభువు, శిష్యుల యొక్క పాదములను కడిగినప్పుడు, పేతురు యేసయ్యను ఈ విధంగా అడిగియున్నాడు," ప్రభువా, పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదనెను. అయితే, సీమోను పేతురు ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తల కూడ కడుగుమని ఆయనతో చెప్పెను.'' ఆలాగుననే, మనము పూర్తిగా పరిశుభ్రపరచబడవలెనని కోరుకుంటాము. ఇశ్రాయేలీయుల దేశములోని ప్రజలు ఆచారబద్ధమైన పరిశుభ్రపరచబడడాన్ని నమ్ముతారు. ఏదైనా గృహములో లేక మందిరములోనికి ప్రవేశించడానికంటె ముందుగా వారు తమ చేతులను ఎల్లప్పుడు పరిశుభ్రపరచుకుంటారు. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ కొరకు కూడా ఆలాగున చేయడానికి ఎంతో ఇష్టపడుచున్నాడు. ఆయన ఎంతగానో నమ్మదగినవాడు. అందుకే బైబిల్ నుండి 1 యోహాను 1:9వ వచనములో చూచినట్లయితే, " మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును '' అని చెప్పబడిన ప్రకారము ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధులనుగా చేస్తాడు. ఇంకను మన విశ్వాసఘాతకత్వము నుండి మనలను గుణపరచడానికి ప్రభువు ఎంతో నమ్మదగినవాడుగా ఉన్నాడు. అందుకే, "అంత్యదినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను'' అని ప్రభువు అంటున్నాడు. ఆలాగుననే, బైబిల్ నుండి దానియేలు 12:10వ వచనములో చూచినట్లయితే, " అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు'' అని చెప్పబడిన ప్రకారముగా, అంత్య దినములలో అనేకులు తమ్మును తాము శుద్ధిపరచుకొనెదరు. ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. అయితే, మరొక వైపు దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు. దుష్టులు ఎవ్వరు కూడా గ్రహింపలేకపోవుదురు. అయితే, బుద్ధిమంతులు గ్రహించెదరు అని దేవుని వాక్యములో చెప్పబడియున్నది. కనుకనే, మనము జ్ఞానము కలిగి దేవునిని క్షమాపణ కొరకు కోరాలి.
నేను నూతనంగా వివాహము చేసుకున్న తర్వాత, కారుణ్య విశ్వవిద్యాలయములో, కారుణ్య విద్యార్ధులు దీవింపబడాలి అనే ఉద్దేశముతో, యేసు పిలుచుచున్నాడు పరిచర్య శక్తి పరిచర్య కూడికలను ఏర్పాటు చేసింది. అనేకమంది ఆ శక్తి పరిచర్య కూడికకు హాజరయ్యారు. విశ్వాసఘాతకులైన పిల్లలు కూడా ఆ కూడికకు హాజరయ్యారు. ఆ విద్యార్ధులు ఆ దినములలో ఎంతగానో ఇబ్బందులు కలుగజేయుచు ఉండేవారు. కొందరు సమ్మెళ్లు చేయుచూ, వాటిలో పాల్గొంటూ ఉండేవారు. అయితే, ఆ శక్తి పరిచర్య సమయములో మా తండ్రిగారు మరియు మా భర్తగారు పరిచర్య చేయుచున్న సమయములో మరియు ప్రార్థన సమయములో, అనేకమంది విద్యార్ధులను ప్రభువు పరిశుద్ధాత్మతో నింపియున్నాడు. ఆ సమయములో ఇబ్బందులు కలుగజేయుచున్నటువంటి విద్యార్ధులపైన కూడా దేవుని శక్తి దిగివచ్చియున్నది. వారు దేవుని ఆత్మచేతతో నింపబడడము నేను చూస్తున్నప్పుడు, వారందరు కూడా బురద నీళ్లతో నిండియున్నటువంటి గుంటలోనికి త్రోయబడినట్లుగా పడిపోయి ఉన్నారు. వారు నిజంగా, ఆ బురద నీటిలో పొర్లాడుచూ ఉన్నారు. అయితే, వారందరు పరిశుద్ధాత్మ పూర్ణతతో సంతోషభరితులైయ్యారు. అప్పుడు ప్రభువు వారందరిని పరిశుద్ధాత్మ చేత పరిశుభ్రపరచుచున్నాడు అని నాకు అర్ధమైనది. నా ప్రియమైన వారలారా, నేడు మీకు కూడా అదే పరిస్థితి జరుగనై యున్నది. తన శక్తితో మిమ్మును పరిశుద్ధపరచబడవలెనని మీరు ఆయనకు కోరిప్పుడు, ఇప్పుడే అది జరుగనై యున్నది. కనుకనే, నేటి వాగ్దానము నుండి ఆయన మిమ్మును పరిశుద్ధపరచి, దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా బలహీనత సమయాలలో కూడా మమ్మును స్వతంత్రులనుగా చేయుటకు నీవు మమ్మును ప్రేమించినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, దయచేసి, మా యొక్క ప్రతి పాపం మరియు ప్రతి అపవిత్రత నుండి మమ్మును శుద్ధమైన జలములతో కడిగి శుభ్రపరచుము. దేవా, మా హృదయం నుండి ప్రతి విగ్రహాన్ని మరియు ప్రతి తప్పుడు కోరికను తొలగించి, నీ యొక్క పరిశుద్ధాత్మశక్తితో మమ్మును నింపి, మా జీవితాన్ని శుద్ధిపరచుము. ప్రభువా, నీ యొక్క మార్గములలో నడవడానికి మరియు నీవలె పవిత్రంగా ఉండటానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ యొక్క ప్రేమ మా విశ్వాసఘాతకత్వమును గుణపరచి, పూర్తిగా పునరుద్ధరించునట్లుగా చేయుము. ప్రభువా, ఇప్పుడే నీ శుద్ధి చేయు శక్తి మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, నీవు సమస్తమును జరిగిస్తావని వాగ్దానము చేసినట్లుగానే, ఇప్పుడే మమ్మును పరిశుద్ధులనుగా చేయము. యేసయ్యా, నీ పరిశుద్ధమైన రక్తము చేత, మమ్మును కడుగుము. దేవా, మనస్పూర్తిగా మమ్మును ప్రేమించినట్లుగానే, మాలో ఉన్న విశ్వాస ఘాత కత్వమును తొలగించి, మమ్మును ఆ స్వభావము నుండి గుణపరచుము. యేసయ్యా, మేము నిన్ను ప్రేమించుటకు మాకు శుద్ధమైన హృదయమును మాకు దయచేసి, మా పట్ల ఒక అద్భుతమును జరిగించుము. దేవా, మేము నీ యొద్దకు మరల వచ్చునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, మమ్మును హిమము వలె తెల్లగా మార్చి, మమ్మును పవిత్రంగా మార్చుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


