నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యాకోబు 1:17వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " శ్రేష్ఠమైన ప్రతియావియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు'' అని చెప్పబడినట్లుగానే, ఇది ఎంత చక్కటి వచనము కదా! ప్రభువు ఏదైనా వాగ్దానము చేసిన యెడల ఆయన నిశ్చయముగా దానిని జరిగిస్తాడు. మన దేవుడు ఒక మానవుడు కాదు. అందుకే బైబిలేమంటుందో చూడండి, "ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు,'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు అబద్దమాడుటకు ఆయన మానవుడు కాదు. ఆయన తన మనస్సును ఎన్నడును మార్చుకొనడు. అందుకే బైబిల్ నుండి సంఖ్యాకాండము 23:19వ వచనములో ఉన్న రీతిగా, "దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?'' అని చెప్పబడినట్లుగానే, యేసయ్యా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నటువంటి దేవుడై యున్నాడు. ప్రభువు ఏదైనా చేస్తాను అని చెప్పి వాగ్దానము చేసిన యెడల, ఆయన నిశ్చయముగా దానిని జరిగిస్తాడు. మనము ఆయనకు నమ్మకముగా ఉండకపోయినప్పటికిని కూడా, ఆయన మన యెడల ఎంతో నమ్మదగినవాడుగా ఉంటూ, అన్నిటిని నెరవేరుస్తాడు.

అందుకే బైబిల్ నుండి మత్తయి 5:48వ వచనములో చూచినట్లయితే, "మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన సంపూర్ణుడై ఉన్నట్లుగానే, ఆయన మనకు సంపూర్ణమైన వరములను అనుగ్రహిస్తాడు. నా ప్రియులారా, ఈ లోకమునకు పునాదులు వేయబడక మునుపే, మనకు ఇవ్వవలసిన వాటన్నిటిని ఆయన మనకంటె ముందుగానే ప్రణాళిక సిద్ధపరచియున్నాడు. ఆయన తన ప్రణాళికలను మార్చుకొనడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 40:5వ వచనములో దావీదు భక్తుడు ఈలాగున అంటున్నాడు, " యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మా యెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైన వాడొకడును లేడు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన యందు విశ్వాసముంచిన వారి యెడల ఆయన కృప ఎంతో విస్తారమై ఉంటున్నది. మన పట్ల దేవుని తలంపులు బహువిస్తారములై యున్నవి. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 31:19వ వచనములో చూచినట్లయితే, "నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు యెంతో గొప్పది నరుల యెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మన కొరకు అంత గొప్ప కార్యములను తలపెట్టియున్నాడు. ఏ కన్నులు కూడా వాటిని చూడలేవు. ఏ చెవులు కూడా వాటిని వినియుండలేవు. ఏ హృదయము కూడా వాటిని గ్రహింపజాలవు. కనుకనే, ఆయన యందు విశ్వాసముంచువారి యెడల మరియు ఆయనను ప్రేమించువారి యెడల ఆయన మంచితనము అంత గొప్పదై యున్నది. ఆయనను విశ్వసించువారి యెడల మరియు ఆయనను ప్రేమించువారి యెడల ఆయన కృప అంత అధికముగా విస్తరించుచున్నది. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 2:9వ వచనములో ఉన్నట్లుగానే, " ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.'' కనుకనే, మన పరిపూర్ణమైన దేవుడు ఔదార్యమును కలిగియుంటున్నాడు. మనమైతే, కేవలము మనుష్యులమై ఉంటున్నాము. మనము దేవుని యొద్ద నుండి తొలగిపోతూ ఉంటాము. అందుకే బైబిల్ 7:10,11వ వచనములలో చూచినట్లయితే, "మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యావుల నియ్య నెరిగి యుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యావుల నిచ్చును'' అని చెప్పినట్లుగానే, మన పిల్లలకు మంచి యీవులను ఇవ్వాలని మానవులముగా మనము ఎంతగా ఆశపడతామో కదా!

ఆలాగుననే, నా ప్రియులారా, ఒకసారి ఒక బిడ్డ జన్మించినట్లయితే, వారి కొరకు ఎన్నో ప్రణాళికలు చేస్తూ ఉంటాము. మనకు ఒకసారి ఒక బిడ్డ జన్మించినట్లయితే, ఆ బిడ్డకు ఇవ్వడానికి మనము ఎన్నో బహుమానములను ప్రణాళిక చేసి ఉంచుతాము. మనము మన ధనమును కూడా వారి కొరకు దాచిపెడతాము. ఇంకను కష్టపడి సంపాదించిన ధనమును కూడా వారికి ఇవ్వడానికి మనము దాచిపెడతాము. అయితే, అదేరీతిగా, పరిపూర్ణమైన వరములను ఇవ్వడానికి మన కొరకు మన పరలోకపు తండ్రి ఇంకా ఎంతగా ప్రణాళిక చేస్తాడు కదా.

మా కుమార్తె అయిన స్డెల్లా రమోలా, తన యొక్క చిన్నతనములో, తనకు నా యొద్ద ఏమైనా కావలెననగా, నా దగ్గరకు వచ్చి, 'మమ్మీమా' అని పిలుస్తూ ఉంటుంది. ఆమె ఆలాగున పిలిచిన వెంటనే, నా హృదయము కరిగిపోయేది. నేను వెంటనే, తన యొద్దకు పరుగెత్తుకొని వెళ్లి, 'నా కుమార్తె, నీకు ఏమి కావలెనని,' నేను అడుగుతాను. అదేవిధముగా మీరు కూడా మీ పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు కదా! 'అమ్మా, నాన్న' అని వారు పిలువగానే, వారికి మీరు ఎంతో మంచి యీవులను బహుమానముగా ఇస్తూ ఉంటారు కదా. ఆలాగుననే, మన పరలోకపు తండ్రి యొక్క హృదయము కూడా ఆలాగుననే ఉంటున్నది. కనుకనే, మీరు ఉన్నపాటున ప్రభువు యొద్దకు వెళ్లండి. మీరు ఏదో మంచివారు అని ప్రభువు యొద్ద నటించకండి. మీరు ఉన్నపాటుగానే, ప్రభువు చెంతకు వెళ్లండి. మిమ్మును గురించి, మీరు ఆర్భాటముగా ప్రదర్శించకండి. మీరు ఉన్నపాటుగానే, ప్రభువు చెంతకు వెళ్లండి. దేవుని సింహాసనమునొద్దకు ధైర్యముగా వెళ్లండి, 'నా ప్రభువు నాకు మంచి యీవులను మాత్రమే ఇస్తాడు' అని చెబుతూ వెళ్లండి. ప్రభువు ఎల్లవేళల మంచివాడై యున్నాడు. నా యొక్క మంచి విషయాలలోను మరియు చెడు విషయాలలో కూడా ప్రభువు ఎల్లప్పుడు నాకు మంచివాడై యున్నాడు అని చెబుతూ, ప్రభువు యొద్దకు మనము ధైర్యముగా వెళ్లినప్పుడు, ప్రభువు శ్రేష్టమైన పరిపూర్ణమైన మంచి యీవులను ఇంకను శ్రేష్టమైనవాటన్నిటిని మనకు ఇస్తాడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 10:12వ వచనములో చూచినట్లయితే, "యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థన చేయువారందరి యెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, పరలోకపు తండ్రికి మనము మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన బహు సమృద్ధిగా మనలను ఆశీర్వదిస్తాడు. కనుకనే, ప్రభువును మీ తండ్రిగా పిలువండి.

ఒకసారి ఒక దైవసేవకుడు ఉండేవాడు. అతనిని అందరు ప్రేమగా, 'మహిమగల సేవకుడు' అని పిలిచేవారు. అయితే, అతని కుమారుడు చావునంతగా రోగముతో బాధపడుచుండెను. కానీ, అతని భార్య కొన్ని మందులు కొనమని, అతనిని అడిగింది. అయితే, అతడు మందులు కొనడానికి వెళ్లుచున్నప్పుడు, అవసరతలో ఉన్న మరొక పేద వ్యక్తిని అతడు కలుకుసున్నాడు. అతనిని చూచిన వెంటనే, తన హృదయము కరిగిపోయినది. కనుకనే, తన యొద్ద ఉన్న డబ్బులన్నియు ఆ పేద పిల్లవానికి ఇచ్చాడు. కానీ, అనారోగ్యముతో ఉన్న తన కుమారుని తలంచుకుంటూ, యింటికి తిరిగి వెళ్లుచుండగా, తన గృహమును చేరుకొనగానే, తన భార్య ఆనందముతో గంతులు వేయుచూ, మన కుమారుడు బాగుపడెనని ఆనందముతో అతనికి తెలియజేసెను. ఇది ఎలా జరిగినది? అని ఆమె అతనిని అడిగినది. ఈ మహిగల ఆ సేవకుడు అప్పుడు ఆమెతో ఈలాగున చెప్పాడు, ' నేను యింటికి తిరిగి వస్తున్నప్పుడు, నేను కుమారుని గురించి ఎంతగానో ఆలోచిస్తూ, చింతించుచున్నప్పుడు, 'నేను మార్గము మధ్యలో, మోకరించి, తండ్రీ, తండ్రీ, నా కుమారుని స్వస్థపరచుము ' అని మొఱ్ఱపెట్టాను. నేను అంతకంటె ఏమియు చెప్పలేకపోయాను. నేను ఆలాగున చెప్పి లేచి, తిరిగి యింటికి వచ్చాను. ఈ మంచి కార్యము మరియు మేలును జరిగించినది ప్రభువే అయి ఉంటున్నది అని తన భార్యతో చెప్పాడు.

అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు తన ఐశ్వర్యము చొప్పున, క్రీస్తు యేసునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరమును తీర్చును, ఇంకను శ్రేష్ఠమైన ప్రతియావియు సంపూర్ణమైన ప్రతి వరమును, ఇచ్చే దేవుడు మన ప్రభువై ఉంటున్నాడు. నీతిమంతుల హృదయ వాంఛలను ప్రభువు నెరవేరుస్తాడు అని వాక్యము సెలవిచ్చినట్లుగానే, ఈ రోజు కూడా మీరు ఆయనకు మొఱ్ఱపెట్టండి, ప్రభువు మీకు శ్రేష్టమైన యీవులను అనుగ్రహించుచున్నాడని ఆయనకు వందనములు చెల్లించండి. నా ప్రియులారా, ఒకవేళ మీరు, వివాహము, ఉద్యోగము మరియు ఎన్నో అవసరతల కొరకు ఎంతో కాలము వేచియున్నారో, మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, నేడు దేవుని యొద్ద నుండి పరిపూర్ణమైన బహుమానము మీ యొద్దకు వచ్చుచున్నది. ఆయన మీకు అన్నిటిని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
మా ప్రియమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, ప్రతి మంచి మరియు పరిపూర్ణమైన వరములను ఇచ్చేవాడవు నీవే కాబట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవు మంచి యీవులనిచ్చు దేవుడవు కనుకనే, మేము అడుగు ప్రతి యీవియు కూడా పరలోకము నుండి నేడు నీవు మాకు అనుగ్రహించుము. దేవా, మాకు ఎన్నో అవసరతలు ఉన్నవి, కనుకనే, మా అవసరతలన్నిటిని తీర్చుము. తండ్రీ,మాకు కావలసిన మేలులను మరియు మంచితనమును నీవు సృష్టించి, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు నీ యొద్ద నుండి మాకు వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ బలమైన హస్తమును చాచి, మమ్మును ఈ రోజు దీవించుము. దేవా, నీ మంచితనము మా మీద కుమ్మరించుము. ప్రభువా, ఈ రోజు, మా అవసరతలన్నిటిని విశ్వాసంతో నీ ముందు ఉంచుచున్నాము. దేవా, నీ యొక్క పరిపూర్ణ చిత్తానుసారంగా మా హృదయ కోరికలను నెరవేర్చుము. ప్రభువా, ఎవరూ మూయలేని తలుపులను తెరువుము మరియు మా జీవితములో నీ ఆశీర్వాదములను కుమ్మరించుము. దేవా, స్వస్థత, వివాహం, పిల్లలు, ఉద్యోగం, పదోన్నతి, పునరుద్ధరణ లేదా గొప్ప విజయం కొరకు ఎదురుచూచుచున్న మమ్మును నీ కృపను పొందునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క విశ్వసనీయత మరియు మంచితనంపై నమ్మకం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా మీద మరియు మా కుటుంబము మీద నీ అపారమైన కృపను కుమ్మరించుము. ప్రభువా, నీ పరిపూర్ణమైన మంచి యీవులను మా జీవితములలో ప్రత్యక్షమై నీ నామానికి మహిమను తీసుకొని వచ్చునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.