నా ప్రియులారా, దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ చాలా అద్భుతమైనది. కనుకనే, ఆయన మిమ్మును ఎన్నడు కూడా విడువదు, ఎడబాయడు. ఆయన మిమ్మును అంతము వరకు ప్రేమించుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 15:9వ వచనమును మనము చూచినట్లయితే, యేసు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, "తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి'' అని చెప్పబడినట్లుగానే, యేసు శరీరధారియైన దేవుడు ఉన్నాడు గనుకనే, ఆయన మిమ్మును ప్రేమించుచున్నాడు. ఒకవేళ నా ప్రియులారా, మీ చుట్టూ ఉన్న సమస్యలను చూసి, దేవుడు, 'నన్ను ఇక ప్రేమించడం లేదు' అని ఎప్పుడూ అనకండి. అన్ని విషయాలు మేలు కొరకే జరుగుతాయి. ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు రేపు ఉండవు, కానీ దేవుని ప్రేమ నిన్న, నేడు మరియు రేపు కూడా మీతో కూడా నిలిచియుంటుంది. మీ దుఃఖములన్నిటిని ఆనందంగా మార్చేది ఆయన ప్రేమ మాత్రమే. కనుకనే, నా స్నేహితులారా, యేసు ప్రేమ యందు మీరు నమ్మకం ఉంచండి. మీపై ఉన్న ప్రేమ వలననే ఆయన సిలువ మీద బలిగా సమర్పించుకున్నాడు. అందుకే బైబిల్ నుండి గలతీయులకు 2:20వ వచనములో చూచినట్లయితే, "నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను '' అని భక్తుడు ఇలాగున తెలియజేసెను. ఆయన మిమ్మును ప్రేమించి, మీ పాపాలను, శాపాలను, రోగాలను, బాధలను తానే స్వయంగా భరించి, ఆయన చేసిన త్యాగం ద్వారా వాటన్నింటిని నాశనం చేసి, మీ కొరకు తనను తాను బలిగా అర్పించుకున్నాడు. తద్వారా, మీరు విడుదలను పొందడానికి, క్షమించబడటానికి, స్వస్థత పొందడానికి, ఐశ్వర్యం పొందడానికి మరియు చివరికి పరలోకంలోనికి ప్రవేశించడానికి ఆయన మార్గం సిద్ధపరచియున్నాడు.

నా ప్రియులారా, నేడు ఒకవేళ మీరు పాపులుగా ఉన్నప్పటికిని, ఆయన ప్రేమ ద్వారా మీ పాపములను క్షమించియున్నాడని బైబిల్ నుండి రోమీయులకు 5:8వ వచనములో చూచినట్లయితే,"అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను'' అని చెప్పబడినట్లుగానే, ఈ వచనములో ఆయన ప్రేమను మన పట్ల కనుపరచుచున్నది. మీ పాపముల నుండి యేసు వైపు మరలినప్పుడు, ఆయన మిమ్మును క్షమించి, మిమ్మును రూపాంతరపరచి, తన బిడ్డగా మార్చునట్లుగా చేయండి. అందుకే బైబిల్ నుండి యెషయా 53:5వ వచనములో చూచినట్లయితే, "మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, మీ అపరాధాలు తొలగిపోవడానికి, మీ అతిక్రమాలు క్షమించబడటానికి, మీకు సమాధానమును మరియు స్వస్థతను కలిగించడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. యేసు తన శిష్యుల పాదాలు కడగడం ద్వారా కూడా తన ప్రేమను వెల్లడిపరచియున్నాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 13:1వ వచనములో చూచినట్లయితే, "లోకములోనున్న తన వారిని ప్రేమించి, వారిని అంతము వరకు ప్రేమించెను'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మిమ్మును విడువకుండా ప్రేమించుచున్నాడు అని మరవకండి. కనుకనే, మీరు ఆయనను వెంబడించుచున్నప్పుడు, మీరు ఎదుర్కొంటున్న అవమానం, బాధ, ముళ్లు మరియు గాయాలను ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన వాటన్నింటిని మీ నుండి తుడిచివేసి, మీరు అవమానాన్ని ఎదుర్కొన్న అదే స్థలములో మీకు రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన ప్రేమ మీ జీవితములో పునరుత్థానమును తీసుకొని వచ్చుచున్నది. ఇంకను యేసు మార్త, మరియ, లాజరులను ప్రేమించాడు. లాజరు చనిపోయినప్పుడు, ఆయన ఏడ్చాడని మనము లేఖనములలో చూడగలము. ఆయన ఏడ్చుట మాత్రమే కాదు, లాజరును పేరు పెట్టి పిలిచాడు మరియు మృతులలో నుండి లేపాడు. ప్రేమ పునరుత్థానం కలిగించుచున్నది! ఆలాగుననే, నా ప్రియులారా, ఆయన మిమ్మును కూడా పునరుద్ధరింపజేస్తాడు.

అదే విధముగా, నా ప్రియులారా, నిత్యజీవమును కోరుకున్న ఆ యువకుడిని యేసు ప్రేమించాడు. చూడండి, బైబిల్‌లో మార్కు 10:21వ వచనములో మనము ఆ సంఘటనను చూడగలము, " యేసు అతని చూచి అతని ప్రేమించినీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను'' ప్రకారము యేసు అతనిని ప్రేమించాడు. పరలోకం కొరకు కోరిక కలిగియున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, యేసు కొరకు సమస్తమును విడిచిపెట్టిన వారికి నూరంతలు ప్రతిఫలం మరియు నిత్యజీవితం లభిస్తాయని బైబిల్ నుండి మత్తయి 19:29వ వచనములో వాగ్దానమును చేయబడుచున్నది. అదే నేడు మిమ్మును పరలోకానికి చేర్చగల దేవుని ప్రేమయై యున్నది. ఇంకను ఆయన ప్రేమ మనకు స్వస్థతను కూడా తీసుకొనివస్తుంది. యేసు జనసమూహాన్ని కాపరి లేని గొర్రెల వలె చూసినప్పుడు, ప్రేమతో చలించిపోయి వారందరిని స్వస్థపరిచాడు. చివరగా, ఆయన ప్రేమ మీ శత్రువులను ప్రేమించడం మీకు నేర్పించుచున్నది. అసూయ మరియు దుష్టత్వం నిండిన ఈ లోకంలో, ప్రేమించడం, క్షమించడం మరియు మేలు చేయడం ద్వారా యేసు మిమ్మును అన్నిటికంటె అత్యధికమైన విజయవంతులనుగా నిలబెడతాడు, సరిగ్గా ఆయన సిలువపై ప్రార్థించినట్లుగా, 'తండ్రీ, వీరిని క్షమించు' అని చెప్పిన యేసు యొక్క ఈ ప్రేమలోనే మీరు నిలిచి ఉండండి. ఆయన ప్రేమను ఆనందించండి. నా స్నేహితులారా, యేసు మిమ్మును ప్రేమించుచున్నాడు గనుకనే, మీరు అటువంటి ప్రేమను పొందుకోవాలనగా, మీరు మీ హృదయాలను యేసుకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, ఆయన తన ప్రేమను మీ హృదయములో కుమ్మరించి, ఆయన తన ప్రేమ ద్వారా మీలో నిలిచియుంటాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమామయుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసు ప్రభువా, నీవు అంతము వరకు మమ్మును ప్రేమించుచున్నావని మా పట్ల నీవు వాగ్దానం చేసినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. యేసయ్యా, సిలువకు, నీ క్షమాపణకు, నీ స్వస్థతకు మరియు నీవు చేసిన త్యాగం వలన మేము పొందిన విడుదలకై నీకు వందనములు. యేసయ్యా, నీవు త్యాగము చేసినట్లుగానే, మేము మా జీవితాలను నీకు సమర్పించుకొనుటకు నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, ఇప్పుడు కూడా, నీ పరిపూర్ణ ప్రేమతో మమ్మును ఆవరించి, మా హృదయం నుండి ప్రతి దుఃఖాన్ని మరియు భయాన్ని మరియు అవమానమును తొలగించుము. దేవా, నీ యొక్క అపారమైన కృపతో మా జీవితంలోని మృతమైన ప్రతిదానిని నీ యొక్క ప్రేమ ద్వారా మరల పునరుత్థానం చేయుము. యేసయ్యా, నీ వలె మేము ఇతరులను ప్రేమించడం మరియు క్షమించడం మాకు నేర్పించుము. ప్రభువా, మేము నిన్ను పరిపూర్ణముగా వెంబడించునట్లుగాను, ఇంకను ఎల్లప్పుడు మేము నీ ప్రేమలో నిలిచియుండునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.