నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 49:15 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను'' అని చెప్పబడినట్లుగానే, నా స్నేహితులారా, ప్రభువు ఎన్నడును మిమ్మును మరచిపోడు. ఒక తల్లి తన బిడ్డను మరచిపోయినప్పటికిని ప్రభువు మిమ్మును ఎన్నడును మరచిపోడు. ప్రభువు నుండి ఎంతటి ఓదార్పునిచ్చే వాగ్దానము కదా! తల్లి ప్రేమ అత్యంత శక్తివంతమైన ప్రేమ స్వరూపములలో ఒకటిగా పరిగణించ బడుతుంది. అయినప్పటికిని, ఒక తల్లి తన బిడ్డను మరచిపోయినప్పటికిని, తాను మాత్రం తన బిడ్డలను ఆయన ఎన్నటికిని మరచిపోడని మనకు సెలవిచ్చుచున్నాడు. ఎటువంటి మానవుని ప్రేమకన్నా దేవుని ప్రేమ మిన్నయైనది, అది లోతైనది మరియు ఎంతో నమ్మదగినది. కనుకనే, మీరు చింతించకండి.

వార్తలలో నేను ఒక సంఘటనను గురించి చూశాను. అదేమనగా, ఒక తల్లి తన రెండేళ్ల కుమారునితో కలిసి ఒక క్యాబ్‌లో ప్రయాణము చేసియుండెను. ఆమె తన గమ్యమును చేరుకున్నప్పుడు తన క్యాబ్‌లో నుండి బయటకు వచ్చినది. ఆ క్యాబ్‌లో వేరొక ప్రయాణికులు ఎక్కి కూర్చున్నారు. తదుపరి రైడ్ కూడా మొదలైపోయినది. ఆకస్మాత్తుగా ఆ క్యాబ్ డ్రైవరుకు ఒక కాల్ వచ్చినది. నీవు క్యాబ్ డ్రైవరా? అని ఫోన్‌లో ఉన్న వ్యక్తి అతనిని అడిగెను. అందుకు అతడు అవును, నేనే అని జవాబిచ్చాడు. వెంటనే ఆమె, నేను ఇంతకుముందుగానే, నీ యొక్క క్యాబ్‌లో ప్రయాణించాను. వెనకాల సీటులో రెండేళ్ల చిన్న బిడ్డ ఉన్నదా? అని ఆ వ్యక్తి అడిగింది. వెంటనే, ఆ బిడ్డకు ప్రక్కన కూర్చున పయనించుచున్న ఆ వ్యక్తి, ఇదిగో ఈ బిడ్డ ఇక్కడ ఉన్నదని చెప్పాడు. దయచేసి, ఆ బిడ్డను మరల నా యొద్దకు తీసుకొని వచ్చి, ఇవ్వండి అని చెప్పెను. అవును, నా ప్రియ స్నేహితులారా, ఒక తల్లి తన బిడ్డను మరచిపోవచ్చును. కారణము, మదిలో అనేక విషయములను గురించి ఆలోచిస్తూ, చేయవలసిన విషయములు ఎన్నో ఉన్నవని ఆలోచిస్తూ, మన స్వంత బిడ్డలను కూడా మనము మరచిపోవచ్చును. కానీ, దేవుడు తన బిడ్డలను ఎన్నడు కూడా మరచిపోడు. అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు తన అరచేతులలోనే మిమ్మును చెక్కుకొనియున్నాడు. ఆయన మిమ్మును ఎల్లప్పుడు దృష్టించుచున్నాడు. ఆయనకు మీ యొక్క ప్రతి అవసరత కూడా తెలుసు. మీరు ఎక్కడకు వెళ్లుచున్నారో ఆయనకు తెలుసు. మీ ప్రతి అడుగు కూడా ఆయనకు తెలుసు. కనుకనే, ఆయన మీకు అన్నిటిని సమకూర్చుస్తాడు. ధైర్యముగా ఉండండి.

కాబట్టి, నా ప్రియులారా, బహుశా! ఈ రోజు మీరు ఒంటరిగా, తృణీకరించబడినట్లుగా, బాధలు అనుభవించునట్లుగాను, లేదా ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేదని భావిస్తూ ఉండవచ్చును. మీ బాధ ఎవరికీ తెలియదని, మీ పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోలేరని మీరు అనుకోవచ్చును. కానీ ప్రభువుకు సమస్తమును తెలుసు. ఆయన ప్రతి కన్నీటిని చూస్తున్నాడు, మీ యొక్క ప్రతి ప్రార్థనను వింటాడు, మరియు మీరు మోయుచున్న ప్రతి భారమును అర్థం చేసుకుంటాడు. కాబట్టి, ఈ రోజు యేసును ఆశ్రయించండి. ప్రేమగలిగిన తల్లిదండ్రులు తమ బిడ్డను ఆదరించినట్లుగా ఆయన మిమ్మును కూడా ఆదరిస్తాడు. మీ బలహీనతలో ఆయన మిమ్మును బలపరుస్తాడు, మీ సవాళ్లలో మిమ్మును నడిపిస్తాడు మరియు మీ అవసరతన్నింటిని తీరుస్తాడు. మీరు ఆయనకు ఎంతో అమూల్యమైనవారు మరియు ఆయన మిమ్మును ఎన్నటికిని విడువడు, మరువడు. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు ధైర్యం తెచ్చుకోండి. మిమ్మును సృష్టించిన దేవుడు మిమ్మల్ని గుర్తుంచుకుంటా డు, మీ పట్ల శ్రద్ధ వహిస్తాడు మరియు జీవితంలోని ప్రతి దశలో మీతో కూడా నడుస్తా డు. కనుకనే , మీరు మన ప్ర«భువైన యేసు మీద ఆధారపడండి, ఆయన మీకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహిస్తాడు. ఏలాగనగా, ఒక తల్లి తన బిడ్డలను ఆదరించినట్లుగా ఆయన మిమ్మును ఆదరిస్తాడు. ఆయన మిమ్మును తనకు సమీపముగా హత్తుకుంటాడు. ఆపత్కాలములో ఆయన ఎల్లప్పుడు మీకు తోడుగా నిలుస్తాడు. కాబట్టి, భయపడకండి. నా ప్రియ స్నేహితులారా, ధైర్యము వహించండి. ఈ వాగ్దానమును బట్టి, ఆయనకు వందనములు చెల్లించుచూ ప్రార్థించండి. నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు ఎల్లప్పుడు, మా పట్ల దృష్టిని ఉంచినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు ఎల్లప్పుడు, మమ్మును గురించి పట్టించుకున్నందుకై నీకు వందనములు. ప్రభువా, మా జీవితంపై నీవు చూపుచున్న నిరంతర ప్రేమకు, స్థిరమైన శ్రద్ధకు నీకు వందనములు. దేవా, మేము ఒంటరిగా, తృణీకరించబడినట్లుగాను లేదా నిరుత్సాహంగా ఉన్నట్లుగా భావించినప్పుడు, నీవు ఎల్లప్పుడూ మాతో ఉంటావని, మమ్మును ఎన్నడూ విడిచిపెట్టవని మాకు గుర్తుచేసినందుకై నీకు వందనములు. ప్రభువా, మా యొక్క ప్రతి బాధకరమైన సమయంలో మా హృదయమును ఆదరించి, మేము బలహీనంగా భావించినప్పుడు మా విశ్వాసమును బలపరచుము. దేవా, నీ పరిపూర్ణమైన చిత్తం మరియు సమయం ప్రకారం మా జీవితంలోని ప్రతి అవసరాన్ని తీర్చుము. ప్రభువా, మేము అనుదినము నీ సన్నిధిని నమ్మడానికి, భయం లేదా సందేహము లేకుండా నీ శాశ్వతమైన ప్రేమలో విశ్రమించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీవు ఎల్లప్పుడు మాతో ఉంటూ, మమ్మును ఎన్నడూ విడిచిపెట్టవని మేము నమ్ముచున్నాము. దేవా, ఈ రోజు ఎవ్వరు లేకుండా ఒంటరిగా ఉన్న మమ్మును నీవు తల్లివలె ఆదరించుము. ప్రభువా, మా జీవితములో మేము విరిగిపోయిన స్థితిలోను, బాధగా ఉంటూ, ఎవ్వరు మమ్మును పట్టించుకోకపోయినను, నీవు మమ్మును ఆదరించుచున్నందుకై నీకు వందనములు. ప్రభువా, మా సమస్యలను పట్టించుకొనువారు లేకపోయినను నీవు మమ్మును ఒక తల్లివలె హత్తుకొని ఆదరించుము. దేవా, మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను చూచి, నీ ఆదరణను మరియు సమాధానమును మాకు దయచేయుము. ప్రభువా, ఈ లోకములో ఎవ్వరు మరచినను, నీవు మమ్మును మరచిపోకుండా, తల్లివలె నీవు మమ్మును ఆదరించుమని యేసుక్రీస్తు అత్యంత ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.