నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. అందుకే ప్రభువు తన బలమైన హస్తమును మీ మీద ఉంచి, మిమ్మును ఆశీర్వదించును గాక. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హెబ్రీయులకు 13:6వ వచనము తీసుకొనబడియున్నది. ఆ వచనము, "కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమైయున్నాము'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీకు సహాయకుడుగా ఉన్నాడు గనుకనే మీరు దేనికిని భయపడకూడదు. ఇది ఎంత ధన్యకరమైన జీవితము కదా! నా స్నేహితులారా, మీరు ఎల్లప్పుడు ప్రభువును మీకు సహాయకుడుగా కలిగి ఉండాలి. అందుకే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు కదా! "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.'' అవును, ప్రియులారా, నేడు మీ అనుభవము కూడా అదే అయి ఉండాలి. అంతమాత్రమే కాదు, ప్రభువు మీతో కూడా నివసించాలి. ఆయన ఎల్లవేళల మీకు సహాయకుడుగా ఉండాలి. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 28:7వ వచనములో చూచినట్లయితే, "యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను'' అని చెప్పబడినట్లుగానే, మనము కీర్తనలతో దేవునిని స్తుతించాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 9:1వ వచనములో చూచినట్లయితే, "నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను'' అని చెప్పబడినట్లుగానే, దావీదు తన పూర్ణ హృదయముతో నిన్ను కీర్తించెదను అని అంటున్నాడు. అవును, దావీదు వలె మనము కూడా దేవునిని నిత్యము కీర్తించవలెను.

కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, బైబిల్ నుండి కీర్తనలు 103:1-2వ వచనములను మనము చూచినట్లయితే, "నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము'' అని మనము చదివినట్లుగానే, దేవుడు చేసిన ఉపకారములలో మనము దేనిని కూడా మరవకుండా ఆయనను స్తుతించాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. కాబట్టి, ప్రియ స్నేహితులారా, ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 33:1వ వచనములో చూచినట్లయితే, "నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము'' అని చెప్పబడినట్లుగానే, మనము ఏమి చేయాలనగా, ప్రభువునందు మనము ఆనందించాలి. అంతమాత్రమే కాదు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరముగా ఉంటున్నది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 40:3వ వచనములో చూచినట్లయితే, "తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు'' అని చెప్పబడినట్లుగానే, మన నోట ఎల్లప్పుడు స్తోత్రరూపమగు క్రొత్త గీతము ఉండవలెనని ప్రభువు మన పట్ల ఎదురు చూచుచున్నాడు. అవును, మనలను చూచి అనేకులు దేవుని యందు నమ్మికయుంచునట్లుగానే, ఎల్లప్పుడు ఆయనను స్తుతించవలెను. హల్లెలూయా! మనము దేవుని వాక్యమును చదివినప్పుడు అది ఎంత అద్భుతకరముగా ఉంటుంది కదా! తద్వారా, నా ప్రియులారా, మధురమైన రక్షకుని యొక్క అద్భుత సన్నిధానమును మీరు కూడా అనుభవించునట్లుగా ఆయన మిమ్మును మారుస్తాడు. కొన్నిసార్లు నేను ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువు పాదముల చెంత మోకరించి, ఆయనను స్తుతించుచూ, ఆయన యందు ఆనందిస్తూ ఉంటాను.

నా ప్రియ స్నేహితులారా, నేడు మీ జీవితములో ఇటువంటి అనుభవమును కలిగియున్నారా? ప్రభువుతో సమయమును గడపాలి అని ఇప్పుడే మీరు ఒక నిర్ణయమును తీసుకొనండి. ఆయన వాక్యమును చదువుచూ, ఆయన సన్నిధిలో ఆనందించవలెను. నా ప్రియులారా, ఈ రోజు నుండి ప్రభువు మిమ్మును అటువంటి అనుభవములతో నింపి, ఆశీర్వదించును గాక. మనము కలిసి ప్రార్థించుకుందాము. నేడు నా ప్రియులారా, మీరు కూడా దేవుని వాక్యమును అనుదినము చదువుచూ, ఆయన మీ పట్ల చేసిన అద్భుతమైన కార్యములను బట్టి స్తుతించినట్లయితే, నిశ్చయముగా, మీ స్తుతులను ఆయన శోభస్కరముగా మార్చి, దేనికిని మీరు భయపడకుండా మిమ్మును మార్చి, మీకు నిత్యము సహాయకుడుగా ఉండి, మీ గృహములను ఆనందముతో నింపుతాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన ప్రేమగల తండ్రీ, నీ యొక్క అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనములు. దేవా, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మేము అనుదినము నీ వాక్యమును చదువుచూ, పరిశుద్ధాత్మయందలి ఆనందములో ఉన్నటువంటి అద్భుతమైన అనుభూతిని నేడు నీవు మాకు అనుగ్రహించుము. దేవా, మా గృహములు ఎల్లప్పుడు నీ యొక్క ఆనందమును కలిగియుండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా కలుగు ఆనందమును అనుభవించునట్లుగాను, నిన్ను మా సహాయకునిగాను, కెడెముగాను, డాలుగా ఉంచుకొనునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా హృదయాలు ఎల్లప్పుడూ నీయందు ఆనందించునట్లుగాను, మా గృహములు నీ సన్నిధిలో ఆనందంతో, స్తుతులతో నిండియుండునట్లుగా చేయుము. ప్రభువా, నీవు మా జీవితములో చేసిన ఉపకారములన్నిటిని ఎన్నటికిని మరువకుండా, మా పూర్ణ హృదయంతో నీ పరిశుద్ధ నామమును నిత్యము స్తుతించుటకు కృపను దయచేయుము. దేవా, అనేకులు నీ యందు భయభక్తులతోను, నీ యందు నమ్మికయుంచునట్లుగా నీవు మా నోట స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును ఉంచుము. తండ్రీ, మాలో ప్రతి ఒక్కరితో ఉండి, ప్రతిదినము నీ మధురమైన సన్నిధి ఆనందముతో మమ్మును నింపి, ఆశీర్వదించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.