హలో నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దాన సందేశము ద్వారా మిమ్మును కలుసుకోవడము నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. ప్రియులారా, ఈనాడు మీ జీవితమంతయు దుఃఖముతో నిండి ఉన్నదా? మరియు మీరు ఎక్కడికి వెళ్ళినను, జీవితంలో మీరు ఓటమిలను ఎదుర్కొంటున్నారు అని అనుకుంటున్నారా? వైద్యులు కూడా చేతులెత్తేసినంత తీవ్రమైన అనారోగ్యంతోను, వ్యాధులతోను మీరు బాధపడుచున్నారా? అవును, మీ దుఃఖమంతటిని తన ఆనందంతో కప్పుతానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మనము ఈ లోకంలో జీవించుచున్నప్పుడు, దుఃఖము మరియు కష్టాలు తప్పక ఎదురవుతుంటాయి. ప్రతి విశ్వాసి కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంటారు. అయితే, కష్టకాలములో సైతం తన సంతోషంతోనూ, తన సమాధానముతోనూ మిమ్మును నింపుతానని ప్రభువు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అవును, నా ప్రియులారా, దేవుడు అనుగ్రహించుచున్న తన యొక్క గొప్ప సమాధానము ఈనాడు మిమ్మును నింపబోవుచున్నది. కనుకనే, మీరు ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించండి.
అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా గ్రంథం 35:10వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో చూచినట్లయితే, " వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును'' అని చెప్పబడినట్లుగానే, నేడు మీ జీవితంలో ఎన్నో దుఃఖములను మీరు ఎదుర్కొంటున్నప్పటికిని, ఈ రోజు ప్రభువు ఆనందం మీ జీవితమును నింపబోవుచున్నది. అవును, నా ప్రియులారా, ఈ లోకంలో మనము మోయవలసిన ఒక సిలువ ఉన్నది. ఆ భారములను, త్యాగములను, మీరు కార్చిన కన్నీటిని ప్రభువు తుడిచివేసి, మిమ్మును ఆనంద సంతోషములతో నింపుతాడు. మనము బైబిల్‌లో భక్తుడైన యోబు జీవితమును గుర్తుచేసుకుందాము. యోబు ఒక నమ్మకమైన వ్యక్తి; అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అయినప్పటికిని, ఆయన తన కుటుంబమును, ఆరోగ్యమును, చివరకు తన స్నేహితుల సహాయమును కూడా కోల్పోయి, ఎన్నో విధములుగా కష్టములను మరియు బాధలను, వ్యాధులను ఎదుర్కొన్నాడు. కానీ, యోబు దేవుని విడిచిపెట్టకుండా, ఆయన యందు నమ్మకముగా ఉన్నందున తాను కోల్పోయిన వాటన్నిటిని తిరిగి దేవుని యొద్ద నుండి రెండంతలుగా పొందుకున్నాడు.
అవును, నా ప్రియులారా, ఈనాడు, మీరు కూడా అలాగే తలంచుచూ, ' ప్రభువా, నేను నమ్ముకున్న వారందరూ నన్ను విడిచిపెట్టి, నన్ను నిరాశకు గురి చేశారు. తద్వారా, నా జీవితం దుఃఖముతో నిండిపోయినది,' అని చెప్పవచ్చును. అయితే, ఆయన తన యొక్క ఆనంద సంతోషము ఈనాడు మిమ్మును నింపుతుందని ప్రభువు మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, మీ బాధలలో ఆయన మిమ్మును ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన మీ దుఃఖమును సంతోషముగాను, మీ నిట్టూర్పులను సమాధానముతో సరిసమముగా చేస్తాడు. కనుకనే, నా ప్రియులారా, ఈనాడు ఈ వాగ్దానమును విశ్వసించి, ఆయన ఆనంద సంతోషములను మన జీవితములలోనికి అంగీకరించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ జీవితములో ఉన్న దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవునట్లుగా చేసి, మీ తలల మీద నిత్యానందముండునట్లుగా, మిమ్మును ఆయన తన ఆనంద సంతోషములు గలవారినిగా చేసి, నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమామయుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా జీవితంలోని ప్రతి దుఃఖమును, ప్రతి కన్నీటిని, మరియు ప్రతి భారమును నీవు చూచి, మా నుండి వాటన్నిటిని తొలగించి, నిత్యానందము మా తలల మీద ఉండునట్లుగా చేయుము. దేవా, మేము బలహీనంగా మరియు కష్టాలతో చుట్టుముట్టబడినట్లు భావించినప్పుడు, నీ సమాధానముతో మమ్మును నింపుము. ప్రభువా, మా దుఃఖమును నీ సంతోషంతో మరియు మా నిట్టూర్పును ఆనందంతో భర్తీ చేయుము. దేవా, మాకు మార్గం కనిపించనప్పుడు కూడా నీ వాగ్దానములను మేము విశ్వసించడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, గుండె చెదరిన మమ్మును మరియు విరిగిన మా హృదయమును నీవు స్వస్థపరచి, మేము కోల్పోయిన వాటన్నిటిని తిరిగి మాకు అనుగ్రహించుము. దేవా, మా భారములన్నిటిని మోయుటకును, వాటిని సహించుటకు మాకు బలమును అనుగ్రహించుము. ప్రభువా, నీ ఆనంద సంతోషములు మమ్మును ఆవరించి, అవి మా జీవితములో పొంగి ప్రవహించునట్లుగా చేయుము. దేవా, నీ నుండి మంచి రోజులు వస్తాయని మేము ఎదురుచూస్తూ, నీ యందు నమ్మిక కలిగి జీవించునట్లుగా మాకు నీ కృపను దయచేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


