నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 119:105వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది'' అని చెప్పబడిన ప్రకారముగా దేవుని వాక్యము మన పాదములకు మరియు మన జీవితములకు వెలుగునిస్తుంది. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 3:16వ వచనములో చూచినట్లయితే, " సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి'' అని చెప్పబడిన ప్రకారము నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును చదవడానికి ఎంత సమయమును ఇచ్చుచున్నారు? అని మిమ్మును మీరు పరీక్షించుకొనండి. నా ప్రియులారా, దేవుని వాక్యమును చదవడము మాత్రమే కాదు, మీరు ప్రతిరోజు దానిని ధ్యానము చేయాలి. కనుకనే, బైబిల్ నుండి యోహాను 14:23వ వచనములో చూచినట్లయితే, "యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము'' అని చెప్పబడిన ప్రకారము ఆయన వాక్యమును మనము ధ్యానించినప్పుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు యేసు ప్రభువు మనతో కూడా వచ్చి నివసిస్తాడు. మనతో కూడా నివసించడము అది ఎంత గొప్ప విషయము కదా!

నా ప్రియులారా, దేవుని వాక్యమును మీరు ఎంత అధికముగా చదువుతారో, మీరు అంత అధికమైన రీతిలో ఆయన సన్నిధానమును అనుభవిస్తారు. అం దుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 6:7,10వ వచనములలో చూచినట్లయితే, "సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలమువలనను కుడి యెడమల నీతి ఆయుధములు కలిగి, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తము ను కలిగినవారము'' అని చెప్పబడినట్లుగానే, దేవుని వాక్యమును చదివినప్పుడు, మీరు సంతోషించగలరు. నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమునకు ఎంతో శక్తిని ఉన్నది. దేవుని వాక్యమును చదువుటలో నిర్లక్ష్యముగా ఉండకండి. ప్రతి రోజు మరియు ప్రతి ఉదయమున కూడా మీరు ఎంత వీలైతే, అంత అధికముగా సమయమును వెచ్చించి, దేవుని వాక్యమును చదవాలి మరియు భుజించాలి. అందువలన, మీరు అనేకమైన దీవెనలను పొందుకుంటారు.

బైబిల్ నుండి యోహాను 16:24వ వచనములో చూచినట్లయితే, " ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును'' అని చెప్పబడినట్లుగానే, దేవుని వాక్యమును చదవడము మాత్రమే కాదు గానీ, మీరు చదివినటువంటి విషయములన్నిటిని కూడా, ' ప్రభువా, నాకు అనుగ్రహించుము' అని మీరు అడిగి పొందుకోవాలి. అందుకే, ప్రభువు, "మీ సంతోషము పరిపూర్ణమగు నట్లు అడుగుడి, మీకు దొరకును'' అని మీకు వాగ్దానమును ఇచ్చుచున్నాడు. ఇంకను బైబిల్ నుండి లూకా 11:13వ వచనములో చూచినట్లయితే, " కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యావులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను'' అని చెప్పబడిన ప్రకారముగా ఇంకా ఎటువంటి ఆశీర్వాదములను పొందుకుంటారో మనము చదువుగలుగుతాము.కనుకనే, పైన చెప్పబడినట్లుగానే, మీరు దేవుని వాక్యమును చదివినప్పుడు, ఈ ఆశీర్వాదములన్నియు కూడా మీకు వస్తాయి నా ప్రియ దేవుని బిడ్డలారా. కనుకనే, ప్రతి రోజు మనము ఈలాగున చేయుటకు మన జీవితములను సమర్పించుకుందామా? హల్లెలూయా! నా ప్రియులారా, దేవుని వాక్యమును అనుదినము చదివి, ధ్యానించినట్లయితే, నిశ్చయముగా, ఆయన వాక్యము మీ పాదములకు దీపముగాను, మీ త్రోవకు వెలుగుగాను ఉండి, నేటి వాగ్దానము నుండి ప్రభువు మిమ్మును సరియైన మార్గములో నడిపించి, ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు.దేవా, నీ వాక్యమును చదువుట మాకు గొప్ప ధన్యత. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. దేవా, మేము నీ వాక్యమును చులకనగా తలంచి నిర్లక్ష్యపరచకుండా చేయుము. ప్రభువా, అనుదినము మేము నీ యందు భయభక్తులు కలిగి, దేవుని వాక్యమును చదువునట్లుగాను, ఆ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడుము. దేవా, వేదనలలో ఉన్న మాకు నీ వాక్యము ద్వారా విడుదలనిచ్చి, సంతోషముతో మమ్మును నింపుము. యేసు ప్రభువా, మేము విధేయతతోను మరియు కృతజ్ఞతగల హృదయంతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, మా జీవితాన్ని నడిపించడానికి నీ విలువైన వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. ప్రభువా, ప్రతిరోజూ నీ వాక్యాన్ని చదవడానికి మరియు ధ్యానించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ వాక్యం మాలో సమృద్ధిగా మరియు సమస్త జ్ఞానంతో నివసించునట్లుగా చేయుమము. యేసయ్యా, మా హృదయాన్ని నీ సత్యంతోను నింపుము మరియు నీ వాక్యము ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయుము. దేవా, విశ్వాసంతో మరియు నీ వాగ్దానాలపై నమ్మకంతో నిన్ను అడగడానికి మాకు నేర్పుము. యేసయ్యా, మా పూర్ణ హృదయంతో మేమ నిన్ను వెదకుచున్నప్పుడు, మమ్మును నీ పరిశుద్ధాత్మతో నింపుము. దేవా, మా జీవితం ఎల్లప్పుడూ నీ వాక్యంలో నాటబడునట్లుగా నీకృపను మాకు చూపించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.