నా ప్రియమైన స్నేహితులారా, మన జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ అడుగు ముందుకు వేసి నడిపించడానికి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చింతించకండి, ఆయన ఇదివరకే సమస్తమును మన పట్ల ఉద్దేశమును కలిగియున్నాడు. కనుకనే, ఈరోజు, ఆయన మన కొరకు చేసిన వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 118:15వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును'' ప్రకారము అవును, నీతిమంతుల గుడారాలు ఇలాగే ఉండాలి!నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడాలి! అయినప్పటికీ చాలా సార్లు, నేటికీ, కుటుంబాలు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే సమావేశమవుతాయి: "నా బిడ్డకు పెళ్లి కావడం లేదు, లేదా అప్పు పెరిగిపోవుచున్నది, మేము అనారోగ్యంతో ఇబ్బంది పడుచున్నాము, లేదా చెడు వ్యసనం మా ఇంట్లోనికి ప్రవేశించినది'' అని మాట్లాడుకుంటారు. తద్వారా, ఆ కుటుంబాలు భయంతో నింపబడి ఉండవచ్చును, ప్రతి సమస్యపై పోరాడుతుండవచ్చును మరియు మీ గృహమంతయు అంధకారముతో నింపబడియున్నదని మీకు అనిపించవచ్చును. కానీ నా స్నేహితులారా, దానిని మార్చడానికి దేవుడు నేడు మీ మధ్యలోను మరియు మీ గృహములలోను నివసించుచున్నాడని మరువకండి. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం కలిసి ప్రకటిద్దాం మరియు ఆనందం, విజయాల హర్షధ్వనులను మరల మన గృహములలోనికి తీసుకురావాలి! బైబిల్‌లో మనము చూచినట్లయితే, "యూదా రాజైన అబీయా, ఇశ్రాయేలు రాజైన యరొబామును ఎదుర్కొన్నప్పుడు, అబీయాకును యరొబామునకును యుద్ధము కలుగగా అబీయా నాలుగు లక్షలమంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను; యరొబామును ఎనిమిది లక్షలమంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను.''కానీ, యరొబాము యెహోవాను విసర్జించాడు. అబీయా, 'యెహోవా మాత్రమే మనకు విజయాన్ని ఇవ్వగలడు' అని ప్రకటించాడు. అతను బూరలు ఊదడానికి యెహోవా యాజకులను ముందుగా ఉంచాడు, యుద్ధం ప్రారంభమైనప్పుడు, అతని సైన్యం యెహోవాకు మొరపెట్టింది. వ్యూహాముల కంటెను, సైన్యములకంటెను, ధైర్యసాహసములకంటెను, వారు దేవుని శక్తిని నమ్ముకున్నారు. కనుకనే, యరొబాము సైన్యం వారిని వెనుక నుండి చుట్టుముట్టినప్పుడు కూడా, ఓటమి నిశ్చయము అని అనిపించినప్పుడు, వారు తమ స్వరములను ఎత్తి ప్రభువుకు మొఱ్ఱపెట్టారు. తద్వారా, ఆయన వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ప్రభువు వారి పక్షమున యుద్ధము చేసెను. చూడండి, కొద్దిమంది, అనేక మందిపై విజయమును సాధించారు. ఇది ఎంత గొప్ప కార్యము కదా!
నా ప్రియులారా, కష్టాలు మనలను చుట్టుముట్టినప్పటికిని, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహసునాదము వినబడును మరియు విజయ ధ్వనులతో నిండి ఉంటాయి. ఒకసారి నేను కారుణ్య క్రిస్టియన్ స్కూల్ హాస్టల్‌ను దర్శించాను. అక్కడ జరిగిన ఒక కార్యమును నేను జ్ఞాపకము చేసుకుంటూ, దానిని మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. ప్రతి అంతస్తులో ఉన్న విద్యార్థులు, దేవుని స్తుతించుచూ, ఉత్సాహ సునాదము చేయుచూ, పాటలు పాడుతూ, చేతిలో గిటార్లు వాయిస్తూ, ప్రభువుకు స్వరాలు ఎత్తి చూపుతూ ఉత్సాహసునాదముతో గానము చేయుచూ ఆనందించుండిరి. హాస్టల్ అంతయు ఆనందం మరియు విజయ సునాదములతో ప్రతిధ్వనించింది! అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు మీ గృహాలలో కూడా అలాగే ఉండాలని కోరుచున్నాను. కనుకనే, చింతలేదు, భయం లేదు, ఓటమి లేదు, కేవలం దేవుని స్తుతించడం, విశ్వాసం మరియు విజయ ధ్వనులు మాత్రమే. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు, మన గృహములలో ప్రభువు సన్నిధిని ఆహ్వానించి, సంతోషగానములో ఆయనను స్తుతించునట్లుగాను, ఆయన అనుగ్రహించు జయము మన జీవితాలలోని ప్రతి మూలలోనూ ప్రతిధ్వనించునట్లుగా చేద్దాము. దేవుని యొద్ద నుండి ఈ ఆశీర్వాదాలను పొందుకుందాము. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆనందింపజేసి, దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, మా జీవితంలోని ప్రతి క్షణంలోనూ మరియు ప్రతి పరిస్థితులలో నీవు మాతో ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, నీవు ఇప్పటికే మాకు ముందుగా అడుగులు వేయుచున్నావనియు మరియు మా విజయాన్ని సిద్ధపరచావనియు మేము సంపూర్ణంగా నమ్ముచున్నాము. ప్రభువా, మా ఇంటిని నీ యొక్క సమాధానము, ఆనందం మరియు సన్నిధితో నింపుము. దేవా, భయం మరియు ఆందోళన యొక్క ప్రతి స్వరాన్ని స్తుతి గానములతో నిమ్మళించునట్లుగా చేయుము. ప్రభువా, మా బలహీనతలను నీ బలంతో, మా కన్నీళ్లను నీ విజయంతో చక్కపరచుము. దేవా, మా గృహములు కృతజ్ఞతా స్తుతిగానములతోను మరియు నీ యందు విశ్వాసంతో ప్రతిధ్వనించునట్లుగా చేయుము. ప్రభువా, దయచేసి మా శక్తిపై ఆధారపడకుండా, నీ బలమైన దక్షిణ హస్తము మీద ఆధారపడటం మాకు నేర్పించుము. దేవా, ఈ రోజు, మా ఇంటిని ఉత్సాహ సునాదముతోను మరియు ఎన్నటికిని మారని విజయము నింపబడునట్లుగా మార్చుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


