నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు ఇంజనీరింగుల యొక్క దినముగా ఉన్నది. ప్రతి దినము ప్రత్యేకమైన ఒక నూతన ఆవిష్కరణలు చేయుచున్న ఇంజనీరింగుల కొరకు ప్రత్యేకంగా మనము ప్రార్థన చేయబోవుచున్నాము. ఒకవేళ, మీరు ఇంజనీరు అయితే, దేవుడు మిమ్మును బహుబలముగా వాడుకోవాలని కోరుకొనుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 థెస్సలొనీకయులకు 3:13వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, మేము మీ యెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను, ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక '' అని చెప్పబడినట్లుగానే, దేవుని యెదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచాలని మీ పట్ల కోరుచున్నాడు. ఒకవేళ, మీరు, దేవుని యెదుట మా హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఎలాగున ఉండగలము అని అడగవచ్చును? దేవుడు మా జీవితమును చూచి, నిందారహితముగాను, పరిశుద్ధమైనదిగా అని ఎలా పిలుస్తాడు? ఇది ఎలాగున సాధ్యముకాగలదు? అని మీరు అనుకుంటుండవచ్చును.

అందుకే బైబిల్‌లో దేవుడు నోవహును నీతిమంతునిగా కనుగొనినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. దేవుడు యోబును యథార్థవంతునిగా మరియు దేవుని యెదుట నిందారహితునిగా కనుగొనియున్నాడు. వారు అటువంటి పేరును పొందుకొనినట్లయితే, నా ప్రియ స్నేహితులారా, దేవుని కృప ద్వారా, మనము కూడా ఆలాగున చేయగలము. మనము ఏ విధంగా పరిశుద్ధులము, నిందారహితులము కాగలము? అయితే, చూడండి మన యొక్క పనిలో ప్రతివానికి ఒక యజమాని (బాస్) ఉంటాడు కదా! కానీ, మనము సరైన కార్యములను చేయుచూ, మన యజమానుడు మన యొక్క పనులను చూచి, సంతోషపడాలని మనము కోరుకుంటూ ఉంటాము కదా. తద్వారా, ఆయన మనలను బట్టి సంతోషపడతాడు. దాని కొరకు, మనము సమయమునకు వస్తుంటాము. నియమాలన్నిటిని పాటిస్తాము. ఇంకను మనము చేయుచున్న పనిలో సాఫల్యత కలిగియుండునట్లుగా ఖచ్చితముగా చూసుకుంటూ ఉంటాము. మన యజమానుని యొద్దకు మనము వెళ్లినప్పుడు, మనము చేసిన పనులను చూచి, అతడు సంతోషపడవలెనని మనము కోరుకుంటాము కదా. మనలను బట్టి, అతను ఏదో ఒక విధముగా సంతోషము కలిగియున్నప్పుడు, మనకు ఏదో సాఫల్యత ఉంటుంది అని మనము అనుకుంటాము. మా యజమానుడు నన్ను గురించి చాలా మంచి మాటను చెప్పాడు అని మనము అనుకుంటాము. 'చాలా బాగా చేశావు' అని అన్నారు. అది నాకు గొప్ప ఆనందమును అనుగ్రహిస్తుంది అని అనుకుంటారు కదా.

అవును, నా ప్రియులారా, మనము మన ప్రభువైన యేసు కొరకు పని చేయుచున్నప్పుడు, ఇదేరీతిగా, ఉంటుంది. ప్రభువును, నన్ను చూచి, ' బాగుగా చేశావు, భళా! మంచి నమ్మకమైన దాసుడా!' అని చెప్పగోరుచున్నాడు. అట్టి దేవుని యందలి భయము, మనము చాలా ప్రాముఖ్యము. అవును, దేవుని కొరకు అది చేయుచున్నప్పుడు చాలా కష్టతరముగా ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే, బాస్‌కంటె దేవుని యొక్క ఊహలు ఎంతో ఉన్నతముగా ఉంటాయి. దేవుని కొరకు గొప్ప కార్యములు చేయాలని ఆయన కోరుకుంటాడు. మన జీవితము నిందారహితముగా ఉండాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. కానీ, నా స్నేహితులారా, మనము, 'నేను దేవుని సంతోషపెట్టాలి అనే ఆ యొక్క భయము, నేను ఆయన యెదుట సరైన కార్యములను జరిగించాలన్న దైవభయమును' మనము కలిగియున్నప్పుడు మన యొక్క సకల దుష్టత్వమును తోలివేస్తుంది. ఆయన చిత్తమును పరిపూర్ణము చేయుచున్నది. కనుకనే, అట్టి దైవభయమును మనము కలిగియున్నప్పుడు, మనము పరిశుద్ధంగాను మరియు నిందారహితముగా ఉండగలుగుతాము. నా ప్రియులారా, నేడు దేవుడు తన బలమును మీ జీవితములో ప్రతి కోణములోను కూడా మీ పట్ల పరిపూర్ణము చేస్తాడు. దేవుడు మీ బలహీనతలో తన బలమును, అభిషేకమును పరిపూర్ణము చేస్తాడు. ఆయన మీ ద్వారా పనిచేయడము ప్రారంభిస్తాడు. ఆయన చూచేది మన హృదయము ఒక్కటే. కనుకనే, నేటి నుండి మనము ఆయన యెదుట నిందారహితముగా జీవించుటకు నిర్ణయించుకొనవలెను.

నా ప్రియులారా, నేడు మీరు దేవుని కొరకు నీతిమంతులుగా ఉండాలని కోరుచున్నారా? దేవుని కొరకు మీరు గొప్ప కార్యములను చేయాలని మీరు కోరుకుంటున్నారా? అయితే, దేవుడు మీ కోసము సంకల్పించినది, మీరు చేయుటకు ఆయన మీకు పరిపూర్ణమైన సామర్థ్యమును ఇస్తాడు. ఆయన మీ ద్వారా పనిచేయడము ప్రారంభిస్తాడు. మీ జీవితములో మీరు నీతికరమైన కార్యములు చేయుటకు ఆయనే మీకు సహాయము చేస్తాడు. మీరు ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయన మీ అడుగుజాడలను నిర్దేశిస్తాడు మరియు మీ జీవితం ఆయన నీతికి సాక్ష్యంగా నిలుచునట్లుగా సహాయపడతాడు. నేటి వాగ్దానములో సెలవిచ్చినట్లుగానే, దేవుని యెదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఉండునట్లుగా ఇప్పుడు ఆయన మిమ్మును బలపరచి, స్థిరపరచును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన యేసయ్యా, మేము నీవలె పరిశుద్ధంగాను మరియు నిందారహితముగాను ఉండుటకు నీ కృపను మా మీదికి వచ్చునట్లుగా చేయుము. తండ్రీ, నీ యెదుట మేము దైవభయము కలిగియుండునట్లుగా మాకు నీ కృపను చూపుము. దేవా, నీ చిత్తమును నెరవేర్చడానికి మాకు దైవభయం దయచేయుము. ప్రభువా, మా జీవితము పట్ల నీవు ఉద్దేశించిన ప్రయోజనాలను నెరవేర్చడానికి మాకు ఉత్సాహపూరితమైన హృదయమునిమ్ము. దేవా, మా హృదయాన్ని నీ శక్తిచేత బలపరచి, మా బలహీనతలలో నీ బలాన్ని పరిపూర్ణం చేయుము. ప్రభువా, మా ద్వారా కార్యము సఫలము చేసి, నీతి కార్యాలు జరిగించు సామర్థ్యాన్ని మాకు దయచేసి, మా యొక్క ప్రతి కీడును విడిచిపెట్టి, నీ యెదుట యథార్థతతో జీవించడానికి మాకు సహాయం చేసి, మా జీవితము నీ నామమునకు మహిమ కలుగునట్లుగా చేయుము. దేవా, నిన్ను ఆనందపరచడానికి మరియు నీ కొరకు గొప్ప కార్యములు జరిగించడానికి, అటువంటి ఆశయము కలిగియున్న హృదయమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, అటువంటి హృదయమును మేము కలిగియుండునట్లుగా, నీవు మా ద్వారా పనిచేయుము మరియు మా ద్వారా బలమైన కార్యములను జరిగించుము. దేవా, మేము నిందారహితముగాను ఉండునట్లుగాను, అన్ని విషయములలో మేము పరిశుద్ధంగా ఉండునట్లుగాను మమ్మును బలపరచు క్రీస్తునందు మేము సమస్తమును చేయుటకు మాకు నీ శక్తిని అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.