నా ప్రియమైనవారలారా, నేడు ప్రభువు మిమ్మును తన కాపుదలలో మరియు సంరక్షణలో నెమ్మదితో ఉంచవలెనని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 1:33వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును'' అన్న వచనము ప్రకారము దేవుని ఉపదేశమును అంగీకరించువారు సురక్షితముగా నివసిస్తారు మరియు ఏ అపాయమునకు భయపడక నెమ్మదితో జీవించెదరు. అంతమాత్రమే కాదు, ప్రభువు అనుగ్రహించు జ్ఞానము మనలను తొట్రిల్లకుండా కాపాడుతుంది, మనలో ఉన్న భయమును తొలగిస్తుంది మరియు ప్రమాదముల మధ్యలో కూడా మనము నెమ్మదిగా జీవించునట్లుగా చేయుచున్నది. ఇది ఎంతటి గొప్ప కృప!
అవును, మా కుటుంబ జీవితములో చూచినట్లయితే, నా తండ్రిగారైన సహోదరులు డి.జి.యస్. దినకరన్‌గారు తమ మరణ తరువాయిలో అత్యవసర చికిత్స విభాగము (ఐసియు)లో ఉన్నప్పుడు, మా తండ్రిగారు ఎంతో బలహీనంగా ఉంటూ, తీవ్రమైన దగ్గుతో బాధపడుచున్నప్పుడు కూడా వారు ఇలా ప్రార్థించేవారు: "ప్రభువా, దయచేసి నాకు మరి కొంతకాలము ఆయుష్షునివ్వు. పరిచర్యలోనూ, కారుణ్యలోనూ ఇంకా ఎన్నో అప్పులు కలవు. ఆ అప్పులను నా కుమారునికి మిగిల్చి వెళ్లాలని నేను ఇష్టపడుట లేదు. కనుకనే, దయచేసి వాటన్నిటిని తీర్చుటకును, నా కుమారుడు నెమ్మదితో జీవించి, పరిచర్యను కొనసాగించడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుము'' అని ఆయన ప్రార్థించారు. ఈ విషయము కొరకు ప్రార్థించమని ఆయనగారు మా పెద్దనాన కుమారుడైన ఎర్నెస్ట్‌ను మరియు ఇతర పాస్టర్లను కూడా కోరుకున్నారు. అయితే, ప్రభువు నా తండ్రిని తన సన్నిధికి కొనిపోయాడు. ఆయన అంత్యక్రియల తర్వాత, నేను ఎంతో హృదయ భారముతో నిండియున్నాను. అప్పుడు, నేను "ప్రభువా, మా తండ్రి వలె ఈ లక్షలాదిమంది ప్రజలకు తండ్రిగా ఎవరు ఉండగలరు? ఈ గొప్ప బాధ్యతను నేను ఎలా మోయగలను? వారిని ఎవరు మోయగలరు?'' అని నేను దేవుని అడిగాను.
అయితే, ఇరవై మూడు రోజుల తర్వాత, సిఎస్ఐ బిషప్ రెవ. దేవా కడాచమ్ ఏర్పాటు చేసిన 'జీసస్ కాల్స్' కూటములలో ప్రసంగించడానికి నేను నాగర్‌కోయిల్‌కు బయలుదేరు చున్నప్పుడు, నా కొరకు ప్రార్థించి నన్ను ఆ కూటములకు పంపించే నా తండ్రి ఇంక నాకు లేరు అన్న బాధతో నేను ఒక్కసారిగా కృంగిపోయాను. ఆ సమయంలో, ప్రభువు నాకు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చియున్నాడు: " నా కుమారుడా, ఇంత వరకు నేను నీ తండ్రి ద్వారా నీతో మాట్లాడుతూ, ఇంతవరకు నీ తండ్రిని నడిపించియున్నాను. ఇకపై, నేనే నీకు తండ్రిగా ఉంటాను. నేనే నీకు సమస్తమును ఉపదేశించెదను. నా జ్ఞానం మరియు నడిపింపు ప్రకారం నీ జీవితమును, నీ కుటుంబమును మరియు నీ పరిచర్యను కొనసాగించుము; అప్పుడు సమస్తమును నీ జీవితములో సమస్తమును వృద్ధి పొందుతుంది '' అని తెలియజేసియున్నాడు.
అంతమాత్రమే కాదు, ప్రభువు నాతో ఇలాగున తెలియజేసియున్నాడు, "ఈ భారమును నీవు మోయవలసిన అవసరం లేదు. నేనే దానిని మోయుదును. నేను చెప్పినట్లు నీవు చేసినప్పుడు, నేను నీ జీవితములో సమస్తమును అభివృద్ధి చెందునట్లుగా చేయుదును'' అని వాగ్దానము చేసియున్నాడు. అప్పుడు, ఆయన, 'జీసస్ కాల్స్' పరిచర్య కొరకు నాకు ఒక నూతన నడిపింపును అనుగ్రహించియున్నాడు. ఒక ప్రవచనాత్మక శిబిరమును (ప్రొఫెటిక్ క్యాంపు) నిర్వహించమని ఆయన నాకు సూచించియున్నాడు. అలాగే యేసును గురించి సాక్ష్యము చెప్పుటకు వేలాదిమందిని లేవనెత్తుతానని వాగ్దానము చేసియున్నాడు. ఆలాగుననే, భారతదేశము నలుమూలల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుమారులు, కుమార్తెలు ఆయన సాక్ష్యమును ప్రకటించడానికి లేవనెత్తబడతారని ఆయన తెలియజేసియున్నాడు.
కనుకనే, మేము ప్రవచనాత్మక శిబిరమును 2008వ సంత్సరములో ప్రారంభించాము, మొదటి శిబిరమునకు సుమారు 2,000 మంది హాజరయ్యారు. త్వరలోనే, భారీ బహిరంగ సభలను నిర్వహించమని ప్రభువు మాకు నిర్దేశించియున్నాడు. ఆలాగుననే, ప్రార్థనా యోధులు ప్రార్థించుటకు గవిని యొద్ద ఉంచబడియున్నారు. అలాగే ప్రజలు ఆ సభలను టెలివిజన్‌లో వీక్షించునట్లుగా కెమెరాలను ఉపయోగించియున్నాము. ఆ సమయంలో ఎల్ఇడి ్రస్కీన్లు అందుబాటులో లేకపోవడంతో, వేదికపై ఒక పెద్ద ్రస్కీన్‌ను ఏర్పాటు చేయడానికి మేము 16 ప్రొజెక్షన్ టి.విలను కలిపి అమర్చాము. తద్వారా, ఆ కూటములలో ప్రభువు అద్భుతాలను జరిగించియున్నాడు. ఆ కూటములలో ఆయన సన్నిధితో నింపబడి యుండెను. నా పిల్లలైన శ్యామ్ మరియు షారోన్ ఆరాధనను నడిపించేవారు. అలాగే, ప్రవచనాత్మకంగా మాట్లాడటానికి మరియు ప్రజలను వారి పేర్లతో పిలవడానికి ప్రభువు నాకు కృపను అనుగ్రహించియున్నాడు. బంధకములతోను, బాధలతోను మరియు దుఃఖముతోను నిండియున్న ప్రజలు విడుదల పొందుకున్నట్లుగా సాక్ష్యమిచ్చియున్నారు. మరియు అనేకులు పరిశుద్ధాత్మ పరిపూర్ణతను అనుభవించారు. వారి జీవితములు రూపాంతరపరచబడినవి. అంతమాత్రమే కాదు, ప్రజల యొక్క పాపములు తొలగిపోవునట్లుగా చేసి, వారి జీవితములలోనికి పరిశుద్ధతలోనికి ప్రవేశించునట్లుగా చేసియున్నాడు.
ఆలాగుననే, ప్రభువు, దేశము కొరకు ప్రతిరోజు 24 గంటలు ప్రార్థించడానికి ఢిల్లీలో ఒక ప్రార్థన గోపురమును, ఆ తర్వాత ఇశ్రాయేలులో ఒక ప్రార్థన గోపురమును మరియు ప్రార్థన గోపురముల విస్తరణను స్థాపించమని నాకు ఆజ్ఞాపించియున్నాడు. అంతమాత్రమే కాదు, కారుణ్యలో నీరు, ఆహారం, ఆరోగ్య సంరక్షణ మరియు పరిశోధనను అందించమని కూడా ఆయన మాకు ఆజ్ఞాపించియున్నాడు. ఆయన కారుణ్యను ఒక కళాశాల నుండి విశ్వవిద్యాలయంగా ఎదుగునట్లుగా చేసియున్నాడు. అందులో, పరిశోధలో కేంద్రమును మరియు అభివృద్ధిని అనుగ్రహించి ఆశీర్వదించియున్నాడు. ఇంకను సీషా కార్యకలాపములు విస్తరించవలెనని, అలాగే నిరుపేదలు మరియు అవసరతలో ఉన్నవారిని ఆదుకొనవలెనని కూడా ప్రభువు మాకు నిర్దేశించియున్నాడు. ఇందుకు ప్రతిఫలముగా వృద్ధాశ్రమములు, పునరావాస కేంద్రములు, విద్య మరియు నైపుణ్య శిక్షణా కార్యక్రమములు, గృహములు కోల్పోయిన వారికి ఆవాసాలు, వైద్య శిబిరములు, ఉచిత వైద్య సేవలు, అలాగే మహిళలకు మరియు పిల్లలకు చేయూతనివ్వడం వంటి అనేక కార్యక్రమములు చేపట్టబడినవి. మేము ఆయన ఉపదేశములను అనుసరించినప్పుడు, ప్రభువు పరిచర్యలో ఉన్న అవసరతలను నమ్మకంతో తీర్చియున్నాడు. ప్రార్థన కేంద్రములను విస్తరించియున్నాడు. కూటముల ద్వారా లక్షలాది మంది ప్రజలను ఆశీర్వదించియున్నాడు. ప్రభుత్వ నాయకుల మధ్య అవకాశములను కల్పించియున్నాడు మరియు మాతో కలిసి సేవ చేయడానికి అనేకమందిని లేవనెత్తియున్నాడు. ఇది ప్రభువు నుండి లభించే జ్ఞానం మరియు నడిపింపు మాత్రమే.
ఆలాగుననే, ప్రతిరోజూ ఉదయం సుమారు 3 లేదా 4 గంటలకు ప్రభువు నన్ను నిద్రలేపి, ఏమి చేయాలో నాకు బయల్పరుస్తాడు. నేను ఆయన నడిపింపును వెంబడిస్తాను. ఎవరికి కూడా భయపడవలసిన అవసరము లేదు. కనుకనే, మనము ప్రభువు సన్నిధిలో నీతిగా నడుచుకుంటూ, యథార్థంగాను మరియు నమ్మకముగా ఉండవలెను. నా ప్రియులారా, మన యొక్క ప్రతి పోరాటము మరియు వ్యతిరేకతలోనూ ప్రభువు మనకు గొప్ప కృపను కనుపరచియున్నాడు. మా కొరకు ప్రార్థించే వేలాది మందికి, అలాగే పూర్తికాల సేవకులుగా లేదా స్వచ్ఛంద సేవకులుగా మాతో కలిసి పనిచేయుటకు వేలాది మంది సేవ చేయుటకు ఇచ్చిన కృపను బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఈ పరిచర్య ద్వారా ఆయన సమృద్ధియైన ఫలితములను అనుగ్రహించియున్నాడు. అంతేకాకుండా, ఆయన మిమ్మును కూడా మాకు ఒక అమూల్యమైన యీవిగా అనుగ్రహించియున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.
కనుకనే, నా ప్రియులారా, ప్రతి ఉదయం ప్రభువు మీకు తన జ్ఞానమును, నడిపింపును అనుగ్రహించవలెనని నా ప్రార్థన. కాబట్టి, మీరు తొట్రిల్లకుండా, భయము లేకుండా, నెమ్మదితో జీవించునట్లుగా ఆయన మిమ్మును శక్తిమంతులనుగా చేయును గాక. మీరు ఆయన ఉద్దేశములను నెరవేర్చి, ఉన్నత శిఖరములకు ఎదుగునట్లుగా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ప్రభువు తన దైవీకమైన కాపుదల క్రింద మిమ్మును భద్రంగా ఉంచి, తన జ్ఞానముతో మిమ్మును నడిపించి, తన పరిపూర్ణ చిత్తానుసారంగా మీరు సురక్షితంగా, నెమ్మదితో నడుచునట్లుగా బలవంతులనుగా మిమ్మును మార్చి, నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, ప్రతిరోజు మేము నీ యొక్క జ్ఞానములో నడవడానికి మరియు నీ నడిపింపును విశ్వసించడానికి మాకు సహాయము చేయుము. దేవా, నీవు మాకు తండ్రిగా, రక్షకుడిగా మరియు మార్గదర్శిగా ఉండి, మేము మోయలేని ప్రతి భారమును నీ మీద మోపుచున్నాము. ప్రభువా, నీవు మా భారమును మోయుచూ, మమ్మును నీ హస్తముతో ఆదుకొనుము. దేవా, మా కుటుంబమును నీ మార్గములలో నడిపించి, నీ మహిమ కొరకు మమ్మును వాడుకొనుము. ప్రభువా, యేసును గూర్చి సాక్ష్యమిచ్చుటకు మమ్మును లేవనెత్తి, మమ్మును అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. యేసయ్యా, నీ యొక్క మహిమలో మా యొక్క ప్రతి అవసరమును తీర్చుము. దేవా, మేము నీకు సేవచేయుటకును, పేదలను ఆదరించుటకు మాకు కావలసిన సమస్తమును అనుగ్రహించుము. ప్రభువా, ప్రతి ఉదయం నీ పరిశుద్ధాత్మచేత మేము నడిపించబడునట్లుగాను మరియు మేము సురక్షితంగా, నెమ్మదితోను మరియు భయము లేకుండా నడవడానికి మాకు సహాయం చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


