నా ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి నా శుభములు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లేవీయకాండము 25:19వ వచనమును మనకు ఇవ్వబడినది. ఆ వచనము, "అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు'' అని చెప్పబడినట్లుగానే మీరు సురక్షితముగా నివసించాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. ప్రభువు ఇశ్రాయేలీయుల ప్రజలకు ఏడవ సంవత్సరమున పంటలు వేయకుండా, భూమిని పండించకుండా, ఎలా ఉండాలో పై వచనములో తెలియజేయుచున్నాడు. ఏడవ సంవత్సరమున పంటలు పండించకపోయినను కూడా సరే, మీరు తృప్తిగా భుజించి, సురక్షితముగా నివసించెదరు అని ఇశ్రాయేలీయుల ప్రజలకు ప్రభువు సెలవిచ్చియున్నాడు. అయితే, మానవ దృక్పథంతో చూచినట్లయితే, ఇది అసాధ్యంగా అనిపించవచ్చును. మనము ఎలాగున జీవించెదము? ఏమి భుజించవలెను? అని వారు ఆలోచిస్తూ ఉండి యుండవచ్చును. కానీ, ప్రభువు, 'ఆయన తానే వారి అవసరతలను తీరుస్తాడని' వారికి వాగ్దానము చేసియున్నాడు. కనుకనే, వారు కడుపారా భుజించి, సురక్షితంగా నివసించెదరని ఇశ్రాయేలీయుల పట్ల ఆయన తెలియజేశాడు. చూడండి, ఇది ఎంతటి గొప్ప భాగ్యము కదా!

అవును, నా ప్రియులారా, ఈ దేవుడు తానే నేడు మీతో మాట్లాడుచున్నాడు. మీ పరిస్థితులు మీకు అసాధ్యమనిపించుచున్నప్పుడు కూడా మీరు ఆయనను విశ్వసించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. బహుశా! మీ జీవితములో మీరు నిరీక్షణను కోల్పోయి ఉండవచ్చును. అయితే, మనము ప్రభువును ఎంతగానో విశ్వసించాలని ఆయన ఎదురుచూచున్నాడు. కొన్ని కార్యములు మనకు అసాధ్యమైనవని అనిపించినప్పటికిని, ఏమి చేయలేమని వైద్యులు చెయ్యి విడిచిపెట్టినప్పటికిని, మీరు మీ బిడ్డలను విడిచిపెట్టి వేసినప్పటికిని, ప్రభువు అంటున్నాడు కదా, ' మీకు అసాధ్యమైనవాటిని, నేను అద్భుతంగా మీ పట్ల జరిగిస్తాను.' అవును, ఆయన మీ పట్ల అద్భుతములను జరిగించి, మీ అనారోగ్యమును స్వస్థపరుస్తాడు. ప్రభువు ఈ రోజు అదే మీకు వాగ్దానము చేయుచున్నాడు. నా ప్రియులారా, ఒకవేళ, 'ఇది సాధ్యము కానేకాదు' అని మనము చాలాసార్లు అనుకుంటాము. ఇంకను, 'నేను ఎన్నో ఉద్యోగముల కొరకు ప్రయత్నించుచున్నాను, కానీ, ఏదియు రావడము లేదు అని అనుకుంటారు. ఎన్నో సంవత్సరములుగా పదోన్నతి కొరకు వేచియున్నాను. కానీ, నాకు పదోన్నతి రావడము లేదు, ప్రభువు నా కొరకు ఏమియు చేయడము లేదు అని అనుకుంటుండవచ్చును.' అయితే, ఇశ్రాయేలీయులవలె ప్రభువునందు మనము విశ్వాసముంచడానికి నేర్చుకొనవలెను. అప్పుడు ప్రభువు అసాధ్యమైనవాటిని మన జీవితములో జరిగిస్తాడు. కలిసి ప్రార్థించుకుందాము. నా ప్రియులారా, ఒకవేళ, మీ చుట్టూ ఉన్నవన్నీ నిరుత్సాహకరంగా అనిపించవచ్చును. అయినప్పటికిని, 'ప్రభువు, నాయందు విశ్వాసముంచండి' అని అంటున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులను పోషించినట్లుగానే, మిమ్మల్ని కూడా పోషిస్తాడు. ఆయన మీ అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు, మీ కుటుంబమును పునరుద్ధరిస్తాడు, మీకు నూతన ఉద్యోగ అవకాశములను మరియు పదోన్నతిని కల్పిస్తాడు మరియు మీ జీవితంపై ఆయన సెలవిచ్చిన ప్రతి వాగ్దానమును నెరవేరుస్తాడు.

అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు, ' మీ పిల్లలు ప్రభువుకు అత్యంత దూరముగా వెళ్లియున్నారని చింతించుచున్నారేమో? మీ పిల్లలకు కొరకు కన్నీటితో ప్రార్థించుచున్నట్లయితే, మీరు పిల్లలను మరియు మీ భారమును ప్రభువు హస్తాలకు సమర్పించండి, ప్రభువు వారిని తిరిగి మీ యొద్దకు తీసుకొని వస్తాడు. అవును, ప్రియులారా, ఈ రోజు మీ జీవితములో ప్రభువు అసాధ్యమైనవాటన్నిటిని జరిగిస్తాడు. దేవునికి దూరమైపోయిన మీ పిల్లల కొరకు కన్నీళ్లతో ప్రార్థించుచున్న తల్లిదండ్రులారా, ధైర్యమును కోల్పోకండి. వారిని ప్రభువు చేతులకు అప్పగించండి. వారు ఎక్కడ ఉన్నారో ఆయనకు తెలుసు, మీకంటే ఎక్కువగా ఆయన వారిని ప్రేమించుచున్నాడు, మరియు వారిని తన దగ్గరకు తిరిగి రప్పించగల శక్తి ఆయనకు కలదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ రోజు, భయానికి బదులుగా విశ్వాసాన్ని ఎంచుకోండి. మీ పరిస్థితులను చూసి కాకుండా, దేవుని వాగ్దానముల యందు నమ్మకముంచినప్పుడు ప్రభువు నిశ్చయంగా, కాపులేకపోయినను సరే, మీరు తృప్తిగా భుజించి, మీరు సురక్షితంగా నివసించునట్లుగా చేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, ఇశ్రాయేలీయులకు సమస్తమును సమకూర్చినట్లుగానే, మాకు కావలసినవన్నిటిని సమకూరుస్తావనియు, నీ సంరక్షణలో మేము సురక్షితముగా నివసించునట్లుగా చేయుము. దేవా, మా ప్రతికూల పరిస్థితులు అసాధ్యంగా అనిపించినప్పుడు కూడా నిన్ను నమ్మడానికి మా విశ్వాసమును వృద్ధిపరచుము. ప్రభువా, మా జీవితములో ఆలస్యాలు, నిరాశలు, లేదా కష్టమైన పరిస్థితుల వలన మేము నిరుత్సాహపడకుండా మమ్మును నీ బలముతో నింపుము. యేసయ్యా, మా పిల్లలు నీకు దూరముగా ఉన్నారని చింతించుచున్నాము. కనుకనే, మా పిల్లలను గురించిన చింతలను నీ మీద వేయుచున్నాము. దేవా, మమ్మును ప్రేమించే దేవుడవు కాబట్టి, మేము మా బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము. ప్రభువా, మా జీవితాలను మరియు మా పిల్లల జీవితములను నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. యేసయ్యా, నీ ప్రేమను మా బిడ్డల మీద కుమ్మరించి, మా మరియు మా పిల్లల జీవితములను దీవించుము. ప్రభువా, మాలోను మరియు ప్రియులైన వారిలోను ఉన్న ప్రతి వ్యాధి బలహీనతలను నీ హస్తాములకు అప్పగించుకొనుచున్నాము. యేసయ్యా, నీ గాయపడిన హస్తములతో మమ్మును తాకి, మమ్మును స్వస్థపరచి, దీవించుము. దేవా, మాకు అసాధ్యమైన కార్యములన్నిటిని నీవు సాధ్యపరచి, మాకు జయమును అనుగ్రహించుము. ప్రభువా, నీ పరిపూర్ణ చిత్తానుసారంగా మాకు ఉద్యోగమును, పదోన్నతిని మరియు స్వస్థత, పోషణకు సంబంధించిన ద్వారములను తెరచి, మాకు సమస్తమును సమృద్ధిగా దయచేసి, నీ సమాధానము మా హృదయములను కాపాడబడునట్లుగా ప్రతిరోజూ నీ దైవీక కాపుదలను అనుభవించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.