నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, ఈ రోజు ఒక అద్భుతమైన వాగ్దానముగా బైబిల్ నుండి 2 తిమోతికి 4:22వ వచనమును మనము కలిగియున్నాము. ఆ వచనము, "ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక. కృప మీకు తోడై యుండును గాక'' అన్న వచనము ప్రకారము దేవుడు తన కృప ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండాలని మీ పట్ల కోరుచున్నాడు. భక్తుడైన పౌలు, తిమోతిని ఈవిధంగా ఆశీర్వదించుచున్నాడు. అదేమనగా, "ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక. కృప మీకు తోడై యుండును గాక.'' అవును, అదేవిధముగా, అపొస్తలుడైన పౌలు తిమోతిని మరియు సంఘములో ఉన్న ప్రజలను కూడా ఆశీర్వదించాడు.

నా ప్రియులారా, "ప్రభువు మీకు తోడై యుండును గాక '' అని దీవించడము పాతకాలములో ఒక ఆనవాయితీగా ఉండేది. అంతకంటే అత్యధికముగా, పౌలు ఇక్కడ తిమోతిని ఇలాగున ఆశీర్వదించుచున్నాడు, " ప్రభువు మీ ఆత్మకు తోడై యుండును గాక'' అని అంటున్నాడు. ఎందుకనగా, తిమోతి తనంతట తానే ఏదియు చేయలేడని పౌలుకు తెలుసు. దేవుని సహాయము లేకుండా తిమోతి పరిచర్య చేయలేడు అని పౌలుగారికి తెలుసు. అందుకే, దేవుడు తన ఆత్మతో తిమోతిని బలపరచవలెనని పౌలు కోరుకున్నాడు. కనుకనే, బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:13వ వచనములో చూచినట్లయితే, "నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను'' అని పౌలు భక్తుడు అనేకసార్లు చెప్పియున్నా డు. బైబిల్ నుండి యోహాను 15:5వ వచనములో చూచినట్లయితే, యేసయ్య, "ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు'' అని అంటున్నాడు. కనుకనే, నా ప్రియులారా, మనము అన్నివేళల యేసయ్యయందు నిలిచియుండవలెను. అంతమాత్రమే కాదు, దేవుని ఆత్మతో ఏకమై ఉండవలెను. మనము అట్టివిధముగా ఉండాలని యేసయ్య మన పట్ల కోరుకుంటున్నాడు. తన బిడ్డలమైన మనలను ఆవిధంగా ఆశీర్వదించాలని కోరుచున్నాడు. ఒక నిజమైన తండ్రి యొక్క హృదయము ఇదేనండి. బైబిల్‌లో యాకోబు వృద్ధుడైన తర్వాత, తన పండ్రెండు కుమారులను ఆశీర్వదించవలెనని వారి పట్ల కోరుకున్నాడు. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 49:1వ వచనములో చూచినట్లయితే, "యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను'' అని చెప్పెను. ఆలాగుననే, రాబోవు దినములలో వారికి సంభవింపబోవు సంగతులన్నిటిని తెలియజేశాడు. యాకోబు కలిగియున్న ప్రతి యొక్క కుమారుని గూర్చి అతడు ప్రవచించాడు. భవిష్యత్తులో దేవుడు వారిని ఎలాగున ఆశీర్వదించబోవుచున్నాడని వారికి తెలియజేశాడు. అంతమాత్రమే కాదు, వారిని ముద్దుపెట్టుకొని, వారిని దీవించియున్నాడు.

మా తండ్రిగారైనటువంటి సహోదరులు డి.జి.యస్ దినకరన్‌గారు కూడా అదే చేశాడు. ఆయన చివరి దినములలో, ఇంకా ఎక్కువ కాలము తను బ్రతుకలేడని గ్రహించారు. ఆలాగుననే, కుటుంబ సభ్యులందరిని దీవించాలని మా పట్ల కోరుకున్నాడు. ఆయన ఎంతో బలహీనంగా ఉన్నప్పటికిని కూడా తన కుటుంబ సభ్యులందరిని ఆశీర్వదించాలని కోరుకున్నాడు. కనుకనే, మా కుటుంబ సభ్యులందరి మీద తన చేతులను ఉంచి, మమ్మును దీవించాడు. నా ప్రియులారా, మన పరలోకపు తండ్రి యొక్క హృదయము కూడా అదేనండి. ఆలాగుననే, మనమందరము దీవించబడాలని ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ మన మీదికి దిగివచ్చినప్పుడు, మనము శక్తిని పొందెదము అని దేవుని వాక్యము అంటున్నది. దేవుని యొక్క శక్తి ద్వారా ఇతరులను మీరు దీవించుదురు గాక. మీరు జీవితములో ఉన్నత స్థాయికి వచ్చి, గొప్ప కార్యములను జరిగించుదురు గాక. బలము చేత కాదు, శక్తి చేత కాదు, ఇది దేవుని ఆత్మ వలననే సాధ్యమగుతుంది. కాబట్టి, నా ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ మీకందరికి తోడై యుండును గాక మరియు దేవుని యొక్క కృప మీకు కలుగును గాక. ప్రభువు మీకు నిత్యము తోడై యుండును గాక. దేవుని ఆత్మ మీ యందు వర్థిల్లును గాక. నా ప్రియులారా, ప్రభువు మిమ్మును నేటి వాగ్దానము నుండి దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క ఆత్మను మేము కలిగియుండడము మాకు గొప్ప ధన్యతను కలిగియుండుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ శక్తి మా మీదికి దిగివచ్చి, మా బలహీనతలలో మమ్మును బలపరచునట్లుగాను, నీ ఆత్మచేత మమ్మును నింపుము. ప్రభువా, మేము ఇతరుల పట్ల గొప్ప కార్యములను చేయగలిగే గొప్ప శక్తిని ఇప్పుడు మాకు దయచేయుము. దేవా, మా మీద నీ కృప కుమ్మరించునట్లుగా, తద్వారా మేము మంచి కార్యములను చేయునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీకు అంగీకారముగాను, దీవెనకరముగా ఉండునట్లుగా మార్చుము. దేవా, మా స్వంత శక్తి, బలము వలన కాదు గానీ, నీ యొక్క ఆత్మ ద్వారా మా పట్ల గొప్ప కార్యములను జరిగించుము. యేసయ్యా, మా జీవితములో ఉన్న నిరుత్సాహమును తొలగించి, మా చేతులను బలపరచి, నీ కొరకు ధైర్యవంతులముగాను, నీకు సాక్షులుగా జీవించునట్లుగా చేయుము. ప్రభువా, మాలో ఉన్న నిరాశలన్నిటిని తొలగించి, మేము బలవంతులముగాను, ధైర్యవంతులముగాను ఉండునట్లుగా నీ కృపను మాకు చూపించుము. యేసయ్యా, నీ కొరకు మేము గొప్ప కార్యములను జరిగించునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.