నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 30:18వ వచనమును ఇది మీ కొరకైన దేవుని వాగ్దానము. ఆ వచనము, "కావున మీయందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడియున్నాడు యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరు ధన్యులు'' అను వచనము ప్రకారము అవును, ప్రభువు దయగల దేవుడు కాబట్టి ఆయన మీపై దయ చూపిస్తాడు. అనేకసార్లు, దేవుడు నీతిగల న్యాయాధిపతి, ఆయన న్యాయాన్ని తీర్చే దేవుడై యున్నాడు అని మనం అనుకుంటాము, కానీ, యెహోవా కనికరము కలిగి ఆయన మీ పట్ల న్యాయం జరిగించుచున్నాడు. మొదటిగా, పశ్చాత్తాపపడి తన వైపు తిరిగిన యెడల వారి మీద దేవుడు కనికరమును చూపుచున్నాడు. అందుకే బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 30:9వ వచనమును మనము చూచినట్లయితే, " మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ సహోదరుల యెడలను మీ పిల్లల యెడలను చెర తీసికొనిపోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములుగలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీయందు ప్రసన్నుడగును'' అని చెప్పబడిన ప్రకారము మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీకు దయ చూపుటకు సిద్ధముగా ఉన్నాడు. నా స్నేహితులారా, అందుకే బైబిల్ నుండి నెహెమ్యా 9:31వ వచనములో కూడా ఇలాగున అంటున్నాడు, " అయితే నీవు మహోపకారివై యుండి, వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపాకనికరములుగల దేవుడవై యున్నావు'' ప్రకారము నిజముగా, ఆయన కృపాకనికరములుగల దేవుడై యున్నాడు. అదే దేవుడు మనలను కూడా కనికరించాలని మన పట్ల ఆశించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి ప్రసంగి 10:12వ వచనములో చూచినట్లయితే, "జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును'' అని చెబుతుంది. కనుకనే, జ్ఞానము గలవాని నోటి మాటలు ఇంపుగా ఉండును అని చెప్పబడినట్లుగానే, మీరు కూడా జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు. కనుకనే, బైబిల్ నుండి సామెతలు 16:24 వ వచనములో చూచినట్లయితే, "ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి'' అని ప్రసంగి గ్రంథకర్త ఇలాగున తెలియజేయుచున్నాడు. దేవుడు ఆలాంటి కృపను మీకు దయచేయాలని కోరుచున్నాడు. ఇతరులకు మరియు భయంకరమైన శత్రువులైనను సరే, వారి పట్ల కనికరము గలవారమై ఉంటూ, వారికి కూడా స్వస్థత కలిగించువారుగాను, ఇంపుగాను, ఆదరణను కలిగించు మాటలను మాట్లాడువారినిగా ఉండునట్లుగా అలాంటి కృపను మీరు పొందుకోవాలని దేవుడు మీ పట్ల కోరుకుంటున్నాడు. మనం కూడా ఇతరుల పట్ల దయ చూపుట ద్వారా, ప్రభువు తన దయ ద్వారా మనము క్షమించబడియున్నాము. కనుకనే, మనము కూడా అదే కనికరము కలిగియుండాలి.
రెండవదిగా, మన సంభాషణలో, మనం కనికరము కలిగి ఉండాలి. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 4:6వ వచనములో చూచినట్లయితే, "ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి'' అని చెప్పబడిన ప్రకారము మనం ఘర్షణ పడాలని ప్రభువు కోరుకోవడం లేదు. ఎవరి పట్ల కూడా మనము వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడు. మనం ఎల్లప్పుడూ కృపాకనికరములతోను మరియు దయగల మాటలతో మనము నింపబడి ఉన్నప్పుడు, అలాంటప్పుడు, మనకు ఎవ్వరు కూడా విరోధులుగా ఉండరు. మరియు మూడవదిగా, ప్రతి భర్త తమ భార్యల పట్ల దయ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే బైబిల్ నుండి 1 పేతురు 3:7వ వచనములో చూచినట్లయితే, "అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి'' అని చెప్పబడినట్లుగానే, అవును, మీ భార్యభర్తల పట్ల మీరు ఒకరినొకరు కనికరము చూపవలసిన వారై ఉన్నారు. తద్వారా, మీ ప్రార్థనలకు ఏలాంటి అభ్యంతరము కలుగకుండునట్లుగా వారిని సన్మానించాలి. మనం మన జీవిత భాగస్వాముల పట్ల కనికరము గలవారై ఉండాలి. నిత్యము వారితో వివాదము పడకండి. ఎప్పుడు కూడా వారి మీద నేరారోపణ చేయకండి. అయితే, మిమ్మును మీరు తగ్గించుకొని, ప్రేమతో, ఒకరినొకరు సన్మానించుకోవాలి, మీ భార్యలను ప్రేమించండి, మీ భర్తలను ఘనపరచండి. అప్పుడు మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండా ఉంటారు. తద్వారా, మీరు దేవునితో ఏకమై ఉంటారు.
మరియు నాల్గవది, మీరు ఇవ్వడములో కనికర సంపన్నులై ఉండండి. మీరు ఇవ్వడములో ఉధారత్వ మనస్సు గలవారై ఉండండి. నీతిమంతులు కనికరముతో ధారాళంగా మరియు దయగలిగిన హృదయముతో ఇచ్చెదరు. కనుకనే, నా ప్రియులారా, నేడు దేవుడు మీకు ఇటువంటి కృపను అనుగ్రహించును గాక, తద్వారా అన్ని విషయాలలో దేవుడు మీ పట్ల కనికరమును చూపుచున్నాడు. నా ప్రియులారా, ఇటువంటి మన పట్ల ఇటువంటి కృపను చూపాలని కోరుకునే ప్రభువు, మీరు పశ్చాత్తాపంతో నడుచుకుంటూ, దయగల మాటలను మీరు మాట్లాడుచూ, మీ కుటుంబ సభ్యులను మరియు ఇతరులను తగ్గింపుగల మనస్సుతో ప్రేమించి, కనికరముతో ధారాళంగా ఇచ్చినప్పుడు తన కృపను మీ పట్ల విస్తారముగా కుమ్మరిస్తాడు. నిజంగా, కృపాకనికరములు గలిగిన దేవుడు మీ జీవితాన్ని లోకానికి తన కృపాకనికరములకు ఒక మార్గంగా మిమ్మును మార్చాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. కనుకనే, నా ప్రియులారా, పై చెప్పబడిన నాలుగు కార్యములను మీరు జరిగించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దయగల ప్రభువా, నీవు కనికరముతో మరియు దయతో నింపబడియున్నావు. కనుకనే, దేవా, ప్రతిరోజు మాపై నీ యొక్క కృపావాత్సల్యతను చూపాలని కోరినందుకై నీకు వందనములు. ప్రభువా, తగ్గింపు మనస్సుతోను మరియు పశ్చాత్తాపపడే హృదయంతో నీ వైపు తిరిగి రావడానికి మాకు నేర్పుము. దేవా, మా నోటి మాటలు ఇతరులకు దయగలవిగాను, ఇంపైనవిగాను మరియు బాగుపరచునవిగాను రుచికరంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మాకు విరోధముగా వచ్చువారి పట్ల కూడా దయ చూపడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా సంభాషణలు నీ ప్రేమ మరియు శ్రావ్యతను ప్రతిబింబించునట్లుగా చేయుము. యేసయ్యా, మేము ఒక కుటుంబంగా ఒకరిపట్ల ఒకరము దయతో మరియు ప్రేమతో ఉండటానికి మరియు ఒకరినొకరు గౌరవించుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, ఇచ్చుటలో నీవు మాకు మాదిరిగా ఉన్నట్లుగానే, మేము కూడా ఇవ్వడంలో దయగల ఉదారత్వముగల హృదయాన్ని మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ కృప మాలో పొంగిపొర్లునట్లుగాను మరియు మేము కలుసుకొను ప్రతి జీవితాన్ని తాకునట్లుగా మాకు అటువంటి కృపను అనుగ్రహించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


