నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు నీతిమంతులుగా జీవించాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. నేడు మీరు నీతిమంతులుగా జీవించుచున్నారా? అవును, మనము నీతిమంతులుగా జీవించుచున్నప్పుడు ప్రభువు మనకు గొప్ప ఆశీర్వాదములను అనుగ్రహిస్తానని మన పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 13:25వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును'' అని చెప్పబడినట్లుగానే, మనము నీతిమంతులుగా జీవించాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. పై చెప్పబడిన వచనమునకు అర్థం ఏమిటి? అని మనము చూచినట్లయితే, వారు తింటూనే ఉంటారని దీనికి అర్థమా? కాదు. దీనికి అర్థము ఏమనగా? ప్రభువు వారి జీవితములలో వారు ఎదుర్కొంటున్న ప్రతివిధమైన కార్యములలోను దేవుడు వారిని సంతృప్తిపరుస్తాడు. వారికి ఎలాంటి కష్టాలు, కొరతలు ఉండవు. ప్రభువు వారిని సమృద్ధిగా ఆశీర్వదించి, అత్యున్నత స్థాయికి హెచ్చించి, వారిని ఘనపరుస్తాడు.

అవును, ఇటీవల, ఇటువంటి ఒక సంఘటన నా జీవితంలో జరిగినది. నేను పరీక్షలు వ్రాస్తున్నప్పుడు, నా పరీక్షలలో నేను ఒక పరీక్షను వ్రాస్తున్నప్పుడు, ఒక ముఖ్యమైన అంశమును చేయకుండా విడిచిపెట్టాను. అది నా ప్రాక్టికల్ పరీక్ష సమయంలో జరిగింది మరియు నేను వైవా సెషన్‌కు వెళ్లి కూర్చునే వరకు నా తప్పును గ్రహించలేదు. అప్పుడు నేను ఎలా భావించి ఉంటానో మీలో అనేకమంది ఊహించగలరని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. వైవా సమయంలో, ప్రొఫెసర్ నన్ను చూచి, 'నువ్వు ఈ కార్యమును చేశావా?' అని అడిగాడు. వెంటనే, 'అయ్యో! ఇక నా జీవితము అంతే. నా పని అయిపోయింది. రాబోవు సంవత్సరము మరల వచ్చి ఈ పరీక్షను నేను వ్రాయాలని అనుకున్నాను.' కానీ, అప్పుడు నిజము చెప్పాలని నాకు అర్థమైంది. అందుకే, ఆయనతో, 'సార్, ఏమి లేదు. నేను ఈ ప్రశ్నకు జవాబు వ్రాయడం పూర్తిగా మర్చిపోయాను అని చెప్పాను.' వెంటనే, ప్రొఫెసర్‌గారి యొక్క ముఖం మారిపోవడం నేను చూశాను. అతనికి ఎంతో కోపము వచ్చినది. కానీ తర్వాత, అతను, ' నీకు పది నిమిషాలు సమయము ఇస్తాను. వెళ్లి మరల అది చేసి తిరిగి రమ్మని చెప్పారు.' అంతటితో నేను మరల ఆ పనిని చేసి తిరిగి అతని యొద్దకు వచ్చాను. నేను తిరిగి వచ్చినప్పుడు, అతను నన్ను ఎంతగానో కదిలించిన ఒక విషయమును నాతో చెప్పాడు. అతను, 'శిల్పా, నీవు చాలా పెద్ద తప్పు చేశావు. ఇందువలన, నీవు ఉత్తీర్ణతను పొందలేక పోయి ఉండవచ్చును అని చెప్పాడు.' కానీ, 'నీవు నిజాయితీగా ఉండి, నీ తప్పును అంగీకరించినందున, నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను,' అని నాతో చెప్పాడు.

అవును, నా ప్రియ స్నేహితులారా, మనము కూడా సత్యవంతులుగా, నీతిమంతులుగా జీవించినప్పుడు ప్రభువు అనుగ్రహాన్ని ఈ విధంగానే అనుభవిస్తాము. ఆ క్షణంలో, నేను ' ప్రభువా, ఏమి జరిగినా నేను సత్యమునే చెప్పాలి' అని అనుకున్నాను. ఒకవేళ నేను విఫలమై, రాబోవు సంవత్సరములో ఆ పరీక్షను వ్రాయవలసి వచ్చినా ఫర్వాలేదు. నేను నిజం చెప్పాలని' మనము అనుకుంటూ, మనము నీతిమంతులుగా ఉంటూ, ఆయన నామమును ధరించాలని ఎంపిక చేసుకున్నప్పుడు ప్రభువు మన మీద గొప్ప దయను కనుపరుస్తాడు. నా ప్రియులారా, ఈ రోజు కూడా మీరు నీతిమంతులుగా జీవించండి. ఎటువంటి పరిస్థితులలోను కూడా, లేక మీ పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు కూడా నీతిని ఎంచుకున్నప్పుడు, ప్రభువు మిమ్మును ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ప్రభువు నన్ను ఆశీర్వదించినట్లుగానే, నేను ఆ పరీక్షలో గొప్ప మార్కులతో ఉత్తీర్ణురాలనయ్యాను. అవును, నా ప్రియులారా, నేడు మీరు కూడా ఎటువంటి పరిస్థితులలో కూడా మీరు నీతిమంతులుగా జీవించినప్పుడు ప్రభువు కృప మీ మీద నిత్యము నిలిచియుండునట్లుగా చేసి, ఆయన మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, నీ అద్భుతమైన ఆశీర్వాదములకు నీకు వందనములు. దేవా, మేము నీ మార్గముల నుండి వైదొలగిన ప్రతిసారీ, పాపము చేసిన ప్రతిసారీ, లేదా కష్టమైన పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పిన ప్రతిసారీ మమ్మును క్షమించుము. ప్రభువా, మా జీవితములోని అతి చిన్న విషయాలలో కూడా సత్యవంతులుగా, నీతిమంతులుగా ఉండటానికి మాకు సహాయము చేయుము. దేవా, మా దోషములను మరియు పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడానికి మరియు ఎల్లప్పుడూ సరైన నీతివంతమైన మార్గమును ఎన్నుకోవడానికి మాకు ధైర్యమును అనుగ్రహించుము. ప్రభువా, నీ యొక్క దయను మరియు కృపను మా మీద మరియు మా ప్రియులైన వారి మీద నిలిచియుండునట్లుగా చేయుము. దేవా, పరీక్షలు వ్రాయుచున్న మమ్మును మరియు మా పిల్లలను నీ యొక్క జ్ఞానముతో నింపి, సత్యమైన మార్గములో నడుచుటకు మాకు నీ కృపను అనుగ్రహించి, మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, మేము మరియు మా ప్రియులు చదివినదంతా గుర్తుంచుకునేలా, ఉన్నత స్థాయిలో ఉండడానికిని మరియు ఉన్నత శిఖరములకు ఎదుగునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా జీవితముల ద్వారా నీ నామమునకు మహిమ కలుగున్నట్లుగా మమ్మును సత్యవంతులనుగాను మరియు నీతివంతులనుగాను మార్చుమని యేసుక్రీస్తు యొక్క సత్యవంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.