నా ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలమున మీకు శుభములు తెలియజేయుటలో నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 8:1వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు'' అని చెప్పబడినట్లుగానే, మీకు ఎటువంటి శిక్షావిధియు ఉండకూడదు అని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. నా ప్రియులారా, పై చెప్పబడిన వచనానుసారముగా మీరు క్రీస్తుయేసునందున్నప్పుడు మీకు ఎటువంటి శిక్షావిధియు ఉండదు.
బైబిల్ గ్రంథములో ఒక స్త్రీని పరిసయ్యులు యేసునొద్దకు తీసుకొని వచ్చు ఒక సంఘటనను మనము చూడగలము. యేసయ్యా, మందిర ఆవరణములో ప్రజలకు బోధించుచుండెను. యేసయ్సలో ఏదైనా తప్పుపట్టాలని శ్రాస్తులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టారు. వారు యేసుతో, బోధకుడా, యా స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. యేసయ్యా, మౌనముగానే ఉండిపోయాడు. అయినను, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని యేసయ్య వారితో చెప్పి, మరల వంగి నేల మీద వ్రాయుచుండెను. అప్పుడు వారు ఆయన మాట విని, నెమ్మదిగా, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు రాళ్లు క్రింద పెట్టి, ఆ స్థలమును విడిచి బయటికి వెళ్లిపోయారు; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.
అప్పుడు యేసు తలయెత్తి ఆ స్త్రీ వైపు చూచి, ఈలాగున అన్నాడు, "అమ్మా, వారందరు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా?'' అని అడిగినప్పుడు, ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, "నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.'' అవును, నా ప్రియ స్నేహితులారా, యేసయ్య ఒక పాపిని ఎప్పుడు కూడా శిక్షింపడు. అయితే, ఆయన ఎంతో ధైర్యముగా, ఆమెను చూచి, ' నీవు వెళ్లి, ఇకను పాపము చేయకుము' అని చెప్పాడు. ఆమెను ఒక వ్యభిచారిణిగా ఆయన ముద్రించలేదు. ఆమెను త్రోసివేయలేదు. కానీ, నీతిగల జీవితమునకు ఆమెను పిలిచియున్నాడు. నూతన ఆరంభమునకు ఆమెకు విమోచనమును కలిగించియున్నాడు.
అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, మీ పాత పాపములను బట్టి ప్రజలు చెడుగా ముద్రించియున్నారేమో? లేక మీరు ఓటమిలో ఉన్నారేమో? లేక మీరు మోసము చేసియున్నారేమో? అబద్దములను పలికియున్నారేమో? అనేక విషయాలలో మీరు దొంగిలించియున్నారేమో? ఏదియు మీలో నుండి మంచి కనబడలేదేమో? మీకు విమోచనలేదేమో? మీరు నశించిపోయారేమో? మీ పేరు నశించిపోయినదేమో? మీ కుటుంబము నశించిపోయినదేమో? మిమ్మును సమాజములో నుండి నెట్టివేసియున్నారేమో? కానీ, ప్రియులారా, యేసయ్య, తన ప్రేమగల దృష్టితో మీ యొద్దకు వచ్చుచున్నాడు. కనుకనే, మీరు చింతించకండి.
నా ప్రియ స్నేహితులారా, మీ పాపపు జీవితము నుండి మిమ్మును విమోచిస్తాడు మరియు మీ గతము నుండి, మిమ్మును ఏది వెనుకకు పట్టియుంచియున్నదో దానిని నుండి విడిపిస్తాడు మరియు నీతిగల జీవితమును జీవించడానికి ఆయన మిమ్మును పిలిచియున్నాడు. ఆ పాపమును బట్టి, మీరు ఆయన నుండి విడిపోవాలని ఆయన కోరుకోలేదు. కానీ, ప్రేమతో పాపము నుండి బయటకు రమ్మని పిలుచుచున్నాడు. దానిని జయించు శక్తిని మీకు అనుగ్రహిస్తాడు. ఆయనతో జీవించే శక్తిని మీకు దయచేస్తాడు.
కానీ, నా ప్రియ స్నేహితులారా, కాబట్టి, మీ పాపములన్నిటిని విడిచిపెట్టండి. మిమ్మును వెనకకు లాగి ఉంచుచున్న ప్రతి బాధను, మిమ్మును విరిచివేయుచున్న ప్రతి విషయమును, మీరు జయించలేకపోవుచున్న ప్రతి పాపమును మరియు ప్రతి విషయము నుండి మిమ్మును విడిపించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, ఈ రోజు నుండి క్రీస్తు నుండి విమోచనమును పొందుకొనండి. ఆలాగుననే, మీరు నూతన ప్రారంభమును పొందుకొనండి, నీతిగల జీవితమును జీవించుటకు దేవుడు ప్రేమతో మిమ్మును పిలుచుచున్నాడు. కాబట్టి, నా ప్రియులారా, ఈ రోజు నుండి మీరు ఆయనతో కూడా జీవించండి. ఈ గొప్ప వాగ్దానమును బట్టి వందనములు చెల్లించండి. నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవిచ్చి అద్భుతమైన వాగ్దానమును బట్టి నీకు వందనములు. దేవా, మేము నీ యందు వేరుపారినందున మాకు ఎటువంటి శిక్షావిధిని లేకుండా చేసినందుకై నీకు వందనములు. ప్రభువా, మేము ప్రతిరోజు ఎదుర్కొంటున్న శోధనలను జయించే కృపను మాకు దయచేయుము. దేవా, ఈ రోజు పాపపు జీవితము విడిచి నీతిగా జీవించుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. యేసయ్యా, మా పాపపు కోరికలు, ఈ లోక ఆశలు, వ్యసనములన్నిటిని కూడా ఇప్పుడే, మా నుండి తొలగించి మమ్మును నూతనపరచుము. ప్రభువా, మా దుర్‌వ్యసనములన్నిటిని మరియు మా యొక్క పాపమును తొలగించి, నీ రక్తము ద్వారా మమ్మును కడిగి శుద్ధీకరించుము. దేవా, బాధలో ఉన్న మా మీద నీ ప్రేమను కుమ్మరించుము. ప్రభువా, మా యొక్క ప్రతి బాధను, చేదును మా నుండి తొలగించి, నీతో నూతన జీవితమును జీవించే కృపను మాకు అనుగ్రహించుము. దేవా, నీతో ప్రారంభములో నడవగలిగే కృపను మాకు దయచేయుము. యేసయ్యా, సమాధానముతో నిండిన మరియు విశ్రాంతితో నిండిన, ఇంకను నీ ప్రేమతో నిండిన జీవితమును మాకు అనుగ్రహించుము. దేవా, నీతిగల జీవితమును జీవించే కృపను మాకిచ్చి, నీ వాక్యానుసారముగా నడుస్తూ, నీ చిత్తమును చేయుచూ, ప్రతిరోజు నీ స్వరమును ఆలకిస్తూ, పరిశుద్ధ జీవితమును జీవించే కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీకు ఇష్టానుసారముగా జీవించుటకు మా యొక్క పాత జీవితమునంతటిని విడిచిపెట్టుటకు మాకు నీ కృపను దయచేయుము. దేవా, ప్రతిరోజు మమ్మును నడిపించే పరిశుద్ధాత్మ ద్వారా నీతో నడిచే నూతన జీవితమును మకు దయచేయుము. ప్రభువా, మేము నీవలె జీవించే కృపను మాకు దయచేసి, మమ్మును దీవించుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


