నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లేవీయకాండము 26:6వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్ట మృగములు లేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు'' అని చెప్పబడిన ప్రకారము మీకు ఇక భయము ఉండదు. ఇటువంటి ఆశీర్వాదము మన జీవితములో మనము ఎప్పుడు పొందుకొనగలము? అందుకొరకే బైబిల్ నుండి లేవీయకాండము 26:3వ వచనమును మనము చదివినట్లయితే, "మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి, వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు'' అని చెప్పబడిన ప్రకారము మీరు దేవుని ఆజ్ఞలను ఆచరించి, వాటి ప్రకారము ప్రవర్తించినట్లయితే, అప్పుడు మీకు ఇటువంటి గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. కనుకనే, నేడు మీరు దేవుని మార్గములలో నడుచుచున్నారా? దేవునితో అన్యోన్యసహవాసమును కలిగియుంటూ, ఆయనతో కలిసి నడవడము ఎంతో ఆశీర్వాదకరమై యుంటున్నది కదా.

అందుకే బైబిల్ నుండి కీర్తనలు 23:1వ వచనములో చూచినట్లయితే, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' అని కీర్తనాకారుడైన దావీదు భక్తుడు అంటున్నాడు. నా ప్రియ స్నేహితులారా, అదేవిధముగా, మీరు ప్రభువును తండ్రిగాను, కాపరిగాను కలిగియుండాలి. 'ఆయనే మమ్మును నడిపిస్తాడు, ఆయన మాకు అన్నిటిని నేర్పిస్తాడు అనేది మీ నిరీక్షణయై యుండా లి. చిన్నవాడైన దావీదు, అజానుబాహుడుగా ఉంటున్న శూరుడైన గొల్యాతు యెదుట నిలువబడియుండెను. తల మొదలుకొని కాళ్ల వరకు యుద్ధ కవచములను గొల్యాతు ధరించియున్నాడు. కానీ, దావీదు ఏమియు కూడా ధరించలేదు. సాధారణమైన గొఱ్ఱెల కాపరులు కలిగియున్న ఒడిసెలను మాత్రమే దావీదు కలిగియున్నాడు. అయితే, సర్వశక్తిమంతుడైన ప్రభువు మీద తన నిరీక్షణ అంతయు కలిగియుండెను. అవును, మనము కూడా ఎల్లవేళల ప్రభువు వైపు మాత్రమే చూడాలి. ఆయనను గట్టిగా పట్టుకోవాలి, ఆయనతో మాట్లాడాలి. దేవుని సన్నిధానములో వేచియుండాలి. అటువంటి పరిశుద్ధ జీవితమును మీరు కలిగియుండాలి. అన్నివేళల, మీరు ప్రభువును గట్టిగా పట్టుకొనియుండాలి. అప్పుడు ప్రభువు మీ యందు ఇష్టమును కలిగియుంటాడు.

అయితే, చిన్నవాడైనటువంటి దావీదు, శూరుడైన గొల్యాతును సంహరించగలిగాడు. ఎందుకనగా, ప్రభువు అతనితో కూడా ఉన్నాడు, కనుకనే, అతడు అంతటి గొప్ప కార్యమును చేయగలిగెను. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 34:10వ వచనమును చూచినట్లయితే, "సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు'' అని చెప్పబడిన ప్రకారము ఎల్లవేళల మీరు దేవుని గట్టిగా పట్టుకొని, ఆయన యందు భయభక్తులు కలిగియున్నప్పుడు, నిశ్చయముగా మీకు ఏ మేలు కొదువయై యుండదు. అలాగుననే, బైబిల్ నుండి కీర్తనలు 121:1-2 వ వచనములలో చూచినట్లయితే, "కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు'' ప్రకారము భూమ్యాకాశములను సృజించిన దేవుని యొద్ద నుండి నేడు మీకు సహాయము కలుగుతుంది. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు ఎవరి వైపు చూచుచున్నారు? యేసయ్య మీద మీకు నిరీక్షణ ఉన్నదా? మీ నిరీక్షణ అంతా యేసయ్య మీద కలిగియున్నారా? లేక ఈ లోక ప్రజల మీద కలిగియున్నారా? కనుకనే, మీరు ప్రభువు వైపు చూడండి, ఆయనకు మొఱ్ఱపెట్టండి, ఆయన సన్నిధిలో మొఱ్ఱపెడదామా? "ప్రభువా, నీవే, మాకు సహాయము చేయుము, నీవు లేకుండా మేము ఏమి చేయలే ము, నీవే మా నిరీక్షణయై యున్నావు'' అని చెప్పినట్లయితే, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మేము నీకు మొఱ్ఱపెట్టుచున్నాము. కనుకనే, మొఱ్ఱపెట్టుచున్న మా వైపు నీవు చూడుము. ప్రభువా, మాకు ఈ లోకములో ఏ నిరీక్షణ లేదు, మమ్మును విడిపించుటకు ఏ ఒక్కరు కూడా లేరు. అనేకమంది మాకు విరోధముగా లేచుచున్నారు, వారు మమ్మును శ్రమపెట్టుచున్నారు, ఇప్పుడు నీవు మమ్మును విడిపించుము. దేవా, ఇప్పుడు మేము నీకు మొఱ్ఱపెట్టుచుండగా, నిన్ను మేము గట్టిగా పట్టుకొని యుండుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ కృపను మా మీదికి దిగివచ్చునట్లుగా చేసి, సమృద్ధియైన దీవెనలను మా మీద కుమ్మరించుము. ప్రభువా, నీ కట్టడలను అనుసరించి, నీ ఆజ్ఞలను పాటించుటకు మాకు సహాయం చేయుము. దేవా, నీవు మా కాపరిగా ఉండి, ప్రతిరోజూ మమ్మును సరియైన మార్గములో నడిపించుము. ప్రభువా, నిన్ను గట్టిగా హత్తుకొని, ప్రతిరోజూ నీ సన్నిధిలో వేచి ఉండుటకు మాకు నేర్పించుము. దేవా, శూరులు మాకు ముందుగా లేచినప్పుడు, మా నిరీక్షణయంతయు నీలో ఉండునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. యేసయ్యా, మా దృష్టి ఎల్లప్పుడూ నీ మీద ఉండునట్లుగాను, మా సహాయం నీ యొద్ద నుండి వచ్చునట్లుగా చేయుము. దేవా, నీవు లేకుండా, మేము ఏమియు చేయలేము. ప్రభువా, మాకు నీ యొక్క సమాధానమును శాంతిని దయచేయుము మరియు మా జీవితం నుండి భయములన్నిటిని తొలగించుము. దేవా, నీవే మా ఏకైక నిరీక్షణయైన యున్నావని మేము నమ్ముచూ, సుఖముగా పండుకొని నెమ్మదిగా ఉండునట్లుగా కృపను మాకు దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.